ప్రకాశం

బంద్ పాక్షికం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,సెప్టెంబర్ 10:రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం వైఎస్‌ఆర్ కాంగ్రెస్, కాంగ్రెస్, సిపిఎం, సిపిఐ, ఇతర ప్రజాసంఘాల నాయకులు చేపట్టిన బంద్ జిల్లాలో పాక్షికంగా జరిగింది. కాగా ఈ బంద్‌పై జిల్లా పోలీసుయంత్రాంగం ఉక్కుపాదం మోపింది. దీంతో ఆయా పార్టీలకు చెందిన నాయకులను ముందస్తుగానే అరెస్టు చేసి సూదురప్రాంతాల పోలీసు స్టేషన్లకు తరలించారు. జిల్లా వ్యాప్తంగా ఎక్కడికక్కడ నేతలను అరెస్టుచేసి తమ పోలీసుపవర్‌ను నిరుపించుకున్నారు. పోలీసులు బంద్‌ను విచ్ఛిన్నం చేసి ప్రభుత్వం నుండి మెప్పుపొందుందుకు ప్రయత్నం చేశారని ఆయా పార్టీలకుచెందిన నేతలు, కార్యకర్తలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కనీసం ర్యాలీలు, రాస్తారాకోలు జరిపేందుకు అనుమతి నిరాకరించారు. బంద్ సందర్భంగా జిల్లావ్యాప్తంగా కొంతమంది సంపూర్ణంగా తమవ్యాపారసంస్థలను మూసివేయగా మరికొన్నింటిని ఆందోళనకారులు మూయించివేశారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటువిద్యాసంస్థలు మూతపడ్డాయి. ఇదిలా ఉండగా బంద్‌లో పాల్గొనేందుకు ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి తన స్వగృహం నుండి బయలుదేరే ముందే పోలీసులు గృహనిర్బంధం చేశారు. ఎంపి ఇంటిముందు భారీగా పోలీసులను మోహరించారు. ఈ సందర్భంగా పోలీసులకు, వైకాపా నాయకుల మధ్య వాగ్వివాదం, తోపులాట జరిగింది. ఎంపి సుబ్బారెడ్డితోపాటు పలువురు ఇంటిముందే ఆందోళన కార్యక్రమం చేపట్టారు. రాష్ట్రప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు. బంద్‌పై పోలీసులు ఉక్కుపాదం మోపారని ఆయన మండిపడ్డారు. రాష్ట్రంలో ఎమర్జెన్సీని తలపించే విధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్టుచేసిన తమనాయకులు,కార్యకర్తలను దోర్నాల అటవీ ప్రాంతంలో పోలీసులు వదిలిపెట్టడటంపై ఆయన మండిపడ్డారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు రాష్ట్రంలో ఆరాచక పాలన కొనసాగిస్తున్నారని ఆరోపించారు. అదేవిధంగా వైకాపా జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి హైదరాబాదునుండి బంద్‌లో పాల్గొనేందుకు జిల్లాకు వస్తున్న సమయంలో సంతమాగులూరు వద్ద పోలీసులు అరెస్టుచేసి కురిచేడు పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా ఆయన కురిచేడు నుండి ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రాష్ట్రంలో నిరంకుశపాలన సాగుతుందని మండిపడ్డారు. 30 సంవత్సరాల్లో ఎప్పుడు ఇలాంటి అరెస్టులు జరగలేదని ఆయన ఆరోపించారు. రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధించేంత వరకు పోరాటం సాగిస్తామని ఆయన హెచ్చరించారు.
ఇదిలా ఉండగా ఎస్‌పి త్రివిక్రమవర్మ బంద్ సందర్భంగా ఒంగోలులో పర్యటించారు. విలేఖర్లతో మాట్లాడుతూ నేతలను ముందస్తుగా అరెస్టులు చేయటం వలన శాంతిభద్రతలు అదుపులో ఉన్నాయని తెలిపారు. ప్రజలకు బంద్ సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకే ఈ చర్యలు తీసుకున్నామన్నారు.
