శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

బెట్టింగ్‌రాయుళ్ల జేబులు ఖాళీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, డిసెంబర్ 11: తెలంగాణ ఎన్నికల ఫలితాలు నెల్లూరు జిల్లాలోనూ ప్రభావాన్ని చూపాయి. ఎన్నికల ఫలితాలపై జిల్లాలో గత రెండు మూడు రోజులుగా కోట్లది రూపాయల మేర పందేలు సాగాయి. తెలంగాణ రాష్ట్ర సమితికి, నాలుగు పార్టీలతో కలిసి ఏర్పడిన మహాకూటమికి నడుమ ప్రతిష్టాత్మకంగా జరిగిన పోరులో గెలుపు ఎవరిని వరిస్తుందోనని అందరిలోనూ ఎంత ఆసక్తిని రేపిందో బెట్టింగ్‌రాయుళ్లకు కూడా పందేలకు అంతా మజాను అందించిందనే చెప్పాలి. దీనికితోడు పోలింగ్ తర్వాత వివిధ సర్వేలు తమ ఫలితాలను వెల్లడించడంతో బెట్టింగ్‌రాయుళ్లలో మరింత ఆసక్తి నెలకొంది. వివిధ రాజకీయ పార్టీలకు చెందినవారు తమ పార్టీలపై ఉన్న అభిమానంతో కొందరు పందేలు కట్టారు. అయితే ఎక్కువ మంది సర్వే ఫలితాలకు అనుగుణంగా పందేలు పెట్టేందుకు ముందుకొచ్చారు. ఈ సమయంలో ఆంధ్రా ఆక్టోపస్‌గా పేరెన్నికగన్న ఓ మాజీ పార్లమెంటు సభ్యుడు వెల్లడించిన సర్వే ఫలితాలకు అనుగుణంగా పందేలు పెట్టేందుకు ఆసక్తి కనబరిచారు. గతంలో సదరు నేత చేయించిన సర్వేల ఫలితాలు దాదాపు దగ్గరగా ఎన్నికల ఫలితాలు రావడం, ఇదే విషయాన్ని ప్రసార మాధ్యమాలు కూడా ప్రసారం చేయడంతో అందరూ ఆయన సర్వే ఫలితాలను పూర్తిగా విశ్వసించారు. ఉత్తర భారతదేశానికి చెందిన సంస్థలు చేపట్టిన సర్వేలన్నీ ఓ పార్టీకి అనుకూలంగా ఉండగా, ఆయన చేపట్టిన సర్వే కూటమికి అనుకూలంగా ఉన్నది. అయితే అన్ని సర్వేలను కాదని కూడా ఈయన సర్వే వైపే బెట్టింగ్‌రాయుళ్లు మొగ్గుచూపి చివరకు చేతులు కాల్చుకున్నారు. జిల్లాలో ఈ ఎన్నికలకు సంబంధించి ఎక్కువగా మహాకూటమికి అనుకూలంగా బెట్టింగ్ సాగినట్లు విశ్వసనీయ సమాచారం. ఫలితాలు తెరాసకు అనుకూలంగా రావడంతో జిల్లాలో ఎక్కువమంది బెట్టింగ్‌రాయుళ్లు తీవ్రంగా నష్టపోయారు. నగరానికి చెందిన ఓ నేత మహాకూటమికి అనుకూలంగా ఫలితం ఉంటుందంటూ హైదరాబాద్‌లోని తన స్నేహితుల ద్వారా అక్కడి వారితో రూ.15 లక్షలు పందెం కాసినట్లు తెలిసింది. అలాగే కూకట్‌పల్లి అభ్యర్థి నందమూరి సుహాసిని, కొడంగల్ నుండి మహాకూటమి తరపున పోటీలో ఉన్న రేవంత్‌రెడ్డిల గెలుపు కంటే వారు పొందే మెజార్టీపైన కూడా జిల్లాలో పందేలు జరగడం విశేషం. వీరిలో ముఖ్యంగా రేవంత్‌రెడ్డి 25వేల పైచిలుకు ఓట్ల మెజార్టీతో గెలుస్తాడని రెండుకు మూడు వంతున పందేలు సాగాయి. అంటే రేవంత్‌రెడ్డి తరపున రూ.లక్షకు అవతలి వ్యక్తి రూ. ఒకటిన్నర లక్ష ఇవ్వాల్సి ఉంటుంది. కేవలం గెలుపునకు సంబంధించి మాత్రమే అయితే రూ.