ప్రకాశం

ముఖ్యమంత్రి బహిరంగ సభకు సర్వం సిద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూన్ 21: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు బుధవారం జిల్లాపర్యటనకు వస్తున్న సందర్భంగా జిల్లా యంత్రాంగం ఆయన పర్యటనను పూర్తిస్థాయిలో విజయవంతం చేసే పనిలో నిమగ్నమైంది. జిల్లా యంత్రాంగంతోపాటు రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు,ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ సైతం ఏర్పాట్లల్లో మునిగారు. ఒంగోలులో జరిగే భారీబహిరంగ సందర్భంగా మినీస్టేడియంలో సభాప్రాంగణాన్ని ఏ ర్పాటు చేశారు. జిల్లాపోలీసు యంత్రాంగం ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా ఒంగోలులో ట్రయల్న్‌న్రు నిర్వహించారు. ఒంగోలులోని
పలుప్రాంతాలను తెలుగుతమ్ముళ్లు పసుపుమయం చేశారు. కొంతమంది ముఖ్యనాయకులు ముఖ్యమంత్రికి స్వాగతం పలుకుతూ భారీగా ఫ్లెక్సీలను ఏర్పాటుచేశారు. ఈ బహిరంగసభకు భారీఎత్తున డ్వాక్రా మహిళలను తరలించేపనిలో డిఆర్‌డిఎ అధికారులు తలమునకలై ఉన్నారు.
సిఎం పర్యటన సాగేదీలా ...
ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు జిల్లాకేంద్రమైన ఒంగోలులో బుధవారం పర్యటించనున్నారు. దీంతో జిల్లా యంత్రాంగం ఆయన పర్యటనను విజయవంతం చేసే పనిలోనిమగ్నమైంది. బుధవారం మధ్యాహ్నం 1.30గంటలకు ముఖ్యమంత్రి విజయవాడలోని ఇందిరాగాంధీ స్టేడియం నుండి హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 2.15గంటలకు ఒంగోలులోని ఎబిఎం జూనియర్ కాలేజిలో ఏర్పాటుచేసిన హెలీపాడ్ వద్దకు చేరుకుంటారు. అనంతరం 2.20గంటలకు హెలీపాడ్ నుండి రోడ్డుమార్గాన బయలుదేరి 2.25గంటలకు జూవియట్ మెమోరియల్ చర్చి వద్దకు చేరుకుంటారు. 2.30గంటల నుండి 2.55గంటల వరకు 150 సంవత్సరాల చరిత్ర కలిగిన చర్చిలో జరిగే ప్రార్థనలో పాల్గొంటారు.
చర్చి ఫాస్టర్ల ఆశ్వీరచనలు తీసుకున్న తరువాత 2.30గంటల నుండి 2.55గంటల వరకు 40కోట్లరూపాయలతో ఒంగోలు మునిసిపాలిటీకి మంజూరైన మంచినీటి పథకానికి సంబంధించిన పైలాన్‌ను ముఖ్యమంత్రి ఆవిష్కరించనున్నారు. మధ్యాహ్నం మూడుగంటలకు మినిస్టేడియం వద్దకు ముఖ్యమంత్రి చేరుకోనున్నారు. మూడుగంటలనుండి ఐదుగంటల వరకు మినిస్టేడియంలో ఏర్పాటుచేసిన స్టాల్స్‌ను పరిశీంచిన అనంతరం బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించనున్నారు. ఈ బహిరంగసభలో రెండవ విడత రైతు రుణమాఫీ పత్రాలను రైతులకు ముఖ్యమంత్రి అందచేయనున్నారు.