కాగా జిల్లావ్యాప్తంగా ఆర్‌టిసి బస్సులు యధావిధిగానే తిరుగుతున్నాయని ఆ సంస్థ రీజనల్ మేనేజరు ఆదాంసాహెబ్ ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. ఒంగోలు ఆర్‌టిసి గ్యారేజినుండి బస్సులు రాకుండా అడ్డుకునేందుకు వెళ్లిన వైకాపా నాయకులను పోలీసులు అరెస్టుచేసి దోర్నాల ప్రాంతాలకు తరలించారు. ఇదిలా వుండగా పోలీసులు అరెస్టుచేసిన వారిలో సిపిఐకి చెందిన జిల్లాకార్యదర్శి కె అరుణ, సిపిఐ జిల్లానాయకులు ఎం వెంకయ్య, ఎస్‌డి సర్దార్, పివిఆర్ చౌదరి, యు ప్రకాశరావు, ఎఐటియుసి నాయకులు కోటేశ్వరరావు, సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులు, ఒంగోలు నగరకార్యదర్శి జివి కొండారెడ్డి, సిపిఎం నాయకులు జి రమేష్, చీకటి శ్రీనివాసరావు తదితరులు ఉన్నారు. వైకాపాకి చెందిన కుప్పంప్రసాదు, శింగరాజు వెంకట్రావు, గంగాడ సుజాత, బత్తుల ప్రమీల, కాంగ్రెస్‌పార్టీకి చెందిన శ్రీపతి ప్రకాశం, వేమా శ్రీను, ఎద్దు శశికాంత్‌భూషణ్, నిమ్మకాయల శ్రీను,ఎస్‌కె సైదా, దావీదు, శనగలపూడి బుజ్జి, లింగిశెట్టి ఈశ్వరరావు, అల్లంపల్లి మల్లికార్జున, సిపిఐ ఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లాకార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వర్లు, రైతుకూలీ సంఘం నాయకులు కొంగరనరసింహం, పిడిఎస్‌యు నాయకులు మల్లిఖార్జున్ తదితరులను అరెస్టుచేశారు. సిపిఎం జిల్లాకార్యదర్శి పూనాటి ఆంజనేయులుపై పోలీసులు దురుసుగా వ్యవహరించటం పట్ల సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆయాపార్టీలకు చెందిన వారు మాట్లాడుతూ రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తే అనేక పరిశ్రమలు రావటంతోపాటు 99శాతం గ్రాంటువచ్చి రాష్ట్రం ఎంతో అభివృద్ధి చెందుతుందని అలాంటిది కేంద్రప్రభుత్వం ప్రత్యేక హోదా ఇవ్వకుండా ప్రత్యేక ప్యాకేజిలు ఇవ్వనున్నట్లు ప్రకటించిందన్నారు. దీనిని చంద్రబాబు స్వాగతించటాన్ని వారు తప్పుపట్టారు. ప్రత్యేకహోదాను సాధించేందుకు భవిష్యత్‌లో పోరాటాన్ని ఉద్ధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఆందోళనకారుల పట్ల పోలీసులువ్యవహరించిన తీరును అన్నిపార్టీలకుచెందిన నాయకులు తీవ్రంగా ఖండించారు.కాగా జిల్లావ్యాప్తంగా వైఎస్‌ఆర్‌కాంగ్రెస్ పార్టీకి చెందిన ఐవి రెడ్డి, చేగిరెడ్డి లింగారెడ్డి, బుర్రామధుసూదన్, తూమాటి మాధవరావు, వరికూటి అశోక్, సిహెచ్ విజయభాస్కర్, గొట్టిపాటిభరత్, బాచిన చెంచుగరటయ్య, యడం బాలాజీ, దుంపాచెంచిరెడ్డి, బూచేపల్లిశివప్రసాదురెడ్డి, వెన్నా హనుమారెడ్డి అరెస్టు అయినవారిలో ఉన్నారు. మొత్తంమీద రాష్ట్రానికి ప్రత్యేకహోదాసాధనకోసం ఆయారాజకీయపక్షాలకు చెందిన నేతలు చేపట్టిన బంద్ జిల్లావ్యాప్తంగా పాక్షికంగా జరిగింది. కాగా రెండవశనివారం కావటంతోవివిధ ప్రభుత్వ కార్యాలయాలకు సెలవుముందుగానే రావటంతో అదేవిధంగా పాఠశాలలకు విద్యార్థులకు సెలవులు కావటంతో అన్ని మూసివేశారు.

మేం కారం తింటున్నాం
అందుకే ఆందోళన చేస్తున్నాం
పవన్‌కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన ఎంపి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,సెప్టెంబర్ 10:తమ పార్టీకి చెందిన ఎంపిలందరూ కారం తింటున్నారు, అందుకే రాష్ట్రానికి ప్రత్యేకహోదా సాధన కోసం ఆందోళన చేస్తున్నామని ఈ విషయాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ గ్రహించాలని ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. శనివారం ప్రత్యేక హోదా సాధన కోసం బంద్‌లో పాల్గొనేందుకు వెళ్తున్న ఎంపిని పోలీసులు గృహనిర్భందం చేశారు. ఈ సందర్భంగా వైసిపి నాయకులు, కార్యకర్తల మధ్య వాగ్వివాదం తోపులాట జరిగింది. దీంతో తన ఇంటిముందే పోలీసుల వైఖరికి నిరసనగా సుబ్బారెడ్డి ఆందోళన చేశారు. పోలీసులు వ్యవహరించిన తీరుపై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్టారు. ఈ సందర్భంగా ఎంపి విలేఖర్లతో మాట్లాడుతూ ప్రత్యేకహోదా సాధన విషయంలో రాష్ట్రంలోని ఎంపిలందరు కారం తినండని పవన్ చేసిన వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించారు.గత రెండున్నర సంవత్సరాల కాలం నుండే రాష్ట్రానికి ప్రత్యేకహోదా కావాలని ఆందోళన చేస్తున్న విషయం పవన్ గుర్తుపెట్టుకోవాలని ధ్వజమెత్తారు. ప్రత్యేకహోదా సాధించేవరకు పోరాటం చేస్తామని ఆయన తెలిపారు. తమపార్టీకి చెందిన ఎంపిలకు కాకుండా బిజెపి, తెలుగుదేశంపార్టీకి చెందిన ఎంపిలకు కారం తినమని పవన్ చెబితే బాగుంటుందని ఆయన ఎద్దేవా చేశారు. అదేవిధంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడులకు మద్దతు పలికిన పవన్ వారు కూడా కారం తినాలని చెప్పాలని ఆయన హితవుపలికారు. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు కేంద్రప్రభుత్వం ఇచ్చే ప్యాకేజిలకోసమే ప్రత్యేకహోదాను పక్కనపెట్టారని ఆరోపించారు. కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు కూడా మాటమార్చారని ఆయన ఆరోపించారు. తమప్రభుత్వం అధికారంలోకి వస్తే రాష్ట్రానికి పదిసంవత్సరాలపాటు ప్రత్యేకహోదా ఇస్తామని చెప్పిన కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు మాటమార్చి రాష్ట్రాన్ని నట్టేట ముంచారని ఆయన ధ్వజమెత్తారు.

