Others

చీకటిని జయంచాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కళ్లున్నోడు సినిమా చూస్తాడు. దునియా ఉన్నోడు -సినిమా చూపిస్తాడు.
అయోధ్యకుమార్ రెండోదే చేశాడు. చీకటిలో మిణుకుమిణుకు మంటున్న వెల్తుర్ని సినిమా చేసి దర్శకుడయ్యాడు. తలెత్తుకునే చిన్న సినిమా నిర్మించి తరువాతి తరానికి -దార్శనికుడయ్యాడు. కొంచెం కొత్తదనం. కొండంత చిక్కదనం. ఇదీ అతని సిగ్నేచర్. 2012 క్యాటగిరీలో ఏడు నందులు సాధించిన ‘మిణుగురులు’కు ఇతను దివిటీ.
దాదాపు అన్ని సినిమాల లక్ష్యం ఒక్కటే, బాక్సాఫీస్‌ను షేక్ చేయాలని. కాకపోతే కొన్ని మనీతో షేక్ చేస్తాయి. ఇంకొన్ని మనసుని హత్తుకుని షేక్ చేస్తాయి. కమర్షియల్ హిట్లు ఎప్పుడూ దొరికేవే. మైండ్‌సెట్‌ని మార్చే మిణుగురులే అప్పుడప్పుడూ మెరుస్తాయి. ఆ మెరుపులు గొప్పవి కనుకే ఏడు నందులు అందాయి. చిత్ర పరిశ్రమకు సమున్నత గౌరవాన్ని ఆపాదించాయి.
అవార్డుల సినిమాలకు అప్పులే మిగులుతాయన్నది ఇండస్ట్రీలో ఓ సెంటిమెంట్. అందుకే చాలామంది నిర్మాతలు, దర్శకులు అవార్డు సినిమాలకు దూరం జరుగుతారు. సెంటిమెంట్‌నీ, భయాన్నీ లెక్కచేయని వాళ్లే -అప్పుడప్పుడూ మంచి సినిమాకు ప్రయత్నిస్తారు. అలాంటి ప్రయత్నాలే ‘మిణుగురులు’ అవుతాయి. అంతర్జాతీయ వేదికల మీద అప్రీసియేషన్ అందుకుంటాయి. ఆస్కార్ వరకూ ఎగురుతాయి. ఇలాంటి వాటిని అవార్డు సినిమా అనో, బడ్జెట్‌పరంగా చిన్న సినిమా అనో అనొచ్చేమోగానీ, సినిమా ప్రామాణికంలో ‘చిన్న’ అన్న టాగ్ తగిలించలేం. అయోధ్యకుమార్‌కు ఆ తడి తెలుసు కనుకే -‘కమర్షియల్‌గా నష్టపోయినా, ఆ నష్టంలో కమర్షియాలిటీకి చోటులేనంత ఆత్మసంతృప్తి పొందాను’ అంటున్నాడు. చిమ్మ చీకట్లో ‘మిణుగురుల’ను ఏరి పట్టుకోవడానికి పడిన కష్టం, ఎదురైన నష్టాన్ని భవిష్యత్ ప్రణాళికలతో అధిగమించగలనన్న ఇష్టాన్ని ‘వెనె్నల’తో పంచుకున్నాడు. ఆంధ్ర రాష్ట్రం కొద్దిరోజుల క్రితం నంది అవార్డులు ప్రకటించింది. వివిధ క్యాటగిరీల కింద ‘మిణుగురులు’ ఏడు నందులు సొంతం చేసుకుంది. నిజానికి 2012లో సినిమా స్క్రీనింగ్ జరిగినపుడు ‘గొప్ప సినిమా’ అన్నారే తప్ప, కమర్షియల్‌గా సపోర్ట్ చేసేందుకు ముందుకొచ్చిన వాళ్లెవరూ లేరు. అలాగని మిణుగురులు ఆగిపోలేదు. అంతర్జాతీయ ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో సత్తా చాటింది. ప్రామాణికత కలిగిన సినిమాగా ప్రశంసలూ అందుకుంది. తెలుగు సినిమా ఖ్యాతిని అంతర్జాతీయ స్థాయి నుంచి ఆస్కార్ వరకూ ఎగరేసింది. తల్లి భాష మీద నమ్మకంతో పోర్ట్‌లాండ్‌లో చేస్తున్న ఉద్యోగాన్ని వదిలేసి వచ్చేసిన తెలుగోడి నమ్మకాన్ని ఎవరెస్ట్ స్థాయికి తీసుకెళ్లింది. -కాస్త ఆలస్యంగానైనా సొంత గడ్డమీద గొప్ప గౌరవం దక్కింది. నందుల పంట పండింది. -‘బెస్ట్ ఫిల్మ్ టైటిల్ నుంచి ఏడు విభాగాల్లో ‘మిణుగురులు’ నందుల పంట పండించటం ఆనందమే. ద్వితీయ ఉత్తమ చిత్రంగానే ఎంపికైనా, ఆ స్థాయి కల్పించిన జ్యూరీకి కృతజ్ఞతలు’ అంటూ గ్రేట్ అచీవ్‌మెంట్‌ని సింపుల్‌గా షేర్ చేసుకున్నాడు అయోధ్యకుమార్.
