శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

పల్లెనెత్తిన పన్ను పిడుగు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జూలై 21: ఇప్పటివరకు పట్టణాలకే పరిమితమైన పన్నుల భారం ఇక నుంచి పల్లెవాసుల నెత్తిన పడనుంది. పన్నుల వడ్డింపుపై పంచాయతీరాజ్ శాఖ నూతన విధి విధానాలను రూపొందించింది. పన్ను మదింపునకు గతంలో ఉన్న విధి విధానాలను పక్కనపెట్టి భవన పరిమాణం, దాని స్వరూపంతోపాటు స్థల మూలధనం, విలువను పరిగణనలోకి తీసుకొని పన్ను నిర్థారించనున్నారు. మదింపు ప్రక్రియ ప్రారంభించి ఆగస్టు 15లోగా పూర్తిచేయాల్సి ఉంది. వారం తరువాత అభ్యంతరాల స్వీకరణకు గడువు ఉంటుంది. అనంతరం తుది ప్రతిని ప్రచురిస్తారు. ఇక అమలులోకి వస్తే పల్లెవాసులకు పన్నుల మోత మోగనుంది. గ్రామాల్లో ఇంటి కొలతల ఆధారంగా పన్ను విధించేవారు. ఏదో మొక్కుబడిగా శ్లాబు ఉన్న ఇళ్లను పెంకుటిల్లుగా చూపి అరకొర పన్ను విధించేవారు. ఇకపై ఆ పద్ధతికి స్వస్తిపలికి పట్టణాల మాదిరిగా, పకడ్బందీగా పన్నుల వసూలుకు పంచాయతీరాజ్ శాఖ అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. పంచాయతీ పరిధిలో నివాసాలు ఎంత పరిమాణంలో ఉన్నాయో చదరపు అడుగుల్లో లెక్కించి విలువను నిర్ధారిస్తారు. విలువ ఆధారంగా పన్ను విధించనున్నారు. మొక్కుబడిగా కాకుండా ఇంటిని, ఇంటి యజమాని ఫొటో తీసుకుంటారు. ఆధార్ అనుసంధానం చేస్తారు. కలెక్టర్ కార్యాలయంలో ప్రత్యేక సాఫ్ట్‌వేర్ సహాయంతో మదింపు చేయనున్నారు. మదింపునకు సంబంధించి పిఏఓలు, డివిజన్ అధికారులుగా వ్యవహరించనున్నారు. గ్రామంలోని అన్ని ఇళ్లకు బ్లాక్‌లవారీగా ఇంటి నెంబరు కేటాయిస్తారు. ఇళ్లల్లో మూలధనం విలువను పరిగణనలోకి తీసుకొని ఇంటి పన్ను నిర్ధారిస్తారు. నివాస గృహాలైతే మూలధనంపై నూటికి రూ.25 పైసలు చొప్పున వాణిజ్య, వ్యాపార, ఇతర అవసరాలకు ఉన్న భవనాలైతే రూ.50 పైసలు చొప్పున పన్ను విధిస్తారు. ఈ విధానంలో విలువను జిల్లా కలెక్టర్ రూపొందించిన సాఫ్ట్‌వేర్ పద్ధతిలో మాత్రమే ఆమోదిస్తారు. ఆధార్ నెంబరుతోపాటు ఇంటి ఫోను కూడా తీసుకుంటారు. పెంకుటిల్లా, పూరిల్లా, డాబానా ఎన్ని అంతస్తులు తదితర వివరాలు తీసుకుంటారు. నివాసేతర భవనానికి రెట్టింపు పన్ను వసూలు చేస్తారు. కొంత నివాసం, మరికొంత ఇతర అవసరాలకు ఉపయోగిస్తే అలాంటి భవనాలకు ఇంటి నెంబరు వేసి వేర్వేరుగా పన్నులు వేస్తారు. మూలధనం విలువతోపాటు అందులో ఉండే కల్వర్టు, అప్రోచ్‌రోడ్లు, ప్రహరీలు, బోరుబావులు, గేట్లు, సెల్లార్లు, పార్కింగ్ దేనికదే విలువ నిర్ధారిస్తారు. అనధికార లేఅవుట్లలో ఇళ్ల నిర్మాణానికి అనుమతించరు.