లక్ష పందెం పెడితే రేవంత్‌రెడ్డి గెలిస్తే అవతలి వ్యక్తి రూ.70 వేలు ఇస్తే సరిపోతుంది. ఇలా రేవంత్‌రెడ్డిని కేంద్రంగా చేసుకుని కూడా జిల్లాలో పందేలు సాగాయి. అయితే చివరకు ఎవరూ ఊహించని తీర్పును తెలంగాణ ఓటర్లు ఇవ్వడంతో అవాక్కవడం అందరి వంతయింది. జిల్లాలో సుమారు రూ.20-30కోట్ల వరకూ ఈ ఎన్నికల్లో పందేలు కాసి బెట్టింగ్‌రాయుళ్లు పోగొట్టుకున్నట్లు అనధికారిక సమాచారం మేరకు స్పష్టమవుతోంది. ఎన్నికల ఫలితాలు వెలువడే సమయంలో అందరూ టీవీలకు అతుక్కుపోయి అక్కడి అభ్యర్థుల ఫలితాలతో పాటు తమ (బెట్టింగ్‌రాయుళ్ల) రాతలు ఏవిధంగా ఉండబోతున్నాయో చూస్తూ గడిపేయడం గమనార్హం.

పక్షుల పండుగకు విస్తృత ఏర్పాట్లు
* మంత్రి నారాయణ వెల్లడి
నెల్లూరురూరల్, డిసెంబర్ 11: వచ్చే జనవరి 17,18,19 తేదీలలో నిర్వహించనున్న పక్షుల పండుగకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నట్లు పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పి నారాయణ తెలిపారు. మంగళవారం చింతారెడ్డిపాళెంలోని తన క్యాంపు కార్యాలయంలో పక్షుల పండుగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ముత్యాలరాజుతోపాటు పలువురు అధికారులతో మంత్రి సమీక్ష నిర్వహించారు. అనంతరం మంత్రి నారాయణ విలేఖరులతో మాట్లాడుతూ 17,18,19 తేదీల్లో పక్షుల పండుగను ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించనున్నట్లు తెలిపారు. పక్షుల పండుగ కోసం వచ్చే పర్యాటకులకు అన్ని వసతులు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. సూళ్లూరుపేట నుంచి శ్రీకాళహస్తికి వెళ్లే మార్గంలో మున్సిపాలిటీ పరిధిలోని ఆరు కిలోమీటర్ల తారురోడ్డుకు వెంటనే మరమ్మతులు చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో సుమారు రూ.250 కోట్లతో పలు అభివృద్ధి కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయని, ఆ కార్యక్రమాలన్నీ పక్షుల పండుగలోపు పూర్తిచేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. పక్షులను తిలకించడానికి రాష్ట్ర నలుమూలల నుంచి పర్యాటకులు వస్తారని, వారికోసం బస్సు సౌకర్యాలు విరివిగా ఏర్పాటు చేయాలన్నారు. అంతేకాకుండా తాగునీరు సమస్య తలెత్తకుండా ఎక్కడికక్కడ అధికారులు సమన్వయం చేసుకుంటూ ముందుకు సాగాలని ఆయన కోరారు. పక్షుల పండుగ జరిగే మూడు రోజులు సూళ్లూరుపేట పరిసర ప్రాంతాల్లో పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకునే విధంగా అధికారులు తగిన ఏర్పాట్లను చేయాలని ఆయన తెలిపారు. స్థానిక నాయకులతో అధికారులు సమన్వయం చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ముత్యాలరాజు, సూళ్లూరుపేట టీడీపీ ఇన్‌చార్జి పరసా రత్నం, పలువురు నాయకులు, వివిధ శాఖలకు సంబంధించిన అధికారులు పాల్గొన్నారు.

