Others

చలాకీ సోగ్గాడు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘మేరే పాస్ బంగ్లా హై, గాడీహై, పైసాహై, బ్యాంక్ బ్యాలెన్స్ హై.. తేరే పాస్ క్యాహై’ అని ‘దీవార్’ చిత్రంలో నేరస్తుడైన అమితాబ్ అంటే.. పోలీస్ అయిన శశికపూర్ తొణక్కుండా, బెణక్కుండా ‘మేరే పాస్ మా హై..’ అంటాడు. ఆ ఒక్క డైలాగ్‌తో సినిమా విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు శశికపూర్. అదీ.. అతడి ప్రతిభ! డైలాగులు చెప్పడంలో ఒక్కో నటుడికి ఒక్కో స్టయిల్ వుంటుంది. అయితే ఎవరి శైలి వారిదే. కానీ, కొందరు నటులు చెప్పిన డైలాగ్‌లను ఎప్పటికీ మర్చిపోలేం. అలాంటి వాటిలో శశికపూర్ పలికిన ‘మేరే పాస్ మా హై’ అనేది ఎవర్‌గ్రీన్ డైలాగ్. అమితాబ్ బచ్చన్, శశికపూర్ సోదరులుగా అనేక చిత్రాల్లో నటించారు. అయితే అన్నింటిలో కన్నా ‘దీవార్’ చిత్రం చాలా ప్రత్యేకం. అందులో శశికపూర్ పలికిన ఈ డైలాగ్ మరీ ప్రత్యేకమైంది. యశ్‌చోప్రా దర్శకత్వంలో 1975లో వచ్చిన ‘దీవార్’ బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించింది. ఇందులో విజయ్, రవి పాత్రలను అమితాబ్, శశికపూర్ పోషించారు. ఇద్దరి మధ్య సాగిన ఈ డైలాగ్‌కు థియేటర్‌లో చప్పట్లు, ఈలలతో దద్దరిల్లింది. ‘దీవార్’ విడుదలై దాదాపు నలభై ఏళ్లు పూర్తయినా, ఈ డైలాగ్‌కు క్రేజ్ తగ్గలేదు. రోటీ కప్ డా ఔర్ మకాన్, కభీ కభీ, త్రిశూల్, కాలాపత్తర్, షాన్, సిల్‌సిలా, నమక్ హలాల్ వంటి అనేక సినిమాల్లో శశికపూర్ సపోర్టింగ్ క్యారెక్టర్లు చేసినా, అవి అతడిలో దమ్మును చూపాయి. తన స్టామినాను ఎలుగెత్తాయి.
దాదాపు నాలుగు దశాబ్దాల పాటు తనదైన విశిష్ట నటనతో రాణించిన శశికపూర్ 1938 మార్చి 18న కలకత్తాలో జన్మించారు. పృథ్వీరాజ్ కపూర్, రమామెహ్రా కపూర్ తల్లిదండ్రులు. శశికపూర్ అసలు పేరు బలవీర్ రాజ్ పృథ్వీ రాజ్‌కపూర్. శశికపూర్ తన నాలుగో ఏటే సినీ జీవితానికి శ్రీకారం చుట్టారు. తన తండ్రి పృథ్వీరాజ్ కపూర్ దర్శకత్వంలో రూపొందిన నాటకాల్లో నటించారు. 50వ దశకంలోనే అనేక చిత్రాలకు సహాయ దర్శకుడిగా పనిచేశారు. 1961లో ‘్ధర్మపుత్ర’ అనే చిత్రం ద్వారా నటుడిగా పరిచయం అయ్యారు. అనేక సినిమాల్లో భిన్నమైన, వినూత్నమైన పాత్రలను పోషించి బాలీవుడ్ ప్రిన్స్ చార్మింగ్‌గా ప్రేక్షక హృదయాలను దోచుకున్నారు. దీవార్, కభీ కభీ, నమక్ హలాల్, కాలాపత్తర్ తదితర చిత్రాల్లో ప్రేక్షకుల మది లో గుర్తుండిపోయే విలక్షణమైన భూమికను పోషించారు. 