శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

నగరం కాదు.. నరకం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, నవంబర్ 17: అభివృద్ధి పనుల పేరుతో నగరంలో జరుగుతున్న రోడ్ల తవ్వకాలు నగరవాసుల జీవనాన్ని నరకప్రాయంగా మార్చేస్తున్నాయి. అభివృద్ధి ఎప్పటికో తెలియదు కానీ, ప్రస్తుతం పనుల వల్ల జరుగుతున్న ఆటంకాలు అన్నీ ఇన్నీ కావు. నగరానికి ఎంతో ప్రధానమైన భూగర్భ డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థ ఏర్పాటుకు వేల కోట్ల నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులను దక్కించుకున్న గుత్తేదారు సంస్థలు నగరంలో పనులు ప్రారంభించడం, పనులు దాదాపు సగం వరకూ పూర్తయినట్లు అధికారులు చెబుతున్నారు. అయితే డ్రైనేజీ, తాగునీటి వ్యవస్థలకు వేర్వేరుగా అధికారులు టెండర్లు పిలవడం, రెండు ప్రధాన గుత్తేదారు సంస్థలు ఆ పనుల్ని దక్కించుకోవడం జరిగింది. అయితే ఆ ప్రధాన గుత్తేదారు సంస్థలు కొన్ని ప్రాంతాల్లో సబ్ కాంట్రాక్టర్లకు పనులు అప్పచెప్పడం జరిగింది. ఇక్కడ్నుంచే నగర వాసులకు కష్టాలు మొదలై ఉంటాయనే ఆలోచన కలుగుతోంది. ఏ పనులు ఎవరు చేపడుతున్నారు, ఎలా చేపడుతున్నారు అనే అంశాల్లో ఇద్దరు గుత్తేదారుల మధ్య సమన్వయలోపం లేకపోవడంతో ఒకరు తవ్వి వెళ్లిన వెంటనే మరొకరు వచ్చి గుంతలు తవ్వుతున్నారు. నగరంలో 80 శాతం వరకూ సిమెంటు రోడ్లు ఉన్నాయి. ఈ సిమెంటు రోడ్లలో పూర్తిగా గుంతలు తవ్విన తర్వాత పైపులైన్లు ఏర్పాటుచేసి మొక్కుబడిగా ఏదో మట్టితో కప్పేసి వెళ్లిపోతున్నారు. వర్షాకాలంలో ఈ గుంతల్లో ఇరుక్కొని వాహనదారులు పడుతున్న తిప్పలు అన్నీ ఇన్నీ కావు. నెల్లూరు మినీ బైపాస్‌రోడ్‌లో వాహనంపై వెళ్లాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. రోడ్డుకు తూర్పువైపున పనులు చేపట్టినప్పటి నుండి ఆ మార్గాన ట్రాఫిక్ కష్టాలు మొదలయ్యాయి. పోనీ పనులు పూర్తయిన తర్వాత పొడి కంకర, ఇసుక, మట్టితో తాత్కాలికంగా పూడుస్తుండడంతో దుమ్ము రేగుతూ ప్రజలు రోగాలబారిన పడుతున్నారు. కనీసం గుంతలు తవ్వి పూడ్చిన మట్టిపై దుమ్ము లేవకుండా నీటితో తడపడం లేదనే ఆరోపణలున్నాయి. ఇక ఎక్కడ పనులు జరుగుతున్నాయి, ఎప్పటివరకూ పనులు జరుగుతున్నాయనే విషయాన్ని చెప్పేవారే కరవయ్యారు. చివరకు స్థానిక కార్పొరేటర్లకు కూడా తమ ప్రాంతంలో జరుగుతున్న భూగర్భ డ్రైనేజీ పనులపై కనీస సమాచారం ఉండడం లేదు. ఇదే విషయాన్ని పలువురు కార్పొరేటర్లు నగర మేయర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికి ఆయన్నుండి వారికి వౌనమే సమాధానంగా వచ్చిందని తెలిసింది. పురపాలక మంత్రి నారాయణ నెల్లూరు నగరానికి వచ్చిన సమయంలో జరుగుతున్న పనులను పరిశీలించి కొద్దిరోజులు ప్రజలకు ఇబ్బందులు తప్పవని, అభివృద్ధి పనులు పూర్తయితే అంతా సర్దుకుపోతుందని చెబుతున్నారే తప్ప పనులు ఎందుకు నత్తనడకన సాగుతున్నాయనే విషయంపై గుత్తేదారు సంస్థలను ప్రశ్నించడం లేదని ప్రజలు భావిస్తున్నారు. సామాన్యులకు ఎలాగూ వారు సమాధానం చెప్పే పరిస్థితి లేదని, కనీసం ప్రజాప్రతినిధులైన తమ తరపున పనులను వేగవంతం చేయించాలని నగరవాసులు కోరుకుంటున్నారు. భూగర్భ డ్రైనేజి వ్యవస్థ నెల్లూరుకు రావడం ఎంతో ముదావహమని, అయితే అదే సందర్భంలో ప్రజలు పడుతున్న బాధలు త్వరగా తొలగాలంటే పనులను మరింత వేగిరం చేయించాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉంది.