Others

పరదేశి (ఫ్లాష్‌బ్యాక్ @ 50)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రచన: మల్లాది వెంకట కృష్ణశర్మ
నృత్యం: వేదాంతం రాఘవయ్య
సంగీతం: ఆదినారాయణరావు
కళ: టివియస్ శర్మ, వాలి
సెట్టింగ్స్: తోట వెంకటేశ్వరరావు, ఎకె శేఖర్
కెమెరా: కమల్‌ఘోష్
నిర్మాత: ఆదినారాయణరావు.
దర్శకత్వం: యల్‌వి ప్రసాద్
**

సంగీత దర్శకులు ఆదినారాయణరావు, కె గోపాలరావు, నటుడు అక్కినేనితో కలిసి అశ్వని పిక్చర్స్ నెలకొల్పారు. ఈ బ్యానర్‌పై మాయలమారి/ మాయాక్కారై -చిత్రాలను తెలుగు, తమిళ భాషల్లో నిర్మించారు. తరువాత ఆ సంస్థనుంచి వైదొలగి సతీమణి అంజలిదేవి పేరుమీద అంజలి పిక్చర్స్ స్థాపించారు ఆదినారాయణరావు. ఈ బ్యానర్‌పై వీరు నిర్మించిన తొలి చిత్రం ‘పరదేశి’. 1953 జనవరి 14న విడుదలైన ఈ చిత్రానే్న తమిళంలో ‘పూంగోదై’గానూ రూపొందించారు.
1950లో హిందీలో నిర్మించిన ‘రాజారాణి’ చిత్రం రీమేక్ హక్కులు కొనుగోలు చేసి తెలుగు చిత్రం రూపొందించారు. చిత్ర దర్శకుడు ఎల్‌వి ప్రసాద్ రచయిత మల్లాది వేంకట కృష్ణశర్మతో కలిసి తెలుగు నేటివిటీకి తగ్గట్టుగా పలు మార్పులుచేసి చిత్రకథను తీర్చిదిద్దారు.
ప్రధాన పాత్రలు అక్కినేని, అంజలీదేవి పోషించగా, రెండో హీరోగా శివాజీ గణేశన్ నటించారు. తమిళ ప్రొడ్యూసర్, డిస్ట్రిబ్యూటర్ అయిన పెరుమాళ్ళు మొదలియార్ సూచనపై విల్లుపురం చిన్నయపిళ్ళె గణేష్ (ఓ నాటకంలో శివాజీ పాత్ర పోషించి, పాత్ర పేరునే తనపేరుకు పెట్టుకున్న శివాజీ గణేశన్)ను రెండో హీరోగా ఎన్నుకొన్నారు. ఈ చిత్రంలో తొలుత శివాజి గణేశన్‌కు మేకప్ టెస్ట్ చేసింది చిత్ర సహాయ కెమెరామెన్ అయిన వినె్సంట్. అంతేకాక పెరుమాళ్లు మొదలియార్ ఈ సమయంలోనే శివాజీ గణేశన్ హీరోగా ‘పరాశక్తి’ నిర్మించి, అంజలీదేవి, ఆదినారాయణరావుల అంగీకారంతో ‘పరదేశి’కంటే ముందు విడుదల చేశారు. దాంతో శివాజి తొలి చిత్రంగా ‘పరాశక్తి’ నిలిస్తే, తొలుత చిత్రీకరణ జరుపుకున్న చిత్రంగా ‘పరదేశి’ రికార్డు పొందింది. తరువాత శివాజీ గణేశన్ అంజలి పిక్చర్స్ ‘్భక్తతుకారాం’ చిత్రంలో శివాజీ పాత్రను ఏమాత్రం పారితోషికం తీసుకోకుండా నటించడం ప్రత్యేక విశేషం.
చంద్రం (అక్కినేని) తండ్రి గొప్ప వ్యాపారస్తుడు. వ్యాపారంలో నష్టం రావటంతో ఆస్తిని పోగొట్టుకుని ఆ బాధలో ఆత్మహత్యకు పాల్పడతాడు. చంద్రం స్నేహితుడు రఘు (జనార్ధన్) గుండెపోటుతో మరణిస్తూ, భార్య సుశీల (పండరీబాయి), కొడుకు ఆనంద్ (మాస్టర్ మోహన్‌కందా) బాధ్యతలను చంద్రానికి అప్పగిస్తాడు. ఈ బాధ్యతలపై ఓ కంపెనీలో గుమాస్తాగా పనిచేస్తూ చంద్రం అనారోగ్యానికి లోనవుతాడు. డాక్టర్ల సలహాపై విశ్రాంతి కోసం శీతగిరి వెళ్తాడు. అక్కడ జయలక్ష్మి ఆలయం వద్ద పూలు అమ్ముకునే లక్ష్మి (అంజలీదేవి)తో కలిగిన పరిచయం ప్రేమగా మారుతుంది. ఆమెను గుడివద్దే వివాహం చేసుకుంటాడు. తన పెళ్లి విషయం తండ్రి రంగనికి (ఎస్వీ రంగారావు) లక్ష్మి చెబుతుంది. తన ప్రాంతానికి చెందనివారిని పరదేశిలుగా భావించే రంగడు, చంద్రాన్ని