ప్రకాశం

అక్రమాలకు అడ్డా నల్లమల..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మార్కాపురం, జనవరి 19: నల్లమల అటవీప్రాంతం నాటుసారా తయారీదారులకు, కలప స్మగ్లర్లకు, మూగజీవాల వేటగాళ్లకు నిలయంగా మారింది. ఇటీవల పులిచర్మాలను పట్టుకోగా తాజాగా ఏకంగా చిరుతపులిని వేటాడి చర్మం వలిచి కళేబరాన్ని కాల్చివేసిన సంఘటన కలకలం రేపింది. ప్రకాశం, మహబూబ్‌నగర్, కర్నూలు, గుంటూరు జిల్లాల్లో విస్తరించి ఉన్న నల్లమల అటవీ ప్రాంతం అరాచకాలకు అడ్డాగా మారడంతో ఫారెస్టు అధికారులకు కంటిపై కునుకులేకుండా పోయింది. ప్రస్తుతం సంఘటన జరిగిన ప్రాంతానికి పెద్దదోర్నాల మండలంలోని పెద్దబొమ్మలాపురం వైపు నుంచి అలాగే శిఖరం సమీపంలో ఉన్న చిన్నారుట్ల నుంచి వెళ్లే అవకాశాలు ఉన్నాయి. మొన్నటివరకు మావోయిస్టుల భయంతో అటవీ ప్రాంతంలో అడుగుపెట్టేందుకు వెనుకాడిన వేటగాళ్లు, స్మగ్లర్లు, నాటుసారా తయారీదారులు నేడు మావోయిస్టుల ప్రాబల్యం లేకపోవడంతో యదేచ్ఛగా అటవీ ప్రాంతంలో సంచరిస్తూ లాభాపేక్ష వ్యవహారాలు సాగిస్తున్నారు. మహబూబ్‌నగర్ ప్రాంతానికి చెందిన కొందరు అటవీ ప్రాంతంలోని రహస్య స్థావరాలను ఎంచుకొని నాటుసారా తయారీకి పాల్పడుతుండగా మరికొందరు నవంబర్, డిసెంబర్ మాసాలు మొదలుకొని జనవరి చివరివారం వరకు గంజాయిపంటలు సాగుచేస్తూ లబ్ధి పొందుతున్నారని ఆరోపణలు ఉన్నాయి. ఇదిలాఉంటే కర్నూలు జిల్లా ఆత్మకూరు ప్రాంతానికి చెందిన వేటగాళ్లు కొందరు మూగజీవాలను వెంటాడుతూ ఖరీదైన పులిచర్మం, గోళ్లలను తీసుకెళ్తున్నారు. గత 8 నెలల కిందట పెద్దదోర్నాల పట్టణంలో పులిచర్మాలను నిల్వ ఉంచి అమ్మకాలు నిర్వహించే సమయంలో అధికారులకు చిక్కిన దుండగులు చేసిన నేరాన్ని ఒప్పుకొని జైలులో ఊచలు లెక్కపెడుతుండగా దొరకని దొంగలు కొందరు దొరల్లా తమ పని తాము చేసుకొని వెళ్లిపోతున్నారు. పట్టణానికి కూతవేటు దూరంలోనే ఉన్న ఓ కుగ్రామానికి సమీపంలో ఏకంగా చిరుతపులిని చంపి చర్మం వలిచి కళేబరాన్ని గుర్తించకుండా దహనం చేశారంటే వేటగాళ్ల చేతివాటం ఏపాటిదో చెప్పకనే అర్థం అవుతుంది. మొత్తానికి నల్లమల అటవీ ప్రాంతంలో అరాచకాలు సృష్టిస్తున్నవారు కలపను తరలించుకునేందుకు వచ్చిన స్మగ్లర్లా..? లేక నాటుసారా తయారీదారులా..? వేటగాళ్లా..? అనేది అటవీశాఖ అధికారులు తేల్చాల్సి ఉంది. తాజాగా జరిగిన సంఘటన విషయంలో పత్రికల ముందుకు వచ్చిన అధికారులు త్వరలోనే దుండగులను పట్టుకుంటామని ప్రకటన చేయడం ఎంతవరకు ఫలితాలు చూపుతుందో వేచిచూడాల్సి ఉంది.

