శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పేదల బియ్యం పంచుకున్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సాంకేతిక పరిజ్ఞానంతో రేషన్ పంపిణీలో గోల్‌మాల్
* డిఎస్‌ఓ కార్యాలయ కంప్యూటర్ సిబ్బంది పాత్ర
* పోలీసుల అదుపులో 50 మందికి పైగా రేషన్ డీలర్లు?
* కలెక్టర్ ఆదేశాలతో పోలీసుల రహస్య విచారణ

నెల్లూరు, జనవరి 10: ప్రభుత్వం దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారి ఆకలి తీర్చేందుకు ఉద్దేశించిన రేషన్ బియ్యం పంపిణీలో జిల్లాలో కొత్త తరహా గోల్‌మాల్ జరిగినట్లు తెలుస్తోంది. ఈ గోల్‌మాల్ వ్యవహారం వెనుక ఉన్న కంప్యూటర్ సిబ్బందితో పాటు వీరికి సహకరించి లబ్ధి పొందిన సుమారు 50 మందికి పైగా రేషన్ డీలర్లు కూడా ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ ఆదేశాలతో ఎస్పీ పర్యవేక్షణలో రహస్య విచారణ సాగుతోంది. రేషన్ బియ్యం సరఫరాలో నిరుపేదలకు ఎటువంటి అన్యాయం జరగకుండా, బియ్యం పక్కదారి పట్టకుండా చూసేందుకు ప్రభుత్వం ఆధార్ లింకేజీతో కూడిన బయోమెట్రిక్ విధానానికి శ్రీకారం చుట్టింది. అప్పట్నుంచి గతంతో పోలిస్తే ఎంతో మెరుగైన ఫలితాలు రావడం, ప్రభుత్వ సరుకులను తీసుకున్న లబ్ధిదారుల సంఖ్యకు అనుగుణంగా మాత్రమే సరుకుల విడుదల జరుగుతూ వస్తోంది. ఈ సాంకేతిక పరిజ్ఞానాన్ని పర్యవేక్షించే కొందరు కాంట్రాక్ట్ కంప్యూటర్ ఆపరేటర్లు రేషన్ డీలర్లతో కుమ్మక్కై ప్రజల బియ్యాన్ని దోచుకునే పన్నాగానికి శ్రీకారం చుట్టారు. అంత్యోదయ, ఏఐవై కింద ప్రభుత్వం లబ్ధిదారులకు ప్రభుత్వం అందిస్తున్న బియ్యాన్ని రేషన్‌డీలరుకే చెందేలా ఈ కంప్యూటర్ ఆపరేటర్లు గత ఐదారు నెలలుగా ఈ తంతు కొనసాగుతోంది. రేషన్‌షాపుల్లో వేలిముద్రలు పడనిదే సరుకులు ఇవ్వరు. వేలిముద్రలు పడనివారికి ఆయా గ్రామాల విఆర్‌ఓలే వేలిముద్రలు వేసి లబ్ధిదారులకు సరుకులు అందచేయాల్సి ఉంటుంది. డిఎస్‌ఓ కార్యాలయంలో ఉన్న కంప్యూటర్ తాత్కాలిక సిబ్బంది కొందరు వేలిముద్రలు పడని రేషన్‌కార్డుదారుల వివరాలను గుర్తించి, సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో వేలిముద్రలు పడకుండానే సరుకులు లబ్ధిదారులకు ఇచ్చినట్లు చూపేలా ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను ఉపయోగించుకున్నారు. వేలిముద్రలు పడనివారు రిక్తహస్తాలతో తిరిగి వెళ్లిపోతే వీరు సదరు రేషన్‌డీలర్‌ను సంప్రదించడం లేదా డీలరే సమాచారం అందిస్తే వెళ్లి ప్రత్యేక సాంకేతికత ద్వారా లబ్ధిదారులకు బియ్యం అందినట్లు నమోదు చేస్తున్నారు. దీనికి ప్రతిఫలంగా కేజీ బియ్యానికి రూ.6 వంతున రేషన్ డీలర్ వద్ద నుండి తీసుకుంటూ తమ అక్రమాలను కొనసాగిస్తూ వస్తున్నారు. జిల్లాలో వందల సంఖ్యలో రేషన్ డీలర్లు ఈ కంప్యూటర్ ఆపరేటర్లతో కలిసి వందల టన్నుల బియ్యాన్ని కాజేసినట్లు స్పష్టమైన ఆధారాలు లభించడంతో జిల్లా కలెక్టర్ రంగంలోకి దిగి ఈ వ్యవహారంపై విచారణ జరపాల్సిందిగా ఎస్పీ రామకృష్ణ ద్వారా పోలీస్ శాఖను ఆదేశించడం జరిగింది. గత పక్షం రోజులుగా పోలీసులు కంప్యూటర్ ఆపరేటర్లను అదుపులోకి తీసుకుని వారిచ్చిన సమాచారం మేరకు జిల్లాకు చెందిన 50 మందికి పైగా రేషన్ డీలర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. వీరందరిని రహస్య ప్రదేశంలో విచారిస్తూ ఎంత మేర బియ్యాన్ని ఈ పద్ధతిన కాజేశారనే విషయాలను దర్యాప్తు చేస్తున్నారు. నేడో రేపో వారందరినీ మీడియా ముందుకు తీసుకువచ్చే అవకాశం ఉంది.

ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికే జన్మభూమి
* మంత్రి నారాయణ స్పష్టం
నెల్లూరు, జనవరి 10: ప్రజల సమస్యలను తెలుసుకుని, అక్కడికక్కడే సత్వరం అధికారుల ద్వారా పరిష్కరించడం, పరిష్కారం చేయలేని వాటిని ప్రభుత్వం దృష్టికి పంపించడమే జన్మభూమి కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యమని రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ పేర్కొన్నారు. బుధవారం నగరంలోని 9వ డివిజన్‌లో జరిగిన జన్మభూమి - మా ఊరు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జపాన్ దేశం మీద అణుబాంబు వేసినపుడు ఆ దేశం మొత్తం సర్వనాశనమైందని, అలాంటి దేశంలో ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేసి దేశాన్ని ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా నిలబెట్టుకున్నారని గుర్తు చేశారు. వారిని స్పూర్తిగా తీసుకొని విడిపోయిన నష్టపోయిన రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలోనడిపేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. 2050 నాటికి ప్రపంచంలోనే సంపద కలిగిన రాష్ట్రాల్లో ఒకటిగా మన రాష్ట్రం ఉండాలన్నదే ముఖ్యమంత్రి లక్ష్యమని వివరించారు. అనేక సంక్షేమ, అభివృద్ధి పథకాలు ప్రజలకు అందిస్తున్నారన్నారు. చంద్రన్న భీమా పథకం, రంజాన్, సంక్రాంతి, క్రిస్మస్ కానుకలు, బీసీ మైనార్టీలకు పెళ్లికానుక వంటి సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 110 మున్సిపాలిటీల్లో రూ.38వేల కోట్ల రూపాయలతో పేదలకు ఇళ్లు కడుతున్నామన్నారు. పేదవారి ఇంటికి అధికారులు వెళ్లి ఇంకా ఇళ్లులేని వారి జాబితా ప్రకారం మరలా కొత్త ఇంటి నిర్మాణాలు చేపడతామని స్పష్టం చేశారు. దోమల సమస్యల నిర్మూలనకు అండర్ గ్రౌండ్ సినరేజ్ ద్వారా శాశ్వత పరిష్కారం చేపడుతున్నామన్నారు. రూ.550కోట్ల వ్యయంతో చేపట్టిన భూగర్భ మురికినీటి పారుదల వ్యవస్థ పనులు మరో 6 నెలల కాలంలో పూర్తవుతాయని స్పష్టం చేశారు. దోమల నిర్మూలనకు కార్పొరేషన్‌లో ప్రత్యేక అధికారిని కేటాయించడం జరిగిందన్నారు. లార్వాను నిర్మూలించేందుకు యాక్షన్‌ప్లాన్ తయారు చేస్తుందన్నారు. 54 వార్డులకు ఫాగింగ్ మిషన్లు, 10వేల ఆయిల్ బాల్స్ సిద్ధం చేసి ప్రధాన కాలువల్లో వేస్తామన్నారు. 9వ వార్డులోని పార్కులను ఆధునీకరణ చేస్తామని హామీనిచ్చారు. 2018 మార్చి నెలాఖరులోగా పార్కులన్నీ సుందరీకరిస్తామని స్పష్టం చేశారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిమిత్తం నగరంలో రోడ్లపై తవ్విన గుంతలన్నీ పూడ్చడానికి సమయం పడుతుందని, ప్రజలు సమన్వయం పాటించాలని కోరారు. అంతక్రితం అంగన్‌వాడీ చిన్నారులతోనూ, స్థానిక పాఠశాల విద్యార్థులతోనూ మంత్రి ముచ్చటించారు. వివిధ సంక్షేమ పథకాలకు చెందిన చెక్కులను లబ్ధిదారులకు మంత్రి అందచేశారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముంగమూరు శ్రీ్ధరకృష్ణారెడ్డి, రాష్ట్ర పార్టీ ఉపాధ్యక్షురాలు తాళ్లపాక అనూరాధ, మున్సిపల్ కమీషనర్ అలీంబాషా, ఐసిడిఎస్ పీడి ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు.

వంటేరు పట్ల అపార గౌరవం
నా మాటలు అపార్ధం చేసుకున్నారు
రామాయపట్నం పోర్టుకు అప్పటి జీవోనే అడ్డంకి
ఎమ్మెల్సీ బీద స్పష్టం
కావలి, జనవరి 10: కావలి మాజీ శాసనసభ్యుడు, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ రాజకీయ సలహా కమిటీ సభ్యుడు వంటేరు వేణుగోపాల్‌రెడ్డి పట్ల తనకు అపారమైన గౌరవభావం ఉందని శాసనమండలి సభ్యుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర స్పష్టం చేశారు. బుధవారం ఆయన కావలి ఆర్ అండ్ బి బంగ్లాలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ రామాయపట్నం పోర్టు విషయంలో వంటేరునుద్దేశించి తానన్న మాటలను అపార్ధం చేస్తున్నారని వివరణ ఇచ్చారు. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నం పోర్టుకు అనుమతులు ఇచ్చే సమయంలో జీవోలో పొందుపరచిన పోర్టు ప్యూజిబిలిటి అనే అంశమే రామాయపట్నం పోర్టుకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ విషయం వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు రాజమోహన్‌రెడ్డి, వైవి సుబ్బారెడ్డిలకు తెలుసునని అందుకే వారు పోర్టు విషయంలో ముందుకు రావడం లేదని పేర్కొన్నారు. కానీ వారి ప్రోత్సాహంతో మా పెద్దన్న వంటేరు రామాయపట్నం పోర్టు కోసం శ్రమిస్తున్నారన్నారు. వంటేరు చిత్తశుద్ధి మీదగానీ , నిజాయితీ మీదగానీ, ప్రజా సమస్యలపై పోరాడే విషయంలో గాని తనకు ఎటువంటి అనుమానాలు లేవన్నారు. అయితే పోర్టు విషయంలో తెలుగుదేశం ప్రభుత్వం ఏమీ చేయడం లేదని విమర్శిస్తే మాత్రం సహించలేమన్నారు. కృష్ణపట్నం పోర్టు జీవోలో ఉన్న అడ్డంకిని ఎలా అధిగమించాలనే విషయంలో ముఖ్యమంత్రి నిపుణుల సలహాలు, సూచనలు తీసుకుంటున్నారన్నారు. తొందరపడి రామాయపట్నంను సూచిస్తూ కేంద్ర ప్రభుత్వానికి నివేదిక అందజేస్తే కృష్ణపట్నం పోర్టు యాజమాన్యం కోర్టును ఆశ్రయించే ప్రమాదం ఉందని, అలా జరిగితే కోర్టు వివాదం ముగిసేవరకు రామాయపట్నం పోర్టు సాధ్యం కాదనే ఆందోళనతోనే సమస్యను అధిగమించేందుకు అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నామన్నారు. అంతేతప్ప పోర్టు పట్ల తమకెలాంటి వ్యతిరేకత లేదని ఆయన పునరుద్ఘాటించారు.