స్థలం, భవన విలువ లెక్కింపు విధానం
స్థలాన్ని చదరపు గజాల్లో లెక్కింపు చేపడతారు. ప్రహరీలు లేని భవనాలకు భవనం ఆక్రమించిన స్థలానికి మాత్రమే పన్ను విధిస్తారు. స్థలం విలువను ఆ ప్రకారం చూస్తారు. భవనం చదరపు అడుగులు లెక్కించి నిర్ణీత ధరల ప్రకారం స్థలం విలువతోపాటు భవన నిర్మాణ వ్యయం మూలధనంగా నిర్ణయిస్తారు. అసంపూర్ణంగా ఉన్న ఇళ్లకు 65 శాతం మాత్రమే నిర్ధారిస్తారు.
తరుగుదల, నియమాలు
గతంలో పదేళ్లలోపు ఉన్న భవనాలకు తరుగుదల లేదు. ఆపై శాఖ పరిమితి గల భవనాలకు ఏడాదికి 1 శాతం తరుగుదల నిర్ణయించి భవన వయస్సులో సంబంధం లేకుండా మొత్తం తరుగుదలను 30 శాతానికి మించకుండా చేస్తారు.
భవన విలువ నిర్ధారించేది ఇలా..
మాస్టర్‌ప్లాన్ పరిధిలోని పంచాయతీల్లో ఉన్న ఆర్‌సిసి భవనాలకు 1 నుంచి 2 అంతస్తుల లోపు చదరపు అడుగుకు రూ.700, మూడు అంతస్తులు ఆపై ఉంటే రూ.760, సెల్లార్ పార్కింగ్‌కు రూ.500, అసంపూర్తిగా ఉన్న భవనాలకు రూ.420 చొప్పున లెక్కిస్తారు. రేకులతో ఏర్పాటు చేసిన భవనాలు, సినిమాహాళ్లు, పరిశ్రమలకు రూ.380, అసంపూర్ణ భవనాలకు రూ.247లు, పెంకుటిల్లు రూ.225, పూరింటికి రూ.90లు చొప్పున లెక్కిస్తారు.

స్కైప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ
* రాష్ట్రంలోనే తొలిసారిగా నెల్లూరు జిల్లాలో ప్రారంభం
నెల్లూరు, జూలై 21: అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో విస్తృతంగా ఉపయోగించుకోవాలనే రాష్ట్ర డిజిపి ఆదేశాలను నెల్లూరు జిల్లా పోలీసులు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే పబ్లిక్ ఐ, ఇ చలానా వంటి కార్యక్రమాలను అమలుచేసే పనిలో ఉండగా, తాజాగా గురువారం స్కైప్ యాప్ ద్వారా ఫిర్యాదుల స్వీకరణ కార్యక్రమానికి నాంది పలికారు. జిల్లా ఎస్పీ విశాల్ గున్ని గురువారం తన ఛాంబర్‌లో లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. రాష్ట్రంలోనే తొలిసారిగా స్కైప్ యాప్ ద్వారా ఫిర్యాదులను స్వీకరించడం నెల్లూరులో ప్రారంభించినట్లు తెలిపారు. దీని ద్వారా విదేశాల్లో ఉన్న జిల్లా వాసులు తమతమ స్వస్థలాల్లో ఉన్న రక్తసంబంధీకులకు సంబంధించి కానీ, విదేశాల్లో ఉన్న తమకు కాని ఎటువంటి సమస్య వచ్చినా పోలీసులకు స్కైప్ యాప్ ద్వారా ఫిర్యాదు చేసే వెసులుబాటు కల్పించినట్లు ఎస్పీ పేర్కొన్నారు. దీనివల్ల సత్వరమే ఫిర్యాదు పట్ల చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని ఆయన తెలిపారు. అదేవిధంగా నెల్లూరు జిల్లా పోలీస్ ట్విట్టర్ ఖాతాను, యూట్యూబ్‌లో నెల్లూరు పోలీస్ ఛానల్‌ను ఆయన ప్రారంభించారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజలకు పోలీసులు మరింత చేరువ కాగలరని ఆయన ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి.శరత్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

సాంకేతిక పరిజ్ఞానంతో పోలీస్ సేవలు విస్తృతం
* ట్విట్టర్, యూటూబ్ ఖాతాలను ప్రారంభించిన ఎస్పీ
