శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

విలంబి అందరిలోనూ సంతోషం నింపాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, మార్చి 18: విలంబి నామ సంవత్సరం ప్రజలందరిలోనూ సంతోషం నింపాలని, రాష్ట్రం అభివృద్ధిలో మరింత ముందుకు వెళ్లాలని ఎమ్మెల్సీ బీద రవిచంద్ర ఆకాంక్షించారు. ఉగాది పర్వదినం సందర్భంగా జిల్లా సృజనాత్మక, సాంస్కృతిక సమితి ఆధ్వర్యంలో స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో జరిగిన ఉగాది వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ ఉగాది అంటే తీపి, చేదుల కలబోతే జీవితం అని చెబుతుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి మండల స్థాయి నుండి రాష్టస్థ్రాయి వరకు ప్రభుత్వ నిధులతో ఉగాది వేడుకలను ఏర్పాటు చేయడం హర్షించదగిన పరిణామం అన్నారు. ఆదాయం, వ్యయం, గౌరవం, అగౌరవం వంటి అంశాలతో కూడినదే ఉగాది అన్నారు. ఎలాంటి విఘ్నాలు జరగకుండా విలంబినామ సంవత్సరం గడిచిపోవాలని ఆయన ఆకాంక్షించారు. అందరి ఆశీస్సులు ముఖ్యమంత్రికి ఉండాలని కోరారు. జాయింట్ కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్ మాట్లాడుతూ అందరికీ మంచి జరగాలని, జిల్లా అన్ని రంగాల్లో ముందుండి ప్రగతిపథంలో కొనసాగాలన్నారు. ప్రజలందరికీ సంక్షేమం, అభివృద్ధి పథకాలు అందాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. జాయింట్ కలెక్టర్-2 వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉగాది అంటేనే పచ్చడి, పంచాంగం, పథ్యం అని తెలిపారు. ఈ ఏడాది పంచాంగంలో మంచి వర్షాలు ఉంటాయన్నారు. ప్రభుత్వానికి ఆదాయం, పాడిపంటలు బాగా ఉంటాయన్నారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకున్నారు. పంచాంగకర్త సిహెచ్ పూర్ణానందస్వామి ధార్మిక ప్రవచనం చేశారు. ఈ ఏడాది జిల్లాలో పంటలు బాగా పండుతాయని, ఆరోగ్యం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అంతక్రితం అతిథులు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అతిథులను అప్కాబ్ చైర్మన్ పోలిశెట్టి ఘనంగా సత్కరించారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో కవులు తమ ఉగాది కవితాగానం చేశారు. విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ రంగాల్లో నిష్ణాతులైన ప్రముఖులు ములుగు విజయదుర్గ, మేకప్‌మాన్ వి.లక్ష్మీకాంత్‌బాబు, నృత్యంలో నెల్లూరు నారాయణబాబు, మెజీషియన్ ఎన్‌ఆర్ కరెంట్, సేవారంగంలో కందుకూరి చెంగయ్య ఆచారి, సంగీతంలో సూరం సుధాకర్, చిత్రలేఖనం కె.సునీతరవి, నాటకరంగంలో వి.మోహన్‌జనార్ధన్, డోలు మల్లం వెంకటేశ్వర్లు, న్యాయసేవలో గోవిందరాజు సుభద్రాదేవిలను సత్కరించారు.