ఉప రాష్టప్రతి పర్యటనకు ఏర్పాట్లు
వెంకటాచలం, జనవరి 10 : భారత ఉప రాష్టప్రతి ముప్పవరపు వెంకయ్యనాయుడు వెంకటాచలంలో రెండు రోజులు ఉండనున్న నేపథ్యంలో జిల్లా అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. వెంకయ్యనాయుడు ఈనెల 12, 13 తేదిల్లో స్వర్ణ్భారత్ ట్రస్టు, అక్షర విద్యాలయ పాఠశాలల్లో జరిగే పలు కార్యక్రమాల్లో తమిళనాడు గవర్నర్‌తో కలిసి పాల్గొననున్నారు. దీంతో స్వర్ణ్భారత్ ట్రస్టు, అక్షర విద్యాలయ పాఠశాల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈనేపథ్యంలో బుధవారం సాయంత్రానికే ముగ్గురు డిఎస్పీలు, పలువురు సీఐలు, ఎస్‌ఐలతోపాటు 300 మందికి పైగా పోలీసులు వెంకటాచలానికి చేరుకున్నారు. వీరికి అధికారులు విధులను కేటాయించారు. మంగళవారం స్వర్ణ్భారత్ ట్రస్టు ప్రాంగణం, అక్షర విద్యాలయ పాఠశాలను పరిశిలించిన జిల్లా ఎస్పీ పిహెచ్‌డి రామకృష్ణ పోలీసు బందోబస్తును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. పోలీసులతోపాటు రెవెన్యూ, ఇతర అధికారుల సౌకర్యాల కల్పనపై పరిశీలిస్తున్నారు. స్వర్ణ్భారత్ ట్రస్టులో సంక్రాంతి సంబరాల కార్యక్రమం, ఉచిత మెగా వైద్యశిబిరం నిర్వహించనుండటంతో ట్రస్టు ఆధ్వర్యంలో ఆ ఏర్పాట్లు చేస్తున్నారు. నెల్లూరు నుంచి చవటపాళెం పంచాయతీ పరిధిలోని సరస్వతినగర్ వద్ద ఉన్న అక్షర విద్యాలయ పాఠశాల వరకు జాతీయ రహదారిపై ప్రధాన కూడళ్ల వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు.

కావలి అభివృద్ధి ప్రణాళిక కోసం ప్రజలతో ముఖాముఖీ
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర వెల్లడి
కావలి, జనవరి 10: కావలి పట్టణ సమగ్ర అభివృద్ది ప్రణాళిక రూపొందించడం కోసం త్వరలో ప్రజలతో ముఖా ముఖి కార్యక్రమం నిర్వహించనున్నట్లు శాసనమండలి సభ్యులు, తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు బీద రవిచంద్ర తెలిపారు. వివిధ శాఖల ద్వారా సాధించుకున్న నిధులను ప్రజల సూచనలతో ప్రజల అవసరాల కోసం వినియోగిస్తామన్నారు. జన్మభూమి-మా ఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు కావలికి విచ్చేసిన ఆయన విలేఖరులతో సమావేశమయ్యారు. ఇటీవల కావలి నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్‌బాబు పర్యటించిన సందర్భంలో కార్యక్రమాలను విజయవంతం చేసిన అధికారులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని తాగునీటి సమస్య పరిష్కారానికి అమృత పథకం ద్వారా మంజూరైన 59 కోట్ల రూపాయలతో ప్రతి కాలనీలో ఓవర్‌హెడ్ ట్యాంక్‌లు, పైపులైన్లు నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ పనులను 2019 ఉగాది నాటికి పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకుంటామన్నారు. పట్టణంలో డ్రైనేజి వ్యవస్థను 80 కోట్లతో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. మొదటి విడతగా 33 కోట్లతో అంతర్గత డ్రైనేజి వ్యవస్థను అభివృద్ధి చేస్తామన్నారు. అపరిష్కృతంగా ఉన్న పెద్దపవని ఫ్లైఓవర్ రోడ్డు సమస్యను త్వరలోనే పరిష్కరిస్తామన్నారు. నూతన డిజైన్‌కు టెక్నికల్ ఆమోదం వచ్చిందని ఆర్థిక శాఖ అనుమతులు రావలసి ఉందని తెలిపారు. ఈ రోడ్డు నిర్మాణం కారణంగా నష్టపోతున్న వారికి భారీగా పరిహారం ఇస్తామని, 18 నెలల కాలవ్యవధిలో ఈ రోడ్డును పూర్తిచేస్తామన్నారు. శివారు కాలనీలో ఉన్న గ్రావెల్ రోడ్లను 30 కోట్లతో సిసి రోడ్లుగా మార్చుతామని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఆయనతో పాటు మున్సిపల్ ఛైర్మన్ అలేఖ్య, ఏరియా వైద్యశాల అభివృద్ధి కమిటీ ఛైర్మన్ గుత్తికొండ కిషోర్, మాజీ మున్సిపల్ చైర్మన్ గ్రంధి యానాదిశెట్టి, తెదేపా సీనియర్ నాయకులు రామకోటారెడ్డి, పట్టణ పార్టీ అధ్యక్షుడు అమరా యాదగిరిగుప్తా, సధీర్‌బాబు, పలువురు కౌన్సిలర్లు, నాయకులు పాల్గొన్నారు.