నెల్లూరు, జూలై 21: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని పోలీస్ శాఖలో వినియోగించుకోవడం ద్వారా సేవలను విస్తృతపరచడంతో పాటు సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకునే వీలు కలుగుతుందని జిల్లా ఎస్పీ విశాల్ గున్ని పేర్కొన్నారు. గురువారం తన కార్యాలయంలో జిల్లా పోలీస్ ట్విట్టర్, యూట్యూబ్, ఇన్‌స్టాగ్రాం అకౌంట్లను ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాలయాపన లేకుండా ఫిర్యాదులు పోలీసులకు అందించడంలో ఈ ఖాతాలు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. జిల్లా ఎస్పీ ఫేస్‌బుక్ ఖాతాకు 20 వేల పైచిలుకు ఫాలోవర్స్ ఉండడమే ఇందుకు ఉదాహరణగా పేర్కొన్నారు. అనుమానాస్పద వ్యక్తుల సంచారం, చట్ట వ్యతిరేక కార్యకలాపాల సమాచారం ఇటువంటి సోషల్ మీడియా వెబ్‌సైట్ల ద్వారా పోలీసులకు త్వరగా చేరవేసినవారవుతారన్నారు. అదేవిధంగా విదేశాల్లో ఉన్న ప్రవాస జిల్లా వాసుల కోసం స్కైప్ యాప్‌ను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందన్నారు. ఇటువంటి సోషల్ మీడియా అప్లికేషన్‌ల ద్వారా గత రెండున్నర నెలల కాలంలో 294 ఫిర్యాదులు అందాయని వీటిలో 241 కేసులను పరిష్కరించినట్లు ఆయన వెల్లడించారు. అదేవిధంగా మరో 25 కేసులను ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని 28 కేసులు పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. ఐ క్లిక్ ద్వారా 188 ఫిర్యాదులు అందగా వాటిలో 136 పరిష్కరించినట్లు, 29 కేసులు ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశామని, 33 కేసులు మాత్రమే పెండింగ్‌లో ఉన్నట్లు ఆయన వివరించారు. గురువారం నుంచి జిల్లాలో ఈ చలానా ప్రవేశ పెడుతున్నట్లు వెల్లడించారు. మరికొన్ని కొత్త సాంకేతిక ఫీచర్లను నెల్లూరు పోలీస్ శాఖలో ఉపయోగించుకునేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన వెల్లడించారు. ట్విట్టర్ ద్వారా అనుసరించదలచినవారు ఎస్పీ నెల్లూరు ఖాతాను ఉపయోగించుకోవచ్చన్నారు. యుట్యూబ్‌లో నెల్లూరు పోలీస్ పేరుతో చానల్‌ను కూడా అందుబాటులోకి తీసుకొచ్చినట్లు ఎస్‌పి తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ శరత్‌బాబు, డిఎస్పీలు రాముడు, తిరుమలేశ్వరరెడ్డి, విక్రమ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.

సీట్ల కేటాయింపునకు నేడు లక్కీ డ్రా
వేదాయపాళెం, జూలై 21: నగరంలోని కొత్తూరు ప్రాంతంలో ఉన్న కేంద్రీయ విద్యాలయంలో 1వ తరగతి నుంచి 8వ తరగతి వరకు ఖాళీగా ఉన్న సీట్ల భర్తీ కోసం శుక్రవారం లక్కీ డ్రాను నిర్వహిస్తున్నామని విద్యాలయం ప్రిన్సిపాల్ ప్రసాద్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ డ్రా కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జాయింట్ కలెక్టర్-2 సాల్మన్‌రాజ్‌కుమార్ హాజరవుతారని తెలిపారు. దరఖాస్తులు చేసుకున్న విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ డ్రా కార్యక్రమానికి హాజరుకావాలని ఆయన కోరారు.