జిల్లాలో రెండోవిడత రుణమాఫీ
343.54 కోట్లు
రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన రైతురుణమాఫీ పథకంలో భాగంగా రెండోవిడత జిల్లాలోని ఒక లక్షా 54వేల 378మంది రైతులు 343.54కోట్లరూపాయల మేర లబ్ధిపొందనున్నారు. ఆ మేరకు రాష్టమ్రుఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాకేంద్రమైన ఒంగోలులో బుధవారం జరిగే భారీ సభలో లబ్ధిదారులకు రుణమాఫీ పత్రాలను అందచేయనున్నారు. ఒంగోలు నియోజకవర్గ పరిధిలో 4,804మంది లబ్ధిదారులకు 11.16కోట్లరూపాయలు, సంతనూతలపాడునియోజకవర్గ పరిధిలో 13,604మంది లబ్ధిదారులకు 32.48కోట్లరూపాయలు, చీరాల నియోజకవర్గ పరిధిలో 2809మంది లబ్ధిదారులకు 5.94కోట్లరూపాయలు మాఫీ కానున్నాయి. అదేవిధంగా పర్చూరు నియోజకవర్గ పరిధిలో 19, 367మంది రైతులకు 44. 38కోట్లరూపాయలు, అద్దంకి నియోజకవర్గ పరిధిలో 18,547మంది రైతులకు 41.40కోట్లరూపాయలు, దర్శి నియోజకవర్గ పరిధిలో 14, 596మందిరైతులకు 31.84కోట్లరూపాయలు, యర్రగొండపాలెం నియోజకవర్గ పరిధిలో 14వేల 179మంది రైతులకు 28. 16కోట్లరూపాయలు, మార్కాపురం నియోజకవర్గ పరిధిలో 11,281మంది రైతులకు 24. 66కోట్లరూపాయలు, గిద్దలూరు నియోజకవర్గ పరిధిలో 13వేల 131మంది రైతులకు 26.22కోట్లరూపాయలు, కనిగిరి నియోజకవర్గ పరిధిలో 12వేల 399మంది రైతులకు 26. 37కోట్లరూపాయలు, కందుకూరు నియోజకవర్గ పరిధిలో 12వేల 519మంది రైతులకు 28.73కోట్లరూపాయలు యలు మాఫీ కానుంది.

నువ్వా..నేనా.!
జిల్లాలో తెలుగుతమ్ముళ్ల మధ్య రచ్చ..రచ్చ
అద్దంకి, గిద్దలూరు, కందుకూరులో శాసనసభ్యులు, ఇన్‌చార్జుల మధ్య కుమ్ములాటలు
జిల్లాలో వికటిస్తున్న చంద్రన్న ఆపరేషన్ ఆకర్ష్
టిడిపి నేతల మధ్య ముఖ్యమంత్రి సయోధ్య కుదిర్చేనా ?
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జూన్ 21: జిల్లాలోని తెలుగుతమ్ముళ్ల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి నెలకొంది. నువ్వెంత అంటే నువ్వెంత అంటూ తెలుగుతమ్ముళ్లు సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటున్నారు. క్రమశిక్షణకు మారుపేరుగా నిలిచిన తెలుగుదేశంపార్టీలోని తెలుగుతమ్ముళ్ల మధ్య ప్రతిరోజు యుద్ధమే జరుగుతుందనే చెప్పవచ్చు. చంద్రబాబు చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ జిల్లాలో వికటించే పరిస్థితులు నెలకొన్నాయనే చెప్పవచ్చు.
ప్రధానంగా జిల్లాలోని అద్దంకి, కందుకూరు, చీరాల, యర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాల్లోని తెలుగుతమ్ముళ్ల మధ్య ఇటీవల వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ నుండి తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్న శాసనసభ్యుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్ధితి నెలకొంది. అందరూ సర్ధుకుపోయి నియోజకవర్గాలను అభివృద్ధి చేయాలని ఒక పక్క చంద్రబాబు సూచిస్తున్నప్పటికీ ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా ఉండటంతో అధిష్టానానికి ప్రతిరోజు తలనొప్పిగానే మారిందనే చెప్పవచ్చు. నియోజకవర్గాల్లో శాసనసభ్యులా లేక ఇన్‌చార్జుల పెత్తనం మంటూ బాహాటంగానే తెలుగుతమ్ముళ్లు యుద్ధాలే చేస్తున్నారు. అధికారుల బదిలీలు, అభివృద్ధి పనుల వ్యవహారంలో వైకాపా నుండి తెలుగుదేశంపార్టీ గూటికి చేరిన శాసనసభ్యులకు, గతంలో నియోజకవర్గ ఇన్‌చార్జులు మధ్య వార్ జరుగుతుంది. నియోజకవర్గంలో తమకే అధికారాలు ఉన్నాయంటూ తాము చెప్పిన