నా కుమారుడి వద్దకు చేర్చండి
* తల్లిని కాదన్న పేగుబంధం
* 70 ఏళ్ళ వయస్సులో పోలీసుస్టేషన్‌ను
ఆశ్రయించిన తల్లి
మార్కాపురం టౌన్, సెప్టెంబర్ 10: వృద్ధాప్యంలో తల్లిదండ్రులకు ఆసరా ఇవ్వాల్సిన పేగుబంధం 70 ఏళ్ళ వయస్సులో తల్లిని కాదని తరిమివేయడంతో తనను ఆదుకొని తిరిగి కుమారుడి వద్దకు చేర్చాలని కోరుతూ ఓ మాతృమూర్తి శనివారం స్థానిక రూరల్ పోలీసుస్టేషన్‌ను ఆశ్రయించింది. వివరాల్లోకి వెళితే మండలంలోని బొడిచర్ల గ్రామానికి చెందిన టి వెంకటలక్ష్మమ్మకు ఒక కుమారుడు, నలుగురు కుమార్తెలు ఉన్నారు. పదేళ్ళ కిందట వెంకటలక్ష్మమ్మ భర్త చనిపోవడంతో ఒంటరి అయిన లక్ష్మమ్మ కుమారుడి వద్ద ఉండాలని తలచింది. స్వగ్రామం తర్లుపాడు మండలం లక్ష్మక్కపల్లి కాగా, వివాహం అనంతరం తన కుమారుడు ఉన్న 20 ఎకరాల పొలాన్ని అమ్ముకొని భార్య పుట్టిల్లు అయిన బొడిచర్లకు చేరాడు. కుమార్తెలు కూడా వివాహాలు చేసుకొని వారివారి మెట్టినిల్లలో ఉండటంతో కుమారుడి వద్ద ఉండాలని లక్ష్మమ్మ తలచింది. అయితే లక్ష్మమ్మను కుమారుడు గెంటివేయడంతో కన్నీరుమున్నీరుగా విలపిస్తూ తనను తన కుమారుడి వద్దకు చేర్చాలని పోలీసులను ఆశ్రయించింది. కుమారుడిపై ఎన్నో ఆశలు పెట్టుకున్నానని, ఒక్కగానొక్క కుమారుడు కావడంతో అడిగింది ఏదీ కాదనకా అల్లారుముద్దుగా పెంచామని, ఇలా కాటికి వెళ్ళే వయస్సులో తనకు అమ్మ బరువైందని లక్ష్మమ్మ రోదిస్తోంది. దయచేసి తనను కొడుకు వద్దకు చేరిస్తే కొడుకును చూసుకుంటూ చివరివేళలో కన్నుమూస్తానని ఆమె చేతులెత్తి ఎదురుపడిన ప్రతిఒక్కరినీ వేడుకుంటోంది.
వినాయక నిమజ్జనంలో అపశ్రుతి
- ఇద్దరు యువకులు గల్లంతు
టంగుటూరు,సెప్టెంబర్ 10:టంగుటూరు మండలంలోని కొణిజేడుగ్రామానికి చెందిన యద్దనపూడి వెంకటేష్ (18) మానం నాగరాజు (18) వినాయక నిమజ్జనం సందర్భంగా కొత్తపట్నం మండలంలోని మడనూరులోని సముద్రంలో స్నానంచేస్తుండగా గల్లంతయ్యారు. వీరు ఒంగోలులోని ఒకప్రైవేటు కాలేజిలో సీనియర్ ఇంటర్ చదువుతున్నారు. కాగా వీరి తల్లిదండ్రులు వ్యవసాయకూలీలు. ఈ సంఘటనతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. గల్లంతైన యువకుల కోసం పోలీసులు ముమ్మర గాలింపు చర్యలు చేపట్టారు.
