శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అట్టహాసంగా ప్రారంభమైన రాష్టస్థ్రాయి క్రీడాపోటీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గూడూరు, సెప్టెంబర్ 23: రాష్ట్ర పాఠశాలల క్రీడాసమాఖ్య, అమరావతి, నెల్లూరు జిల్లా క్రీడాసమాఖ్య ఆధ్వర్యంలో 63వ రాష్టస్థ్రాయి స్కూల్ గేమ్స్ పోటీలు శనివారం అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. అండర్-14, 17 బాలబాలికల విభాగంలో బాల్ బ్యాడ్మింటన్ క్రీడా పోటీల ప్రారంభం కార్యక్రమంలో తిరుపతి ఎంపి వరప్రసాద్, ఎమ్మెల్యే సునీల్‌కుమార్, ఆర్డీవో పి అరుణ్‌బాబు క్రీడాపతాకాలను ఆవిష్కరించి విద్యార్థుల నుండి గౌరవవందనం స్వీకరించారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ పోటీల్లో దాదాపు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి 500 మంది క్రీడాకారులు, 70 మంది కోచ్‌లు పాల్గొన్నారు. జిల్లా చరిత్రలో తొలిసారి గూడూరులో ఈ పోటీలను గూడూరులో నిర్వహించడం విశేషం.
క్రీడా పోటీల నిర్వహణ తీరుపై ఎమ్మెల్యే అసంతృప్తి
గూడూరులోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో శనివారం ప్రారంభమైన 63వ రాష్ట్ర స్థాయి స్కూల్‌గేమ్స్ పోటీల నిర్వహణ తీరుపై గూడూరు ఎమ్మెల్యే పాశం సునీల్‌కుమార్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని పది జిల్లాల నుండి దాదాపు 500 మందికి పైగా క్రీడాకారులు ఈ పోటీలకు హాజరయ్యారు. పెద్దఎత్తున కార్యక్రమ ఏర్పాట్లను చేసిన నిర్వాహకులు కనీసం పట్టణ ప్రథమ మహిళ, మున్సిపల్ చైర్‌పర్సన్ పి దేవసేనమ్మకు, ఎంపిపి, వార్డు కౌన్సిలర్లకు ఆహ్వానం పంపక పోవడంలో ఆంతర్యం ఏమిటని ఆయన నిర్వాహకులను నిలదీశారు. మూడు రోజుల పాటు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుండి పాల్గొనే క్రీడాకారులకు అన్ని వసతి సౌకర్యాలు కల్పనకు కృషి చేసిన మీరు కనీసం ఆహ్వానపత్రాలు ముద్రించకపోవడం, పట్టణంలోని ప్రముఖులను ఆహ్వానించకపోవడం, కనీసం పత్రికల వారికి కూడా సమాచారం అందించక పోవడం దారుణమని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుండి వచ్చిన క్రీడాకారులుకు భోజన, వసతి సౌకర్యాలను ఇక్కడి దాతలు ఏర్పాటు చేయడానికి కృషి చేసి పట్టణంలోని ప్రముఖులను ఆహ్వానించకపోవడం తనకు చాలా బాధ కలిగిందని అన్నారు. ఇదిలావుండగా ఈ పోటీల ప్రారంభ కార్యక్రమానికి నిర్వాహకులు తిరుపతి పార్లమెంటు సభ్యుడు వి వరప్రసాద్‌రావును ముఖ్యఅతిధిగా ఆహ్వానించారు. క్రీడాకారులను గంటకు పైగా మండుటెండలో నేలపై కూర్చోబెట్టి నాయకుల ప్రసంగాలు చేయడంతో విసుగు చెందారు. మండుటెండలో నేలపై కూర్చునలేక పలువురు క్రీడాకారులు లేచి నీడ కోసం వెళ్లిపోయారు. ఇది గమనించిన ఎంపి తాను ఎక్కువసేపు మాట్లాడనని, నేను మీ ఎంపిని అని, కాసేపు నా మాటలు వినండని ఆయన కోరుకున్నా ఎండతో అల్లాడిపోయిన క్రీడాకారులు విసుగు చెంది దాహార్తి తీర్చుకొనేందుకు, ఎండవేడిమి నుండి ఉపశమనం పొందేందుకు లేచి వెళ్లిపోయారు. ఇదిలావుంటే నాయకులు మాత్రం షామియానాల నీడలో ప్రసంగాలు చేయడం, మండుటెండలో విద్యార్థులు మలమల మాడుతున్నా కనీసం వారికి మంచినీరు కూడా సరఫరా చేయకపోవడం విచారకరం. నిర్వాహకులు మాత్రం సభావేదికపై ఎమ్మెల్యేని, దాత కనుమూరు హరిచంద్రారెడ్డి, బాలకృష్ణంరాజులను పొగడ్తలతో ముంచెత్తడం విశేషం. ఈ కార్యక్రమంలో కనుమూరు హరిచంద్రారెడ్డి, బాలకృష్ణంరాజు, కె మునిగిరీష్, కడివేటి చంద్రశేఖర్, చెన్నూరు, చిల్లకూరు ఉన్నత పాఠశాలల సిబ్బంది, పిఇటిలు తదితరులు పాల్గొన్నారు.
