Others

మర్యాద తప్పితే మసే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దర్శకుడు జాగరూకతతో ఉండి కథ, కథనాలతో మెస్మరైజ్ చేస్తేనే ప్రేక్షకుడు టేకింగ్ మాయలో పడతాడు. బాక్సాఫీసు బద్దలవుతుంది. దర్శకుడికే క్లారిటీలేక తడబడి తోచింది చుట్టేస్తే, ప్రేక్షకుడు తిరగబడతాడు. బాక్సాఫీసు చతికిలపడిపోతుంది. ఈ రెండు సమీకరణాలు -సక్సెస్ ఫెయిల్యూర్‌కి చక్కగా సరిపోయే సరిహద్దు రేఖలు!

రేఖవెంబడి వెళ్తేనే దర్శకుడితో ప్రేక్షకుడు ఏకమవుతాడు. సక్సెస్‌తో దర్శకుడు మమేకమవుతాడు. గీత దాటితే దర్శకుడికి ప్రేక్షకుడు సమాంతర రేఖవుతాడు. ఆ డైరెక్టర్‌కి విజయం అందని పండవుతుంది. అందుకే -ఎన్నో సక్సెస్‌లు సాధించి అనుభవం సంపాదించుకున్న సీనియర్లు ‘డైరెక్టర్ కేరాఫ్ ఆడియన్స్’ సూత్రాన్ని ఉపదేశిస్తారు. డైరెక్టర్ కేరాఫ్ డైరెక్టర్ అన్న ఆలోచన ప్రదర్శించినపుడే -అసలు చిక్కొచ్చిపడుతుంది. ఇక ఆ సినిమా గొంతు నులిమినట్టు విలవిల్లాడుతుంది. ఇప్పటి దర్శకుల్లో ఎవరేమనుకుంటున్నారు? ‘డైరెక్టర్ కేరాఫ్ ఆడియన్స్’ అనుకుంటున్నారా? లేక ‘... కేరాఫ్ డైరెక్టర్’ అనుకుంటున్నారో, అలా అనుకున్న సినిమాలకు ఎలాంటి ఫలితాలు వచ్చాయో చూద్దాం.
***
దర్శకుడిగా శంకర్‌కి ఒక స్పెషల్ స్టేటస్ ఉంది. చిన్న సామాజికాంశాన్ని ఇతివృత్తంగా తీసుకుని భారీ కథనంతో సినిమాను రూపొందించగల దిట్టగా పేరుంది. సింపుల్ లైన్‌కు హై టెక్నికల్ వాల్యూస్ అద్ది, కంప్యూటర్ గ్రాఫిక్స్‌తో సృజనాత్మకతను సృష్టించి సాధారణ ప్రేక్షకుడిని సంభ్రమాశ్చర్యాలకు గురి చేయగలడం శంకర్‌కు డైరెక్షన్‌తో పెట్టిన విద్య. దుక్క ఇనుములోనూ పిసరంత ప్రేమను పుట్టించి గుండెను హత్తుకునే సన్నివేశాలు ఆవిష్కరించి ‘రోబో’తో మురిపించాడు, మైమరిపించాడు. ఆడియన్స్ హృదయాల్లో శంకర్ ‘రోబో’ ఓ స్పెషల్ సైన్. ఆ సినిమాతో మురిసిపోయిన ప్రేక్షకులు శంకర్‌కు నీరాజనాలు పట్టారు. అనూహ్య విజయానికి శంకర్ కూడా ఉబ్బితబ్బిబ్బయ్యాడు. ఆ ఆనందంలో ‘దర్శకుడు కేరాఫ్ ప్రేక్షకుడు’ ఈక్వేషన్‌లో బ్యాలెన్స్ తప్పాడు. దాంతో ప్రయోగాల ల్యాబ్‌లో సన్నివేశాల రసాయన చర్య వికటించింది. చావుతప్పి ‘ఐ’ లొట్టపోయింది. ఎంతో ఎక్స్‌పెక్టేషన్స్‌తో వచ్చినా.. సున్నితమైన ప్రేమ కథలోని మాధుర్యం ఆడియన్స్‌కు అందలేదు. అంతే, సినిమా అష్టవంకర్లతో మసకబారింది. శంకర్ అతి నమ్మకం అభాసుపాలైంది. ఆడియన్స్‌కు అర్థంకాక ‘ఐ’ సినిమా వెనక్కిపోయింది.