వేడుకగా ఉగాదికి ఆహ్వానం
* జిల్లావ్యాప్తంగా కొత్త ఏడాది సంబరాలు
నెల్లూరు, మార్చి 18: తెలుగువారి నూతన సంవత్సర ప్రారంభ ఉగాది వేడుకలు జిల్లావ్యాప్తంగా ఘనంగా జరుపుకున్నారు. నూతన ఏడాదిని పురస్కరించుకుని ఆలయాలు విచ్చేసిన భక్తులతో కిక్కిరిసి దర్శనమిచ్చాయి. వేకువజాము నుండే ఆలయాల్లో భక్తుల రద్దీ కనిపించింది. తెలుగు వాకిళ్లు ఉగాది శోభను సంతరించుకున్నాయి. జిల్లాలోని పెంచలకోన, జొన్నవాడ, సూళ్లూరుపేట చెంగాళమ్మ ఆలయాలతో పాటు నగరంలోని శ్రీరాజరాజేశ్వరి, శ్రీరంగనాథస్వామి దేవాలయాల్లో ఉగాది సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు సైతం విశేష సంఖ్యలో హాజరై ఏడాది ప్రారంభాన స్వామివార్లను దర్శించుకొని మంచి జరగాలని ప్రార్ధించారు. ఉగాదిని పురస్కరించుకొని నగరంలోని వాణిజ్య సముదాయాలు కొనుగోలుదార్లతో నిండిపోయాయి. ప్రత్యేక ఆఫర్లు ప్రకటించడంతో ఏడాది ప్రారంభానికి కొత్త వస్తువులు కొనుగోలు చేసేందుకు అందరూ ఆసక్తి కనబరిచారు. వివిధ సాంస్కృతిక, సామాజిక సంస్థల ఆధ్వర్యంలో పలుచోట్ల ఉగాది వేడుకలు, పంచాంగ శ్రవణాలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా స్థానిక కస్తూర్బా కళాక్షేత్రంలో నిర్వహించిన ఉగాది కవిసమ్మేళనం ఆకట్టుకుంది. ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో
వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో స్థానిక ఏసి సుబ్బారెడ్డి స్టేడియంలో విలంబి నామ సంవత్సర ఉగాది సంబరాలు ఘనంగా నిర్వహించారు. నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది రాష్ట్ర ప్రజలకు అంతా మంచి జరగాలని అభిలషించారు. స్టేడియంను అరటిపిలకలు, మామిడి ఆకులు, ముగ్గులతో అందంగా అలంకరించారు. వాకర్స్ అందరికీ ఉగాది పచ్చడి అందచేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు కిలారి తిరుపతినాయుడు, గుడుగుంట వేణుగోపాల్, సభ్యులు అంకిరెడ్డి, శేషగిరిరావు, రాఘవేంద్రశెట్టి, కె.రాజగోపాల్, మేకల నరేంద్రరెడ్డి, దద్దోలు రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
రంగనాథస్వామి దేవస్థానంలో
ఉగాది సందర్భంగా శ్రీ తల్పగిరి రంగనాథస్వామి దేవస్థానంలో స్వామివారికి తిరుమంజన సేవ జరిగింది. కామిశెట్టి కుటుంబీకులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమంలో దేవస్థాన చైర్మన్ మంచికంటి సుధాకర్‌రావు, ధర్మకర్తల మండలి సభ్యులు పాల్గొన్నారు. డాక్టర్ కె.అంజన్‌కుమార్, కె.రాజేశ్వరి దంపతులు ఆలయంలోని ఆంజనేయస్వామి వారికి వెండి కిరీటం, మకరతోరణం, వక్షస్థలం, పంచె, పాదాలు అందించారు. సుమారు ఏడున్నర కేజీల వెండితో ఈ ఆభరణాలు చేయించినట్లు దాతలు తెలిపారు.
శ్రీరాజరాజేశ్వరి దేవస్థానంలో
విలంబి నామ సంవత్సర ఉగాది వేడుకల్లో భాగంగా దర్గామిట్టలోని శ్రీరాజరాజేశ్వరి దేవస్థానంలో పంచాంగ శ్రవణం జరిగింది. ఆలూరి శిరోమణి శర్మ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. అనంతరం రాత్రి దివ్య ఆభరణ అలంకార శోభితురాలైన శ్రీరాజరాజేశ్వరి అమ్మవారికి వేద మంత్రోచ్ఛరణలతో, ప్రత్యేక బ్యాండ్ వాయిద్యాలతో దేవస్థానంలో ప్రదక్షణోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నెల్లూరు ఎంపి మేకపాటి రాజమోహన్‌రెడ్డి దంపతులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. ముత్యాల చీర ధరించిన అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులుతీరారు.