రాష్ట్రీయం

దడ పుట్టిస్తున్న అవిశ్వాసం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు వైకాపా చెక్
తెదేపా ఆత్మస్థైర్యాన్ని దెబ్బకొట్టే యత్నం జగన్ ప్రకటనతో తెదేపాలో ప్రకంపనలు
విజయవాడ, మార్చి 11: ప్రభుత్వాన్ని కూలదోయడానికి ఏమాత్రం శక్తిలేని ప్రతిపక్ష వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అవిశ్వాస తీర్మానం నోటీసులు జారీ చేయడం వెనుక పెద్ద రాజకీయ వ్యూహమే దాగి ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. ప్రతిపక్షం శతవిధాలా ప్రయత్నించినా తమ ప్రభుత్వానికి ఢోకాలేదని తెలుగుదేశం పార్టీ పైకి గంభీరంగా కనిపిస్తున్నా, పార్టీలో అంతర్గతంగా ప్రకంపనులు మొదలయ్యాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని స్పీకర్ కచ్చితంగా అనుమతించాలి. అయితే, ఈ సమావేశాల్లో దీనిపై చర్చ జరుగుతుందా? లేక వచ్చే సమావేశాల వరకూ వాయిదా పడుతుందా? అన్నది 14వ తేదీన తేలే అవకాశాలు ఉన్నాయి. వైఎస్‌ఆర్ పార్టీ ఉన్నపళంగా ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడం వెనుక ఉన్న రాజకీయ కోణాలపై పెద్ద చర్చ సాగుతోంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలకు ప్రత్యేక సీట్లు కేటాయించలేదు. వారంతా ఇప్పటికీ ప్రతిపక్ష సభ్యుల గ్యాలరీలోనే కూర్చుంటున్నారు. అలాగే మొన్న అసెంబ్లీ నుంచి సస్పెండ్ అయిన ఎమ్మెల్యేల్లో వైకాపా నుంచి టిడిపిలో చేరిన ఆదినారాయణరెడ్డి పేరు ఉండడం కూడా గమనార్హం. అంటే ఈ 8మంది ఎమ్మెల్యేలు తెలుగుదేశం ఖాతాలో లేనట్టే! ఈ 8మందిని అనర్హులుగా ప్రకటించి ఆయా నియోజకవర్గాల్లో ఎన్నికలకు రావాలని వైకాపా అధినేత జగన్ పదేపదే సవాలు విసురుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు పట్టించుకోవడం లేదు. అయితే, వైకాపా మాత్రం పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఏవిధంగానైనా అనర్హులుగా ప్రకటించాలన్న ఆలోచనలో ఉన్నట్టు తెలుస్తోంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి దానిపై ఓటింగ్ జరిగినప్పుడు, వైకాపా ఖాయంగా విప్ జారీ చేస్తుంది. ఆ సమయంలో పార్టీ ఫిరాయించిన ఎనిమిది మంది ఎమ్మెల్యేలు పార్టీ విప్‌ను ధిక్కరించే అవకాశం ఉంది. దీంతో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు అనర్హులుగా లెక్కలోకి వస్తారు. ఈవిషయంలో స్పీకర్ స్పష్టమైన నిర్ణయం తీసుకోపోతే, ఆయనపై కూడా అవిశ్వాసం తీసుకొచ్చేందుకు వైకాపా సిద్ధమవుతోంది.
ఇక, రాజధాని భూముల వ్యవహారంలో ప్రభుత్వ పెద్దలు అవినీతికి పాల్పడ్డారన్నది ప్రతిపక్షం ఆరోపణ. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగితే, ఈ అంశాన్ని పెద్దఎత్తున రాష్ట్ర ప్రజలకు, రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులకు వివరించి వారి పక్షాన వైకాపా ఉందని నిరూపించుకునేందుకు అవకాశం ఏర్పడుతుందని భావిస్తున్నారు. అలాగే రాజధాని ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడానికి వచ్చేవారు కూడా పునరాలోచన చేసేలా లోపాలను ఎత్తిచూపాలని వైకాపా ప్రయత్నిస్తోంది. అంతేకాదు, టిడిపితో చెలిమి చేయడం బిజెపి శ్రేణులకు ఏమాత్రం ఇష్టం లేదు. సమీప భవిష్యత్‌లో వచ్చే ఏ ఎన్నికల్లోనైనా ఒంటరిగా పోటీకి దిగాలని బిజెపి క్యాడర్ అభిప్రాయపడుతోంది. ఈనేపథ్యంలో అవిశ్వాస తీర్మానం ద్వారా తెలుగుదేశం పార్టీని పూర్తిగా ఇరికాటంలో పెట్టి, బిజెపికి దగ్గర కావాలని కూడా వైకాపా అధిష్ఠానం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది.
ఇవన్నీ ఒక ఎత్తయితే, 21 మంది ఎమ్మెల్యేలు తమవైపు వస్తే ప్రభుత్వాన్ని కూల్చడం పెద్ద పని కాదని జగన్ చేసిన ప్రకటనతో తెలుగదేశం పార్టీలో గుబులు మొదలైంది. దీంతోనే ఆపరేషన్ ఆకర్ష్‌ను మొదలుపెట్టింది. జగన్ గూటిలో అసంతృప్తితో ఉన్నవారిలో కొంతమంది బాబు ఆశీస్సులు పొందారు. ఇలాంటి పరిస్థితుల్లో అవిశ్వాస తీర్మానాన్ని ప్రవేశపెడుతున్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీకి చెందిన కొందరు ఎమ్మెల్యేలు జగన్‌తో టచ్‌లో ఉన్నారనే ప్రచారం ఇంకా కొనసాగుతూనే ఉంది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిగి ఓటింగ్ వరకూ వస్తే, టిడిపిలో అసంతృప్తితో ఉన్న ఎమ్మెల్యేలు ఏవిధంగా వ్యవహరిస్తారనే భయం ఆ పార్టీ నేతలను వెంటాడుతోంది. దీంతో వైకాపా ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని టిడిపి సీరియస్‌గానే తీసుకోవలసిన పరిస్థితి ఏర్పడింది. అవిశ్వాస తీర్మానంపై చర్చ జరిపినా, జరపకుండా తప్పించుకున్నా అధికార పార్టీకి ఇబ్బంది తప్పదన్నది వాస్తవం.