చిరుత పులిని చంపిన గుర్తుతెలియని వ్యక్తులు
పెద్దదోర్నాల, జనవరి 19: చిరుతపులిని గుర్తుతెలియని వ్యక్తులు చంపి చర్మాన్ని తీసుకొని కళేబరాన్ని కాల్చివేసిన సంఘటన గత ఐదురోజుల కిందట పెద్దదోర్నాల మండలంలోని పెద్దబొమ్మలాపురం గ్రామ పరిధిలోని దేవలూటి అటవీ ప్రాంతంలో జరిగింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ సంఘటనపై సమాచారం అందుకున్న ఫారెస్టురేంజ్ అధికారులు సంఘటన ప్రాంతానికి మంగళవారం వెళ్లి కొన్ని ఆనవాళ్లు సేకరించినట్లు తెలిసింది. కళేబరాన్ని కాల్చివేసిన బూడిదను సేకరించినట్లు తెలిసింది. అయితే అధికారులు ఈ విషయాన్ని బయటకు పొక్కకుండా గోప్యంగా ఉంచారు. ఈ విషయమై ఎసిఎఫ్ హిమశైలజను విలేఖరులు వివరణ కోరగా చిరుతపులిని చంపి కాల్చివేసింది వాస్తవమేనని, సమగ్రమైన విచారణ చేపట్టి నిందితులను పట్టుకొని కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.
నిధులన్నా పనులు చేయరా!
కార్పొరేషన్ అధికారులపై దామచర్ల ఆగ్రహం
ఒంగోలు, జనవరి 19: కార్పొరేషన్‌లో తగిన నిధులు ఉన్నప్పటికీ అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన పనులు చురుగ్గా సాగకపోవటంపై కార్పొరేషన్ అధికారులపై ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ మండిపడ్డారు. ఒంగోలు కార్పోరేషన్ కార్యాలయాన్ని మంగళవారం నాడు శాసనసభ్యుడు దామచర్ల ఆకస్మికంగా సందర్శించారు. ఈసందర్భంగా కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో ఏర్పాటుచేసిన సమావేశంలో దామచర్ల మాట్లాడుతూ నగరంలో అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి కోట్లరూపాయలు నిధులు ఉన్నాయని ఈ నిధులతో రోడ్లు, డ్రైన్లు ఏర్పాటుచేయటంతోపాటు పారిశుద్ధ్య పనులు ఇతర అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని తాను గతంలో అధికారులకు పదేపదే సూచించటం జరిగిందన్నారు. అయితే నగరంలోని పలురోడ్లు, డ్రైన్ల వ్యవస్థకు సంబంధించిన నిర్మాణపనులు ఎక్కడ వేసిన గొంగళి అన్నచందంగా ఉందని, పారిశుద్ధ్యం పరిస్థితి దారుణంగా ఉందని ఆయన ఆవేదన వ్యక్తంచేశారు. కేవలం మొక్కలు నాటితే సరిపోదని నగర అభివృద్ధికి సంబంధించిన అన్ని పనులను వేగవంతంగా చేయాల్సిన అవసరం ఉందని అధికారులను ఆదేశించారు. పనులు చేయకపోతే ఇంటి దగ్గర ఉండండి, ప్రత్యామ్నాయం తాము చూసుకుంటామని కూడా ఆయన సిబ్బందిని హెచ్చరించారు. శాసనసభ్యుడు దామచర్ల కార్పొరేషన్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులపై ఆగ్రహాన్ని వ్యక్తం చేయటంతో కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణతోపాటు కార్పొరేషన్ కార్యాలయానికి సంబంధించిన ఇంజనీరింగ్ సిబ్బందితోపాటు వివిధ విభాగల సిబ్బంది కూడా ఖంగుతిన్నారు.

దేవాదాయశాఖలో అక్రమాలకు పాల్పడిన
ఉద్యోగులపై క్రిమినల్ కేసులు
- జిల్లా కలెక్టర్ సుజాతశర్మ
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 19 : దేవాదాయ శాఖలో అక్రమాలకు పాల్పడిన ఉద్యోగులపై క్రిమినల్ కేసులు బనాయించాలని కలెక్టర్ సుజాతశర్మ సహాయ కమిషనర్‌ను ఆదేశించారు. పర్చూరు మండలం చెరుకూరు త్రివిక్రమ, అగస్తేశ్వర స్వామి ఆలయాలు, ఉప్పుటూరు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయానికి సంబంధించి దేవాదాయ శాఖ కిందిస్థాయి ఉద్యోగులు ఉన్నతాధికారుల అనుమతి లేకుండా బ్యాంకుల నుండి నిధులు డ్రా చేసి అక్రమాలకు పాల్పడిన విషయమై ఆరోపణలు రావడంతో జిల్లా కలెక్టర్ పై విధంగా ఆదేశాలు దేవాదాయశాఖ సహాయ కమిషనరు శ్రీనివాసరెడ్డికి జారీ చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులైన ఉద్యోగులు, బ్యాంకు మేనేజర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని సూచించారు.