ప్రత్యేక హోదా బిల్లుకు మద్దతు ఇవ్వాలి
ఎన్‌ఎస్‌యుఐ ఆధ్వర్యంలో రాస్తారోకో
నెల్లూరుసిటీ, జూలై 21: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అమలు కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు రాజ్యసభలో ప్రవేశపెట్టనున్న ప్రైవేటు బిల్లుకు టిడిపి, బిజెపి, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీల ఎంపిలు మద్దతు ఇవ్వాలని కోరుతూ గురువారం గాంధీబొమ్మ సెంటర్‌లో రాస్తారోకో, ధర్నా నిర్వహించారు. ఈసందర్భంగా ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ మాట్లాడుతూ డిసిసి అధ్యక్షుడు పిలుపు మేరకు ఎపికి ప్రత్యేక హోదా అమలు కోసం కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు కెవిపి రామచంద్రరావు ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లు మే 13వ తేదీన చర్చ, ఓటింగ్ జరగకుండానే 12వ తేదీన వాయిదా వేసి బిజెపి, టిడిపిలు కుట్ర చేశాయని ఆరోపించారు. శుక్రవారం రాజ్యసభలో ఈ బిల్లుకు చర్చకు వస్తుందని టిడిపి, బిజెపి, వైసీపీ ఎంపిలు మద్దతు ఇచ్చి ఆ బిల్లును పాస్ అయ్యేలా చూడాలన్నారు. దేశంలో 11 రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కేవలం క్యాబినేట్ నిర్ణయం ద్వారానే అమలు అవుతుందని ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం ప్రత్యేక హోదా రావాలంటే చట్టం చేయాలని సాకు చూపడం దారుణమన్నారు. ప్రత్యేక హోదా కోసం కాంగ్రెస్ పార్టీ గత రెండు సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేపట్టిందని కాని ప్రత్యేక హోదా రానివ్వకుండా అడ్డుపడుతూ టిడిపి, బిజెపి ప్రభుత్వాలు ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు. ఎపికి ప్రత్యేక హోదా వచ్చేంతవరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో గిరి, శిరీష్, నవీన్, వెంకటేష్, వాహీద్, బ్రహ్మసాయి తదితరులు పాల్గొన్నారు.

శ్రీసిటీని సందర్శించిన రాష్ట్ర పరిశ్రమల శాఖ కార్యదర్శి
తడ, జూలై 21: నెల్లూరు, చిత్తూల జిల్లాల సరిహద్దులోని తడ వద్ద అంతర్జాతీయ ప్రమాణాలతో నెలకొన్న శ్రీసిటీ పారిశ్రామికవాడను రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి సాల్మన్ ఆరోగ్యరాజ్ గురువారం సందర్శించారు. ఈ సందర్భంగా శ్రీసిటీ ఎండి రవీంద్ర సన్నారెడ్డి ఆయనకు ఘనంగా స్వాగతం పలికి సెజ్ వౌలిక వసతులు, అభివృద్ధిని వివరించారు. అనంతరం ఆయన శ్రీసిటీ పరిసరాలను చూసి అక్కడ పురోగతిని పరిశీలించారు. సాల్మన్ ఆరోగ్యరాజ్ 2011 నుండి 2013 వరకు చిత్తూరు జిల్లా కలెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన వెంట పరిశ్రమల శాఖ జిఎం, ఎపిఐఐసి జోనల్ మేనేజర్ ప్రతాప్‌రెడ్డి ఉన్నారు.