పనులే చేయాలని తెలుగుదేశంపార్టీ తీర్థం పుచ్చుకున్న శాసనసభ్యులు అధికారులకు హుకుం జారీచేస్తున్నారు. కాదు తామే నియోజకవర్గాలకు ఇన్‌చార్జులమని శాసనసభ్యుల మాటలు వినవద్దంటూ పాత నేతలు అధికారులపై పెత్తనం సాగిస్తున్నారు. ఏంకి పెళ్లి సుబ్బిచావుకు వచ్చిందన్న చందంగా వీరిద్దరి మధ్య అధికారులు నలిగిపోతున్నారు. ప్రధానంగా అద్దంకి నియోజకవర్గంలో శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్‌కు, ఇన్‌చార్జి కరణం బలరామకృష్ణమూర్తి మధ్య ప్రతిరోజూ గొడవ జరుగుతూనే వుంది. అద్దంకి నియోజకవర్గంలో ఒక పోలీసు అధికారి బదిలీ విషయంలోను ఆ ఇద్దరినేతల వ్యవహరం తారాస్థాయికి చేరింది. చివరకు బలరాం మాటే నెగ్గిందనే చెప్పవచ్చు. మొత్తంమీద ప్రతిరోజు అద్దంకి నియోజకవర్గంలో ఏం జరుగుతుందోనన్న ఉత్కంఠ పరిస్థితిలో ఇటు పార్టీనాయకులు,కార్యకర్తలతోపాటు అటు అధికారగణం ఉన్నారు. దీంతో అద్దంకి నియోజకవర్గం రావణాకాష్టంలా మారనుంది. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలోను శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, నియోజకవర్గ ఇన్‌చార్జి అన్నా రాంబాబు మధ్య వార్ కొనసాగుతుంది. కందుకూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు పోతుల రామారావు, ఇన్‌చార్జి దివి శివరాం మధ్య కూడా వార్ కొనసాగుతూనే ఉంది. ఇక చీరాల నియోజకవర్గంలో మాత్రం శాసనసభ్యుడు ఆమంచి కృష్ణమోహన్, నియోజకవర్గ నాయకురాలు పోతుల సునీత వర్గీయులు మధ్య కూడా ప్రత్యక్షపోరు జరుగుతుందనే చెప్పవచ్చు. యర్రగొండపాలెం నియోజకవర్గంలో మాత్రం అసమ్మతి నివురుగప్పిన నిప్పులా ఉందనే చెప్పవచ్చు. మొత్తంమీద జిల్లాలో పార్టీని బలోపేతం చేయాలనే తలంపుతో వైకాపాకు చెందిన శాసనసభ్యులను తమపార్టీవైపు మళ్లించుకోవటంలో సఫలీకృతులైన చంద్రబాబు వారిని సమన్వయం చేయటంలో మాత్రం పూర్తిస్థాయిలో దృష్టిసారించటం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
ఇదిఇలా ఉండగా జిల్లాలో పార్టీని బలోపేతం చేసేందుకు రాష్టమ్రంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ ప్రత్యేకంగా కృషిచేస్తునే ఉన్నారు. ఎప్పటికప్పుడు జిల్లా సమావేశాలను దామచర్ల నిర్వహిస్తూ పార్టీలోని నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకువెళ్తున్నారనే చెప్పవచ్చు. అదేవిధంగా జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులురెడ్డి సైతం వారంలో ఒకటి లేదా రెండురోజులు జిల్లాలో పర్యటిస్తూ నేతలతో చర్చిస్తూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తున్నారు. ప్రధానంగా తన సామాజిక వర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలను తెలుగుదేశంపార్టీవైపు ఆకర్షితులు అయ్యే విధంగా పావులు కదుపుతూ ముందుకువెళ్తున్నారనే చెప్పవచ్చు.
నామినేటెడ్ పదవుల కోసం నేతల ఎదురుచూపులు
కాగా జిల్లాలోని తెలుగుతమ్ముళ్లు నామినేటెడ్ పదవుల కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. పార్టీ ఆవిర్భవించిన దగ్గరనుండి పార్టీ జెండాలను మోసాం, కాని పార్టీల మారిన నేతలకు మాత్రం రాష్ట్ర, జిల్లాస్థాయిలో ప్రభుత్వ లబ్ధిచేకూర్చే పదవులను కట్టబెడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నారు. ఇప్పటికైనా పార్టీ జెండామోసిన నాయకులు,కార్యకర్తలను గుర్తించి నామినేటెడ్ పదవులను కట్టబెట్టాలని తెలుగుతమ్ముళ్లు ముక్తకంఠంతో ముఖ్యమంత్రిని కోరుతున్నారు.