ఎక్సైజ్ శాఖలో గందరగోళం!
* మూకుమ్మడి సెలవులో ఇన్స్‌పెక్టర్లు * గాడితప్పిన ఎక్సైజ్ పాలన * ఎక్సైజ్ కమిషనర్ ఆరా

నెల్లూరు, సెప్టెంబర్ 23: జిల్లా ఎక్సైజ్ శాఖలో ప్రస్తుతం గందరగోళ వాతావరణం నెలకొంది. గతంలో అవినీతికి పేరుగాంచిన ఈ ఎక్సైజ్ శాఖలో ఇకపై ఏ అధికారి కూడా అవినీతికి పాల్పడితే సహించేది లేదంటూ ఎక్సైజ్ కమిషనర్ జారీ చేసిన ఆదేశాలు అవినీతి అంతస్తులు కట్టుకున్న కొందరు అధికారులను పిడుగుపాటుకు గురిచేశాయి. అవినీతికి పాల్పడే అధికారులపై క్రమశిక్షణా చర్యలు తప్పవంటూ, ఇప్పటికే ఒక ఇన్స్‌పెక్టర్ స్థాయి అధికారిపై చర్యలు తీసుకోవడంతో మిగతా అధికారుల్లో గుబులు మొదలైంది. చివరకు ఒకే సర్వీస్‌కు చెందిన పలువురు ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్లు మూకుమ్మడి సెలవుపై వెళ్లడం ఆబ్కారీ శాఖలోనే సంచలనంగా మారింది. వీరందరి చేత సెలవు పెట్టించడం వెనుక ఎక్సైజ్ అధికారుల సంఘంలో కీలకపాత్ర పోషించేందుకు ఉబలాటపడే ఓ అధికారి ప్రముఖపాత్ర పోషించినట్లు సమాచారం. అవినీతికి పాల్పడవద్దంటే సెలవుపై వెళ్లడమేమిటో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. దీనిపై విచారణ జరిపాలని రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ ఇప్పటికే జిల్లా ఎక్సైజ్ ఉన్నతాధికారులకు వౌఖిక ఆదేశాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ తతంగంపై శాఖాపరమైన విచారణ జరుగుతున్నట్లు సమాచారం. ఒక ఎక్సైజ్ స్టేషన్‌కు నెలవారి స్టేషనరి, మెయింటెనెన్స్ తదితర ఖర్చుల రూపేణా నెలకు పాతిక వేల వరకూ అవుతుంది. శాఖాపరంగా కేటాయింపులు బహుస్వల్పంగా ఉంటుంటాయి. మరి ఇటువంటి పరిస్థితుల్లో స్టేషన్ అధికారిపైనే బాధ్యతలు ఉంటున్న నేపథ్యంలో నెలనెలా మామూళ్లు వచ్చే సమయంలో స్టేషన్ ఖర్చులు పెట్టగలిగిన అధికారులు ప్రస్తుతం తమ జేబులో నుండి పెట్టేందుకు సాహసించరు. దీనికితోడు త్వరలో బదిలీలు ఉన్న నేపథ్యంలో తాము కోరుకున్న చోటుకు వెళ్లేందుకు పైరవీలు చేయించుకునేందుకు వీలుగా నెలలపాటు సెలవులు పెట్టి అమరావతిలో ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నవారు మరికొందరు. త్వరలో నెల్లూరు నగరంలో ఖాళీ అవుతున్న ఎక్సైజ్ ఇన్స్‌పెక్టర్ స్థానం కోసం ఓ అధికారి సెలవు పెట్టి మరీ తీవ్రంగా ప్రయత్నాలు చేస్తుండడం గమనార్హం. అయితే వ్యక్తిగత కారణాలతోనే ఇలా కొందరు ఇన్స్‌పెక్టర్లు సెలవులు పెట్టినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఏదో ఒకరిద్దరు అధికారులు మాత్రమే