బాయిలర్ పైనుండి పడి కార్మికుడు మృతి
ముత్తుకూరు, జూలై 21: ముత్తుకూరులోని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వరంగ విద్యుత్ సంస్థ దామోదరం సంజీవయ్య ఎపి థర్మల్ కేంద్రంలో బాయిలర్ పైనుండి పడి ఓ కార్మికుడు గురువారం మృతి చెందాడు. ఖమ్మం జిల్లా యలమంచి గ్రామానికి చెందిన రామదాసు (23) అనే కార్మికుడు ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. వివరాలు పరిశీలిస్తే రామదాసు బాయిలర్‌పై మరమ్మతులు చేస్తుండగా, 9వ అంతస్తు నుండి ప్రమాదవశాత్తు జారి నాలుగో ఫ్లోర్ వద్ద యాష్‌పై పడి తీవ్ర గాయాల పాలయ్యాడు. ప్రమాదం జరిగిన వెంటనే అప్రమత్తమైన ప్రాజెక్టు అధికారులు చికిత్స నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలిస్తుండగా మార్గమధ్యంలో చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. దీంతో ప్రాజెక్టు వద్ద గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని శవపంచనామా నిమిత్తం నెల్లూరు ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.
అధికారుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు బలి
ఎపి జెన్‌కో అధికారుల నిర్లక్ష్య ధోరణతో కొద్ది నెలలుగా ప్రాజెక్టులో పనిచేస్తున్న కార్మికుల నిండుప్రాణాలు బలవుతున్నాయి. వరుస ప్రమాదాలు జరుగుతున్నా ఎపి జెన్‌కో అధికారులు, సేఫ్టీ డిపార్టుమెంట్ అధికారులు కాని ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకున్న సందర్భాలు లేవని కార్మికులు వాపోతున్నారు. ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుండి వస్తున్న కార్మికులు జెన్‌కో అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎంతోమంది బలవుతున్నారు. కొద్దికాలంగా బాయిలర్, యాష్ పైపుల వద్ద ఘోర ప్రమాదాలు జరిగి కార్మికులు నిండుప్రాణాలు కోల్పోతున్నా ప్రమాదాల నివారణకు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ప్రాజెక్టు అధికారులను కార్మిక సంఘాలు, కార్మికులు ప్రశ్నిస్తున్నారు. జెన్‌కో అధికారుల తీరుపై కార్మికులతోపాటు కార్మిక సంఘాలు భగ్గుమంటున్నాయి. అయినా అధికారుల తీరులో మాత్రం ఎలాంటి చలనం లేదు. దీంతో బతుకు జీవనం కోసం పొట్ట చేతపట్టుకొని వచ్చిన కార్మికులు థర్మల్ కేంద్రాలకు బలవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం, ప్రాజెక్టు అధికారులు స్పందించి బాయిలర్ వద్ద జరుగుతున్న ప్రమాదాల నివారణకు గట్టి చర్యలు చేపట్టాలని లేకుంటే తీవ్ర ఆందోళన చేపట్టాల్సి వస్తుందని కార్మికులు హెచ్చరించారు.

30 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సీతారామపురం, జూలై 21: వెంపలితోక అటవీ ప్రాంతంలో గత రెండు రోజులుగా నిర్వహిస్తున్న కూంబింగ్‌లో 30 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని తమిళనాడు సేలంకు చెందిన శరవణ్ అనే కూలీని అరెస్ట్ చేసినట్లు రేంజర్ వెంకటేశ్వరరావు తెలిపారు. గురువారం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ ఈ ప్రాంతంలో తమిళ కూలీల కదలికలు ఉన్నాయని సమాచారం రావడంతో తాము గాలింపు చర్యలు చేపట్టామన్నారు. దీని వెనుక మరికొందరు ఉన్నట్లుగా అనుమానం ఉందన్నారు. స్థానికుల ప్రమేయం సైతం ఉన్నట్లుగా సమాచారం ఉందని, త్వరలో విచారణ చేపట్టి వారిని కఠినంగా శిక్షిస్తామని ఆయన తెలిపారు.

