Others

సాహిత్యానికి పరమావధి సమానత్వం ( సుహృల్లేఖ -2)

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగీత - సాహిత్య సంచారిణి
*
మనం సాహిత్యోపాసకులం. మనం మిత్రులం- అంటే అందరం ఒకే సాంచాలోంచి వచ్చినవారం కానక్కరలేదు. అభిప్రాయాలలో వైవిధ్యం వుంటుంది. కాని, భూమిక ఒకటే. రంగు రంగుల రకరకాల కట్టడాలు లేవనడానికి అభ్యంతరం లేదు కదా! అభిరుచులు, ఆవేశాలు తద్వారా అనుభవాలు వేరువేరుగా ఉండవచ్చు. అసలు సృష్టిలోనే వైవిధ్యం ఉంది. ఏ ఒకరి పోలికలు మరొకరికి ఉండవు. ఏకగర్భ సంజాతులలో కూడా సమానవత్వమనేది లేదు. కావలసినది సమాన దృష్టి. ఇది సాహిత్యానికి పరమావధి. ఏ దేశ సాహిత్యమైనా ఆ దేశం లేదా ఆ జాతి సంప్రదాయాన్ని, సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. సంప్రదాయాన్ని వదలిపెట్టిన ఏ సాహిత్యమూ నిలవదు. సాహిత్యం శాశ్వత సత్య ప్రతిపాదితమై ఉంటుంది. ‘సత్యే ధర్మ ప్రతిష్ఠితః’ అన్నట్లు ధర్మబద్ధమై ఉంటుంది. సారస్వతం ప్రధానంగా 5 పాయలుగా ప్రవహిస్తోంది. కవిత్వం, సంగీతం, చిత్రలేఖనం, నాట్యం, శిల్పమని- ఇవే లలిత కళలు. ఈ ఐదింటి సమాహార రూపమే సాహిత్యం. ఏ పాయలోనైనా తక్కిన నాల్గింటి ఛాయలూ ఉంటాయి. అంతర్గర్భితంగానైనా ఉండాలి కూడా.
ఏ కళకైనా పరమార్థం ఒకటే- ‘ఆనందం’. కళాకారుడు తాను పొందిన ఆనందాన్ని సహృదయులకు అందియ్యాలి. ఇపుడు కవిత్వాన్ని తీసుకుందాం. కొందరు నిర్వచించినట్టుగా కవిత్వం వేరూ, కావ్యం వేరూ కాదు. స్థూలంగా లక్షణాలను బట్టి కొలిస్తే వేరనిపించవచ్చు. కానీ కాదు. కవిత్వం ఎందుకు? ఇది విశ్వశ్రేయోదాయకం. ఆనంద ప్రదాయకం. ఉపదేశ సంప్రదాయకం. అట్లా ఉండాలని ప్రాచ్య, పాశ్చాత్య లాక్షణికులందదరూ అంగీకరించారు. పై విషయాన్ని ఒకే వాక్యంలో చెప్తే విశ్వశ్రేయోదాయకమైన ఉపదేశం ఆనందప్రదం. ఉపదేశం అంటే మంచి మాట, సూక్తి, సుభాషితం- ఇట్లా చెప్పుకుంటూ పోవచ్చు. కానీ సూక్తులు కవిత్వం కాదు. కానీ కవిత్వీకరించవచ్చుననేది వేరు. కథాకావ్యంలో కానీండి, కేవల కవిత్వంలో కానీండి ఒక సుభాషితం ఉంటుంది. దానికి రంగులు పూయటానికి వీలుండదు, అది కూడదు. సందర్భాన్నిబట్టి ఆ సూక్తి యొక్క విలువ కనబడుతుంది.
సీతానే్వషణ తత్పరుడు హనుమంతుడు లంకలో ప్రవేశించాడు. సీత కనబడలేదు. అతడు వెదకని స్థలం ‘చతురంగుళమాత్రో పి’ లేదు. చింతించాడు. చితిలో ప్రవేశిస్తానంటాడు. నిరాశా పరాజితుడైనాడు హనుమంతుడు. అక్కడ కవి సుభాషితాలు చెప్తాడు. ‘అనిర్వేదః శ్రీయోమూలం’ - ఉత్సాహం సౌభాగ్యానికి మూలమని. అట్లాగే ‘జీవన్ భద్రాణి పశ్యతి’ అని (బ్రతికినవాడు శుభములు పొందుతాడు). హనుమంతుడు తదనంతర కార్యాన్ని నిర్వహించగలగటానికి ఈ సూక్తులే బలం. అట్లా కాకపోతే, హనుమంతుడు చితిని ప్రవేశిస్తే, లేదా ప్రాణత్యాగం చేసి ఉంటే రామాయణం అర్థరహితంగా, అసంపూర్ణంగా ముగిసి ఉండేది. చూశారా, కావ్యంలో సూక్తులకెంతటి ప్రాధాన్యం వున్నదో. అందుకే ఉపదేశం కూడా కావ్య ప్రయోజనాలలో ఒకటి. తక్కిన విషయాలు తరువాత.

- ముళ్ళపూడి సచ్చిదానందమూర్తి