ప్రకాశం

వైకాపా పురోభివృద్ధిపై జగన్ దృష్టి సారించేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, డిసెంబర్ 8 : రానున్న అసెంబ్లీ ఎన్నికలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చావోరేవో అన్నట్లుగా మారనున్నాయ. దీంతో రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గం కీలకం కావడంతో గెలుపుగుర్రాలకే అత్యంత ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. గతంలో జరిగిన ఎన్నికల్లో తాము ఏ అభ్యర్థిని నిలబెట్టినా, చివరకు తమ కారు డ్రైవర్‌ను నిలబెట్టినా గెలుస్తారన్న అహంభావం ఉండటంతో తగిన మూల్యం చెల్లించుకున్నారు. అలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా పటిష్టమైన నాయకత్వం ఉన్న నేతలకు రానున్న ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వాల్సి ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది. గతంలో తెలుగుదేశం పార్టీ పాలైనప్పటికీ ఆ పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు ఎన్నికల్లో ఓటమి పాలైనప్పటిటీ తిరిగి సంవత్సరంలోనే జనంలో కలిసిపోయి ఆందోళన కార్యక్రమాల బాట పట్టారు. గ్రామగ్రామాన చంద్రబాబు పర్యటించి పార్టీ శ్రేణులను కాపాడుకోవడంతో పాటు ఎన్నికల్లో పార్టీని గెలిపించి అధికారంలోకి తీసుకొచ్చారు. ఎన్నికల సమయంలో పార్టీలోకి ఎవరు వచ్చినా ఆహ్వానించి పార్టీని మరింత బలోపేతం చేశారు. కాని వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తరచూ ప్రజల్లో మమేకం కావాల్సి ఉందన్న అభిప్రాయాన్ని ఆ పార్టీ శ్రేణులే వ్యక్తం చేస్తున్నాయి.
ప్రధానంగా జిల్లాలో పార్టీ పురోభివృద్ధిపై జగన్ దృష్టి సారిస్తారన్న చర్చ సాగుతోంది. ముందుగా తన బంధువులైన ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డికి, వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డిల మధ్య సఖ్యత అయ్యేవిధంగా జగన్ కసరత్తులు చేపట్టాల్సింది. ఎవరికి వారు ఉత్తరధృవం, దక్షిణ ధృవంగా ఉండటంతో పార్టీ శ్రేణులు అయోమయంలో ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారిద్దరు సఖ్యతతో ఉండి అన్ని కార్యక్రమాల్లో ఉంటే పార్టీ పరుగులు పెడుతుందన్న భావన పార్టీ శ్రేణుల నుంచి వ్యక్తమవుతోంది.జిల్లాలో 12 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉండగా ఆరు నియోజకవర్గాల్లో వైకాపా శాసనసభ్యులు గెలుపొందారు. ఆరుగురిలో నలుగురు తెలుగుదేశం పార్టీ గూటికి చేరగా కేవలం మార్కాపురం, సంతనూతలపాడు శాసనసభ్యులు జంకె వెంకటరెడ్డి, ఆదిమూలపు సురేష్ మాత్రమే పార్టీని నమ్ముకుని ఉన్నారు. దీంతో మిగిలిన పది నియోజకవర్గాల్లో ఇన్‌ఛార్జీలు కొనసాగుతున్నారు. ప్రస్తుతం జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలోని రెండు నియోజకవర్గాలు, తూర్పు ప్రకాశంలోని మూడు నియోజకవర్గాల్లో పార్టీ పరిస్థితి దయనీయంగా ఉందనే చెప్పవచ్చు. ఈ ఐదు నియోజకవర్గాలపై వైకాపా అధినేత జగన్ ప్రత్యేక దృష్టి సారించకపోతే మాత్రం రానున్న ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకుంటారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పార్టీ కోసం అహర్నిశలు శ్రమించే వారిని కాకుండా అప్పటికప్పుడు పార్టీలు మారేవారిని, వ్యాపారం చేసుకునే వారిని ఇన్‌ఛార్జులుగా నియమిస్తే పార్టీ పునాదులు గ్రామస్థాయికి