Others

మన దేశం (అపురూప చిత్రాలు)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

స్వాతంత్య్రానికి పూర్వం దేశభక్తులు, రాజకీయ నాయకులు పడ్డ అగచాట్లను, పోలీసు అధికారుల దౌష్ట్యాన్ని నేపథ్యంగా ఎంచుకొని శోభనాచల సంస్థవారు ఎలాగైనా చిత్రం తీసి, స్వతంత్ర భారతదేశ ఆవిర్భావ సందర్భంగా విడుదల చేయాలన్న సంకల్పంతో నిర్మాత మీర్జాపురం రాజాగారికి కలిగింది. దర్శకులు ఎల్.వి.ప్రసాద్, రచయిత సముద్రాల, కృష్ణవేణి ‘విప్రదాసు’ నవల ఆధారం చేసుకొని ‘మన దేశం’ చిత్రంగా మార్చడంలో చర్చలు జరిపారు (రాజావారు కూడా అప్పుడప్పుడు వచ్చి కథ వింటూ సలహాలను ఇస్తూ వెళుతుండేవారు. అప్పుడు ఆయన దర్శకత్వంలో ‘కీలుగుర్రం’ నిర్మాణంలో వున్నది). సముద్రాల రచన ఆరంభించారు. నారాయణరావుని, నాగయ్యని, రేలంగిని అలా ఒక్కొక్కరిని పాత్రలకు ఎన్నిక చేస్తూ వచ్చారు.
అప్పుడే అద్భుతమైన ఆధునిక లలిత సంగీత ధోరణి, అమోఘమైన కంఠబలంతో ఘంటసాల వెంకటేశ్వరరావు చిత్ర రంగంలోకి ప్రవేశిస్తున్నారు. శోభనాచల సంస్థవారే అంతకుముందే ‘లక్ష్మమ్మ’ చిత్రాన్ని తీయాలనుకుని ఘంటసాలని సంగీత దర్శకునిగా తీసుకున్నారు. కొన్ని పాటలకు కంపోజింగ్ కూడా జరిగింది. కాని చిత్ర నిర్మాణాన్ని కారణాంతరాలవలన వాయిదా వేసి ‘కీలుగుర్రం’ తీసుకున్నారు. దానితో ఆయనే ఆ చిత్రానికి సంగీత దర్శకుడయ్యారు. అలాగే ‘మనదేశం’ చిత్రానికి ఆయనే్న నియమించారు.
‘మనదేశం’ చిత్రంలో ప్రాముఖ్యతగల పోలీసు ఇన్స్‌పెక్టర్ పాత్ర ఉన్నది. ఆ పాత్రను ఎల్.వి. ప్రసాద్ సూచన మేరకు కొత్తవాడైన, మంచి కంఠం, పర్సనాలిటీ ఉన్న ఎన్.టి.రామారావుకు ఇచ్చారు. ఆ విధంగా నందమూరి తారకరామారావుకి ‘మనదేశం’ తొలి చిత్రం అయింది. రామారావు ఎక్కడా కూడా తన తొలి సినిమా చేస్తున్నట్లు అనిపించలేదు. ప్రసాద్ చెప్పింది విని అలాగే తనకు తాను బోధ చేసుకుని గంభీరంగా సంభాషణలు చెబుతూ నటించారాయన. ఎప్పుడూ మూడ్‌లోనే ఉండేవారు. షాట్ కట్ అయిన తరువాత కూడా ఆయన అదే మూడ్‌లో ఇంకా కొంతసేపు కొనసాగేవారని నిర్మాత కృష్ణవేణి చెప్పేవారు.
అయితే అనుకున్నట్లుగా చిత్ర నిర్మాణం పూర్తికాలేదు. ఎక్కువ కాల్‌షీట్లు వచ్చాయి. ఖర్చుపెరిగింది. స్వాతంత్య్ర దినోత్సవానికి ముందుగానే విడుదల చేయాలన్న నిర్మాత కోరిక నెరవేరలేదు. 1946వ సంవత్సరం చివరి మాసంలో చిత్ర నిర్మాణాన్ని ప్రారంభించినా, ఈ చిత్రం 1949లోగాని విడుదల చేయలేకపోయారు.
రేలంగి, బాలసరస్వతిమీద చిత్రీకరించిన హాస్యగీతం ‘పంచదార వంటి పోలీసు వెంకటస్వామి నిను నేను మరువలేనురా’ బాగా పాపులర్ అయినది. ‘జయ జననీ పరమ పావనీ, జయ జయ జయ భారత జననీ, వెడలిపో వెడలిపో తెల్లదొర మా దేశపు ఎల్ల దాటి వెడలిపో’ అనే భక్తిగీతాలు, ఎం.ఎస్.రామారావు, కృష్ణవేణి పాడిన ‘ఏమిటో ఈ సంబంధం’ అనే యుగళగీతం కూడా చెప్పుకోదగ్గవే. ఎన్నో ప్రాధాన్యతలు సంతరించుకున్న నాటి రాజకీయ చిత్రం ‘మనదేశం’. ఈ చిత్రం 1949 సంవత్సరం నవంబర్ నెల 24న విడుదలయింది.
