శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

కొరవడిన ప్రచారం-దరిచేరని ప్రయోజనం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 17: ప్రభుత్వం ఎంతో ఉన్నతాశయంతో అందించే అవకాశాలు ప్రచార లోపంతోనూ, అమలులో నిర్లిప్తతోనూ లబ్ధిదారులకు సకాలంలో అందని, అందుకోలేని సంఘటనలు కోకొల్లలు. ఈ కోవలోనే ఎపిఎస్ ఆర్టీసీ ప్రయాణికుల సంఖ్యను పెంచుకునే వ్యాపార ధోరణికి, ఎంతో ఉదాత్తమైన రాయితీ అవకాశాన్ని జోడించి అందించిన పథకం కాస్త ఎవరికీ తెలియకుండా మిగిలిపోతోంది. ఆర్టీసీ అధికారులు 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు ఆర్టీసీ బస్సు ప్రయాణంలో చార్జీలో 25 శాతం రాయితీని ఇస్తున్నట్లు ప్రకటించడమే కాక, జూలై 1వ తేది నుంచి ఈ పథకాన్ని అమలు చేస్తున్నారు. అయితే పథకాన్ని ప్రారంభించినంత హడావుడి ప్రచారంలో కనిపించకపోతుండడంతో రాయితీని వృద్ధులు అందుకోలేకపోతున్నారు. జిల్లాలో 60 ఏళ్ల పైబడినవారు సుమారు 6 లక్షల పైబడి ఉన్నారు. ఆర్టీసీ అందించే 25 శాతం రాయితీకి వీరంతా అర్హులు. ఆర్టీసీలో పల్లెవెలుగు నుంచి వోల్వో సర్వీసుల వరకు రాష్ట్రంలోని ఏ ప్రాంతానికైనా చార్జీలో 25 శాతం రాయితీని వృద్ధులు అందుకునేందుకు అర్హులు. ఇందుకోసం ముందస్తుగా ఎటువంటి కార్డులు తీసుకోనవసరం లేదు. ప్రయాణించే సమయంలో తమ వద్ద ఆధార్ తదితర ఏదైనా వయస్సు నిర్ధారణ కార్డులు ఉంటే అవి చూపిస్తే సరిపోతుంది. ఒకవేళ ఎటువంటి ఆధారం లేనప్పటికి చూసేందుకు 60 ఏళ్ల పైబడి ఉంటే బస్ కండక్టర్ తన విచక్షణపై సదరు ప్రయాణికుడికి రాయితీ టికెట్ అందించవచ్చు. ఉదాహరణకు నెల్లూరు నుంచి తిరుపతికి రూ.120 బస్ చార్జీ ఉందనుకుంటే 60 ఏళ్లు దాటిన వృద్ధులకు రూ.90లు మాత్రమే ఉంటుంది. టోల్‌గేట్ వసూళ్లలో మాత్రం ఎటువంటి రాయితీ కల్పించరు. ఎంతో ఉపయుక్తమైన ఇటువంటి రాయితీ పథకం గురించి జిల్లాలోని వృద్ధులకు అవగాహన లేదు. ఆర్టీసీ సిబ్బందిలోనూ పలువురికి ఈ రాయితీపై పూర్తి అవగాహన లేకపోవడం గమనార్హం. ఇక అటువంటివారు విధుల్లో ఉన్న సమయంలో వృద్ధులకు ఈ రాయితీ అవకాశం కల్పించే వీలే ఉండదనేది స్పష్టం. కొద్దిమంది కండక్టర్లు మాత్రం ఈ రాయితీ అవకాశాన్ని అందిస్తూ వృద్ధుల నుంచి మంచి పేరు తెచ్చుకుంటున్నారు. వనిత, ఫ్యామిలీ తదితర ప్యాకేజి కార్డుల గురించి ఊకదంపుడు ప్రచారం నిర్వహించే ఆర్టీసీ మంచి రాయితీ కార్యక్రమం గురించి ఆ స్థాయిలో ఎందుకు ప్రచారం చేయడం లేదో అర్థం కావడంలేదు. ఒకవేళ ఈ పథకం వల్ల ఆర్టీసీకి నష్టం అని భావిస్తుంటే ఇటువంటి రాయితీ పథకాన్ని ఎందుకు ప్రవేశపెట్టాల్సి వచ్చిందో తెలియదు. ఇకనైనా వృద్ధులకు ఎంతో ఉపయోగకరమైన ఈ రాయితీ అవకాశాన్ని వారు అందుకునే విధంగా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది.
ప్రచారం చేస్తున్నాం
- నెల్లూరు-1 డిపో మేనేజర్ శీనయ్య
వృద్ధుల కోసం అమలు చేస్తున్న 25 శాతం రాయితీ పథకాన్ని జిల్లాలో అమలు చేస్తున్నాం. అన్ని బస్సుల్లోనూ ఈ రాయితీని 60 ఏళ్లు దాటిన వృద్ధులు పొందవచ్చు. వయస్సు నిర్ధరణ కార్డు ఉంటే సరిపోతుంది. లేకున్నప్పటికి కండక్టర్లు 60 ఏళ్లు దాటిన వారని భావిస్తే రాయితీ ఇమ్మని చెప్పి ఉన్నాం. జిల్లాలో ఇప్పటికే ఈ రాయితీపై ప్రచారాన్ని ప్రారంభించాం.