శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే ఉద్యోగులపై వేటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరుసిటీ, జూలై 30: రాష్ట్ర మునిసిపల్ శాఖ మంత్రి నారాయణ ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీ్ధర్‌రెడ్డి ధ్వజమెత్తారు. శనివారం నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయంలోని డిప్యూటీ మేయర్ ఛాంబర్‌లో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మంత్రి నారాయణ అసమర్థ పాలనను కప్పిపుచ్చుకునేందుకే కార్పొరేషన్‌లో సిటీ ప్లానింగ్ విభాగంలో ఏడుగురు ఉద్యోగులకు ఎలాంటి షోకాజ్ నోటీసు, విచారణ లేకుండా వారిని సస్పెండ్ చేయడం ఎంతవరకు సమాంజసమని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నెల్లూరు జిల్లాలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు ఎక్కువగా ఉండటంవల్ల అభివృద్దిలో వివక్ష చూపిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అతి తక్కువ సీట్లు టిడిపికి రావడంతో జిల్లా ప్రజలపై కక్ష సాధించడానికే నారాయణకు మంత్రి పదవి ఇచ్చారని ఆరోపించారు. అందులో భాగంగానే నారాయణ తనకు ఇష్టం వచ్చినట్లు ఇళ్లను కూల్చడం, ఉద్యోగులను సస్పెండ్ చేస్తూ ఓ ఉన్మాదిలా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. జిల్లా ప్రజల సమస్యలు తెలిసిన ఒక మంచి వ్యక్తికి మంత్రి పదవి ఇస్తే బాగుంటుందన్నారు. రాజకీయ స్వార్థం కోసం అమాయకులైన ఉద్యోగులను బలి చేయడం మంచిది కాదన్నారు. ఉద్యోగులు తప్పుచేసి ఉంటే కచ్చితంగా చర్యలు తీసుకోవచ్చని, దానిని తాము కూడా స్వాగతిస్తామన్నారు. కార్పొరేషన్‌లో కమీషన్ల వ్యవహారంపై చర్యలు తీసుకుంటే బాగుంటుందన్నారు. ఎవరో చేసిన పాపానికి ఉద్యోగులను బలి చేయడం మంచిది కాదన్నారు. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ మంత్రి నారాయణ దమ్ముంటే తన విద్యాసంస్థల్లో అక్రమాలు లేవని నిరూపిస్తే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని సవాల్ విసిరారు. అదేవిధంగా మంత్రి విద్యాసంస్థల్లో అక్రమాలు ఉన్నాయని నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమా అని ప్రశ్నించారు. కార్పొరేషన్‌లో ప్రక్షాళన చేస్తామని చెప్పిన మంత్రి నారాయణ ముందుగా తన విద్యాసంస్థల నుంచి ప్రారంభించాలని సూచించారు. ఒక హోటల్లో కూర్చొని దందాలు చేసుకుంటున్న షాడో మేయర్ బెదిరింపుల వల్లే అధికారులు అవినీతికి పాల్పడాల్సి వచ్చిందన్నారు. కార్పొరేషన్‌లో సిటీ ప్లానింగ్ విభాగంలో పనిచేస్తున్న సిబ్బంది కడుపుకొట్టకుండా సస్పెన్షన్‌ను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో మంత్రి నారాయణ చిట్టాను బట్టబయలు చేస్తామని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ ముక్కాల ద్వారకానాధ్, కార్పొరేటర్లు గోగుల నాగరాజు, ఖలీల్, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు శ్రీకాంత్‌రెడ్డి, వేలూరు మహేష్ తదితరులు పాల్గొన్నారు.