పొగాకులో మల్లెతెగులు నివారణకు
శాస్తవ్రేత్తలను పంపండి
కేంద్రమంత్రులకు లేఖ రాసిన ఎంపి సుబ్బారెడ్డి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 19:ప్రకాశం జిల్లాలోని పొగాకు రైతులు మల్లెతెగులతో తీవ్రంగా నష్టపోతున్నారని, తెగులు నివారణకు చర్యలు తీసుకునేవిధంగా రాజమండ్రిలోని కేంద్రపొగాకు పరిశోధన కేంద్రం నుండి శాస్తవ్రేత్తలను పంపించాలని కేంద్ర వాణిజ్యశాఖమంత్రి నిర్మలాసీతారామన్, కేంద్రవ్యవసాయశాఖమంత్రి రాధామోహన్‌సింగ్‌కు మంగళవారం ఎంపి వైవి సుబ్బారెడ్డి లేఖ రాశారు. దేశంలోనే పొగాకుపంట అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతులు పండిస్తారని ఆ లేఖలో పేర్కొన్నారు. రాష్ట్రంలోనే ఒక్క ప్రకాశం జిల్లాలోనే అత్యధికంగా 38వేల 341హెక్టార్లల్లో పొగాకుపంటను రైతులు సాగుచేస్తారన్నారు. ఇటీవల తాను నాగులుప్పలపాడు మండలంలో మల్లెతెగులుతో దెబ్బతిన్న పొగాకుపంటను పరిశీలించినట్లు వివరించారు. ఈ తెగులు వలన పొగాకు పంట 30శాతం నుండి 70శాతం వరకు నష్టపోయే ప్రమాదం ఉందన్నారు. ఒక్కోక్క ఎకరాకు 80వేల రూపాయల వరకు ఖర్చులు ఉన్నాయని దీంతో రైతులు తీవ్రంగా ఈ తెగులుతో నష్టపోతున్నారన్నారు. గత సంవత్సరంలో పొగాకురైతులకు గిట్టుబాటు ధరలు రాక తీవ్ర ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్ధితులు ఈసంవత్సరం రాకుండా ఉండేందుకు కేంద్రప్రభుత్వం శాస్తవ్రేత్తల బృందాన్ని జిల్లాకు పంపించాలని ఆయన కోరారు. శాస్తవ్రేత్తలు మల్లెతెగులు నివారణకు సాంకేతికపరమైన సూచనలు, సలహాలు అందచేస్తే ఆ తెగులు నివారణ అయ్యే అవకాశం ఉందని ఆలేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం ఆ తెగులుతో పొగాకు పంట ఎదుగుదల లేకరైతులు ఇబ్బందులు పడుతున్నారని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఆలేఖలో పేర్కొన్నారు.
