ప్రకాశం

వెలుగొండపై ప్రత్యేక దృష్టి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, మే 27: రాష్ట్రంలోనే వెనకబడిన ప్రకాశం జిల్లా ప్రజల జీవనాడి వెలుగొండ ప్రాజెక్డును రాష్ట్రప్రభుత్వం త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ వైకాపా రాష్ట్ర ముఖ్యనాయకుడు, ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వచ్చేనెల రెండవవారంలో పాదయాత్ర నిర్వహించేందుకు సమాయత్తం అవుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈ పాదయాత్ర ఒంగోలు నుంచి వెలుగొండ ప్రాజెక్టు వరకు పూర్తిచేయాలా, లేక వెలుగొండ ప్రాజెక్టు నుంచి ఒంగోలు వరకు పాదయాత్ర నిర్వహించాలా అనే విషయమై రూట్‌మ్యాప్ ఖరారు చేసే పనిలో ఆయన అంతరంగికులు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రకాశం జిల్లా ప్రజల ఆశాజ్యోతి వెలుగొండ ప్రాజెక్టును నిర్మించాలని కోరుతూ గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి కూడా పాదయాత్రలో భాగంగా అక్కడికి వెళ్లారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేకదృష్టి సారించారు. ఈ ప్రాజెక్టుకు 5,150 కోట్లరూపాయలు వ్యయంతో అంచనాలను కూడా రూపొందించారు. ఇప్పటివరకు సుమారు 4200కోట్లరూపాయల వరకు ప్రాజెక్టు నిర్మాణానికి ఖర్చు చేసారు. కానీ మొదటి సొరంగం పనులు, రెండవ సొరంగం పనులు మాత్రం నత్తనడకన సాగుతుండటంతో ప్రాజెక్టు నిర్మాణం మూడు అడుగులు ముందుకు, ఆరు అడుగులు వెనక్కిలా మారాయి. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే ప్రకాశం, నెల్లూరు, కడప జిల్లాలోని 30 మండలాలకు చెందిన 447300 ఎకరాలకు సాగునీరు, 15.25లక్షలమంది ప్రజలకు మంచినీటి వసతి సౌకర్యం కలగనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తయితే కడప, నరసరావుపేట, నంద్యాల, ఒంగోలు, నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గాల్లోని మార్కాపురం, దర్శి, గిద్దలూరు, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, బద్వేలు అసెంబ్లీ నియోజక వర్గాల్లోని ప్రజలకు వరంగా చెప్పుకోవచ్చు.
ఇదిలా ఉండగా ఈనెల 29వ తేదీన లోక్‌సభ స్పీకర్ సుమిత్రామహాజన్ వైకాపాకు చెందిన ఐదుగురు ఎంపీలను హాజరుకావాలని లేఖలు పంపించింది. ఈనేపథ్యంలో ఈనెల 29వతేదీన వైకాపాకు చెందిన ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించే అవకాశాలున్నాయి. దీంతో భవిష్యత్తు రాజకీయాలపై ఎంపీ వైవీ సుబ్బారెడ్డి దృష్టిసారించిన నేపథ్యంలో వెలుగొండ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తిచేయాలని డిమాండ్ చేస్తూ పాదయాత్ర చేపట్టనున్నారు. ప్రధానంగా ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని పశ్చిమప్రాంత నియోజకవర్గాల్లో వైకాపాకు మంచిపట్టు ఉంది. దీంతో ఆయా నియోజకవర్గాల మీదుగా పాదయాత్ర చేపట్టి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా ఎంపీ సుబ్బారెడ్డి పావులు కదుపుతున్నట్లు పార్టీవర్గాల సమాచారం. గతంలోనూ పశ్చిమ ప్రాంతంపై ఆయన దృష్టిసారించి ఫ్లోరైడ్ సమస్యపై దృష్టిసారించారు. అదే విధంగా వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆయాప్రాంతాల్లో పర్యటించేలా ఎంపీ చర్యలు తీసుకున్నారు. అదే విధంగా కిడ్నీ వ్యాధిగ్రస్తులపై అధ్యయనం చేసేందుకు కేంద్రబృందాన్ని కూడా ఆయన తీసుకువచ్చి వారికి ఉపశమనం కలిగించారు.
కాగా వైకాపాకు చెందిన ఎంపీల రాజీనామాలను స్పీకర్ ఆమోదించిన పక్షంలో వెంటనే ఉపఎన్నికలు జరుగుతాయా, లేక వచ్చే ఏడాది జరిగే సాధారణ ఎన్నికల సందర్భంలోనే అన్ని నియోజకవర్గాలతోపాటు జరుగుతాయా అన్న చర్చ అన్ని వర్గాలనుంచి వినిపిస్తొంది. ఏదిఏమైనా ముందస్తు వ్యూహంలో భాగంగానే ఒంగోలు ఎంపీ వైవీ సుబ్బారెడ్డి వెలుగొండకు పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టేందుకు రూపకల్పన చేస్తున్నట్లు పార్టీవర్గాల సమాచారం. ఈపాటికే రాష్ట్రప్రభుత్వ వైఫల్యాలపై వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి రాష్టవ్య్రాప్తంగా పాదయాత్రలు నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో అబ్బాయి ఒకచోట, బాబాయి మరొక చోట జరిపే పాదయాత్రల గురించి ఆ పార్టీ నేతల్లో చర్చ కొనసాగుతోంది.