కార్పొరేషన్‌లో కలకలం
* ఏడుగురిపై ఒకేసారి సస్పెన్షన్ వేటు
* మరో అధికారిపై వేటుకు సిద్ధం
* ఉద్యోగుల్లో ఆందోళన
నెల్లూరు సిటీ, జూలై 30: నెల్లూరు నగరపాలక సంస్థలోని సిటీ ప్లానింగ్ విభాగంలో పని చేస్తున్న నలుగురు బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్లు, ముగ్గురు టిపిఎస్‌లపై సస్పెన్షన్ వేటు పడటంతో ఒక్కసారిగా ఉద్యోగుల్లో కలకలం రేగింది. రాష్ట్ర టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ డైరెక్టర్ రఘు శుక్రవారం రాత్రి ఏడుగురు ఉద్యోగులపై సస్పెన్షన్ వేటుతో పాటు వారి స్థానంలో కొత్తవారిని కూడా యుద్ధప్రతిపాదికన నియమించడం విశేషం. అయితే నెల్లూరు కార్పొరేషన్ అంటేనే హడలెత్తిపోతున్న అధికారులు వారు విధుల్లోకి చేరతారా అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. గత రెండు రెండు రోజుల క్రితం అసిస్టెంట్ సిటీ ప్లానింగ్ అధికారి గుణశేఖర్‌ను నియమిస్తే ఆయన నెల్లూరు కార్పొరేషన్‌కు రావడానికి సుముఖత చూపకుండా వెళ్లిపోయారు. గత కొద్దికాలంగా కార్పొరేషన్‌లో అవినీతి పెరిగిపోయిందని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టడంతో మంత్రి నారాయణ నేరుగా రంగంలోకి దిగి అవినీతిపై పూర్తిస్థాయిలో విచారించేందుకు ప్రభుత్వం నుంచి 6 టాస్క్ఫోర్స్ బృందాలను రంగంలోకి దింపారు. 2015 సంవత్సరం నుంచి భవన నిర్మాణాలకు అనుమతి ఇచ్చిన వాటిని టాస్క్ఫోర్స్ బృందాలు తనిఖీ చేశాయి. మొత్తం 1100 భవనాలు అక్రమంగా నిర్మించినట్లు టాస్క్ఫోర్స్ బృందం నిగ్గు తేల్చింది. దీంతో మంత్రి నారాయణ సీరియస్‌గా స్పందించి అక్రమ కట్టడాలను తొలగించే ప్రక్రియను చేపట్టారు. ఇందులో భాగంగా 11 భవనాలను యుద్ధప్రతిపాదికన తొలగించారు. ప్రజల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు, అదే పార్టీలో ఉన్న నాయకులు కూడా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో అక్రమ భవనాలు కూల్చివేతకు స్వస్తి చెప్పారు. సిటీ ప్లానింగ్ విభాగం అవినీతిమయం కావడంతో నగరంలో ఇష్టానుసారంగా అక్రమ కట్టడాలు వెలిసినట్లు టాస్క్ఫోర్స్ బృందం నివేదికలో తేలింది. అంతేకాకుండా భవనాల అక్రమ నిర్మాణానికి భారీస్థాయిలో సిటీ ప్లానింగ్ అధికారులకు ముడుపులు ముట్టచెప్పామని ప్రజలు టాస్క్ఫోర్స్ బృందానికి ఫిర్యాదు చేశారు. దీంతో అవినీతిని ప్రోత్సహించిన అధికారులపై వేటు వేస్తేనే వ్యవస్థ బాగుటుందన్న ఉద్దేశ్యంతో ఒక్కసారిగా ఏడుగురు ఉద్యోగులపై వేటు వేశారు. అయితే కిందిస్థాయి సిబ్బందిని మాత్రం సస్పెండ్ చేయడంతో అసలు కారకులైన అధికారులపై చర్యలు తీసుకోకపోవడం పట్ల సస్పెండ్ అయిన ఉద్యోగులు విచారం వ్యక్తం చేస్తున్నారు. అక్రమ కట్టడాలకు కిందిస్థాయి సిబ్బందితో పాటు అధికారులకు సమాన భాగస్వామ్యం ఉన్నా వారిపై చర్యలు తీసుకోక పోవడం గమనార్హం.