ఇలా వ్యక్తిగత పనులపై సెలవులు పెట్టాల్సి వచ్చినప్పటికి మిగతా అధికారులు ఎందుకు విధులకు నెల రోజులుగా దూరంగా ఉంటున్నారో అంతుచిక్కడం లేదు. జిల్లాలో ఎంతో చర్చనీయాంశంగా మారిన ఈ వ్యవహారంపై రాష్ట్ర ఎక్సైజ్ కమిషనర్ లక్ష్మీనరసింహం సీరియస్‌గా ఉన్నట్లు సమాచారం. వెంటనే విచారణ జరిపించి వాస్తవాలు తెలుసుకోవాలని జిల్లా ఉన్నతాధికారులకు ఆయన్నుంచి ఆదేశాలు వచ్చాయి. ఈ విషయం తెలుసుకున్న కొందరు అధికారులు రెండు రోజుల్లో విధుల్లో చేరేందుకు సిద్ధమవుతూ ఉన్నతాధికారులకు సమాచారం అందించడం విశేషం.

రూ.50 కోట్లతో బారాషాహిద్‌లో అభివృద్ధి పనులు
*మంత్రి నారాయణ వెల్లడి
నెల్లూరుసిటీ, సెప్టెంబర్ 23: నగరంలోని బారాషాహిద్ దర్గాలో వౌలిక వసతుల కల్పన కోసం 20 కోట్ల రూపాయలు, అమృత్ పథకం ద్వారా 30 కోట్ల రూపాయలతో స్వర్ణాలచెరువును అభివృద్ధి చేస్తున్నట్లు మునిసిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. శనివారం బారాషాహిద్ దర్గాలో జరుగుతున్న అభివృద్ధి పనులను మంత్రి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి సంవత్సరం స్వర్ణాలచెరువులో జరుగుతున్న రొట్టెల పండుగకు ఈ ఏడాది సుమారుగా 15 లక్షల పైచిలుకు భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని తెలిపారు. గత రెండు సంవత్సరాలలో శాశ్వత మరుగుదొడ్లు, కమ్యూనిటీ హాలు నిర్మించడం జరిగిందన్నారు. ఈ ఏడాది 20 కోట్ల రూపాలయతో ఘాట్ల నిర్మాణం, పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. భక్తులందరికి అనువైన ప్రదేశాలను గుర్తించామని అక్కడ వారికి ఆరోగ్యకర వాతావరణంలో మంచినీటి వసతి, మరుగుదొడ్ల ఏర్పాట్లు చేయడం జరిగిందన్నారు. అమృత్ పథకం కింద 30 కోట్ల రూపాయలతో స్వర్ణాలచెరువును అభివృద్ధి చేయనున్నట్లు వెల్లడించారు. ఈ రొట్టెల పండుగ గత నాలుగు వందల సంవత్సరాల నుంచి నిర్వహించబడుతోందని, వివిధ దేశాలు, రాష్ట్రాల నుంచి కూడా అధిక సంఖ్యలో భక్తులు హాజరవుతారని చెప్పారు. నగర మేయర్ అబ్దుల్ అజీజ్ మాట్లాడుతూ గతంలో ఎప్పుడు లేని విధంగా బారాషాహిద్ దర్గాలో ప్రతి ఏడాది కోట్లాది రూపాయలను ఖర్చు చేసి అభివృద్ధి చేస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి నారాయణ కృషి వల్ల కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. గత ఏడాది కంటే ఈ ఏడాది భక్తులు అధిక సంఖ్యలో వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, టిడిపి ఇన్‌చార్జ్ ముంగమూరు శ్రీ్ధర్‌కృష్ణారెడ్డి, దొడ్డపనేని రాజానాయుడు, ఖాజావలి, వౌలానా మునిసిపల్ కమిషనర్ డిల్లీరావు, తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

అదుపుతప్పి గుంటలో పడ్డ కారు
*నలుగురికి తీవ్ర గాయాలు
మనుబోలు, సెప్టెంబర్ 23: పెళ్లి చేసుకుని మొక్కు తీర్చుకోవడానికి తిరుమలలోని ఏడుకొండలు స్వామి దర్శనం కోసం కారులో వెళ్తుండగా ఆ కారు అదుపుతప్పి లోయలో పడింది. మండల పరిధిలోది బద్దెవోలు క్రాస్‌రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ఈ సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. ఈ సంఘటన వివరాలిలా ఉన్నాయి. ప్రకాశం జిల్లా చీమకుర్తి మండలం రామచంద్రాపురానికి చెందిన పర్చూరు సుబ్బారావుకు రాజేశ్వరి అనే అమ్మాయితో శుక్రవారం రాత్రి వివాహమైంది. అనంతరం ఏడుకొండలు స్వామిని దర్శించుకోవాలని వధూవరులతో పాటు మరో ఏడుగురు తిరుమలకు ఇన్నోవా కారులో బయలుదేరారు. ఈక్రమంలో మండల పరిధిలోని బద్దెవోలు క్రాస్‌రోడ్డు సమీపంలో అదుపుతప్పి సుమారు 20 అడుగుల లోతైన గుంటలో పడిపోయింది. బ్రిడ్జి వద్ద కాపలాగా ఉన్న సెక్యూరిటీ సిబ్బంది గుర్తించి కారులో ఉన్న వారిని బయటకు తీసుకువచ్చేలోగా స్థానిక ఎస్‌ఐ శ్రీనువాసులురెడ్డి తమ సిబ్బందితో వచ్చి వారిని పైకి తీసుకువచ్చారు. ఈ ప్రమాదంలో పెళ్లి కుమారుడు సుబ్బారావు సమీప బంధువులు పర్చూరు పేరయ్య, పర్చూరు కోటేశ్వరమ్మ, పర్చూరు వరమ్మ, పర్చూరు ఈశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన వీరిని చికిత్స నిమిత్తం 10 8అంబులెన్స్, హైవే అంబులెన్స్‌లలో నెల్లూరులోని సింహపురి ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ధనలక్ష్మిగా ఆత్మకూరు కన్యకాపరమేశ్వరి
ఆత్మకూరు, సెప్టెంబర్ 23: దేవీ శరన్నవరాత్రి మహోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ఆత్మకూరు పట్టణంలోని శ్రీ ఆర్యవైశ్య కుల దేవత కన్యకాపరమేశ్వరి ఆలయంలో ధనలక్ష్మి అలంకరణ చేపట్టారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఆర్యవైశ్యులైన నిడమానూరు రమేష్, కృష్ణా మెడికల్స్ దోర్నాదుల సుబ్బయ్య, పచ్చిపులుసు ఈశ్వరయ్య, దివంగత సోమిశెట్టి పెంచల నరసింహులు కుమారులు, అమరా పద్మావతి, రాజా రామయ్య, పరిటాల నాగేశ్వరరావు, దివంగత గ్రంధే వెంకటేశ్వర్లు కుమారులు వెంకటకృష్ణ, వెంకట శ్రీహరి, సుంకు వెంకటేశ్వర్లు, వాయుగుండ్ల నాగేశ్వరరావు, అనిశెట్టి సుబ్బారావు, పరిటాల రామకృష్ణ, వాయిగుండ్ల వెంకటేశ్వర్లు, పోకూరు జ్ఞానయ్య, కొత్త నారాయణ సోదరులు, వాయుగుండ్ల శివయ్య, దివంగత