***
హోలీ టైటిల్. ఫ్యామిలీ స్టోరీ. లవ్‌లీ స్క్రీన్‌ప్లే.. వెరసి ఆడియన్స్‌కి అత్తారింటికి ఎటు వెళ్లాలో దారిచూపించాడు పవన్ కళ్యాణ్. పేరు పవన్‌కే వచ్చినా, పనిమంతుడిగా అక్కడ దర్శకుడు, మాటల మాంత్రికుడు త్రివిక్రమే కనిపిస్తాడు. కేరాఫ్ ఆడియన్స్.. అనుకుంటూ సినిమా తీశాడు కనుకే ప్రాజెక్టులోకి కాసుల వరద వచ్చిపడింది. సినిమాకు ముందే మేజర్ పార్ట్ లీకైనా ఆడియన్స్ పట్టించుకోలేదు. థియేటర్లలో సినిమా నడుస్తుండగానే -పైరసీ మార్కెట్‌కు వచ్చేసినా లెక్కచేయలేదు. ఓ మంచి సినిమాను థియేటర్‌లో చూస్తేనే అనుభూతి అన్న ఆలోచనతో ఆడియన్స్ పరుగులు తీశారు. ఇప్పటికీ చానెళ్లలో సినిమా వస్తే -కదలకుండా కూర్చుంటున్నారు. ఎన్ని పంచ్‌లేసినా ఆడియన్స్‌ని కంచె దాటనివ్వకపోవడమే అసలు సక్సెస్ అని నమ్మాడు కనుకే -సక్సెస్‌కి సరైన దారి వెతికాడు.
ఆ ఉత్సాహమే త్రివిక్రమ్‌ను కాస్త అటూ ఇటూ చేసింది. మనమేం తీసినా ఆడియన్స్ చూస్తారులే అన్న పొరబాటు ఆలోచన బోల్తా కొట్టించింది. కేరాఫ్ డైరెక్టర్’ ఆలోచనతో తన టేస్ట్‌ని టెస్ట్ చేసుకోవడానికి, హీరోయిజానికి రంగులద్ది చేసిన తరువాతి సినిమా ‘సన్నాఫ్ సత్యమూర్తి’. అదే దెబ్బతీసింది. బన్నీలాంటి పవర్‌ఫుల్ హీరో స్క్రీన్‌మీద కనిపించినా -పాపం ప్రేక్షకుడు చేష్టలుడిగి చూస్తుండిపోయాడు. ‘సన్నాఫ్ సత్యమూర్తి’ అన్నంత మాత్రాన యూత్ పరుగులు తీయరు. ‘డాటరాఫ్ సత్యవతి’ అని టైటిల్ పెట్టినంత మాత్రాన మహిళలు క్యూకట్టరు అన్న విషయాన్ని ఆడియన్స్ బలంగానే తీర్పు చెప్పారు. సమీక్షలు పాజిటివ్‌గానే వచ్చినా -సినిమా వెనకబడిపోవడానికి కారణం అదే.
***
‘డైరక్టర్ కేరాఫ్ డైరెక్టరే’ అనే మాటని థౌజండ్ పర్సెంట్ నమ్మే దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మ. ‘నాకోసమే నేను. నచ్చిన సినిమా తీస్తా. నచ్చితే చూడండి, లేదంటే లేదు’ అంటూ తన స్టయిల్‌లో సినిమాలు తీస్తూనే ఉన్నారు. దీనివల్ల వర్మ తీస్తున్న సినిమాల సంఖ్య పెరుగుతుందే తప్ప, గొప్ప ఫలితాలు అందించే సినిమాల సంఖ్య ఏమాత్రం పెరగడం లేదు. వర్మ మేథస్సు నుంచి గొప్ప చిత్రాలు వచ్చిన టైంలో -ఆయన ఎలాంటి ప్రకటనలూ చేయలేదు. అందుకే ట్రెండ్‌ని సెట్ చేసే సినిమాలే అందించారు. ఎప్పుడైతే ‘నాకోసం నేను’లాంటి ప్రకటనలు ఇవ్వడం మొదలుపెట్టాడో -అప్పటినుంచి ఇప్పటివరకూ మరో ట్రెండ్‌సెట్టర్ సినిమా తీయలేకపోయాడు. కనీసం బాక్సాఫీసు దగ్గర కాసుల గలగలలు వినిపించగలిగే సినిమా కూడా తీయలేకపోతున్నాడు. వర్మ చెప్పకపోయినా, ఆయన గురించి తెలిసిన వాళ్లంతా చెప్పే మాట ఒక్కటే. ఆడియన్స్‌ని దృష్టిలో పెట్టుకుని రా.గో.వ. సినిమా తీస్తే -అది ట్రెండ్ సెట్టరే అవుతుందని. వర్మకు ఆ ఆలోచన ఎప్పుడొస్తుందో.. తెలుగు పరిశ్రమకు హిట్ బొనాంజా ఎప్పుడు దక్కుతుందో.
