రాష్ట్రీయం

ఆదిలాబాద్ జైలు నుండి మావోయిస్టు మహిళా నేత విడుదల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్,డిసెంబర్ 12: మావోయిస్టు పార్టీ సీనియర్ దళ నాయకురాలు ఉత్తర తెలంగాణ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి పుల్లూరి ప్రసాద్‌రావు అలియాస్ చంద్రన్న సతీమణి మోతిబాయి అలియాస్ రాధక్క శనివారం జిల్లా జైలు నుండి బెయిల్‌పై విడుదలయ్యారు. 18 ఏళ్ల కిందట దళ సభ్యురాలిగా చేరిన రాధక్క జిల్లా కమిటీ సభ్యురాలిగా, మంగిదళ కమాండర్‌గా ఆ తర్వాత ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర కమిటీ సభ్యురాలిగా బాధ్యతలు నిర్వర్తించి, ఉద్యమంలోనే చంద్రన్నతో సహజీవనం గడిపారు. గత ఏడాది సెప్టెంబర్‌లో అరెస్ట్ అయిన రాధక్కపై ఆదిలాబాద్, ఖమ్మం జిల్లాల్లో పోలీసులు 21 కేసులు నమోదు చేయగా, కేసు విచారణలో సరైన ఆధారాలు లేకపోవడంతో 20 కేసులను న్యాయస్థానం కొట్టివేసింది. అయితే ఆదిలాబాద్ జిల్లాలో రాధక్కపై నమోదైన కేసుకు సంబంధించి జిల్లా కారాగారంలో 14 నెలలుగా శిక్ష అనుభవిస్తున్న రాధక్కకు బెయిల్ మంజూరు కావడంతో శనివారం ఉదయం విరసం నేత వరవరరావు, రాజకీయ ఖైదీల అసోసియేషన్ ప్రతినిధులు దశరథ్, రవీంద్రనాథ్ జిల్లా జైలుకు వెళ్లి రాధక్కను బెయిల్‌పై విడిపించారు.
ఇంట్లోనే ఇక స్వేచ్ఛగా జీవిస్తా : రాధక్క
ఆదిలాబాద్ మండలం పిప్పల్‌దరికి చెందిన మోతిబాయి అలియాస్ రాధక్క జైలు నుండి విడుదలైన అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ తాను కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నానని, ఇక ఉద్యమంలోకి వెళ్లేది లేదని స్పష్టం చేశారు. జిల్లా జైలులో మహిళా ఖైదీలకు సమస్యలున్నప్పటికీ ఇక్కడ జైలు అధికారులు బాగానే చూసుకున్నారని అన్నారు. కాగా, విరసం నేత వరవరరావు మాట్లాడుతూ సత్ప్రవర్తన కలిగిన మహిళా ఖైదీలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, దేశవ్యాప్తంగా ఖైదీల విడుదలపై ఒకే విధానం అవలంభించాలని అన్నారు. రాష్ట్రంలో జైళ్ల పరిస్థితి దారుణంగా ఉందని, మహిళా ఖైదీల విషయంలో సర్కారు ఏమాత్రం శ్రద్ధచూపడం లేదని అన్నారు. ఏడేళ్లు పూర్తిచేసుకున్న రాజకీయ ఖైదీలను మానవతా దృక్పథంతో విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.