యువతిపై కత్తితో దాడి
సంతనూతలపాడు, జనవరి 19: తన ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై కత్తితో దాడి చేసిన సంఘటన మంగళవారం జరిగింది. సంతనూతలపాడుకు చెందిన యువతి ఒంగోలు బాపూజీ కాంప్లెక్స్‌లోని ఒక షాపులో పని చేస్తోంది. చీమకుర్తి గ్రానైట్ ఫ్యాక్టరీలో మార్కర్‌గా పనిచేస్తున్న కిరణ్‌కుమార్ అనే యువకుడు ఆ యువతి పనిచేసే షాపుకు వెళ్లి ఆమెతో పరిచయం పెంచుకొని తద్వారా ఆమె ఫోన్ నెంబరు సేకరించి ఆమెకు మాయమాటలు చేప్పి లోబర్చుకొనే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే కిరణ్‌కుమార్‌కు పెండ్లి అయినట్లు తెలుసుకున్న ఆ యువతి దీనితో కొద్ది రోజులుగా కిరణ్‌కుమార్‌ను దూరంగా పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో కిరణ్‌కుమార్ సంతనూతలపాడులోని ఆమె స్వగృహానికి వెళ్లి ఎవరూ లేని సమయంలో ఆమెతో ఘర్షణకు దిగాడు. దీంతో ఇద్దరి మధ్య ఘర్షణ పెరగటంతో కిరణ్‌కుమార్ ఆ యువతిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో ఆమె మెడ, మోచేయి, మణికట్టుపై తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన గమనించిన స్థానికులు ఆమెను చికిత్స నిమిత్తం రిమ్క్‌కు తరలించారు. ఆసుపత్రి నుండి వచ్చిన సమాచారంతో సంతనూతలపాడు ఎఎస్‌ఐ డివి డేవిడ్ నిందితుడిని అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సర్పంచ్‌ల అధికారాలను ఉపయోగించుకోనివ్వండి
సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు,
ఎంఎల్‌సి యలమంచిలి డిమాండ్
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 19:సర్పంచ్‌లకు నిధులు, విధులు అధికారాలిచ్చి బలోపేతం చేయాలని ఎపి సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు యలమంచిలి బాబురాజేంద్రప్రసాదు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక సెంట్రల్‌పార్కు సమావేశ మందిరంలో రాష్ట్ర సర్పంచ్‌ల సంఘం సమావేశం ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకట్రావు అధ్యక్షతన జరిగింది. ఈసమావేశానికి ముఖ్యఅతిథిగా విచ్చేసిన యలమంచిలి మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ చట్టంలోని అధికారవికేంద్రకరణ, స్థానిక స్వపరిపాలన, స్వయం పోషకత్వాలను కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు చిత్తశుద్ధితో అమలుచేసి స్థానిక సంస్థలను స్థానిక ప్రభుత్వాలుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు. గ్రామపంచాయితీలను గ్రామప్రభుత్వాలుగా ప్రకటించాలని ఆయన రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243జి, 11వ షెడ్యూలులో పేర్కొన్న 29 అంశాలను, ఆ 29 అంశాలకు చెందిన ఆయా ప్రభుత్వ శాఖల సిబ్బందిని, నిధులు, విధులు, అధికారాలను తక్షణమే గ్రామపంచాయితీలకు, మండల పరిషత్‌లకు, జిల్లాపరిషత్‌లకు బదిలీచేయాలని కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలను డిమాండ్ చేశారు. తక్షణమే గ్రామపంచాయితీల్లో గ్రామసచివాలయాలను ప్రారంభించి గ్రామస్థాయిలోని అన్ని ప్రభుత్వశాఖల సిబ్బందిని, వారి విధులను, బాధ్యతలను, ఆయాగ్రామసచివాలయాల పరిధిలోకి తీసుకువచ్చి ఆయా గ్రామాల సర్పంచ్‌లు, ఎంపిటిసిల నాయకత్వంలో పనిచేయించాలన్నారు. అప్పుడే పరిపాలనలో పారదర్శకత, జవాబుదారితనం వస్తాయన్నారు. అంతేకాకుండా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు గ్రామస్ధాయిలో అమలుచేసే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమపధకాలు నూటికినూరుశాతం అమలై విజయవంతం అవుతాయన్నారు. తద్వారా గ్రామీణప్రజలకు నాణ్యమైన సేవలు అంది నిజమైన సుపరిపాలన అమలౌతుందన్నారు. బహుముఖ ప్రయోజనాలు ఉన్నా గ్రామీణప్రజలకు ఉపయోగపడే ఈ గ్రామసచివాలయ వ్యవస్ధను తక్షణమే గ్రామపంచాయితీల్లో ప్రవేశపెట్టాలని రాష్ట్రప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సర్పంచ్‌లకు, ఎంపిటిసిలకు అడిగిన వెంటనే మూడువేలరూపాయల జీతాలు పెంచారని, జడ్‌పిటిసిలకు, ఎంపిపిలకు ఆరువేల రూపాయల చొప్పున గౌరవవేతనాన్ని పెంచినందుకు, ఉపాధిహామీపధకంలో వేసే సిమెంటురోడ్లపైన సంపూర్ణంగా అధికారాన్ని సర్పంచ్‌లకే ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, రాష్ట్ర మంత్రి అయ్యన్నపాత్రుడులకు కృతజ్ఞతలు తెలిపారు. సమావేశానికి అధ్యక్షత వహించిన సర్పంచ్‌ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పమిడి వెంకట్రావు మాట్లాడుతూ గత పదిసంవత్సరాలుగా గత ప్రభుత్వాలు, పాలకవర్గాలు చెల్లించకుండా వదిలేసిన విద్యుత్ పాత బకాయిలను సుమారు 846కోట్లరూపాయలను సర్పంచ్‌లను కట్టాలని మాట్లాడటం అన్యాయమన్నారు. ఆదాయం లేనిగ్రామపంచాయితీల్లో మొత్తం నిధులువిద్యుత్ బకాయిలకే సరిపోయి గ్రామాల్లో సర్పంచ్‌లు అభివృద్ధి పనులు చేయలేకపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.విద్యుత్ బిల్లులు చెల్లించాలంటూ సర్పంచ్‌లను ఎపిట్రాన్స్‌కో అధికారులు వేధిస్తున్నారని, విద్యుత్‌ను నిలిపివేస్తున్నారని ఇప్పటికైనా ముఖ్యమంత్రి తక్షణమే స్పందించి ఈసమస్యను పరిష్కరించి సర్పంచ్‌లనురక్షించాలని కోరారు. ఎంపిటిసిల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కె మురళీ మాట్లాడుతూ ఎంపిటిసిలకు, జడ్‌పిటిసిలకు పంచాయితీరాజ్ చరిత్రలోనే ప్రథమంగా ఆగస్టు 15న జాతీయజెండాను ఎగురవేసి అధికారాన్ని ఎపి పంచాయితీరాజ్ ఛాంబర్, ఎపి ఎంపిటిసి సంఘాల నాయకులు కృషిచేసి సాధించారన్నారు. ఈ గౌరవాన్ని, గుర్తింపు ఇచ్చిన ముఖ్యమంత్రికి, విద్యాశాఖమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఎపి పంచాయితీరాజ్ చాంబర్ రాష్ట్రప్రధానకార్యదర్శి బి ప్రతాప్‌రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎస్ సుబ్బరామయ్య, వినోద్‌రాజులు మాట్లాడుతూ పంచాయితీరాజ్ ప్రభుత్వాలకు చట్టబద్దంగా, న్యాయబద్దంగా, రాజ్యాంగబద్ధంగా ఇవ్వాల్సిన అమలుచేసిబలోపేతం చేయాలన్నారు. ఈ సమావేశంలో శ్రీకాకుళం సర్పంచ్‌ల సంఘం జిల్లా అధ్యక్షుడు జె చంద్రవౌళి, విశాఖ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు రవివర్మ, కృష్ణాజిల్లా ప్రధానకార్యదర్శి ఎ రవి, గుంటూరు జిల్లా అధ్యక్షుడు శ్రీనివాస్,చిత్తూరు జిల్లాఅధ్యక్షుడు జెవై శేఖర్‌నాయుడు,కర్నూలు జిల్లాఅధ్యక్షుడు ఎస్ శ్రీ్ధర్‌రెడ్డి, కడప జిల్లాఅధ్యక్షురాలు కుసుమకుమారి, అనంతపురం జిల్లా అధ్యక్షుడు హనుమంతరెడ్డి, విజయనగరం జిల్లా అధ్యక్షుడు సత్యనారాయణ, చిత్తూరు జిల్లా ఎంపిటిసిల సంఘం అధ్యక్షుడు చింతా కిరణ్‌యాదవ్, కర్నూలు జిల్లా అధ్యక్షుడు డి వాసు, పశ్చిమగోదావరిజిల్లా అధ్యక్షుడు బి బీమరాజు, కర్నూలు జిల్లా అధ్యక్షుడు మీనాక్షినాయుడు, శ్రీకాకుళం జిల్లాఅద్యక్షుడు చంద్రమోహన్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సర్పంచ్‌ల సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు యలమంచిలి బాబురాజేంద్రప్రసాద్‌ను రాష్టక్రమిటీ సభ్యులు భారీగజమాలతో ఘనంగా సత్కరించి మెమోంటోను అందచేశారు.