అమరాప్రసాద్ కుటుంబీకులు, మెంటా వెంకటేశ్వరరావు, తుమ్మలపెంట రత్నమ్మ, కనమర్లపూడి గురుబ్రహ్మం, చిన్ని నారాయణస్వామి ఉభయకర్తలుగా వ్యవహరించారు. తిరునాళ్లతిప్పలోని దుర్గాదేవికి ధనలక్ష్మి అలంకరణ చేపట్టారు. అదేవిధంగా ఉత్తర బలిజవీధిలోని జ్వాలాముఖి ఆలయంలో అమ్మవారికి గాయత్రిదేవి అలంకరణ నిర్వహించారు. కార్యక్రమానికి బేతిరెడ్డి పాలనారాయణ, సుభాషిణి, సాయిలేఖన, సాయి విఘ్నేష్ కుటుంబీకులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. అదేవిధంగా ఆత్మకూరు విశే్వశ్వరాలయంలో కూడా ఈ దేవీ నవరాత్రులు, మహిళా భక్తులచే కుంకుమపూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. అలాగే ఏఎస్‌పేటలోని మత్కన్యకాపరమేశ్వరికి కన్యకాపరమేశ్వరి అలంకరణ నిర్వహించారు.
చండీ అలంకరణలో వింజ పరమేశ్వరి
వింజమూరు: వింజమూరుకు నైరుతి దిశన కొండపై కొలువుదీరిన శ్రీ వింజ పరమేశ్వరి అమ్మవారు శనివారం చండీ అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక యాదవ బజార్‌కు చెందిన డేగా మధుయాదవ్ దంపతులు ఉభయకర్తలుగా అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. సుగంధభరితపుపుష్పాలతో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి ఆలయం చుట్టూ ముమ్మారు ప్రదక్షణ చేశారు. భక్తులు అత్యంత శ్రద్ధాసక్తులతో అమ్మవారిని దర్శించుకుని తీర్ధప్రసాదాలు స్వీకరించారు. ఉభయకర్తలుగా కె ఆదిశేషారెడ్డి, లక్ష్మీకాంతమ్మలు వ్యవహరించగా, ఆలయ ధర్మకర్త రాఘవరెడ్డి పర్యవేక్షించారు.

గూడూరులో వాణిజ్య పన్నుల అధికారుల దాడులు
గూడూరు, సెప్టెంబర్ 23: గూడూరు పట్టణంలో కొనుగోలుదారులకు బిల్లులు ఇవ్వని వ్యాపారస్తులపై శనివారం వాణిజ్య పన్నుల శాఖ అసిస్టెంట్ కమిషనర్ సిహెచ్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నాలుగు దుకాణాల యజమానుల నుండి 90 వేల రూపాయల జరిమానా వసూలు చేసినట్టు సంబంధిత అధికారి తెలిపారు. వ్యాపారులందరు జిఎస్‌టి చట్టప్రకారం కొనుగోలుదారులకు బిల్లులు తప్పనిసరిగా ఇవ్వాలన్నారు. సంవత్సరానికి 20 లక్షలు పైబడి వ్యాపారం చేసే వ్యాపారస్తులు జిఎస్‌టి లైసెన్సులు తప్పనిసరిగా జిఎస్‌టి వెబ్‌సైట్ నుండి తీసుకోవాలన్నారు. అలాగే వినియోగదారులు కూడా వ్యాపారులను బిల్లులు ఇవ్వాలని డిమాండ్ చేయాలన్నారు. ప్రతి అమ్మకందారుడు 200 రూపాయల పైచిలుకు అమ్మకానికి బిల్లులు ఇవ్వాల్సి వుందని, లేకుంటే చట్టప్రకారం వ్యాపారస్తులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.

రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి పూర్తిచేయండి
*ఎంపి వరప్రసాద్ సూచన
గూడూరు, సెప్టెంబర్ 23: గూడూరు ప్రజల చిరకాల వాంఛ అయిన తూర్పు, పడమర గూడూరులను కలుపుతూ నిర్మించ తలపెట్టిన రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణ పనులకు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిధులను విడుదల చేసి పూర్తిచేయాలని తిరుపతి పార్లమెంటు సభ్యులు వి వరప్రసాద్‌రావు కోరారు. శనివారం ఆయన స్థానిక ఆర్ అండ్ బి అతిధిగృహంలో విలేఖర్లతో మాట్లాడుతూ ఎంతోకాలంగా అసంపూర్తిగా నిలిచిపోయిన ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి సంబంధించి రైల్వే శాఖకు సంబంధించి పనులు పూర్తయ్యాయని, ఇక రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి పనులు పూర్తికావాల్సి ఉందన్నారు. ప్రధానంగా భూసేకరణ, సర్వీసు రోడ్డు నిర్మాణ పనులు జాప్యం జరగడం పట్ల ఆయన వెంటనే ఆర్డీవోతో ఫోన్‌లో సంప్రదించి పనులను త్వరితగతిన పూర్తిచేయాలని కోరారు. అలాగే గూడూరు రైల్వేస్టేషన్‌లో 4,5 ప్లాట్‌ఫారాల నిర్మాణం, రెండో పట్టణంలో బుకింగ్ కౌంటర్, పాత ఫుట్‌ఓవర్ బ్రిడ్జి స్థానంలో నూతనంగా మరో ఫుట్‌ఓవర్ బ్రిడ్జిని నిర్మించడం జరుగుతుందన్నారు. గూడూరు పట్టణానికి తాగునీరు అందించే పైపులైను తరచూ మరమ్మతులకు గురవుతున్న దృష్ట్యా దీనిని పూర్తిస్థాయిలో ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపితే కేంద్రం నుండి నిధులను తీసుకొస్తామని తెలిపారు. తాను ప్రధానమంత్రి సహాయ నిధి నుండి ఇప్పటివరకు 70 మందికి పరిహారం ఇప్పించడం జరిగిందన్నారు. అలాగే చిత్తూరు జిల్లా ఏర్పేడు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో మృతి చెందినవారి కుటుంబాలకు ఒక్కొక్కరికి 2 లక్షల వంతున సిఎం సహాయ నిధి, తన ఎంపి నిధుల నుండి 2 లక్షల వంతున మృతుల కుటుంబాలకు అందచేసినట్టు ఆయన తెలిపారు. అలాగే వెడిచర్ల గ్రామానికి చెందిన అంకయ్య అనే ఆటో కార్మికుడు కీళ్లవ్యాధితో బాధపడుతున్న విషయాన్ని స్థానిక నాయకులు తన దృష్టికి తీసుకొచ్చారని, అతనికి పిఎం సహాయ నిధి నుండి 1.75 లక్షల మంజూరుకు తాను కృషి చేస్తానని ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసిపి నాయకులు ఎల్లసిరి గోపాలరెడ్డి, మేరిగ మురళి, వైసిపి పట్టణ, గ్రామీణ అధ్యక్షులు బొమ్మిడి శ్రీనివాసులు, మల్లు విజయకుమార్‌రెడ్డి, కౌన్సిలర్లు నాసిన నాగులు, చోళవరం గిరిబాబు, మైనారిటీ నాయకులు మగ్ధూం మొహిద్దీన్, 24 సొసైటీ అధ్యక్షులు యల్లా శ్రీనివాసులరెడ్డి, తాళ్లూరు శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

మోటార్ సైకిళ్ల దొంగలు అరెస్ట్
తడ, సెప్టెంబర్ 23: గత మూడు నెలలుగా తడ పరిసర ప్రాంతాల్లో మోటార్‌సైకిళ్లను చోరీ చేస్తున్న ఆరుగురిని అరెస్ట్ చేయగా, ముగ్గురు పరారీలో ఉన్నారు. దీనిపై సూళ్లూరుపేట సిఐ కిషోర్‌బాబు శనివారం తడ పోలీస్ స్టేషన్‌లో విలేఖర్లకు వివరాలు వెల్లడించారు. గత మూడు నెలలుగా తడ, సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో మోటార్‌సైకిళ్లను చోరీ చేస్తున్న దొంగల ముఠాను శుక్రవారం సాయంత్రం తడ మండలం పన్నంగాడు వద్ద ఆరుగురిని అరెస్ట్ చేశామన్నారు. ముగ్గురు పరార్ అయ్యారని, వారి వద్ద నుండి పది మోటార్‌సైకిళ్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. తడ ఎస్సై వెంకటేశ్వరరావు, శ్రీహరికోట ఎఎస్సై శేఖర్, మునీంద్రలు ఈ దొంగలను పట్టుకొనేందుకు సహకరించారని తెలిపారు. వీరిని గూడూరు ఇన్‌చార్జ్ డిఎస్పీ రాఘవరెడ్డి అభినందించి రివార్డులు ఇవ్వనున్నట్టు తెలిపారు.