ఇందిరాభవన్‌లో కాంగ్రెస్ సంబరాలు
నెల్లూరు సిటీ, డిసెంబర్ 11: దేశంలోని ఐదు రాష్ట్రాలలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మూడు రాష్ట్రాలలో కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగురవేయడంతో డీసీసీ అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాభవన్‌లో సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఇందిరాభవన్‌కు అధికసంఖ్యలో కార్యకర్తలు చేరుకుని టపాకాయలు కాల్చి, మిఠాయిలు పంచి విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పనబాక కృష్ణయ్య మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ వ్యతిరేక విధానాలకు రాజస్థాన్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గడ్ రాష్ట్రాల ప్రజలు గుణపాఠం చెప్పారని, 2019 ఎన్నికలకు ఇది సెమీఫైనల్ అని పేర్కొన్నారు. మోదీ పతనానికి ఈ ఎన్నికలు నాంది అని అన్నారు. దేశంలో పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీని సక్రమంగా అమలు చేయకపోవడం, దేశంలోని అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంతో ప్రజల్లో ఆయన పట్ల నమ్మకం పోయిందన్నారు. దేశంలోని మూడు రాష్ట్రాల్లో బీజేపీకి గుణపాఠం చెప్పి కాంగ్రెస్‌కు పట్టం కట్టడం ఆనందంగా ఉందన్నారు. దేశంలో వేల కోట్లను ఎన్నికల కోసం ఖర్చు కోసం పెట్టిన మోదీ ఏమి సాధించారని నిలదీశారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో మేనిఫెస్టోను అమలు చేయలేదన్నారు. దేశంలో అనేక వ్యవస్థల్లో కుంభకోణాలకు తెర తీయడంతో ప్రజలే మోదీకి తగిన గుణపాఠం చెప్పారన్నారు. ఏపీకి ఇవ్వాల్సిన ప్రత్యేక హోదా ఇవ్వని, విభజన హామీలను నెరవేర్చని ప్రధాని మోదీని వచ్చే ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు కూడా ఇంటికి సాగనంపడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు. జిల్లాకు రావల్సిన దుగరాజపట్నం పోర్టును అడ్డుకున్నారని ధ్వజమెత్తారు. రైల్వే బడ్జెట్‌ను ఎత్తివేసి రైల్వేశాఖను నాశనం చేశారని ఆయన మండిపడ్డారు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాకూటమి గెలుస్తుందని అందరూ భావించారని, అయితే గ్రామాల్లో ఓటింగ్ శాతం పెరగడం వల్ల ప్రజాకూటమి ఓటమిపాలైందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ధనబలంతో గెలిచిందని అన్నారు. 2019లో జరిగే ఎన్నికలకు ఈ మూడురాష్టల్ర ఫలితాలే దిక్సూచి అని, 2019లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం తథ్యమని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఏదిఏమైనప్పటికీ భవిష్యత్తులో కూటమి కొనసాగుతుందని పనబాక స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

ఆక్వా జోన్ ఏర్పాటుపై సమావేశం
* పెరగనున్న ఆక్వాసాగు పరిధి