తనవద్దకు తీసుకురమ్మంటాడు. చంద్రం కోసం వెళ్ళిన లక్ష్మికి అతడు అక్కడ లేడని తెలుస్తుంది. చంద్రం తనను మోసగించాడని తండ్రితో చెప్పడంతో భరించలేక రంగడు ఆత్మహత్య చేసుకుంటాడు. లక్ష్మి గర్భవతి అవుతుంది. ఓ ఆడపిల్లను ప్రసవిస్తుంది. అక్కడనుంచి ఓ మారుమూల కొండ ప్రాంతంలో తనబిడ్డను పెంచుతుంది. పెరిగిన ఆ బిడ్డ తార (వసంత) ఆ ప్రాంతాలకు వచ్చిన ఆనంద్ (శివాజీ గణేషన్)తో ప్రేమలో పడుతుంది. తల్లి ఇది విని ఆందోళన పడుతుంది. ఈ ప్రేమవద్దని వారిస్తుంది. చివరకు చంద్రం అక్కడకు వచ్చి లక్ష్మి అపోహలు తొలగిస్తాడు. ఆనంద్ తన పెంపుడు బిడ్డని, తానసలు వివాహం చేసుకోలేదని గతం వివరిస్తాడు. దాంతో తార, ఆనంద్‌ల పెళ్లితో చిత్రం శుభంగా ముగుస్తుంది.
చిత్రంలో గాజు బత్తులుగా రేలంగి, రాయుడు సత్యం, ఇంకా సూర్యాకాంతం, అనసూయ, సీతారామయ్య ఇతర పాత్రలు పోషించారు. దర్శకులు యల్‌వి ప్రసాద్ చిత్రాన్ని సరళంగా నడిపిస్తూనే, సన్నివేశాలను ఆకట్టుకునేలా రూపొందించారు. సెట్టింగ్స్, ఫొటోగ్రఫీ చిత్రీకరణకు మరింత వనె్నలద్దగా, స్లోమోషన్ సీక్వెన్స్ అలరించాయి. సంభాషణలు సన్నివేశానుగుణంగా మెప్పించాయి. ఈ చిత్రంలో శకుంతల, దుష్యంతుల ఎపిసోడ్‌ను అంజలీదేవి, నాగేశ్వరరావులపై చిత్రీకరించారు. స్లోమోషన్‌లో చిత్రీకరణ కమల్‌ఘోష్ కెమెరా పనితనానికి మెచ్చుతునకగా నిలిచింది. ప్రముఖ హిందీ దర్శకులు వి శాంతారామ్ ఈ స్లోమోషన్ కెమెరా ఎక్విప్‌మెంట్ బొంబాయినుంచి రప్పించి చిత్రం యూనిట్‌కి అందించారు.
చిత్రంలో అక్కినేనికి పిఠాపురం ప్లేబాక్ పాడటం విశేషం. ‘నేనెందుకు రావాలి/ ఎవరికోసము’, ‘పిలిచినది నవ యవ్వనమే, పలికినది అనురాగమ్మే’ అంజలీదేవి, అక్కినేనిలపై (పిఠాపురం, జిక్కి- మల్లాది కృష్ణశర్మ) చిత్రీకరించారు. అంజలీదేవిపై చిత్రీకరించిన మరో రెండు గీతాలు ‘అయ్యా ఘంఘం గుమలాడే గులాబి పూవులు’ (జిక్కి), మరో ఆహ్లాదకర గీతం ‘పిలిచింది కలువ పువ్వు/ పలికింది మల్లెపూవు’ (జిక్కి). ‘రావో లేటి రాజా’, ‘నా హృదయములో ఎవరో’ (ఏపి కోమల) అలరించే గీతాలే.
బాలరాజు చిత్రం నుంచీ ఏఎన్నార్‌కు ఘంటసాల ప్లేబాక్ పాడటం రివాజు. కాని ఈ చిత్రంలో పిఠాపురంచే పాడించటం, దానికి అక్కినేని అంగీకరించటం విశేషం. ‘పరదేశి’ చిత్రంలో తొలుత ప్రేయసి ప్రియులుగా అలరించిన అక్కినేని, అంజలీదేవి, ఆ తరువాత వయసు మీరిన జంటగా పరిణితితో కూడిన నటన ప్రదర్శించారు. ఒకే చిత్రంలో ఇలా వైవిధ్యం ప్రదర్శించి మెప్పించటం ఎంతో కష్టమైన విషయం. దాన్ని సుసాధ్యం చేసి చూపించారు అంజలీదేవి, అక్కినేనిలు.
‘పరదేశి’ చిత్రం ఆర్థికంగా విజయం సాధించకపోయినా, చక్కని కథాంశం, యువతకు ప్రేమగూర్చి ఇచ్చే సందేశంతో కూడిన చిత్రంగా మన్నన పొందింది. దర్శకులు యల్‌వి ప్రసాద్ చిత్రాన్ని రూపొందించిన తీరుకు ప్రశంసలు లభించాయి. తరువాత అంజలీ పిక్చర్స్ పలు విజయవంతమైన చిత్రాలను నిర్మించి తెలుగు చిత్ర పరిశ్రమలో తమకొక ప్రత్యేక స్థానాన్ని నిలబెట్టుకోవటం విశేషం.

-సివిఆర్ మాణిక్యేశ్వరి