2011లో పద్మభూషణ్, 2015లో ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే అవార్డును పొందారు. బాలీవుడ్‌లో లవర్‌బాయ్‌గా పేరు తెచ్చుకున్న శశికపూర్ నటుడిగానే కాకుండా, దర్శక నిర్మాతగా వ్యవహరించారు. కభీ కభీ, దుస్‌రా ఆద్మీ, జమీన్ ఆస్మాన్ లాంటి పలు విజయవంతమైన చిత్రాలు ఆయన ఖాతాలో వున్నాయి. అమితాబ్‌తో కలిసి శశికపూర్ దీవార్, నమక్ హలాల్ చిత్రాల్లో నటించారు. అమితాబ్ కంటే తాను వయసులో పెద్దవాడు. కానీ చాలా సినిమాల్లో తమ్ముడుగా నటించాడు. 70వ దశకంలో ముఖ్యంగా ఆ దశకం సెకండాఫ్‌లో శశికపూర్ ఉన్నంత బిజీగా ఏ హీరో లేడు. ఎంత బిజీ అంటే రాజ్‌కపూర్ తన సినిమా ‘సత్యం శివం సుందరం’లో బుక్ చేద్దామంటే అతడి దగ్గర డేట్స్‌లేవు. అంత బిజీలో కూడా శశికపూర్ కలియుగ్, జునూన్ వంటి భిన్నమైన సినిమాల్లో నటించి అభిరుచి కలిగిన ప్రేక్షకుల దృష్టిలో ఎదిగాడు. సొంత బ్యానర్ ‘్ఫల్మ్ వాలాస్’ స్థాపించి గోవింద్ నిహలానీతో ‘విజేత’, అపర్ణాసేన్‌తో ‘36 చౌరంగీ లేన్’, గిరీష్ కర్నాడ్‌తో ‘ఉత్సవ్’ తీశాడు. ‘ఆగ్’ చిత్రం ద్వారా ఆయన బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చారు. హీరోగా నటించిన తొలి చిత్రం ‘్ధర్మపుత్ర’. ఆయన చివరి చిత్రం ‘సైడ్ స్ట్రీట్స్’. నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ రంగంలో శశికపూర్ తనదైన ముద్ర వేశారు.
నాటకాలు వేసే రోజుల్లోనే మరో నాటకాల సంస్థ అధినేత కూతురైన ఇంగ్లీష్ నటి జెన్నీఫర్ కెండల్‌ను ప్రేమించి 1958లో వివాహం చేసుకున్నారు. వీరికి ముగ్గురు సంతానం. కరణ్ కపూర్, కునాల్ కపూర్, సంజనా కపూర్‌లు. తర్వాత ఈ ఇద్దరూ పలు ఆంగ్ల చిత్రాలో నటించారు. అలా శశికపూర్ హీట్ అండ్ డస్ట్ (1983), సమీ అండ్ రోసీ గెట్ లైడ్ (1987), ది డిసీవర్స్ (1989), ఇన్ కస్టడీ (1994), జిన్నా (1998), సైడ్ స్ట్రీట్స్ (1998) లాంటి ఆంగ్ల సినిమాల్లో నటించారు. ఆయన తండ్రి స్థాపించిన పృథ్వీ థియేటర్స్‌తో పాటు ఆయన నిర్మిం చి, దర్శకత్వం వహించిన నాటకాలలో వివిధ పాత్ర లు పోషించే వారు. బాలనటుడిగా సంగ్రామ్ (1950), దనపాణి (1953) వంటి కమర్షియల్ చిత్రాల్లో నటించారు. 