నెల్లూరు, డిసెంబర్ 11: జిల్లాలో ఆక్వా సాగును మరింత ప్రోత్సహించడంలో భాగంగా సారవంతమైన, ఆక్వాసాగుకు అనుకూలమైన భూములను గుర్తించి రైతులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక ఆక్వాజోన్ ఏర్పాటుపై మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాల మేరకు.. ఇప్పటివరకు జిల్లాలో 12,731 హెక్టార్లలో ఆక్వాసాగు జరగుతుండగా, సాగుకు అనుకూలంగా గుర్తించిన మరో 9,279.49 హెక్టార్లలో కూడా ఆక్వాసాగును ప్రోత్సహించబోతున్నారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ కమిటీ సమావేశంలో నిర్ణయించిన భూముల్లో ఆక్వాసాగుకు అవసరమైన అన్ని అనుమతులను ఆయా శాఖలు త్వరితగతిన ఇవ్వాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందుకోసం జీవో నెం.16కు అనుగుణంగా ఆక్వాజోన్‌లు ఏర్పాటు చేయాలని సూచించారు. జిల్లాలో ప్రస్తుతం ఉన్న ఉప్పునీటి, మంచినీటి చెరువులతో పాటు ఆక్వాకు అనుకూలమైన భూములను గ్రామాలవారీగా సర్వే చేసి గ్రామసభల్లో పేర్కొనడం కూడా జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో సిఐఎఫ్‌ఏ శాస్తవ్రేత్త డాక్టర్ బిఎస్ గిరి, ఫిషరీస్ కాలేజ్ ప్రిన్సిపాల్ డాక్టర్ వి.హరిబాబు, ఎంపెడా ఎడి గణేష్, మత్స్యశాఖ జెడి పి.శ్రీహరి, ఆక్వారైతులు బాబునాయుడు, శ్రీ్ధర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

2019లో రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం వీడనుంది
* టీడీపీ నుంచి వైకాపాలోకి భారీగా వలసలు * ఎమ్మెల్యే కాకాణి స్పష్టం
వేదాయపాళెం, డిసెంబర్ 11: ఆంధ్ర రాష్ట్రానికి పట్టిన చంద్రగ్రహణం 2019 ఎన్నికలతో వీడనుందని వైకాపా జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి శాసన సభ్యుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైసీపీ జిల్లా కార్యాలయంలో సర్వేపల్లి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ నాయకులు కాకాణి సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా వారికి వైసీపీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కాకాణి మాట్లాడుతూ తెలంగాణ ఎన్నికల ఫలితాలు చంద్రబాబుకు చెంప పెట్టులాంటిదన్నారు. ఎన్టీఆర్‌ను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను తన స్వార్థం కోసం పావులుగా వాడుకుంటూ వారికి ద్రోహం చేశారని విమర్శించారు. చంద్రబాబు మాయమాటలు నమ్మి హరికృష్ణ కూతురు ఎన్నికల్లో పోటీ సి మోసపోయారన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో ఎన్నడూ లేనివిధంగా అవినీతి, అక్రమాలు జరుగుతున్నాయన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ ఉనికి కోల్పోయిందన్నారు. టీడీపీ పదవీకాలం పూర్తయిందంటే టీడీపీకి సర్వేపల్లి నియోజకవర్గంలో ఏజెంట్లు కూడా దొరకరని ఎద్దేవా చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలకు ప్రజలతోపాటు టీడీపీ శ్రేణులు కూడా పార్టీని వీడి వైసీపీలోకి చేరుతున్నారన్నారు. 2019 ఎన్నికల్లో వైసీపీ పక్షాన భారీ మెజార్టీ సాధించే నియోజకవర్గాల్లో సర్వేపల్లికి చోటుదక్కుతుందన్నారు. పార్టీలో చేరినవారందరికీ, పార్టీ అభివృద్ధికి కృషి చేస్తున్నవారందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. పార్టీలో చేరిన వారిలో ఉప్పుల వెంకయ్య, కుప్పా సురేష్, బొచ్చు పుల్లయ్య, తాండ్ర మోహన్, తాండ్ర లక్ష్మికాంతమ్మ, బొచ్చు సురేష్‌లతోపాటు వంద మందికిపైగా పార్టీలో చేరారు. ఈకార్యక్రమంలో వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