ఆగని ఎర్రచందనం అక్రమాలు
ఆత్మకూరు, జూలై 21: గత కొన్నాళ్లుగా ఎర్రచందనం స్మగ్లింగ్ అదుపులోకి వచ్చినా అడపాదడపా మళ్లీ అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా సీతారామపురం మండలం వెంపల్లితోక అటవీ ప్రాంతంలో గడిచిన రెండు రోజులుగా నిర్వహిస్తున్న కూంబింగ్‌లో భాగంగా 30 ఎర్రచందనం దుంగలతోసహా ఓ తమిళ కూలీని స్థానిక రేంజి అధికారి అరెస్టు చేశారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎర్రచందనం అక్రమ రవాణా పూర్తిగా అదుపులోకి వస్తోందనే వార్తలు అవాస్తవమనే సంగతి తేటతెల్లమవుతోంది. ఇటీవల ఆత్మకూరు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ షేక్ ఖాజావలి రాష్ట్ర డిజిపి రాముడు చేతులమీదుగా అవార్డు అందుకున్నారు. దీనికి కారణం ఏమిటంటే సదరు సిఐ ఆత్మకూరులో బాధ్యతలు స్వీకరించాక గత ఏడాది కాలంలో సుమారుగా 60 లక్షల రూపాయల విలువైన ఎర్రచందనం దుంగలను, వాటి కేసులను చేధించడంలో ప్రత్యేక కృషి చేశారు. శాంతిభద్రతలు పర్యవేక్షించే పోలీసు అధికారి ఎర్రచందనం అక్రమ రవాణాను అడ్డుకుంటూ అవార్డు పొందడం ఇక్కడ గమనార్హం. వాస్తవంగా ఈ స్మగ్లింగ్‌ను అదుపు చేయాల్సిన ప్రధాన బాధ్యత అటవీ శాఖ అధికారులది. అయితే ఆ శాఖ అధికారులు స్మగ్లింగ్‌ను అదుపు చేస్తున్నారా లేక అక్రమార్జనలో తిలాపాపం తలా పిడికెడు అనేలా వ్యవహరిస్తున్నారనేది గతంలో జరిగిన వివిధ సంఘటనలో సోదాహరణగా ప్రస్తావించుకోవచ్చు. ఏడాదిన్నర క్రితం ఆత్మకూరు రేంజిలో డిఆర్‌ఓగా పనిచేస్తున్న గాలీబ్ ఎర్రచందనం స్మగ్లర్లతో అక్రమ లావాదేవీలు కొనసాగిస్తున్నారంటూ అరెస్టు కావడాన్ని ఇదే సందర్భంలో చెప్పుకోవాలి. ప్రధాన బాధ్యత వహించాల్సిన అటవీ శాఖ ఆత్మకూరు రేంజి అధికార యంత్రాంగం అవినీతిలో అనకొండలా ప్రవరిస్తున్నారు. పొరుగున ఉన్న ఉదయగిరి రేంజిలోనైనా అప్పుడప్పుడు అటవీ శాఖ యంత్రాంగం కేసులు నమోదు చేస్తోంది. ఇకనైనా అటవీ అధికారులు పూర్తిస్థాయిలో ఎర్రచందనం స్మగ్లింగ్‌ను అదుపులోకి తీసుకొస్తారా లేక యధాప్రకారం కొనసాగుతారా అనేది ఉన్నత అధికారులు తీసుకొనే చర్యలపైనే ఆధారపడి ఉంటుందని చెప్పాలి.