ఇదిఇలాఉండగా ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా జిల్లాపై వరాల జల్లు కురిపించే అవకాశాలున్నట్లు పార్టీవర్గాల ద్వారా సమాచారం. రామాయపట్నం పోర్టుతోపాటు వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం, నిమ్జ్, ఒంగోలులో ట్రిపుల్ ఐటి, కోస్తాకారిడార్ వంటి అంశాలపై ముఖ్యమంత్రి ప్రస్తావించే అవకాశాన్నట్లు తెలుస్తోంది.

నిరంతర యోగా సాధనతోనే
మెరుగైన జీవన విధానం
--- మంత్రి శిద్దా రాఘవరావు --
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జూన్ 21:నిరంతరం యోగా సాధన ద్వారా ప్రజలు మెరుగైన ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపాలని రాష్ట్ర రవాణా శాఖమంత్రి శిద్దారాఘవరావు పిలుపునిచ్చారు. మంగళవారం ఉదయం స్థానిక పోలీసు పెరేడ్ మైదానంలో ఆయుష్‌శాఖ ద్వారా ఏర్పాటుచేసిన అంతర్జాతీయ యోగా దినోత్సవంలో మంత్రి ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రప్రభుత్వం ప్రతిష్టాత్మాకంగా యోగా దినోత్సవం చేపట్టిందని అలాగే దేశవ్యాప్తంగా కూడా ఈ కార్యక్రమం పెద్దఎత్తున నిర్వహిస్తున్నట్లు చెప్పారు. యోగాసనాల ద్వారా పలు ప్రయోజనాలున్నాయని,కోపాన్ని నియంత్రించుకోవచ్చునని ఆరోగ్యవంతమైన జీవితం గడుపుతూ రోగాల బారిన పడకుండా చూసుకోవచ్చునని తెలిపారు. దేశం మొత్తం యోగాకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఐక్యరాజ్యసమితిలో చేసిన ప్రతిపాదన ఆధారంగా జూన్ 21న ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగాదినోత్సవం జరిపేందుకు ఐక్యరాజ్యసమితి నిర్ణయించినట్లు వివరించారు.
రాష్ట్రప్రభుత్వం రాజకీయ నాయకులందరికీ హైదరాబాద్‌లో యోగా కార్యక్రమాలు చేపట్టిందని ఈసందర్భంగా గుర్తుచేస్తు ప్రతిఒక్కరూ ఈకార్యక్రమానికి హాజరై విజయవంతం చేయాలన్నారు. జిల్లాశాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి మాట్లాడుతూ వయస్సుతో తారతమ్యం లేకుండా యోగా చేయాలని సూచించారు. మానసిక ఒత్తిడిని అదుపు చేసేందుకు యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. ఆనందమయ జీవితానికి యోగా ఉత్తమ మార్గమని ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రతిరోజు యోగాచేయటం వలన 18గంటలు ఎటువంటి అలసట లేకుండా పనిచేస్తున్నారని తెలిపారు. ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల మాట్లాడుతూ ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ యోగా చేయాలన్నారు. ఆహార నియమాలు, యోగా పాటించటం వలన ఆరోగ్యంగా ఉండవచ్చునని తెలిపారు. యోగావిషయంలో ముఖ్యమంత్రిని ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. ముఖ్యమంత్రి యోగా చేసిన తరువాతనే మిగిలిన కార్యక్రమాలు చేపడ్తారని, రాష్ట్ర శ్రేయస్సుకోసం ముఖ్యమంత్రి నిరంతరం పనిచేస్తున్నారన్నారు.
కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ యోగావలన మానసిక, శారీరక ఒత్తిడి తగ్గుతుందని అలాగే మంచి క్రమశిక్షణ అలవడుతుందన్నారు. పురాతన చరిత్రలో వేదంలో యోగా గురించి వివరించటం జరిగిందని యోగా సాధనపై వివేకానందస్వామి బహుళప్రచారం చేపట్టారని నేటి 21వ శతాబ్ధంలో ప్రధాని మోదీ యోగాను ప్రవేశపెట్టారని ఈసందర్భంగా గుర్తుచేశారు. మారుతున్న జీవనశైలి వలన, పనిఒత్తిడివలన మధుమేహం, రక్తపోటు వంటి రోగాలబారిన పడుతున్నామని, యోగావలన వాటన్నింటిని అధికమించవచ్చునని తెలిపారు.