ఫ్లెమింగో ఫెస్టివల్ కాదు.. పసుపు పండగ
సూళ్లూరుపేట, జనవరి 10: సూళ్లూరుపేట వేదికగా ప్రతియేటా జరిగే పక్షుల పండుగను అధికార పార్టీ నేతలు పసుపు పండుగగా మార్చి నిధులు దుర్వినియోగం చేశారని నుడా డైరెక్టర్ సన్నారెడ్డి దయాకర్‌రెడ్డి విమర్శించారు. బుధవారం స్థానిక ఆర్ అండ్ బి బంగ్లాలో ఆయన బీజేపీ నాయకులతో కలసి విలేఖర్ల సమావేశంలో మాట్లాడారు. ప్రణాళికాబద్ధంగా చేయాల్సిన పక్షుల పండుగను అధికార పార్టీకి చెందిన వారు నిబంధలను తుంగలో తొక్కి కేవలం డ్యాన్స్ తళుకులతో చేసి మూడు రోజులు రూ.3కోట్లు ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. మిత్రపక్షంగా ఉన్న బీజేపీ నాయకులను ఆహ్వాన కమిటీలో వేయకుండా కనీసం ఆహ్వానాలు కూడా అందించకుండా నిర్వహించడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. ఇది ప్రభుత్వ పండుగా లేక పసుపు పండుగా అని ఎద్దేవా చేశారు. విదేశాల నుంచి వలస వచ్చే పక్షుల ప్రాముఖ్యతను చాటిచెప్పేందుకు ప్రభుత్వం కోట్లాది రూపాయలు నిధులు కేటాయిస్తే ఇక్కడ అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నేతలు వారి ప్రాపకం కోసం సినీతారలు, సినీ గాయకులను తీసుకొచ్చి డ్యాన్స్‌లను చేసి షో చేశారే తప్ప ప్రభుత్వ పండుగలా నిర్వహించలేదని విమర్శించారు. మున్సిపాలిటీలో అభివృద్ధికి రూ.6కోట్లు మంజూరైనా ఇక్కడ అధికార పార్టీలో గ్రూపుల తగాదాలతో నిధులు వినియోగించుకోకపోవడంతో సాక్షాత్తు మున్సిపల్ శాఖ మంత్రి పక్షుల పండుగ సభలో మున్సిపాలిటీ నిర్వాకంపై అసహనం వ్యక్తం చేశారు. దీనినిబట్టిచూస్తే వారి పాలన ఏ తీరుగా ఉందో అర్ధం చేసుకోవచ్చునన్నారు. పక్షుల పండుగ వేదికపై ప్రొటోకాల్ కూడా పాటించలేదని ప్రజాప్రతినిధులు, కేడర్‌లేని వ్యక్తులు కూడా వేదికపై చిందులు వేయడం పద్ధతిగా లేదన్నారు. స్థానిక ఎమ్మెల్యేకు సరైన గౌరవం ఇవ్వలేదని ఆరోపించారు. ఇలాంటి ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు బాధ్యతగా ఉండాలని అలాకాకుండా ఇష్టానుసారంగా చేసుకొంటే ప్రజల నుంచి తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన వస్తుందని హెచ్చరించారు. ఇప్పుడు బిజెపి ఏపిలో బలోపేతం అవుతోందని, అనేక మంది నేతలు తమ పార్టీవైపు చూస్తున్నారని దీనిని గుర్తించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కోటయ్య గౌడ్, పులుగు శ్రీనివాసులరెడ్డి, ఆరణి విజయభాస్కర్ రెడ్డి, చెన్నకేశవులు, సుబ్రమణ్యంరెడ్డి, కండిగల కందయ్య, విజయమ్మ, మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రొటోకాల్