కార్మికుల కనీస వేతనం కోసం ఉద్యమించాలి
ఐఎఫ్‌టియు రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు
గూడూరు, జూలై 21: ఆరుగాలం శ్రమించి సంపదలను సృష్టిస్తున్న కార్మికులకు సరైన తిండి, గృహవసతి, వైద్యం ప్రైవేటు రంగంలో పనిచేస్తున్న కార్మికులకు కరవైందని, దీనికితోడు పెరిగిన నిత్యావసర సరుకుల ధరలు కార్మికులను కుంగదీస్తున్నాయని, అన్ని రంగాల కార్మికులకు నెలకు 18వేల రూపాయల కోసం కార్మికులు ఐకమత్యంతో ఉద్యమించాలని భారత కార్మిక సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షులు సిహెచ్ కొండయ్య పిలుపునిచ్చారు. గురువారం ఆ సంఘం ఆధ్వర్యంలో స్థానిక రైల్వేస్టేషన్ నుండి కార్మికులతో కలసి భారీ ప్రదర్శన నిర్వహించి అనంతరం స్థానిక అంబేద్కర్ భవనంలో జరిగిన గూడూరు డివిజన్ సదస్సులో ఆయన ముఖ్య అతిధిగా హాజరై ప్రసంగించారు. కేంద్రంలోని ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం, రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వాలు ఎన్నికల సందర్భంగా కార్మికులకు ఇచ్చిన హామీలకు భిన్నంగా కార్మిక హక్కులను హరించి వేసే కార్మిక చట్టాల సవరణకు పూనుకొన్నాయన్నారు. కార్మికులకు, ఉద్యోగులకు చట్టబద్ధంగా ఉన్న భద్రతను తొలగించేస్తున్నారన్నారు. స్వదేశీ, విదీశీ పెట్టుబడుదారులకు కార్మికుల శ్రమను, సహజ వనరులను కొల్లగొట్టేందుకు ప్రధాని, సిఎంలు పోటీలు పడి కార్మికు చట్టాలను సవరిస్తున్నారన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడాలని, ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సెప్టెంబర్ 2న దేశవ్యాప్త సార్వత్రిక సమ్మె జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి డివిజన్ అధ్యక్షులు సిహెచ్ బాబు అధ్యక్షత వహించగా కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు కే రమేష్, ఆర్ మోహన్‌లతో ఆపటు డివిజన్ కార్యదర్శి కె చెంగలరావు, జిల్లా నాయకులు కె ఖాదర్ బాష, పెంచలయ్య, కృష్ణయ్య, డి అంజయ్య, నవకోటి, వీరాస్వామి, డిపి పోలయ్య తదితరులు పాల్గొనగా, అంతకు ముందు పెద్ద సంఖ్యలోకార్మికులు ఎర్ర జెండాలతో స్థానిక రైల్వే స్టేషన్ నుండి ముత్యాలపేట, టవర్‌క్లాక్ సెంటర్ మీదుగా అంబేద్కర్ భవనం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు.

రైతులకు అనుకూలంగా రైల్వే
బాక్స్‌టైపు బ్రిడ్జిలు నిర్మించాలి:జెసి
దొరవారిసత్రం, జూలై 21: మండలంలో అక్కరపాక, మినమలమూడి గ్రామాల మధ్య రైల్వే బాక్సుటైపు బ్రిడ్జిలు రైతులకు అనుకూలంగా నిర్మించాలని జెసి ఇంతియాజ్ అహ్మద్ పేర్కొన్నారు. గురువారం తహశీల్దార్ కార్యాలయ ఆవరణంలో మినమలమూడి, అక్కరపాక గ్రామాల వద్ద బాక్సు టైపు బ్రిడ్జిలు నిర్మించేందుకు ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. ఈ సమయంలో ఆయా గ్రామాల రైతులు బాక్సు టైపు బ్రిడ్జి వల్ల వర్షాకాల సమయంలో వర్షపునీరు నిలిచిపోయి రాకపోకలు సాగవన్నారు. ఇంకా పండించిన పంటలను తీసుకొని వెళ్లేందుకు ఈ మార్గంలో ధాన్యం లారీలు, ట్రాక్టర్లు వెళ్లలేవని, దానివలన చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఉన్న గేట్లను ఉంచినట్టయితే తమకు అనుకూలంగా ఉంటుందని రైతులన్నారు. దాంతో జెసి మాట్లాడుతూ రైతులకు అనుకూలంగా రైల్వే అధికారులు బాక్సుటైపు బ్రిడ్జి నిర్మించాలన్నారు. అదేవిధంగా ప్రస్తుతం ఉన్న గేట్లను యథావిధిగా ఉంచాలన్నారు. అత్యవసర సమయాల్లో గేట్ల ద్వారా రైతుల రాకపోకలు సాగించేందుకు వీలు కల్పించాలని ఆయన రైల్వే అధికారులకు సూచించారు. అలాకాకుండా తమకు ఇష్టం వచ్చినట్టు రైల్వే అధికారులు బాక్సు టైపు బ్రిడ్జిని నిర్మించ కూడదన్నారు. వారంరోజుల లోపు రైల్వే అధికారులు బాక్సుటైపు బ్రిడ్జి నిర్మాణ నమూనాలను తెలియచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ గిరీషా, తహశీల్దార్ శ్రీనివాసరావు, రైల్వే డిఇ ప్రసాదరావు, ఎడిఎ రాజన్ రాబిన్, రైతులు పాల్గొన్నారు.