పేటెంట్ చట్టాలపై అవగాహన ఉండాలి
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు జెసి సూచన
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, జూలై 30: ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు, పారిశ్రామికవేత్తలు ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్, పేటెంట్ చట్టాలపై అవగాహన ఏర్పరచుకొని తద్వారా వ్యాపారాన్ని పెంపొందించుకోవాలని జాయింట్ కలెక్టరు ఎఎండి ఇంతియాజ్ తెలిపారు. శనివారం స్థానిక డిఆర్ ఉత్తమ్ హోటల్‌లో ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రియల్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్‌ప్రైజెస్ మినిస్ట్రీస్ సంయుక్త ఆధ్వర్యంలో ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్‌పై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ముఖ్యంగా ఐదు విభాగాలపై ఆధారపడి ఉందన్నారు. పేటెంట్ హక్కులు, ట్రేడ్ హక్కులు, కాపీ హక్కులు, రూపకల్పన హక్కులు, భౌగోళిక హక్కులని వివరించారు. ఉదాహరణకు బాస్మతి రైస్ అనగానే భౌగోళికంగా ఇండియానే గుర్తుకు వస్తుందని, దుగ్గిరాల అనగానే పసుపుకి నెలవైనదిగా గుర్తుకు వస్తుందని ఇది భౌగోళిక గుర్తింపని అన్నారు. నెల్లూరులో మొట్టమొదటిసారిగా ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్ప్‌పై అవగాహన సదస్సు ఏర్పరచడం అభినందనీయమని ఆయన తెలిపారు. ఈ చట్టాలపై అవగాహన ఏర్పరచుకొని యువత ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు. జిల్లా ఇండస్ట్రీస్ సెంటర్ జనరల్ మేనేజర్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ, నెల్లూరు జిల్లా పరిశ్రమల అభివృద్ధికి అనువైన ప్రదేశమని తెలిపారు. ఒక్క అపాచీ సంస్థలోనే 1015 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారని అన్నారు. ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యుడు సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ పారిశ్రామికవేత్తలు బ్యాంకుల నుండి పొందుతున్న రుణాలను పూర్తిస్థాయిలో వ్యాపార అభివృద్ధికి వినియోగించుకోవాలన్నారు. ఒకవేళ స్వలాభానికి వినియోగించుకుంటే వ్యాపారంలో నష్టాల దిశగా పయనించే అవకాశం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో గుంటూరు ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు ఎ ఆంజనేయులు, పారిశ్రామికవేత్తలు పాల్గొన్నారు.

పేదలకు మెరుగైన వైద్యం అందిస్తాం
* వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని వెల్లడి
కలువాయి, జూలై 30: రాష్ట్ర ప్రజలకు మెరుగైన వైద్యం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ కామినేని శ్రీనివాస్ అన్నారు. శనివారం కలువాయిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రూ. కోటి 18 లక్షలతో నిర్మించనున్న నూతన భవన నిర్మాణానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలకు మరింత సేవ చేసేందుకు ఎప్పుడు అందుబాటులో ఉంటామని తెలిపారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చే