జిల్లా జడ్జి విజయకుమార్ మాట్లాడుతూ యోగా చేయటం వలన ఆరోగ్యం బాగుంటుందని తెలుపుతూ ఆరోగ్యంతోపాటు మానసిక ఆరోగ్యం ముఖ్యమన్నారు. ఎంత గొప్పగా జీవిస్తున్నామనేది ముఖ్యంకాదని ఏలా జీవిస్తున్నామది గొప్ప విషయంగా తెలుసుకోవాలన్నారు. ప్రతిమనిషి మంచి ఆలోచనలతో మంచి చేయాలన్నారు. మానసిక వికాసానికి యోగా ఎంతో ఉపయోగపడుతుందన్నారు. పతాంజలి యోగా పీఠంకు చెందిన బాల సుబ్రమణ్యం మాట్లాడుతూ జీవితం సఫలీకృతంకు యోగాభ్యాసం అవసరమన్నారు. యోగ రాజం, ఆధ్యాత్మిక చింతన, యోగాసనాల ద్వారా జీవితం అనందమయం చేసుకోవచ్చునని తెలిపారు. పతంజలి యోగా పీఠం ప్రతినిధి పి రామచంద్రరావు ప్రాణిక్‌హీలింగ్ ప్రతినిధి గీత తదితరులు పాల్గొని యోగా విశిష్టత గురించి వివరించారు. పతాంజలి యోగా పీఠంకు చెందిన ప్రతినిధుల ఆధ్వర్యంలో నమస్కార ముద్రతో ప్రారంభించి యోగా ముద్రాసనం శాంతిమంత్రంతో ముగించటం జరిగింది. యోగా కార్యక్రమంలో పాల్గొన్న విశిష్ట అతిధులకు ఆయుష్ శాఖ ఆర్‌డిడి ద్వారా మెమోంటోల బహుకరణ జరిగింది. 88 ఎళ్ళ వయస్సు గల నాగబోయిన వెంకటేశ్వర్లు చేసిన అసనాలను జిల్లాకలెక్టర్ తిలకించి అభినందనలు తెలుపుతూ మెమోంటోను అందచేశారు. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌కై వచ్చి యోగా కార్యక్రమంలో పాల్గొన్న వారికి జిల్లాకలెక్టర్ అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్తకలెక్టర్ ఎం హరిజవహర్‌లాల్‌తోపాటు తదితరులు పాల్గొన్నారు.
డైవర్షన్ రోడ్డులో కూరుకుపోయిన భారీ లారీ
* నిలిచిపోయిన వాహనాల రాకపోకలు
* ప్రయాణికుల తీవ్ర ఇక్కట్లు
కురిచేడు, జూన్ 21: మండల కేంద్రమైన కురిచేడు మెయిన్‌రోడ్డు విస్తరణ పనులు జరుగుతున్న నేపధ్యంలో వాహనాల రాకపోకలకు వీలుగా వన్‌వే ట్రాఫిక్ అమలు చేస్తూ డైవర్షన్‌రోడ్డు ఏర్పాటు చేశారు. గత మూడునెలల నుంచి వాహనాలు వన్‌వే ట్రాఫిక్‌లో రాకపోకలు జరుగుతున్నాయి. మంగళవారం మధ్యాహ్నం 1గంట సమయంలో డైవర్షన్‌రోడ్డులో సిమెంటులోడ్‌తో వెళ్తున్న ఒక భారీవాహనం ఇటీవల కురిసిన వర్షాలకు రోడ్డుపై ఏర్పడిన బురదలో కూరుకుపోయింది. దీనితో రోడ్డుకు ఇరువైపులా కిలోమీటరు విస్తీర్ణంలో వాహనాలు బారులుతీరాయి. మెయిన్‌రోడ్డులో సిమెంటుపనులు జరుగుతున్నందున రాకపోకలు పూర్తిగా నిషేధించడంతో గత 20రోజుల నుంచి డైవర్షన్‌మార్గం లోనే వాహనాల రాకపోకలు జరుగుతున్నాయి. మధ్యాహ్నం 1గంట నుంచి సాయంత్రం 7గంటల వరకు కూడా లారీని అక్కడి నుంచి బయటకు తీసేందుకు సరైన చర్యలు చేపట్టకపోవడంతో ప్రయాణికులు తీవ్ర అసహనానికి లోనయ్యారు. ఆర్‌అండ్‌బి జెఇ రఫీకి వాహనాల రాకపోకలు నిలిచిపోయిన విషయాన్ని తెలియచేయగా ఆయన 5గంటల సమయంలో లారీని తొలగించేందుకు ఒక యంత్రాన్ని పంపించారు. ఆ యంత్రం ద్వారా లారీని బయటకు తీయడానికి చేస్తున్న ప్రయత్నాలు ఫలించకపోవడంతో బస్సుల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటివరకు ట్రాఫిక్‌జామ్‌లో చిక్కుకున్న వాహనాలు ప్రత్యామ్నాయ మార్గం లేకపోవడంతో