ఉల్లంఘించారు
వైకాపా ఆత్మకూరునేతల ధ్వజం
ఆత్మకూరు, జనవరి 10: నెల్లూరు జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ఆత్మకూరు బ్రాంచ్ నూతన భవన ప్రారంభోత్సవ వేడుకల్లో ప్రొటోకాల్ ఉల్లంగన జరిగిందంటూ స్థానిక వైకాపా నేతలు ధజమెత్తారు. తమ పార్టీకి చెందిన జడ్పీ చైర్మన్ నెల్లూరు ఎంపి తమ ఆత్మకూరు ఎమ్మెల్యేలకు ఈ ప్రారంభోత్సవ కార్యక్రమ ఆహ్వాన సమాచారమే లేదని తప్పుపట్టారు. ముఖ్య అతిథులుగా అమాత్యులను ఆ తరువాత గౌరవ అతిథిపేరిట ఎలాంటి పదవీ లేకున్నామాజీ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేరును తమ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులకంటే ముందు వరసలో బ్యాంకు ప్రారంభోత్సవ శిలా ఫలకంపై పేర్కొన్న వైనం క్షంతవ్యం కాదని హెచ్చరించారు. ఈ ప్రకటన చేసిన వారిలో వైకాపా రాష్ట్ర కార్యదర్శి ఇందూరు నారసింహారెడ్డి, ఆత్మకూరు మున్సిపల్ కౌన్సిల్ పక్షనేత అల్లారెడ్డి ఆనందరెడ్డి, నూతన యువజన విభాగ అధ్యక్షులు నాగలపాటి ప్రసాద్ రెడ్డి, ఉల్కా పెంచులయ్య, కొండా వెంకటేశ్వర్లు, తదితరులు ఉన్నారు.

అర్హులకు రేషన్‌కార్డులు
* ఎమ్మెల్యే బొల్లినేని
వింజమూరు, జనవరి 10: జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో నియోజక వర్గంలోని అర్హులైన వారందరికి రేషన్ కార్డులు పింఛన్లు మంజూరు చేస్తున్నామని స్థానిక శాసన సభ్యులు బొల్లినేని రామారావు పేర్కొన్నారు. ఆయన బుధవారం మండలంలోని ఊటుకూరు పంచాయతీలో జరిగిన జన్మభూమి కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ జన్మభూమి మా ఊరు కార్యక్రమం ద్వారా అర్హులైన ప్రతి ఒక్కరికి పింఛన్లు రేషన్ కార్డులు, పక్కాగృహాలు అందిస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్‌కు ఆదాయ వనరు తిరుమల తిరుపతి దేవస్థానం ఒక్కటే అయినప్పటికి చంద్రబాబునాయుడు ఎన్నికల్లో రైతులకు ఇచ్చిన హామీలను మూడవ విడత రుణమాఫీ నగదును ఇటీవలే వారి బ్యాంకు ఖాతాలకు జమ చేశారన్నారు. ఈ పంచాయతీలోకూడా ఊటుకూరు నుంచి ఇందిరా నగర్ వరకు 60 లక్షల రూపాయలతో సిసి, బిటి రోడ్డు రెండు వంతెనలతో పని పూర్తికావస్తుందన్నారు. ఈకార్యక్రమంలో జట్పీటిసి సభ్యులు పులిచర్ల నారాయణరెడ్డి, ఎంపిటిసి గురజాల వెంకట్రమణయ్య నాయుడు, టిడిపి మండలాధ్యక్షులు చల్లా వెంకటేశ్వర్లు యాదవ్, సర్పంచ్ నల్లి మహాలక్ష్మమ్మ, టిడిపి కార్యకర్తలు పాల్గొన్నారు.