***
దర్శకుడిగా పూరీ జగన్నాథ్ ఎన్ని మంచి సినిమాలు చేయలేదు. ఎన్నిసార్లు పరిశ్రమకు కొత్త స్టయిల్‌ను ఆపాదించలేదు. కాకపోతే -పూరీకూడా అపుడపుడూ ప్రేక్షకుడిని పూర్‌గా ఆలోచిస్తాడు. అందుకే మధ్యమధ్యలో ‘దేవుడు చేసిన మనుషులు’, ‘కెమెరామెన్ గంగతో రాంబాబు’ లాంటి ఫెయిల్యూర్ సినిమాలు జనంమీద రుద్దుతుంటాడు.
దర్శకుడు కేరాఫ్ ప్రేక్షకుడు? అన్న స్పృహ ఉన్నంత వరకూ పూరీనుంచి మంచి సినిమాలే వచ్చాయి. గొప్ప సినిమాలే వచ్చాయి. తెలుగు సినిమా స్టయిల్‌ను కొత్తగా చూపించే సినిమాలే వచ్చాయి. కేరాఫ్ డైరెక్టర్ సినిమాలు తీయడం మొదలుపెట్టిన దగ్గర్నుంచీ ‘గొప్ప టైటిల్స్’ వస్తున్నాయి తప్ప గొప్ప సినిమాలు రావడం లేదు. తెలివి తెచ్చుకుని ‘టెంపర్’ చేసినా పూరీ పాళ్లు పూర్తిగా కలవలేదు. తీస్తున్న సినిమాలు హార్ట్‌అటాక్ కలిగిస్తున్నాయని తప్ప, గుండెకు ఆనందం ఇవ్వడం లేదు. మనసుపెట్టి తీస్తున్నానని చెబుతున్న ‘రోగ్’ని ఏంచేస్తాడో చూడాలి.
***
ప్రేక్షకుడి నాడి రాజవౌళికి బాగా తెలుసు. అందుకే ‘బాహుబలి’ని బ్రాండ్ అంబాసిడర్ చేసుకున్నాడు. ప్రేక్షకుడికి ‘మర్యాద’ ఇస్తేనే సినిమాకు ‘సై’ అంటారన్న విషయాన్ని ఆదినుంచీ అనుసరిస్తూనే ఉన్నాడు. అందుకే ఈగని చూపించినా, రాజవౌళికి ఏనుగంత బలాన్నిచ్చారు ప్రేక్షకులు. కేరాఫ్ ప్రేక్షకుడు ఫార్ములాని బలంగా నమ్ముతాడు కనుకే -ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని రుచి చూపిస్తూనే ఉన్నాడు. బాహుబలిని ప్రేక్షకుల ముందు సవినయంగా నిలబెట్టి, సక్సెస్‌తో కుస్తీ పట్టేందుకు తపన పడుతున్నాడు.
అందుకే దర్శకుడన్నవాడు ఎంత ఎత్తుకు ఎదిగినా -ప్రేక్షకుడిని మర్చిపోకూడదు. అదే జరిగితే -అడ్రసులే గల్లంతవుతాయి. సినిమా ప్రేక్షకుడికి చేరకుండా -డైరెక్టర్ అడ్రసుకే చేరిపోతుంది. ఏమంటారు?
*
-ఎనుగంటి వేణుగోపాల్

-ఎనుగంటి వేణుగోపాల్