పక్కాగృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తిచేయాలి
ఉదయగిరి, డిసెంబర్ 11: పక్కాగృహాలు మంజూరైన లబ్ధిదారులు నిర్మాణాలను త్వరితగతిన పూర్తిచేయాలని గృహనిర్మాణ శాఖ డీఈ శ్రీహరిగోపాల్ పేర్కొన్నారు. ఆయన మంగళవారం మండలంలోని వెంగళరావునగర్, దుంపవారిపల్లి, ఉదయగిరిలో జరుగుతున్న పక్కాగృహాల నిర్మాణాలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో ఎన్టీఆర్ పక్కాగృహాల పథకం కింద 2016-17 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 1250 పక్కాగృహాలు మంజూరుకాగా అన్ని నిర్మాణాలు పూర్తిచేశామన్నారు. 2017-18లో 1198 గృహాలు మంజూరుకాగా వీటిలో 930 గృహాలు పూర్తికాగా 253 గృహాలు వివిధ దశల్లో వున్నాయన్నారు. మరో 15 గృహాల పనులు ప్రారంభం కాలేదన్నారు. 2018-19లో 1100 గృహాలు మంజూరుకాగా 654 పూర్తిచేశామన్నారు. 418 వివిధ దశల్లో వుండగా 28 ఇళ్లు ఇంతవరకు నిర్మాణాలు చేపట్టలేదన్నారు. అలాగే పిఎంవై పథకం కింద 2016-17లో 220 పక్కా గృహాలు మంజూరయ్యాయన్నారు. వీటిలో 143 ఇళ్లు నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. 2017-18లో 31 గృహాలు మంజూరు కాగా 13 గృహాలు పూర్తిచేశామన్నారు. లబ్ధిదారులు వెంటనే నిర్మాణాలు పూర్తిచేసుకోవాలన్నారు. పూర్తయిన గృహాలకు సకాలంలో బిల్లులు చెల్లిస్తామన్నారు. ఈయన వెంట హౌసింగ్ ఏఈ కరీముల్లా, వర్క్ ఇన్‌స్పెక్టర్ హర్షవర్దన్, చెన్నారాయుడు ఉన్నారు.

కరవు గ్రామాలను పరిశీలించిన మానవ హక్కుల వేదిక
వింజమూరు, డిసెంబర్ 11: ఉమ్మడి రాష్ట్రాల మానవ హక్కుల వేదిక కోఆర్డినేటర్ వి వసంతలక్ష్మి మంగళవారం కలిగిరి, కొండాపురం, వింజమూరు మండలాల్లోని కరవు గ్రామాలను పరిశీలించారు. వింజమూరు మండలంలోని జనార్థనపురం, నల్లగొండ్ల, నందిగుంట, కిస్తీపురం గ్రామాలు తీవ్ర కరవు గ్రామాలుగా ప్రకటించారు. పరిశీలనలో భాగంగా నందిగుంటలో ఉపాధి కూలీలు చేస్తున్న కరవు పనులను పరిశీలించి వారి ద్వారా వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె విలేఖరులతో మాట్లాడుతూ కరవు గ్రామాలుగా ప్రకటించిన ఆయా ఊర్లలో ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఈ విషయంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. కరవు మండలాల్లో ఉపాధి హామీ పనిదినాల సంఖ్య 100 నుండి 150కి పెంచవలసి ఉండగా ఎక్కడా అది జరగడం లేదన్నారు. బ్యాంకుల ద్వారా రుణాలు మంజూరు చేయకపోగా వాటికి రాయితీలు ఇవ్వడం లేదన్నారు. తాగునీటి సమస్యను తీర్చడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు. చలికాలంలోనూ తాగునీరు సరఫరా చేయాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. సీతారాంసాగర్‌కు రూ. 500 కోట్లు నిధులు కేటాయించినా ఇంతవరకు పనులు చేపట్టలేదన్నారు. వృద్ధులకు ప్రభుత్వం అందజేయాల్సిన భోజన సదుపాయం అమలు కావడం లేదన్నారు. ఈ పరిశీలనలో వైస్ చైర్మన్ జయశ్రీ, జనరల్ సెక్రటరీ కె సుధ, సీపీఎం మండల కార్యదర్శి పి బయ్యన్న ఉన్నారు.