Others

అసలు విలనేడీ!?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సినిమా. ఏ భాషలోనైనా ప్రేక్షకులను ఉర్రూతలాడించేది. మానసిక ఆనందానిచ్చేది. మంచి చిత్రమైతే మార్గదర్శకమయ్యేది కూడా. 1931లో వచ్చిన తొలి చిత్రం నుంచీ నేటివరకు ఎన్నో తరహా చిత్రాలొచ్చాయి. ఆదిలో పౌరాణికాల హవా నడిచింది. మరికొన్నాళ్లకు జానపదాలు వచ్చాయి. ఇప్పుడంతా సాంఘిక చిత్రాల హవా. టైం, ట్రెండ్‌ను బట్టే దర్శకులు, నిర్మాతలు సినిమాలు నిర్మిస్తున్నారు. సినిమా ఏ తరహాదైనా, ఏ జోనర్‌లో నిర్మించినా.. అప్పుడూ ఇప్పుడూ సినీ మూల సూత్రం -చెడుపై మంచి పోరాటం. మంచికి ప్రతిరూపమైన హీరో చేతిలో చెడుకు ప్రతిరూపమైన ప్రతి నాయకుడు చావుదెబ్బ తినటం.
పౌరాణికాల్లో చెడుకు ప్రతిరూపమైన పాత్రలున్నా, వాళ్లను విలన్లు అనడానికి చాన్స్ లేదు. ఎందుకంటే ప్రతినాయక పాత్రనూ హీరో రేంజ్‌లో చూపించిన ఘనత మన తెలుగు సినిమాదే కనుక. రావణుడు, దుర్యోధనుడులాంటి పాత్రలు కథాపరంగా దుష్టపాత్రలే అయినా, వాటిని పోషించిన ఎన్టీఆర్ కొత్త ఇమేజ్ తీసుకొచ్చారు. విలన్ అనడానికి అవకాశం లేనంతగా పాత్రను పోషించి రక్తికట్టించారు. నిజానికి అత్యంత శక్తివంతమైన ప్రతి నాయకుని పాత్రలవి!
ఇక జానపదాల్లో ప్రతి నాయకుల పంథా వేరు. రాజుని సైన్యాధ్యక్షుడు బంధిస్తాడు లేదా చంపిస్తాడు. బిడ్డ సహా రాజు భార్య అడవిలోకి పారిపోతుంది. పిల్లాడు పెరిగి పెద్దవాడై తిరిగొచ్చి ప్రతి నాయకుని తుద ముట్టిస్తాడు. చాలాకాలం దాదాపు అన్ని జానపదాల్లో ఇదే బాణీ. ప్రతి నాయకుని పాత్ర సృష్టి జానపదాల్లో ఒకేతీరులో ఉండటంతో ప్రజల ముఖం మొత్తింది. కొన్ని జానపదాల్లో మాత్రం మాంత్రికుని పాత్ర సృష్టించబడింది. పాతాళ భైరవిలో ఎస్వీ రంగారావు పాత్రను ప్రత్యేకంగా చెప్పుకోవడం అందుకే. అలాగే జ్వాలాదీప రహస్యంలో సర్పకేశి పాత్రను అద్భుతంగా మలిచారు. భైరవద్వీపంలోనూ జానపద విలన్ మాంత్రికుని పాత్ర గొప్పగా రక్తికట్టించారు. కానీ ఎక్కువ జానపదాల్లో విలనీ ఒకేరకంగా ఉండటంతో ప్రేక్షకులకూ విసుగొచ్చేసింది!
ఇక సాంఘికాల్లో విలన్ పాత్ర. పాత చిత్రాల్లో ఆర్ నాగేశ్వరరావు విలనీ అద్భుతం. తరువాత ఎస్వీఆర్, రాజనాల, జగ్గయ్య, కైకాల, రావుగోపాలరావు లాంటి నటులు అద్భుత విలనీతో ప్రేక్షకులను కట్టిపడేశారు. ముఖ్యంగా రావుగోపాలరావు విలనీ ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకొనేది. ఆయన డైలాగ్ డెలివరీ, టైమింగ్ అద్భుతం. విలనీ గురించి ప్రస్తావించుకునే అనేక సందర్భాల్లో ముత్యాలముగ్గును ప్రస్తావించుకునేది అందుకే. ఇక దిగ్గజంలాంటి ఎస్వీఆర్ ‘కత్తుల రత్తయ్య’లో విలనీని అద్భుతంగా పండించారు. టైటిలే విలన్ పేరున పెట్టారంటే, ఆ పాత్ర సామర్థ్యాన్ని అంచనా వేయొచ్చు. ఆ కాలంలో దర్శకులు పవర్‌ఫుల్ విలన్ పాత్రల్ని సృష్టించేందుకు ఎక్కువ ఆసక్తి చూపేవారు. ఇక జగ్గయ్య విలనీ, మోహన్‌బాబు విలనీలూ చెప్పుకోదగ్గవే. అయితే, అత్యంత పవర్‌ఫుల్ విలనీ పాత్రల్లో ఇద్దరూ ఏ చిత్రంలోనూ కనిపించలేదు.