నేర నియంత్రణకు ప్రత్యేక చర్యలు
కారంచేడు, జనవరి 19: జిల్లాలో నేరాలను నియంత్రించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నామని జిల్లా ఎస్‌పి చిరువోలు శ్రీకాంత్ అన్నారు. స్థానిక పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషనుకు సంబంధించి అన్ని రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరును పరిశీలించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో నేరస్థులు నూతన పద్దతులను అవలంబిస్తున్నారని వాటిని ఎదుర్కోవడానికి నూతన టెక్నాలజీని వినియోగిస్తూ సిబ్బందికి అవగాహన కల్పిస్తున్నామన్నారు. ప్రతి ద్విచక్ర వాహనదారులు హెల్మెట్‌ను తప్పక ఉపయోగించాలని సూచించారు. జిల్లాలో గత సంవత్సరం 226 ప్రమాదాలు జరిగితే హెల్మెట్లు లేని కారణంగా 212 మంది హెల్మెట్లు కారణంగా చనిపోయారని తెలిపారు. జిల్లాలో సుమారు 6000 కేసులు నమోదు చేస్తే 1100 కేసులు ప్రమాదాలకు సంబంధించినవని తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషను ఆవరణలో మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో డి ఎస్‌పి జయరామరాజు, చీరాల రూరల్ సి ఐ పాపారావు, ఎస్సై రాజేష్ సిబ్బంది పాల్గొన్నారు.
ఇంకొల్లులో : ఇంకొల్లు పోలీస్ స్టేషన్‌ను ఎస్‌పి శ్రీకాంత్ ఆకస్మిక తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేయడంతో సిబ్బంది పనితీరు వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఇంకొల్లు సర్కిల్ ఇన్‌స్పెక్టర్ కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్కిల్ పరిధిలోని ఆరు పోలీస్ స్టేషన్ల ఎస్సైలతో పాటు ఇంకొల్లు సి ఐ శ్రీనివాసరావు, ఎస్సై రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.
వేటపాలెంలో : జిల్లా ఎస్‌పి చిరువోలు శ్రీకాంత్ వేటపాలెం పోలీస్‌స్టేషన్‌ను మంగళవారం తనిఖీ చేశారు. రికార్డులు, పోలీస్‌స్టేషన్ నిర్వహణ పట్ల సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విలేఖరులతో మాట్లాడుతూ చల్లారెడ్డిపాలెంలో గత ఏడాది జరిగిన సిసిఐ గోదాముల అగ్ని ప్రమాదం కేసు విచారణ పురోగతిలో ఉందన్నారు. బచ్చులవారిపాలెంలో బాంబు పేలుడు ఘటనపై స్పందిస్తూ పేలుడు పదార్ధాల నమూనాలను ల్యాబ్‌కు పంపించామని, గ్రామస్థులను విచారిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట డిఎస్‌పి సిహెచ్ జయరామరాజు, చీరాల రూరల్, ఇంకొల్లు సిఐలు పాపారావు, కె శ్రీనివాసరావు, వేటపాలెం, ఈపూరుపాలెం ఎస్సైలు ఎ చంద్రశేఖర్, రాంబాబు ఉన్నారు.

ఎన్‌టిఆర్ కళాపరిషత్‌లో అలరించిన ప్రదర్శనలు
ఒంగోలు,జనవరి 19: ఎన్‌టిఆర్ కళాపరిషత్ రాష్ట్ర వార్షికోత్సవ కార్యక్రమాల్లో మంగళవారం ప్రదర్శించిన నాటికలు, కోలాటాం, నాదస్వరంలాంటి కార్యక్రమాలు ప్రేక్షకులను ఆకర్షించాయి. ఎన్‌టిఆర్ కళాపరిషత్ నాటకోత్సవాల్లో రంగయాత్ర గుంటూరువారిచే అనంతం అనే నాటికతోపాటు, అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి ఆధ్వర్యంలోరెండు నిశిబ్ధాల మధ్య అనే నాటికను ప్రదర్శించారు. అదేవిధంగా శ్రీలక్ష్మి తిరుపతమ్మ పాకల బృందంచే నాదస్వరం కార్యక్రమం నిర్వహించారు. అదేవిధంగా శ్రీ ప్రసన్నాంజనేయస్వామి కోలాట భజన సమాజం ఎస్‌ఎల్‌గుడిపాడు వారి ఆధ్వర్యంలో కోలాటాన్ని ప్రదర్శించారు. ఈప్రదర్శనలు అక్కడి ప్రేక్షకులను ఎంతగానో ఆకర్షించారు. ఈకార్యక్రమంలో జిల్లాపరిషత్ చైర్మన్ ఈదర హరిబాబు, ఆంధ్రప్రదేశ్ ప్రజానాట్యమండలి రాష్ట్ర గౌరవాధ్యక్షుడు నల్లూరి వెంకటేశ్వర్లు నిర్వహణలో జరిగాయి.