వైభవంగా వేంకటేశ్వరస్వామి కల్యాణం
వేదాయపాళెం, జూలై 21: శ్రీ వేంకటేశ్వరస్వామి జన్మనక్షత్రమైన శ్రవణాన్ని పురస్కరించుకుని నెల్లూరు నగరంలోని తిరుమల తిరుపతి కల్యాణ మండపంలో గురువారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కల్యాణ మహోత్సవానికి ఉభయదాతలుగా ఒమ్మిన సతీష్, భానుప్రకాష్, వారి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు స్వామివారికి అభిషేకాలు, అలంకారాలు చేశారు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కల్యాణ వేడుకను తిలకించేందుకు భక్తులు భారీగా తరలివచ్చారు.

జిల్లాలో ఐదుగురు ఎస్‌ఐలు బదిలీ
నెల్లూరు, జూలై 21: జిల్లాలో వివిధ పోలీసుస్టేషన్లలో పనిచేస్తున్న ఎస్‌ఐలను బదిలీ చేస్తూ జిల్లా ఎస్‌పి విశాల్ గున్ని గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. వీరు వెంటనే తమకు కేటాయించిన ప్రాంతాల్లో చేరాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. గూడూరు ఒకటో నగర ఎస్‌ఐగా పని చేస్తున్న ఎం బాబీని గూడూరు రూరల్ పోలీసుస్టేషన్‌కు, అక్కడ పని చేస్తున్న టి జగన్మోహన్‌ను నెల్లూరు విఆర్‌కు బదిలీ చేశారు. విఆర్‌లో ఉన్న కె సుధాకర్‌ను గూడూరు ఒకటవ పట్టణ పోలీసుస్టేషన్‌కు బదిలీ చేశారు. ఎఎస్ పేటలో ఉన్న జి అంకమ్మను కావలి ఒకటవ పట్టణ స్టేషన్‌కు, అక్కడ పని చేస్తున్న బి నాగభూషణంను నెల్లూరు విఆర్‌కు బదిలీ చేశారు.

గుట్కా విక్రయ దుకాణాలపై దాడులు
నెల్లూరు, జూలై 21: నిషేధిత ఖైనీ, గుట్కాల విక్రయాలు సాగించే దుకాణాలపై నగర పోలీసులు గురువారం విస్తృత దాడులు చేశారు. దాడుల్లో సుమారు ఐదు లక్షల విలువ చేసే గుట్కా, ఖైనీలను స్వాధీనం చేసుకున్నారు. జిల్లాలో ఇటీవల ఖైనీలు, గుట్కా విక్రయాలు జోరుగా సాగుతూ, ప్రజారోగ్యాన్ని నాశనం చేస్తున్నా అధికారులు అటువైపుగా దృష్టి సారించడం లేదు. జిల్లా ఎస్‌పి విశాల్ గున్ని నగరంలో గుట్కా విక్రయాలపై దాడులు చేసి సంబంధిత వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని గురువారం నగర డిఎస్‌పి వెంకటరాముడును ఆదేశించారు. దీనితో నగర డిఎస్‌పి నేతృత్వంలో నగరంలోని ఆరు పోలీసుస్టేషన్ల పరిధిలో గుట్కాలు విక్రయిస్తున్న దుకాణాలు, నిల్వ కేంద్రాలపై దాడులు చేశారు. దాడుల్లో సుమారు ఐదు లక్షల విలువ చేసే నిషేధిత ఖైనీలు, గుట్కాలను స్వాధీనం చేసుకొని 35 మందిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల దాడులు తెలుసుకున్న పలువురు దుకాణాలు మూసివేసి పరుగులు తీశారు. మరికొందరు దుకాణాల్లో నిల్వ ఉంచిన గుట్కా, ఖైనీలను రహస్య ప్రాంతాలకు తరలించారు.