సమయానికి తల్లీబిడ్డల మరణాల సంఖ్య దేశంలోనే ఆంధ్రప్రదేశ్ ముందంజలో ఉందని, ఇప్పుడు దానిని చాలావరకు తగ్గించగలిగామని ఆయన తెలిపారు. రాష్ట్రంలో ఉన్న లక్ష మంది ఎఎన్‌ఎంలకు ట్యాబ్‌లు అందజేశామని, తద్వారా రాష్ట్రంలో ఏ మారుమూల ప్రాంతంలోనైనా జబ్బు చేసిన వ్యక్తి వివరాలు డిఎంహెచ్‌ఓ, మంత్రి, ముఖ్యమంత్రి క్యాంప్ కార్యాలయానికి డైరెక్ట్‌గా చేరతాయని తెలిపారు. అన్ని ఏరియా వైద్యశాలల్లో 35 రకాల వైద్య పరీక్షలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 14 వందల మంది డాక్టర్లు, కొత్తకొత్త భవన నిర్మాణాలు, పాత భవనాలకు మరమ్మతులు, మెరుగైన మందుల పంపిణీ ద్వారా రాష్ట్రంలో మెరుగైన వైద్యాన్ని ప్రజలకు అందజేస్తున్నట్లు వివరించారు. గతంలో ఉన్న 104 వాహనాన్ని చంద్రన్న సంచార చికిత్స పేరుగా మార్చి ప్రతి మారుమూల పల్లె ప్రాంతంలో ఉన్న ప్రజలకు వారంలో ఒకరోజు ప్రజల వద్దకు వైద్యసేవలు అందిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ఈ సందర్భంగా మండలంలోని యడ్లమూడి శ్రీనివాసరావుకు సిఎం సహాయ నిధి నుంచి వచ్చిన రూ. లక్షా 15 వేల చెక్కును మంత్రి అందజేశారు. ఈ కార్యక్రమంలో వెంకటగిరి ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, నెల్లూరు డిఎంహెచ్‌ఓ వరసుందరం, హెచ్‌డిఎస్ సుబ్బారావు, బిజెపి జిల్లా అధ్యక్షుడు సురేంద్రరెడ్డి, బిజెపి నాయకులు ఎస్‌ఎస్‌ఆర్ నాయుడు, టిటిడి జిల్లా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్ అల్లంపాటి వేణుగోపాల్‌రెడ్డి, టిడిపి నాయకులు వెంకటేశ్వర్లునాయుడు, పాల పిచ్చిరెడ్డి, వైద్యశాల అభివృద్ధి కమిటీ సెక్రటరీ చల్లా విశ్వనాథ్‌రెడ్డి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

ప్రత్యేక హోదాపై దోబూచులాట తగదు
డిసిసి అధ్యక్షుడు పనబాక
నెల్లూరు కలెక్టరేట్, జూలై 30: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దాగుడుమూతలు ఆడుతున్నాయని డిసిసి అధ్యక్షుడు పనబాక కృష్ణయ్య అన్నారు. జిల్లా కేంద్రంలోని విఆర్‌సి కూడలి వద్ద శనివారం రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలంటూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వ్యతిరేకంగా ధర్నా నిర్వహించి రహదారిపై బైఠాయించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడుతూ కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, అరుణ్‌జైట్లీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో దోబూచులాడుతున్నారని విమర్శించారు. బిజెపి అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కల్పిస్తామన్నారా? లేదా? అనే విషయంపై తేల్చకుండా విభజన చట్టంలో లేదు, ఆర్థిక సంఘం వద్దని కుంటిసాకులు చెప్పటం తగదన్నారు. ఇప్పటికే 11 రాష్ట్రాలలో కేవలం కేబినెట్ ఆమోదంతో ప్రత్యేక హోదా కల్పించటం జరిగిందన్నారు. ప్రజలకు, పార్లమెంటుకు బాధ్యత వహించే టిడిపి, బిజెపి ప్రభుత్వాలు హోదాకు అడ్డుపడటం దుర్మార్గమన్నారు. ఈ కార్యక్రమంలో పిసిసి నాయకులు చేవూరు దేవకుమార్‌రెడ్డి, పి చెంచలబాబు యాదవ్, సివి శేషారెడ్డి, భవానీ నాగేంద్రప్రసాద్, గాలాజు శివాచారి, షేక్ అసిఫ్‌బాషా, పత్తి సీతారాంబాబు, ఎన్‌ఎస్‌యుఐ జిల్లా అధ్యక్షుడు కేశవనారాయణ, బిసి సెల్ చిలకా శ్రీనివాసరావు, అనురాధారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