రోడ్డు ప్రమాదంలో
ఆరుగురికి గాయాలు
కారంచేడు, సెప్టెంబర్ 10: మండలంలోని దగ్గుబాడు గ్రామానికి సమీపంలో ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఆరుగురికి గాయాలైన సంఘటన శుక్రవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు దగ్గుబాడు గ్రామానికి చెందిన సయ్యద్ నబి తన కుటుంబ సభ్యులతో చీరాలలోని అత్తగారింటికి బయల్దేరాడు. అదే సమయంలో చీరాల నుంచి తిమిర్తిపాడు గ్రామానికి శేషయ్య తన స్నేహితుడైన యోహానుతో వస్తున్నాడు. ఈ క్రమంలో స్వర్ణ, దగ్గుబాడు నాలుగురోడ్ల కూడలిలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో నబి కాలుకు తీవ్ర గాయాలు కాగా అతని భార్య అసీఫాకు, కుమార్తె, కుమారునికి స్వల్ప గాయాలయ్యారు. వీరిని చికిత్స నిమిత్తం గుంటూరుకు తరలించారు. మరో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న శేషయ్య, యోహానుకు కూడా గాయలవడంతో చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు.

నేడు ప్రకృతి వ్యవసాయంపై తిరుపతిలో శిక్షణ
బస్సులకు జెండా ఊపి ప్రారంభించిన కలెక్టర్ సుజాతశర్మ
ఒంగోలు అర్బన్,సెప్టెంబర్ 10: ప్రకృతి వ్యవసాయంపై తిరుపతిలో ఈనెల 11వతేదీ ఆదివారం నుండి నాలుగురోజులపాటు జరగనున్న శిక్షణ తరగతులకు రైతులను శనివారం సాయంత్రం వ్యవసాయ శాఖ ఏర్పాటుచేసిన బస్సుల్లో పంపించారు. స్థానిక క్యాంపు కార్యాలయం వద్ద కలెక్టర్ సుజాతశర్మ జెండా ఊపి బస్సులను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా జాయింట్‌కలెక్టర్-2 ఐ ప్రకాష్‌కుమార్ విలేఖర్లతో మాట్లాడుతూ జిల్లా నుండి నాలుగురోజులపాటు తిరుపతిలో సుభాష్‌పాలేకర్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే పెట్టుబడిలేని ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులకు జిల్లానుండి 437మంది రైతులు బయలుదేరి వెళ్లారన్నారు. జిల్లాలోని రైతులకు ప్రకృతి వ్యవసాయంపై పూర్తిగా అవగాహన కల్పించేందుకు ఈ శిక్షణ తరగతులు ఎంతగానో ఉపయోగపడ్తాయన్నారు. వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణ మాట్లాడుతూ గతంలో కాకినాడలో ప్రకృతి వ్యవసాయంపై జరిగిన సదస్సుకు జిల్లానుండి రైతులను తీసుకెళ్లామన్నారు. ప్రస్తుతం తిరుపతిలో జరిగే ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ తరగతులకు పది క్లస్టర్లనుండి రైతులను ఎంపికచేసి తీసుకుని వెళ్తున్నట్లు తెలిపారు. ఎరువులు, పురుగుమందులు వాడకుండా కేవలం ప్రకృతి వ్యవసాయంపై రైతుల్లో ఆశక్తిపెంచేవిధంగా సుభాష్‌పాలేకర్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ తరగతులకు తీసుకువెళ్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో డిపిఎం సుభాషిణి తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.

బంద్ సంపూర్ణం..
* ‘హోదా’ మా హక్కు.. * ప్యాకేజీలు వద్దు..
* నినదించిన విపక్షాలు
* నేతల అరెస్టు.. విడుదల
* ఎక్కడి బస్సులు అక్కడే..
* స్వచ్ఛందంగా దుకాణాలు, వ్యాపార సంస్థలు మూసివేత