1948లో వచ్చిన ‘ఆగ్’, 1951లో వచ్చిన ‘ఆవారా’ చిత్రాల్లో తన అన్న రాజ్‌కపూర్ చిన్నప్పటి పాత్రను పోషించి మంచి పేరు తెచ్చుకున్నారు. తన సినీ కెరీర్‌లో మొత్తం 148 హిందీ చిత్రాల్లోను, 12 ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించారు. కథానాయకుడిగా 61 సినిమాల్లో నటించారు. అంతేకాదు లీడ్ హీరోగా 53 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించడం విశేషం. ఇక 21 సినిమాల్లో సహాయ పాత్రలు, 7 సినిమాల్లో అతిథి పాత్రలు పోషించారు. కేవలం హిందీ సినిమాల్లోనే కాదు.. పలు ఇంగ్లీష్ చిత్రాల్లోనూ నటించి పేరు తెచ్చుకున్నారు. భార్య మృతితో సగం జీవితాన్ని కోల్పోయారట శశికపూర్. ఆయన జీవితాధారంగా ‘శశికపూర్: ది హౌస్ హోల్టర్, ది స్టార్’ అనే ఆటోబయోగ్రఫీ వచ్చింది. దీనిని అసీం ఛాబ్రా రాశారు. ఇందులో శశికపూర్ భార్య జెన్నీఫర్ మరణం ఆయన జీవితంలో ఎలాంటి పెను మార్పులకు దారితీసిందో వివరించారు. జెన్నీఫర్ చనిపోయిన రెండేళ్లలో శశికపూర్ జీవితంలో పనుమార్పులు చోటుచేసుకున్నాయని అసీం పుస్తకంలో పేర్కొన్నారు. శశికపూర్ చురుకైన చూపుల్తో ప్రేమ డైలాగులు చెబుతుంటే.. వెండితెరపై కథానాయికే కాదు, థియేటర్లలో అమ్మాయిలు కూడా మైమరచిపోయే వారు. చలాకీగా అతడు ప్రేమగీతాలు పాడుతుంటే.. ప్రేక్షకులు ఉర్రూతలూగిపోయేవారు. అతడి నటనను చూసి.. అభిమానులు ఆనందంగా ఈలలు వేసేవారు. నాలుగేళ్లకే నాటక రంగంపై కాలుమోపిన ఈ చురుకు చూపుల చలాకీ సోగ్గాడు దశాబ్దాల పాటు తిరుగులేని నటుడిగా రాణించారు. సంగ్రామ్, సమాధి లాంటి చిత్రాల్లో బాలనటుడిగా అశోక్‌కుమార్‌తో కలిసి నటించారు. కథానాయకుడిగా కెరీర్ ప్రారంభించిన తొలి నాళ్లలో శశికపూర్‌కు ఎదురు దెబ్బలు తగిలాయి. ఒకటి రెండు సినిమాలతో ఫ్లాప్ హీరో అనే ముద్ర పడింది. ఆ సమయంలోనే హీరోయిన్ నందా కలిసి చేసిన ‘జబ్ జబ్ ఫూల్ ఖిలే’ భారీ విజయాన్ని అందుకుంది. మ్యూజికల్ హిట్‌గా నిలిచింది. అక్కడి నుంచి శశికపూర్ వెనుతిరిగి చూసుకోలేదు. ‘నీంద్ హమారీ, ఖ్యాబీ తుమ్హారీ’, ‘మెహబ్బత్ ఇస్కో కహాతే హై’ వంటి విజయవంతమైన చిత్రాల్లో నందాతో కలిసి నటించారు. శశికపూర్, జీనత్ అమన్ కలిసి పది సినిమాల్లో నటిస్తే ఆరు చిత్రాలు బ్లాక్ బస్టర్ హిట్. ఇక రాఖీతో కలిసి నటించిన చిత్రాలు కూడా ఎక్కువ శాతం బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షాన్ని కురిపించాయి. తాను నటించే ప్రతీ పాత్ర ఎంతో విభిన్నం చేయాలని తపన పడేవారు శశికపూర్. ‘అభినేత్రి’లో ఆయన చేసిన పాత్రను ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. 