ప్రస్తుత సినిమాల్లో విలన్లు బఫూన్లవుతున్నారు. కామెడీ విలన్లో, సీరియస్ విలన్లో అర్ధంకాని పరిస్థితి. సర్దార్ గబ్బర్‌సింగ్‌లో విలన్ పరిస్థితి మనం చూసాం. ప్రతి నాయకుని పాత్రలో పాతతరం విలన్లకున్నంత ఫాలోయింగ్ కొత్తతరం విలన్లకు లేదు. దీనికి కారణం, ప్రతి నాయకుని పాత్రను దర్శకులు బలంగా సృష్టించలేకపోవడమే. అందుకే ఇప్పటి విలన్లు ఎక్కువ కాలంపాటు వెండితెరపై రాణించటం లేదు.
విలన్ అంటే, ఆ నటులోని నటనా కోణాన్ని వెలికితీసే పాత్ర. షోలేలో గబ్బర్‌సింగ్ పాత్రను ప్రస్తావిస్తే -ఇప్పటికీ మస్తిష్కంపైకి సన్నివేశాలు దొంతర్లుగా రావడానికి కారణం అదే. తెలుగు సినిమాల్లో అత్యంత శక్తివంతమైన విలన్ పాత్రలుండేవి తక్కువ. దొంగల వేటలో సత్యనారాయణ, గూఢచారి 116లో ముక్కామల లాంటివాళ్లు మరో కోణంలో సాఫ్ట్ విలన్లు. తడిగుడ్డతో గొంతులు కోసే పాత్రలో నాగభూషణం సరిగ్గా సరిపోయేవారు. ఎక్కువ శాతం ఆయన చేసిన విలనీ పాత్రలు అలాంటివే. ఆ పాత్రను చూసి ప్రేక్షకులు భయపడరు, కానీ సాఫ్ట్‌గా ముంచేసే పాత్రల్లో ఆయన గుర్తుండిపోయారు. పాతతరం విలన్లు కోట శ్రీనివాసరావు సహా అందరూ ఇంతవరకూ రాణించడానికి కారణం వారి నటన, పాత్రల సృష్టి. తాజా చిత్రాల్లో జగపతిబాబు విలన్‌గా రూపాంతరం చెందారు. కానీ ఈ కాలం విలన్లు వెండితెరపై ఎక్కువ కాలం మనగలగక పోవడానికి కారణం ఆయా పాత్రల్లోని లోపాలే! ఆధునిక కాలానికి సరిపోయే విలన్లుగా ప్రకాష్‌రాజ్, ఇప్పుడు జగపతిబాబులను చెప్పుకుంటున్నాం. వీళ్లుతప్ప, గొప్ప విలన్లుగా ఫలానావాళ్లు రాణించారని చెప్పుకోవడానికి అవకాశమే లేకుండా పోయింది. ఏ సినిమాకు ఆ సినిమాలో విలన్ ఓకే అనేసుకోవడం తప్ప, విలనీకి ఇమేజ్ తెచ్చిన గొప్ప నటులూ ఇప్పుడు కనిపించటం లేదు. విలన్లుగా పరభాషా నటుల ప్రతాపం, ప్రభావం పెరిగిన తరువాత కూడా, ఆ సినిమాలో అతను విలన్ అనుకోవడం తప్ప, గుర్తు పెట్టుకోగలిగే స్థాయిలో ప్రతినాయక పాత్రను పోషించేవాళ్లు కరవైపోయారు. మరోపక్క హీరోలు సైతం విలన్ సీన్లు చేసేస్తుంటే, అద్భుతమైన విలన్ అనిచెప్పుకోదగిన వాళ్ల సంఖ్య తెలుగు పరిశ్రమలో క్రమంగా తగ్గిపోతుంది. అసలు విలనేడీ? అనుకోవాల్సి వస్తుంది. *

-ఎం రామకృష్ణ