వాహనదారులు జిపిఎస్ అనుసంధానం చేసుకోండి
కార్లు, లారీలకు సంబంధించినవారు జిపిఎస్ అమర్చుకోవాలని, వాహనాలు చోరీ జరిగిన సమయంలో వారిని వెంటనే పట్టుకొనేందుకు వీలుంటుందన్నారు. ఇదే క్రమంలో ఇసుక తోలే ట్రాక్టర్లు జిపిఎస్ అమర్చుకొనాలని, జిపిఎస్ అమర్చని వాహనాలను ఇసుక తోలేందుకు అనుమతించేది లేదన్నారు.

ధాన్యలక్ష్మి అలంకారంలో ఆదిలక్ష్మి అమ్మవారు
రాపూరు: పెంచలకోన దేవస్థానంలో జరుగుతున్న శరన్నవరాత్రి వేడుకల్లో భాగంగా 3వ రోజైన శనివారం పలు ఉత్సవాలు, ప్రత్యేక పూజలు అత్యంత వైభవంగా జరిగాయి. అమ్మవారికి పట్టు వస్త్రాలంకరణ, పూలంగి సేవ కార్యక్రమాలు వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాలకు వరికుంటపాడుకు చెందిన గుణ యానాదిరెడ్డి, రమణమ్మ దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. సాయంత్రం ఆరు గంటలకు ఆదిలక్ష్మి అమ్మవారు అత్యంత శోభయమానంగా ధాన్యలక్ష్మి అలంకారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు అనేక మంది భక్తులు పెంచలకోన క్షేత్రానికి తరలివచ్చి ప్రత్యక్షంగా ఈ ఉత్సవాన్ని వీక్షించారు. ఆలయ సహాయ కమిషనర్ శనగవరపు శ్రీరామమూర్తి, ట్రస్టు బోర్డు చైర్మన్ తానంకి నానాజీ భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశారు.
విశ్వశాంతి ఆశ్రమంలో..
పెంచలకోనలోని కరుణామయి విజయేశ్వరిదేవి ఆశ్రమంలో దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. మూడో రోజైన శనివారం ఆశ్రమ ఆవరణలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన హోమశాలలో భగవతీ విజయేశ్వరిదేవి పలు హోమాలను వైభవంగా జరిపారు. ఉదయం 9 గంటలకు ప్రారంభమైన ఈ హోమాలు మధ్యాహ్నం రెండు గంటల వరకు జరిగాయి. ఈ హోమాలలో పాల్గొన్న భక్తులనుద్దేశించి ఆమె మాట్లాడుతూ, ప్రతిఒక్కరు ఏడాదిలో ఒకసారి వచ్చే ఈ శరన్నవరాత్రుల్లో భక్తిశ్రద్ధలు, నిష్టతో ఉండాలని, ఆ దేవీ కరుణాకటాక్షలు ప్రతిఒక్కరికి జీవితంలో కోరుకున్న కోరికలు నెరవేరుతాయని అన్నారు. భక్తులకు తీర్ధప్రసాదాలు అందజేశారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులకు ఉచిత భోజన సౌకర్యాలతోపాటు విడిది ఉన్నవారికి విడిది సౌకర్యాలు ఆశ్రమ నిర్వాహకులు రామ్మోహన్, రేవతమ్మ, భరత్ ఏర్పాటు చేశారు.