ఆడిట్ కార్యాలయంలో అవినీ‘తిమింగలాలు’
నెల్లూరు, జూలై 30: లంచం తీసుకుంటూ ఇద్దరు జిల్లా ఆడిట్ కార్యాలయ ఉద్యోగులు ఒకేసారి రెడ్‌హ్యాండెడ్‌గా దొరకడం, వీరిలో జిల్లా స్థాయి అధికారి ఉండడం జిల్లాలో చర్చనీయాంశంగా మారింది. ఈ సంఘటన ఈ కార్యాలయంలో సిబ్బంది అవినీతి ఎంత విశృంఖలంగా తయారైంది తెలియచేస్తోంది. జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాలు, స్థానిక సంస్థల్లో ఆర్థిక సంవత్సరంలో జరిగే లావాదేవీలు, జమా ఖర్చులను ఈ సిబ్బందే పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుంది. అంతటి ప్రాధాన్యత ఉండడంతో ప్రజాప్రతినిధులతో పాటు ప్రభుత్వ కార్యాలయాల సిబ్బంది కూడా వీరికి దాసోహమై అడిగింది ఇచ్చే పరిస్థితి. కాదంటే ఆయా కార్యాలయాల్లో జరిగిన అవినీతి బట్టబయలవుతుందని వారి భయం. దీనికితోడు నగరానికి ఒక మూలన ఈ జిల్లా ఆడిట్ కార్యాలయం ఉండడం కూడా వీరికి కలిసొచ్చే అంశం. అటు మీడియా కానీ, ఇటు పౌరసంఘాల ప్రతినిధులు కానీ ఈ కార్యాలయం వైపు చూడడం బహు అరుదు. దీంతో వీరు ఆడింది ఆట, పాడింది పాటగా ఉంటుంది. మిగతా ప్రభుత్వ కార్యాలయాల వలె వీరికి ప్రజలతో ప్రత్యక్ష సంబంధం ఉండకపోవడం వీరికి కలిసొచ్చే మరొక అంశం. ఇక జిల్లా ఆడిట్ కార్యాలయం విషయానికొస్తే ఇక్కడ తిష్టవేసి కూర్చున్న సిబ్బంది ఎక్కువ. ఎక్కడికి బదిలీ అయినా తిరిగి ఇక్కడికే వచ్చి చేరడంలో ఇక్కడున్న కొందరు ఉద్యోగులు నిష్ణాతులు. తమకు, తమ అవినీతికి అడ్డు అనుకుంటే కార్యాలయంలోని ఇతర ఉద్యోగులను ఇబ్బందులకు గురిచేయడంలోనూ ఇక్కడి సిబ్బంది నేర్పరులు. ఈ కార్యాలయంలో అవినీతి తాండవిస్తోందని గతంలోనూ పలుమార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందాయి. ఇద్దరు ఉద్యోగుల పేర్లు మరీ ఎక్కువగా వినిపించాయి. పింఛన్ల మంజూరు కోసం వచ్చే వారిని ఇక్కడి సిబ్బంది పీల్చి పిప్పి చేస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. కాసులు లేనిదే ఏ ఫైలు ఒక కుర్చీ వద్ద నుంచి మరో కుర్చీ వద్దకు చేరదని ఈ కార్యాలయంలో తమ పనులు కోసం తిరిగి తిరిగి అలిసిపోయిన అభాగ్యులను కదిలిస్తే తెలిసిపోతుంది. ఈ కోవలోనే విశ్రాంత ఉద్యోగి కుటుంబానికి రావాల్సిన పింఛను అందించడానికి లంచం డిమాండ్ చేసి చివరకు కటకటాల పాలయ్యే పరిస్థితి తెచ్చుకున్నారు. రూ.30 వేలు డిమాండ్ చేసిన వహీద్ బాషా కొన్ని రోజుల కిందటే ఆ స్థానంలో ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు చేపట్టారు. అంతకుముందు ఉన్న ఉద్యోగి ఏకంగా రూ.80 వేలు డిమాండ్ చేసినట్లు బాధితుడు శ్రీనివాసులు తెలిపాడు. దీన్నిబట్టి ఉద్యోగి ఎవరైనా, వారి స్థానం ఏదైనా ఇక్కడ కాసులు కంటికి కనిపించనిదే కదిలే ఫైలంటూ ఏదీ ఉండకపోవడం గమనార్హం.

మెరుగైన వైద్యసేవలు అందించాలి:కలెక్టర్
గూడూరు, జూలై 30: ప్రభుత్వాసుపత్రులకు వచ్చే పేదలకు మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా కలెక్టర్ ఆర్ ముత్యాలరాజు వైద్యులకు సూచించారు. శనివారం ఆయన గూడూరు వైద్య విధాన పరిషత్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రిని ఎజెసి రాజకుమార్‌తో కలసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన స్థానిక విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లాలోని మూడు వైద్య విధాన పరిషత్ ఆసుపత్రులకు నోడల్ ఆఫీసర్లను నియమించామన్నారు. గూడూరు ఆసుపత్రికి ఎజెసి రాజ్‌కుమార్‌ను నియమించామని, ఆయన వారానికి ఒకసారి ఈ ఆసుపత్రికి వచ్చి ఇక్కడి పరిస్థితిని పరిశీలించి నివేదిక ఇస్తారన్నారు. రెండు నెలల్లో ఇక్కడి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తామన్నారు. తానేదో వచ్చి ఇక్కడి సిబ్బంది సక్రమంగా పనిచేయడం లేదని సస్పెండ్ చేయడంకన్నా అన్ని సౌకర్యాలు సమకూర్చి అప్పుడు వారి పనితీరులో మార్పులేకుంటే చర్యలు తీసుకొంటే సబబుగా ఉంటుందన్నారు. ప్రభుత్వ వైద్యశాలలకు వచ్చే వారు ప్రధానంగా పేదవారని వారిని వైద్యులు ఆప్యాయతతో వైద్య సేవలు అందించినట్టయితే వారి సేవలను వారు ఎల్లవేళలా గుర్తుంచుకొంటారని అన్నారు. కంటి ఆపరేషన్లు నిర్వహించుకొని ఉంటున్న రోగుల గది పక్కనే మార్చురీ గది ఉండటం వల్ల రోగులు ఇబ్బందులు పడుతున్నారని విలేఖర్లు ఆయన దృష్టికి తీసుకురాగా దానిని మార్చేందుకు తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. త్వరలో గూడూరు ప్రభుత్వ ఆసుపత్రిలో బయోమెట్రిక్ విధానం అమలుచేసి వైద్యులందరు వారికి నిర్ణయించిన సమయం ప్రకారం వైద్యసేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అనంతరం ఆయన ఆసుపత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రసూతి వార్డులో బాత్‌రూంల నిర్వహణ తీరు గమనించి సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కాన్పులు చేయించుకొనే మహిళలకు బాత్‌రూంలు శుభ్రంగా ఉంచుకొనకుండా ఏమిచేస్తున్నారని ప్రశ్నించారు. కలెక్టర్ వెంట ఎజెసి రాజకుమార్, డిసిహెచ్ సుబ్బారావు, ఆసుపత్రి సూపరింటెండెంట్ ఉమ, ఆర్‌ఎంఓ శైలజ, ఉప వైద్యాధికారి డాక్టర్ ఈదూరు సుధాకర్, గూడూరు ఇన్‌చార్జ్ ఆర్డీవో వెంకటసుబ్బయ్య, తహశీల్దార్ సత్యవతి, ఎండివో భవాని తదితరులు ఉన్నారు.

తమిళనాడు బియ్యం పట్టివేత
చిల్లకూరు, జూలై 30: చిల్లకూరు 16వ నంబర్ జాతీయ రహదారిపై బూదనం టోల్‌ప్లాజా వద్ద తమిళనాడు రాష్ట్రం నుండి నెల్లూరుకు తరలిస్తున్న రేషన్ బియ్యాన్ని విజిలెన్స్ డిఎస్పీ వెంకటనాధరెడ్డి, సిఐ ఉప్పాల సత్యనారాయణ తమ సిబ్బందితో కలసి పట్టుకొన్నారు. వ్యాపారుల మధ్య మనస్పర్ధలు రావడంతో ఈ సమాచారాన్ని విజిలెన్స్ అధికారులకు అందచేశారు. పట్టుబడిన లారీని చిల్లకూరు పోలీసులకు అప్పగించి అక్కడ నుండి సివిల్ సప్లై అధికారులకు సమాచారం అందించారు. వారు పోలీసుల నుండి లారీని స్వాధీనం చేసుకుని ఎఫ్‌సిఐ గౌడౌన్‌కు తరలించారు. తమిళనాడు నుండి తరలిస్తున్న 445 బస్తాల రేషన్ బియ్యం విలువ సుమారు 5.60 లక్షలు ఉంటుందని అధికారులు తెలిపారు.