బాల్యం నుంచి సినిమాను ఇష్టపడే అయోధ్య -అనివార్య కారణాలతో చాలాకాలం పాటు ఇష్టం దగ్గరే ఉండిపోయాడు. వంశీ, మణిరత్నం, బాలచందర్ స్టయిల్‌ను ఇష్టపడే అయోధ్య, వాళ్ల సినిమాలను విశే్లషించుకుంటూ చదువు సాగించాడు. చివరకు ఆంధ్ర వర్శిటీలో మెరైన్ కెమిస్ట్రీ చేశాక -లైఫ్‌లో సెటిలయ్యే ఎన్నో అవకాశాలు వచ్చినా సినిమావైపే నిలబడ్డాడు. ‘పూణె ఫిల్మ్ ఇనిస్టిట్యూట్‌లో కోర్సు చేస్తానంటే, ఇంట్లోవాళ్లు విని ఊరుకున్నారు. రెస్పాన్స్ లేదు. శుభ్రంగా చదువుకుంటున్నాడు కదా, అటు వెళ్లడమెందుకు? అన్న ఆలోచన కావొచ్చు వాళ్లది. నేనూ ఫోర్స్ చేయలేదు. కామ్‌గా ఉండిపోయా. తరువాత ఉద్యోగరీత్యా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌గా యుఎస్ వెళ్లినా -నా మైండ్‌ని సినిమా వదల్లేదు. నార్త్‌వెస్ట్ ఫిల్మ్ సెంటర్‌లోని పోర్ట్‌లాండ్ స్కూల్లో నాలుగేళ్ల డిగ్రీ చేశా. పబ్లిక్ బ్రాడ్ కాస్టింగ్‌లో టెంపరరీ ఉద్యోగం చేస్తూనే -‘ది న్యూ స్కార్ఫ్’ ‘ఐ యామ్ నాట్ ఎ చైర్’ షార్ట్ ఫిల్మ్‌లు చేశాం. అదే తొలి అనుభవం. ఫిల్మ్ సెంటర్‌లోని స్క్రిప్ట్ రైటింగ్ టీచర్ ‘రోజర్ మార్గోలిస్’తో కలిసి కొన్ని స్క్రిప్ట్‌లకు వర్క్ చేశా. ఆ టైంలోనే కొన్ని తెలుగులోనూ రాసుకున్నా. సినిమా అంటూ చేస్తే -సొంత గడ్డమీదే చేయాలనిపించి, రాసుకున్న స్క్రిప్ట్‌లు పట్టుకుని ఇండియాకు వచ్చేశా. అందులో ఏ ఒక్కటి వర్కవుటైనా.. మిణుగురులకు బదులు ఓ రొమాంటిక్ లవ్ స్టోరీ వచ్చి ఉండేదేమో. అప్పట్లో ఇద్దరు ముగ్గురు హీరోలను కలిసినా నో అన్నారు. నేనే హీరోగా సినిమా చేసేద్దామన్నంత కసి. తరువాత నిదానంగా ఆలోచించాక -మిణుగురులు సిద్ధమైంది’ అంటాడు అయోథ్య.
‘చూపులేని లైఫ్‌లో అంతా చీకటే. ఇది కళ్లున్నవాళ్ల ఫీలింగ్. కానీ, ఆ చీకట్లో వాళ్లు వెలుర్ని చూస్తుంటారు’.. ఈ థాట్‌ని సినిమా చేద్దామన్న ఆలోచన వచ్చాక -రీసెర్చ్ మొదలైంది. ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లో ఎన్నో బ్లైండ్ స్కూల్స్‌కు వెళ్లాం. అక్కడున్న పిల్లల నుంచి ఎన్నో తెలుసుకున్నాం. ప్రవర్తన ఎలా ఉంటుంది? ఆలోచనలు ఎంత స్థిరంగా ఉంటాయి? ఒక విషయాన్ని ప్రస్తావిస్తే -ఎలా ఊహించుకుంటారు? లాంటి విషయాలు సేకరించాం. కంటి వైద్యులను కలిసి మాట్లాడాం. చివరకు యుఎస్‌లోని బ్లైండ్ స్కూల్‌కు వెళ్లి అక్కడా ఎంతో సమాచారం సేకరించా. విస్తృత పరిశోధనల సారాన్ని సినిమా కథగా మలిచి, చాలామందికే చెప్పా. పెదవి విరిచారు. కారణం -చూపున్న వాళ్లకు చూపులేనోళ్ల కథ చూపించటంలో కమర్షియల్ పాయింట్ లేదని. అయినా ఆగిపోలేదు. విస్తృత పరిశోధనా సారాన్ని పక్కన పెట్టేయడానికి మనస్కరించలేదు. కష్టమైనా ఇష్టంగా రిస్క్ చేద్దామనిపించింది. అలా, ‘మిణుగురులు’లకు దర్శకుడిని, నిర్మాతను అయ్యాను’ అంటాడు అయోధ్య.