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 10 : ప్రత్యేక హోదా ఇచ్చి తీరాలని డిమాండ్ చేస్తూ జిల్లాలో శనివారం చేపట్టిన బంద్ సంపూర్ణంగా, ప్రశాంతంగా ముగిసింది. ఈ సందర్భంగా జిల్లాలోని అన్ని ఆర్టీసీ డిపోల్లో బస్సులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. వ్యాపార, వాణిజ్య సముదాయాలు, దుకాణాలు, కేంద్ర, ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, సినిమా థియేటర్లు మూతబడ్డాయి. తాడిపత్రిలో బంద్ పాక్షికంగా జరిగింది. ఆర్టీసీ బస్సులు అడపాదడపా తిరిగాయి. అనంతపురం నుం చి రూరల్ ప్రాంతానికి, ఉరవకొండకు నడిచిన కొన్ని బస్సులు ఖాళీగా వెళ్లాయి. నగరంలో స్వచ్ఛందంగా ప్రజలు బంద్‌కు సహకరించారు. దీంతో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. పోలీసుల మోహరింపు, ర్యాలీలను అడ్డుకోవడం, ఆందోళనకారుల నినాదాలతో నగరం అట్టుడికింది. జిల్లా పోలీసు యంత్రాంగం ముందస్తుగా 30 పోలీసు యాక్ట్‌ను, కొన్నిచోట్ల 144 సెక్షన్‌ను అమలు చేసినప్పటికీ ప్రతిపక్షాలు ఖాతరు చేయకుండా రోడ్డెక్కాయి. ఈ సందర్భంగా ‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు.. ప్యాకేజీలు మాకొద్దు.. సంపూర్ణ అభివృద్ధికి హోదాయే ముద్దు..’ అంటూ పెద్ద ఎత్తున నినదించారు. ప్రధాన ప్రతిపక్షం వైకాపాతో పాటు సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ అనుబంధ సంఘాలు, విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు, మహిళా ప్రతినిధులు భారీ ఎత్తున బంద్‌లో పాల్గొన్నారు. ఇకపోతే కదిరి, పెనుకొండ, గుంతకల్లు తదితర ప్రాంతాల్లో సిపిఐ, సిపిఎం, వైకాపా నాయకుల్ని ముందస్తుగా అరెస్టు చేశారు. అనంతపురంలో వైఎస్సార్ విగ్రహం వద్ద నుంచి ర్యాలీ చేసేందుకు యత్నించిన వైకాపా, సిపిఐ, సిపిఎం, కాంగ్రెస్ పార్టీల నాయకులు అనంత వెంకట్రామిరెడ్డి, గుర్నాథరెడ్డి, ఓబులు, రాంభూపాల్, జగదీష్, జాఫర్ తదితరులలో పాటు కార్యకర్తల్ని, శ్రీకంఠం సర్కిల్‌లో వైకాపా యువనేత చవ్వా రాజశేఖరరెడ్డి తదితరుల ఆధ్వర్యంలో బంద్‌లో పాల్గొన్న వారిని పోలీసులు అరెస్టు చేసి స్టేషన్లకు తరలించారు. ధర్మవరంలో వైకాపా, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు సుమారు 40 మందిని పోలీసులు అరెస్టు చేశారు. గుంతకల్లులో ఉదయమే కొందరు సిపిఎం నాయకుల్ని పోలీసులు ఇళ్ల వద్ద అరెస్టు చేశారు. ఆర్టీసీ డిపో ఎదుట ఆందోళనకు దిగిన నాయకులు, కార్యకర్తల్ని అరెస్టు చేశారు. తాడిపత్రిలో వైకాపా నేతలు విఆర్.రామిరెడ్డి, కొనదల రమేష్‌రెడ్డితో పాటు, సిపిఐ, సిపిఎం నాయకులు, కార్యకర్తల్ని అరెస్టు చేశారు. ఉరవకొండలో కూడా అదే పరిస్థితి. కదిరిలో వైకాపా కన్వీనర్ సిద్దారెడ్డి, వజ్ర భాస్కర్‌రెడ్డి, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు వేమయ్య యాదవ్, ఇతర ప్రతిపక్ష పార్టీల నేతలతో పాటు సుమారు 185 మందిని అరెస్టు చేశారు. వీరిలో 18 మందిపై నాయకులపై కేసులు నమోదయ్యాయి. పెనుకొండలో ప్రతిపక్ష పార్టీల నేతలు కొందరిని ముందస్తు అరెస్టు చేశారు. పెనుకొండ సమీపంలోని ఆంజనేయస్వామి గుడి వద్ద కెటి శ్రీ్ధర్ ఆధ్వర్యంలో 44వ జాతీయ రహదారిపై దిగ్బంధించారు. రొద్దంలో వైకాపా ఆందోళన కారులు, పోలీసులకు మధ్య తోపులాట చోటుచేసుకుంది. గోరంట్ల, సోమందేపల్లిలో ఆందోళనలు కొనసాగాయి. హిందూపురంలో ప్రతిపక్ష నాయకులు రోడ్డెక్కి ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రత్యేక హోదా కోసం వివిధ రూపాల్లో ఆందోళనలు కొనసాగించేందుకు ప్రతిపక్ష పార్టీలు సిద్ధమవుతున్నాయి.
‘అనంత’ కన్నీరు తుడుస్తా..
* హంద్రీనీవాను పూర్తి చేయడమే లక్ష్యం
* ఇన్‌పుట్ సబ్సిడీ ఇస్తాం.. రైతుల్ని ఆదుకుంటాం
* జిల్లా పరిస్థితులపై శాసనమండలిలో సిఎం సుదీర్ఘ ప్రస్తావన
ఆంధ్రభూమి బ్యూరో