కథా సంగ్రహం
అగ్రహారంలో నివశిస్తున్న రామనాథం (నాగ య్య), జానకి (కాంచన్) దంపతులకు ఒక్కడే కొడుకు నెహ్రూ. రామనాథం సవతి తల్లి యశోద (హేమలత), ఆమె కొడుకు మధు (నారాయణరావు) రాజకీయాలలో పాల్గొనడం యశోదకు ఇష్టంలేదు. తల్లికి, కొడుకుకి ఈ విషయంలో రగడ జరుగుతూనే వుంటుంది. కాని వదిన జానకి మధును బుజ్జగిస్తూ, బుద్ధులు చెబుతూ ఉంటుం ది. చుట్టపు చూపుగా, జానకి పినతండ్రి బారిష్టరు, ఆయన కుమార్తె శోభ (కృష్ణవేణి) అగ్రహారం వస్తారు. శోభకు కాంగ్రెస్ మతమంటే వెక్కిరింపు. మధుతో ఈ విషయముగా ఆవిడ ఘర్షణ పడుతుంది.
ఆచారవంతుల ఇంటిలో, తన తండ్రిని అంటరానివాడికి మల్లే చూశారని, సావడిలో భోజనం పెట్టారని శోభ అలుగుతుంది. తండ్రితో కూడా వెంటనే పట్నానికి ప్రయాణమవుతుంది. రామనాథం కూడా బయలుదేరుతాడు. అందరు మద్రాసులో రామనాథం అతిథులు. ఆ ఇంట నందయ్య (వంగర), నరసి (లక్ష్మీకాంత) అనువైన పరిచారకులు. రామనాథం పరమ చాందసుడు కాదని తెలుసుకొని శోభ తన తప్పు దిద్దుకుంటుంది. మధు నెహ్రూలతో యశోద కూడా పట్నం చేరుకుంటుంది.
కాంగ్రెస్ సమావేశానికి మధు అధ్యక్షత వహిస్తాడు. పోలీసులు ఆ సమావేశాన్ని చెల్లాచెదురు చేస్తారు. అప్పుడు మధుకు దెబ్బలు తగులుతాయి. దెబ్బలు తగిలిన స్థితిలో అతనిని బందీ చేస్తారు. దేశ స్వాతంత్య్రానికి యువకులు పడే కష్టాలను ప్రత్యక్షంగా చూడడంతో శోభకు కనువిప్పు కలిగి, తాను కూడా రంగంలోకి దుముకుతుంది. తెగువగా సాహసాలను చేస్తుంది. రామనాథంగారి కుటుంబం తిరిగి అగ్రహారం చేరుకుంటుంది. పోలీసులు శోభ కోసం రామనాథం ఇంటిని సోదా చేసి, రామనాథం విద్రోహి అని అరెస్టు చేస్తారు. బిడ్డ పాట్లు చూడటంలో యశోదకు ఆవేశం వచ్చి తాను కూడా అరెస్టు అవుతుంది.
జానకి ఎంత నిబ్బరం ఉన్న ఇల్లాలైనా, ఈ యాతనలో ఆవిడ చితికిపోతుంది. రామనాథం, యశోదా విడుదలై వచ్చే నాటికి, జానకి అపాయకరమైన స్థితిలో ఉంటుంది. మధు వదినను చూసిపోదామని పెరోల్ (తాత్కాలిక విడుదల)మీద వస్తాడు. గడువుమీరినా వెళ్లనందుకు పోలీసులు మధును బలవంతంగా లాక్కొనిపోయే సమయంలో జానకి కన్నుమూస్తుంది.
కాంగ్రెస్ అధికార స్వీకారం, రాజకీయాల్లో మా ర్పు, డిటెన్యూల విడుదల, మధు ఉన్నతుడై తిరిగి ఇంటికి రావడం జరుగుతాయి.
నటవర్గం
నాగయ్య, సిహెచ్.నారాయణరావు, ఎన్.టి. రామారావు, రేలంగి, వంగర, కృష్ణవేణి, కాంచన్, హేమలత, లక్ష్మీకాంత, బాలసరస్వతి. రచన: సముద్రాల (సీనియర్), సంగీతం:ఘంటసాల, నృత్య దర్శకుడు: వెంపటి సత్యం, నిర్మాత: మీర్జాపురం రాజా, కృష్ణవేణి, దర్శకత్వం: ఎల్. వి.ప్రసాద్

-ఎ.సి.పుల్లారెడ్డి