ఏ డిపోకు చెందిన వాహనాలు ఆ డిపోకు వెనుదిరిగి వెళ్లాయి. గత 9నెలల నుంచి కురిచేడులో జరుగుతున్న రోడ్ల విస్తరణ నిర్మాణ కార్యక్రమాలు నత్తనడకన సాగుతుండటంతో పాదచారులు, ప్రయాణికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రధానమార్గంలో నీటి సరఫరాకు కలిగిన అడ్డంకులు తొలగించే నిమిత్తం పైపులు బిగించేందుకు తీసినగుంతలు పూడ్చకపోవడంతో ఆ మార్గంలో కూడా వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. పైపులు బిగించి గుంతలను పూడ్చాల్సిన అధికారులు ఆ ఊసే పట్టించుకోకపోవడంతో పాదచారులు, ద్విచక్రవాహనచోదకులు సైతం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

ముస్లింల షాపులు తొలగించటం దారుణం : ఎంపి
ఒంగోలు,జూన్ 21: ఒంగోలు నగరంలోని ఊరచెరువు వద్ద బండ్లమిట్ట సెంటర్‌లో ఉన్న 17మంది ముస్లింల షాపులను ఆక్రమణల పేరుతో ఒంగోలు కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు పోలీసు బందోబస్తుతో వచ్చి తొలగించటం దారుణమని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి విమర్శించారు. మంగళవారం రాత్రి స్థానిక బండ్లమిట్ట సెంటర్‌లో తొలగించిన షాపులను అదేవిధంగా ఊరచెరువులో ఉత్తరం వైపున నివాసం ఉంటున్న పేదలైన బుడబుక్కలవారి నివాసాలను తొలగించటాన్ని కూడా ఎంపి సుబ్బారెడ్డి ఖండించారు. రాష్ట్రంలో రాక్షసపాలన సాగుతుందని ధ్వజమెత్తారు. గత 60సంవత్సరాలుగా బండ్లమిట్ల సెంటర్‌లో షాపులను ముస్లింలు ఏర్పాటుచేసుకుని చిన్నచిన్న వ్యాపారాలు చేసుకుంటూ జీవనం సాగించుకుంటున్నారన్నారు. పవిత్రమైన రంజాన్ మాసంలో వారికి ఎలాంటి నోటీసులు ముందస్తుగా ఇవ్వకుండా కార్పొరేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు తొలగించటం బాధాకరమన్నారు. తొలగించిన ప్రాంతంలోనే ముస్లింలకు తిరిగి షాపులను నిర్మించి ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఇదే స్థలంలో పది అడుగుల వెనక్కి జరిపి ఇస్తే తాము ఇక్కడే వ్యాపారం చేసుకుని జీవనం సాగిస్తామని తమకు న్యాయం చేయాలని ఎంపిని వారు కోరారు. దీంతో స్పందించిన ఎంపి ముస్లిం సోదరులకు తాము అండగా ఉంటామని న్యాయం జరిగేవరకు మీ పక్షాన పోరాటం చేస్తామని కూడా ఆయన ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. ఇది ఇలాఉండగా ఊరచెరువు ఉత్తరం వైపున తొలగించిన బుడబుక్కలవారీ నివాస గృహాలను ఎంపి సుబ్బారెడ్డి పరిశీలించారు. న్యాయం జరిగేవరకు అండగా ఉంటామని కూడా హామీ ఇచ్చారు. కలెక్టర్, ఒంగోలు కార్పోరేషనర్‌కమీషనర్‌తో మాట్లాడి న్యాయం జరిగేవిధంగా చూస్తానని వారికి హామీ ఇచ్చారు.బాగా ఉన్నటువంటివారి భవనాలను ఆక్రమంగా నిర్మించుకున్నారని వాటిని తొలగించకుండా పేదలషాపులు,నివాసాలను తొలగించటం దారుణమన్నారు. ఈకార్యక్రమంలో వైకాపా నాయకులు శింగరాజు వెంకట్రావు, ఓబులరెడ్డి, క్రాంతికుమార్, గంగాడ సుజాత, తోటపల్లి సోమశేఖర్, ఎఐటియుసి జిల్లా అధ్యక్షుడు ఎస్‌డి సర్దార్ తదితరులు ఉన్నారు.