‘సినిమా తీయాలన్న నిర్ణయం తరువాతే అసలు కష్టం మొదలైంది. బడ్జెట్ దగ్గర్నుంచి ఆర్టిస్టులను ఎంపిక చేసుకోవడం వరకూ అన్నీ కష్టాలే. కలిసొచ్చిన మిత్రులు, ఎంపిక చేసుకున్న సాంకేతిక, నటవర్గం, పూర్తి చేయాలన్న కసి.. ఇవే అప్పటికి నా బలాలు. అలా 2012 జూన్‌కే సినిమా పూర్తి చేసినా, అనుకున్నది అనుకున్నట్టు చూపించాలన్న తాపత్రయంతో ఫైనల్ మిక్సింగ్‌లోనూ ఇబ్బందులు పడ్డాం. అతి కష్టంమీద సినిమా పూర్తి చేశాక, మళ్లీ విడుదల కష్టాలు మొదలయ్యాయి. చిత్రసీమలో ఉన్నవాళ్లు, లేనివాళ్లతో కలిపి మొత్తం 40 స్క్రీనింగ్స్ వేశా. ఎవరూ ముందుకు రాలేదు. ఎందుకు? అంటే కమర్షియల్‌గా చిత్రం నిలబడదన్నదే వాళ్ల మాట. నమ్మకం కోల్పోలేదు. ప్రయత్నాలు చేశాను. అలా దర్శకరత్న దాసరి నారాయణ రావుకు సినిమా చూపించా. ఆయనకు నచ్చింది. చీకటి నుంచి మిణుగురులు వెల్తురులోకి వచ్చింది. నిజానికి ఈ ప్రయత్నంలో ఆర్థికంగా బాగానే నష్టపోయా. కానీ, ఆనందానికి వెలకట్టలేనంత గుర్తింపు వచ్చింది. అదే ఆనందం’ అంటున్నాడు అయోధ్యకుమార్.
ఒక గుర్తింపు కొత్త ఉత్సాహాన్నిస్తుంది. ఆ ఉత్సాహంతోనే అయోధ్య కొత్త ప్రణాళికలకు పదును పెడుతున్నాడు. ‘మిణుగురులు’ చిత్రాన్ని అటు హిందీ, ఇటు తమిళం, మరాఠీలో విడుదల చేయాలన్నది ఆయన తపన. ‘రఘువీర్ యాదవ్, ఆశిష్ విద్యార్థి, సుహాసిని లాంటి ఇమేజ్‌వున్న నటులు హిందీ, తమిళంలో బాగా పరిచయం ఉన్నవారే. ఈ ఆలోచనతోనే ఆయా భాషల్లో చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నా’ అంటున్నాడు అయోధ్య. అంతేకాదు, సినిమా తీయాలన్న ఆలోచన పుట్టినపుడు సిద్ధం చేసుకున్న స్క్రిప్ట్‌కీ కొత్త మెరుగులు దిద్దుతున్నాడు. ‘చాలాకాలంగా తెలుగు స్క్రీన్‌కు దూరంగావున్న పాపులర్ హీరో సిద్దార్థతో ఓ రొమాంటిక్ ఫిల్మ్ రెడీ చేస్తున్నా. ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తా’ అంటున్నాడు. సీనియర్ నటి జయసుధ నుంచి తనకు అందిన ప్రశంస గుర్తు చేసుకుంటూ ‘మిణుగురులు చూసిన తరువాత నీలాంటి దర్శకుడితో పని చేయాలనిపించింది అన్నారామె. దర్శకుడిగా అంతకంటే గుర్తింపు ఏముంటుంది? ఆమె ఎంతో అనుభవమున్న నటి. ఆమె కోసం పాత్రను సృష్టించటం ఆషామాషీ కాదు. అయినా నా ప్రయత్నంలో సక్సెస్ అవుతానన్న నమ్మకం ఉంది. ఓ మంచి పాత్రతో ఆమెను కలుస్తా’ అంటున్నాడు అయోధ్య.

చిత్రాలు..దర్శకుడు అయోధ్యకుమార్
*.మిణుగురులు చిత్రంలోని ఓ దృశ్యం

-మహాదేవ