1974-77 మధ్య శశికపూర్ నటించిన సినిమాల్లో దాదాపు పదికి పైగా సినిమాలు భారీ ఫ్లాప్‌లయ్యాయి. అప్పటి నుంచి ఆయన మల్టీస్టారర్ సినిమాలు చేయటం ప్రారంభించారు. కథానాయకుడిగా 61 సినిమాలు చేస్తే 33 విజయాలు లభించాయి. అదే మల్టీస్టారర్‌గా 54 సినిమాలు చేస్తే 34 హిట్‌లు.. సూపర్ హిట్‌లు.. కేవలం జాతీయ నటుడిగానే కాకుండా అంతర్జాతీయ నటుడిగానూ శశికపూర్ పేరు తెచ్చుకున్నారు. మొత్తం 12 హాలీవుడ్ చిత్రాల్లో ఆయన నటించారు. ఒక దశలోనే బాలీవుడ్‌లోనే అత్యధిక పారితోషికం అందుకున్న నటుడిగా ఆయన ఎదిగారు. రాఖీ, షర్మిలా టాగూర్, జీనత్ అమన్, హేమమాలిని, పర్వీన్‌బాబీ, వౌసమీ చటర్జీలాంటి తారలతో ఆయన కథానాయకుడిగా నటించిన పలు చిత్రాలు సినీ అభిమానుల గుండెల్లో చెరగని ముద్రను వేశాయి. రొమాంటిక్ కథానాయకుడిగా తనదైన ముద్రను వేశారు. 1978లో సొంత నిర్మాణ సంస్ధను ప్రారంభించి జునూన్, కలియుగ్, 36 చౌరంగీలే, విజేత, ఉత్సవ్ లాంటి చిత్రాలను అందించారు. 54 మల్టీస్టారర్ చిత్రాల్లో నటించారు. ప్రాణ్‌తో కలిసి నటించిన 9 చిత్రాల్లో ‘బిదాదరీ’, ‘చక్కర్ పే చక్కర్’ మంచి విజయాన్ని సాధించాయి. అమితాబ్‌తో కలిసి 12 చిత్రాల్లో నటించారు. ‘దీవార్’లో వీరిద్దరి నటన ఒకరికొకరు దీటుగా ఉంటుంది. కభీ కభీ, షాన్, సిల్‌సిలా చిత్రాలు ప్రేక్షకుల ప్రశంసలందుకున్నాయి. 1979లో ‘న్యూ ఢిల్లీ టైమ్స్’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడు అవార్డు అందుకున్నారు. 2000లో ఫిల్మ్‌ఫేర్ జీవిత సాఫల్య పురస్కారం ఆయనకు అందింది. పృథ్వీరాజ్ సినీ వారసత్వానికి రాజ్‌కపూర్, షమీకపూర్ ఉన్నారు కానీ, తండ్రి నాటక రంగ వారసత్వానికి శశికపూరే ఆధారంగా నిలిచారు. ఇవాళ ఆర్.కె స్టూడియోలో ఒక వారగా పృథ్వీ థియేటర్ దర్పంగా నిలుచుని ఉందంటే అది అతడి కృషి. 1986లో వచ్చిన ‘న్యూ ఢిల్లీ టైమ్స్’ శశికపూర్ ఆఖరి మెరుపు అయింది. అప్పుడప్పుడు కొంత టీవీలో కొన్ని సినిమాల్లో కనిపించి 1998 తర్వాత పూర్తిగా ఇంటికే పరిమితమైపోయాడు.
బాలీవుడ్‌లో కపూర్‌ల కుటుంబంలో శశికపూర్‌ది ఒక సువర్ణ అధ్యాయం. తొలితరం బాలీవుడ్ నటుడు పృథ్వీరాజ్‌కపూర్ తనయుడిగా, రాజ్‌కపూర్, షమీకపూర్‌ల సోదరుడిగా శశికపూర్ అభినయం వెండితెరపై మెరుపులు కురిపించింది. దశాబ్దాల పాటు హిందీ సినిమా రంగంపై చెరగని ముద్ర వేసిన శశికపూర్ కనుమరుగైనా సినీ అభిమానుల గుండెల్లో ఆయన జ్ఞాపకాలు నిత్యనూతనమే. అంచెలంచెలుగా ఎదిగిన ఆయన ప్రస్థానం అడుగడుగునా స్ఫూర్తిదాయకమే.

-ఎం.డి అబ్దుల్