అనంతపురం, సెప్టెంబర్ 10 : జిల్లాను కరవు బారి నుంచి కాపాడటమే లక్ష్యమని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పునరుద్ఘాటించారు. శనివారం హైదరాబాదులో నిర్వహించిన శాసన మండలి సమావేశంలో ప్రసంగించిన సిఎం సుదీర్ఘ సమయం జిల్లా గురించే ప్రస్తావించారు. అనంతపురం జిల్లా అంటే తనకు అమితమైన ప్రేమ ఉందని, ఆ జిల్లా ప్రజలు ఎన్‌టి రామారావుతోపాటు తనను, పార్టీని అక్కున చేర్చుకుని ఆదరించారని, ఓవిధంగా తన సొంత జిల్లా అని భావోద్వేగం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితు ల్లో హంద్రీనావా ప్రాజెక్టును పూర్తి చే స్తామన్నారు. రెయిన్‌గన్ల ద్వారా రక్షకతడులు పొందే రైతులకు ఇన్‌పుట్ స బ్సిడీ, పంట బీమా రాదని ప్రతిపక్షా లు దుష్ప్రచారం చేస్తున్నాయని, పంట నష్టాన్ని అంచనా వేసి ఇన్‌పుట్ సబ్సిడీ ఇచ్చి రైతుల్ని ఆదుకుంటామన్నారు. అలాగే వాతావరణ బీమాపై జాతీయ స్థాయిలో చర్చించాలని అధికారులను ఆదేశించినట్లు తెలిపారు. వర్షం నీటిని భూగర్భజలాలుగా మార్చాలని సంకల్పించి నీరు-చెట్టు కార్యక్రమాన్ని చేపట్టామన్నారు. తర్వాత నీరు-ప్రగతిగా మార్పు చేశామన్నారు. అలాగే పంట సంజీవని తెచ్చామన్నారు. ఒక మీటర్ భూగర్భజలం పెరిగితే 90 టిఎంసిల నీరు పొందవచ్చన్నారు. అలాగే రెయిన్‌గన్ల ద్వారా ఖరీఫ్ వేరుశెనగ పంటను కాపాడాలన్న తన ఆలోచన రావడంతో ఆరేడు రోజులు అనంతపురంలోనూ స్వయంగా తానే ఉండి, అధికార యంత్రాంగం, మంత్రుల్ని రంగంలోకి దింపి రక్షక తడులు ఇచ్చామన్నారు. రెయిన్‌గన్ల ద్వారా రోజుకు లక్ష ఎకరాలకు రక్షక తడులు ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. జూన్‌లో ముందస్తుగా సాగు చేసిన వేరుశెనగ పంట వర్షాభావానికి గురైందన్నారు. ఈనేపథ్యంలో అనంతపురంతో పాటు రాయలసీమలో మొత్తం 4.69 లక్షల ఎకరాలకు రెయిన్‌గన్ల ద్వారా నీరిచ్చి పంటను కాపాడామని వెల్లడించారు. రాయలసీమలో ఇంతవరకూ ‘గన్’లు చూశారు. ఇపుడు రెయిన్‌గన్‌లు చూపిస్తున్నామన్నారు. ఇకపై కరవు అనే మాటే వినిపించదన్నారు. వచ్చే ఏడాది ముందస్తు చర్యలు తీసుకుని వేరుశెనగ పంటను కాపాడుతామన్నారు.
అనంతలో వర్షం
అనంతపురం అర్బన్, సెప్టెంబర్ 10: అనంత నగరంలో శనివారం మధ్యాహ్నం ఆరంభమైన వర్షం అరగంటపాటు కుంభవృష్టిగా కురిసింది. సాయంత్రం మరోసారి వర్షం భారీగా కురవడంతో రామ్‌నగర్‌లోని ఓవర్ బ్రిడ్జి వద్ద వర్షపు నీరు నిలిచిపోవటంతో పాదచారులు, వాహనచోదకులు తీవ్ర ఇబ్బందులుపడ్డారు. ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. మంగళి కాలనీ, రుద్రంపేట, శ్రీకంఠం, సప్తగిరి కూడళ్లలో రోడ్లపై నీళ్లు నిలిచాయి. అక్కడక్కడ డ్రైనేజీలు పొంగిపొర్లాయి. గత నెల రోజులుగా వరుణదేవుడు చాటేయడంతో ఎండలు సాధారణంకంటే ఎక్కువగా నమోదవుతూ వస్తున్నాయి. శనివారం నగరంలో వర్షం కురవటంతో వాతావరణం చల్లబడింది.
వర్షం కోసం మహా చండీయాగం
మడకశిర, సెప్టెంబర్ 10 : వరుణ దేవుడు కరుణించి ఆదుకోవాలని నిర్వహించిన మహా చండీయాగం శనివారం ముగిసింది. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల నుంచి శనివారం తెల్లవారుఝాము 4 గంటలకు వరకు వేద పండితులు రాధామోహన్ ఆధ్వర్యంలో గణపతి, నవగ్రహ పూజలు నిర్వహించారు. అనంతరం వేద మంత్రోచ్చారణల నడుమ చండీయాగం చేపట్టారు. గత 45 రోజులుగా వర్షాభావం నెలకొనడంతో రైతులు సాగు చేసిన పంటలు ఎండుముఖం పట్టాయి. దీంతో మూగ జీవులు సైతం అవసరమైన పశుగ్రాసం లేకపోవడంతో కబేళాలకు తరలిస్తున్నారు. దీనికి తోడు ప్రజలకు తాగునీరు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చండీయాగం ద్వారా అమ్మవారు కరుణించాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు.
గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలి
గుంతకల్లురూరల్, సెప్టెంబర్ 10 : రాష్ట్రంలో గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని విహెచ్‌పి సెక్రటరీ సోమశేఖర్ డిమాండ్ చేశారు. శనివారం స్థానిక విహెచ్‌పి కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఇప్పటికే అనేక రాష్ట్రాల్లో గోవధ నిషేధ చట్టం అమలులో ఉందన్నారు. మన రాష్ట్రంలో కూడా ఉమ్మడి హైకోర్టు 1973లో చట్టాన్ని అమలు చేసిందన్నారు. చట్టం ప్రకారం గోవులను ఓవర్‌లోడ్‌తో తీసుకెళ్లితే 7 నెలల జైలుశిక్ష, గోవులను వధిస్తే నాన్‌బెయిలబుల్ కేసులు బనాయించాల్సి ఉందన్నారు. అయితే కొందరు స్వార్థపరులు పండుగల పేర గోవులను వధిస్తున్నారన్నారు. హిందువులు గోవును సర్వదేవతల నిలయంగా పూజిస్తారన్నారు. ఇలాంటి గోవులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కావున గోవధ నిషేధ చట్టాన్ని పక్కాగా అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో విహెచ్‌పి నాయకులు రమేష్, ప్రభాకర్, రామకృష్ణారెడ్డి, కాశీనాథ్, అనిల్‌కుమార్ పాల్గొన్నారు
వైభవంగా సౌభాగ్యవ్రతం
హిందూపురం టౌన్, సెప్టెంబర్ 10 : పట్టణంలోని నాగమ్మ తల్లి వినాయక సేవా సమితి ఆధ్వర్యంలో శనివారం మహిళలు సౌభాగ్యవ్రతం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వినాయక విగ్రహానికి ప్రత్యేక పూజలు చేశారు. సేవా సమితి సమితి ఆధ్వర్యంలో 101 మంది మహిళలకు పసుపు, కుంకుమలతోపాటు రవికలు అందజేశారు. మహా మంగళ హారతి అనంతరం భక్తులకు తీర్థ, ప్రసాదాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు విపి అమర్‌నాథ్, మురళీ, వెంకటేష్, జయ, ఈశ్వర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు.
పచ్చదనమే.. పరమావధి...
* డివిజినల్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు
గుమ్మఘట్ట సెప్టంబర్ 10 : పచ్చదనమే పరమావధిగా ప్రతి పాఠశాల ఆవరణల్లో మొక్కలు నాటాలని అటవీశాఖ డివిజినల్ రేంజ్ అధికారి శ్రీపతి నాయుడు పిలుపునిచ్చారు. శనివారం మండలంలోని కరిసూరయ్యదొడ్డి పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడుతూ ఇప్పటికే 6 లక్షల వరకూ మొక్కలు నాటినట్లు తెలిపారు. గత నెల 29వతేదీ వరకూ ప్రతి పాఠశాలలో మొక్కలు నాటాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బీట్ ఆఫీసర్ రామాంజినేయప్ప, సిబ్బంది రాజన్న, ఓబనాయక్, పాలయ్య తదితరులు పాల్గొన్నారు.

హిందూపురంలో బంద్ పాక్షికం
* నాయకుల అరెస్టు
* తోపులాటలో నవీన్‌కు గాయాలు
* సిఐ వైఖరిపై పచ్చచొక్కా ఇచ్చి నిరసన
హిందూపురం, సెప్టెంబర్ 10 : రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని డిమాండ్ చేస్తూ శనివారం హిందూపురంలో చేపట్టిన బంద్ పాక్షికంగా ముగిసింది. ఇందులో భాగంగా ఉదయం నుంచే వైకాపా, వామపక్షాల నాయకులు ఆర్టీసీ బస్సులు తిరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే పోలీసు బందోబస్తు నడుమ అధికారుల ఆర్టీసీ బస్సులను నడిపారు. ఇకపోతే ఉదయం నుంచి 11 గంటల వరకు కొంత మేర వాణిజ్య సంస్థలు, దుకాణాలు, హోటళ్లు మూతబడగా అనంతరం యథావిధిగా పనిచేశాయి. ఇకపోతే ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు రెండో శనివారం కావడంతో ముందుగానే సెలవు ప్రకటించడంతో బంద్ ప్రభావం కనిపించలేదు. కాగా రోడ్డుపైకి వచ్చి నిరసన వ్యక్తం చేసేందుకు ప్రయత్నిస్తున్న వైకాపా నియోజకవర్గ సమన్వయ కర్త నవీన్‌నిశ్చల్ తదితరులను వన్‌టౌన్ సిఐ ఇదుర్‌బాషా ఆధ్వర్యంలో అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. ఈ సందర్భంగా జరిగిన తోపులాటలో నవీన్‌నిశ్చల్ మెడపై స్వల్ప గాయాలు కాగా షర్టు చిరిగిపోయింది. సిఐ ఇదుర్‌బాషా అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తూ వైకాపా పట్ల నిర్లక్ష్యంగా ఉద్దేశ పూర్వకంగా వ్యవహరిస్తున్నారంటూ మహిళా కార్యకర్తలు పచ్చచొక్కా ఇచ్చి నిరసన తెలిపారు. దీనికితోడు జాతీయ రహదారి దిగ్బంధానికి వెళ్తున్న కాంగ్రెస్ నాయకులు బాలాజీ మనోహర్, ఆదిమూర్తి, ఇందాద్ తదితరులను అరెస్టు చేశారు. దీనికి తోడు ప్రత్యేక హోదా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ పట్టణంలో ర్యాలీ నిర్వహిస్తున్న సిపిఐ, సిపిఎం నాయకులను పోలీసులు అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. అదేవిధంగా ప్రత్యేక హోదా ప్రకటించి విభజన రాష్ట్రానికి అన్నివిధాలా న్యాయం చేయాలని ధర్నా చేస్తున్న ఎంఐఎం నాయకులను సైతం పోలీసులు అరెస్టు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పోలీసులు ఎక్కడికక్కడ ఆందోళనకారులను అరెస్టు చేయడంతో బంద్ పాక్షికంగా ముగిసింది. ఇకపోతే పోలీసులు అక్రమ అరెస్టులకు పాల్పడ్డారని ఆరోపిస్తూ ఆయా పార్టీలకు చెందిన నాయకులు పోలీసుస్టేషన్‌లో బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు. పోలీసులకు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయా నాయకులు మాట్లాడుతూ గతంలో రెండుసార్లు ప్రత్యేక హోదా కావాలని అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపిన ముఖ్యమంత్రి చంద్రబాబు ప్యాకేజీకి అమ్ముడుబోయే విధంగా వ్యవహరించడం సిగ్గు చేటన్నారు. ప్రత్యేక హోదా రాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు అడ్డుకుంటూ రాష్ట్భ్రావృద్ధిని కాలరాస్తున్నారని విమర్శించారు. ప్రత్యేకహోదా ప్రకటించే వరకు ఆందోళనలను ఉద్ధృతం చేస్తామని, లాఠీలతో ఆందోళనలను ఆపలేరని పేర్కొన్నారు. అనంతరం నాయకులను సొంత పూచికత్తుపై విడుదల చేశారు. ఆయా కార్యక్రమాలో వైకాపా నాయకులు ప్రశాంత్‌గౌడ్, మల్లికార్జున, సమద్, ఇర్షాద్ అహ్మద్, పలువురు కౌన్సిలర్లు, సిపిఐ కౌన్సిలర్ దాదాపీర్, నాయకులు సురేష్‌బాబు, కెటి శ్రీనివాసరెడ్డి, బాలాజీ, ఇబ్రహీం, హుసేన్, సిపిఎం నాయకులు ప్రవీణ్‌కుమార్, నారాయణస్వామి, నారపరెడ్డి, ఎంఐఎం నాయకులు జిలాన్, మున్నా, మన్సూర్ పాల్గొన్నారు.
రైలు కింద పడి వ్యక్తి మృతి
రాయదుర్గం రూరల్, సెప్టెంబర్ 10 : మండల పరిధిలోని చదం గొల్లలదొడ్డి గ్రామానికి చెందిన వడ్డే లక్ష్మన్న (42) శుక్రవారం రాత్రి రైలు కింద పడి మృతి చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు లక్ష్మన్న కూలి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇందులో భాగంగానే శుక్రవారం సాయంత్రం ఇంటి నుంచి బయటకు వెళ్లాడని తెలిపారు. శనివారం ఉదయానే్న రైల్వే ట్రాక్ సమీపంలో శవమై కనిపించడంతో స్థానికులు గుర్తించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మద్యం తాగి రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని తెలిపారు. మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. ఘటనా స్థలాన్ని రైల్వే పోలీసులు పరిశీలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు.
వ్యక్తి ఆత్మహత్య
తనకల్లు, సెప్టెంబర్ 10: మండల పరిధిలోని కొక్కంటి క్రాస్ చంద్రబాబునాయుడు కాలనీకి చెందిన కుళ్లాయప్ప (25) శనివారం ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు 5 నెలల క్రితం గంగరత్నమ్మతో వివాహమైంది. వీరు పెళ్లైన కొత్తలోనే ధర్మవరం మండలం మావిళ్లపల్లి నుండి చంద్రబాబునాయుడు కాలనీకి విచ్చేశారు. అప్పటి నుండి భార్యా భర్తల మధ్య తరచూ గొడవ జరిగేదని, దీంతో జీవితంపై విరక్తి చెంది కుళ్లాయప్ప ఆత్మహత్య చేసుకున్నాడు. శుక్రవారం రాత్రి భార్య గొడవ పడింది. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీనివాసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
కంబదూరు, సెప్టెంబర్ 10 : మండల పరిధిలోని పావుగడ రోడ్డులో దేవరమంద గేటు వద్ద శనివారం సాయంత్రం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని అండేపల్లి గ్రామానికి చెందిన సిపిఐ నాయకుడు గోవిందరెడ్డి(40) అక్కడిక్కడే మృతి చెందాడు. పోలీసులు, 108 సిబ్బంది తెలిపిన వివరాల మేరకు పావుగడ నుంచి కళ్యాణదుర్గానికి వెళ్తున్న ఒక ద్విచక్ర వాహనం తన వ్యవసాయ తోట నుండి ఇంటికి వెళ్తున్న మరొక వాహనం దేవరమంద గేటు దగ్గర ఢీకొంది. ఈఘటనలో గోవిందురెడ్డికి తీవ్రమైన దెబ్బలు తగలడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మరో ద్విచక్ర వాహనాన్ని నడుపుతున్న అపిలేపల్లి గ్రామానికి చెందిన గంగాధర, కళ్యాణదుర్గానికి చెందిన ధనుంజయకు తీవ్రగాయాలవ్వడంతో కళ్యాణదుర్గం ఆసుపత్రికి తరలించారు. ధనుంజయ పరిస్థితి విషమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. కేసు నమోదు చేస్తున్నట్లు ఎస్సై నరసింహుడు తెలిపారు.