వెళ్తాయన్న వాదన ఆయా నియోజకవర్గాల్లో ఉంది. తూర్పుప్రకాశంలో కంటే పశ్చిమప్రకాశంలోనే వైకాపాకు బలం ఎక్కువగా ఉందికాని దాన్ని కాపాడుకునేందుకు జగన్ ప్రత్యేక ఇంకా ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. అదేవిధంగా తూర్పు ప్రకాశంలోని మూడు నియోజకవర్గాల్లో కూడా పార్టీ పురోభివృద్ధి అనుకున్న స్థాయిలో లేదన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ఈ మూడు నియోజకవర్గాల్లో అవసరమైతే ఇన్‌ఛార్జులను మార్చి కొత్త నాయకత్వానికి అవకాశం కల్పించాల్సిన అవసరం ఉందన్న వాదన ఆ పార్టీ నుంచి వినిపిస్తోంది. కాగా సంతనూతలపాడు నియోజకవర్గానికి కొత్తవ్యక్తిని తీసుకువచ్చి ఇన్‌ఛార్జీగా నియమించారు. గతంలో ఆమె చిత్తూరు వైకాపా ఎంపి అభ్యర్థిగా పోటీ చేసి ఓటమి పాలయ్యారు. ఆమె నియామకంపై మండల స్థాయి నేతలతో చర్చించి ఉంటే బాగుండేదన్న వాదన పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది. ప్రధానంగా గ్రామస్థాయి నుంచి జిల్లాస్థాయి వరకు వైకాపా అభిమానులు ఉన్నప్పటికీ ఆ స్థాయిలో గ్రామస్థాయి నుంచి బలమైన నాయకత్వం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. జిల్లావ్యాప్తంగా జరిగిన గడపగడపకు వైకాపా కార్యక్రమంలో మిశ్రమస్పందన లభించింది. కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ప్రజల్లోకి తీసుకెళ్లి పార్టీని మరింత బలోపేతం చేస్తామన్న ఆలోచన నేతలకు తక్కువగా ఉంది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ప్రతి అంశాన్ని పావుగా వాడుకుని ప్రజల్లోకి వెళ్లేందుకే ప్రయత్నించారు. అదేవిధంగా పార్టీ శ్రేణులకు దశ దిశ నిర్దేశం చేసేవారు. కాని వైకాపా నేతలు అందుకు భిన్నంగా ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికల సమయంలో గళమెత్తితే సరిపోతుంది, ఇప్పటినుంచే ప్రజల్లోకి వెళ్లాలా, ప్రజలకు ఆ మాత్రం తెలియదా అన్న ఊహల్లో వైకాపా నేతలు ఉన్నారన్న విమర్శలున్నాయి. కాని ప్రజలు కూడా తెలివిగా ఓట్లు వేస్తున్నారన్న అంశాన్ని వైకాపా గుర్తించాల్సి ఉంది. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తామే అధికారంలోకి వస్తున్నాం, ఏ మంత్రి పదవీ అయితే బాగుంటుందన్న నిర్ణయానికి కూడా నేతలు వచ్చారు. తీరా ఓటర్లు బోల్తాకొట్టించటంతో వైకాపా శ్రేణులు చతికలపడ్డాయి. ప్రస్తుతం కూడా అదే ఊహాల్లో వైకాపా శ్రేణులు ఉన్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికైనా జిల్లాలోని ముఖ్యనేతలు భ్రమ వీడి కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేక విధానాలను ఎండగట్టడటమే కాకుండా గోడదూకే నేతలకు చెక్‌పెట్టి పార్టీని నమ్ముకున్న వారికే టిక్కెట్లు కేటాయించాలని పార్టీ శ్రేణులు ముక్తకంఠంతో విజ్ఞప్తి చేస్తున్నారు. ముఖ్యంగా జిల్లాలోని పశ్చిమ ప్రకాశంలో రెండు, తూర్పుప్రకాశంలోని మూడు నియోజకవర్గాలపై జగన్‌మోహన్‌రెడ్డి దృష్టి సారించకపోతే భారీ మూల్యం చెల్లించుకుంటారని ఆ పార్టీ నేతల నుంచే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
ఇదిఇలాఉండగా రాష్ట్రప్రభుత్వం ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మార్చినందుకు నిరసనగా శుక్రవారం జిల్లా కేంద్రమైన ఒంగోలులోని కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా వైకాపా ఆధ్వర్యంలో జరగనుంది. ఈ ధర్నాకు వైకాపా అధినేత జగన్‌మోహన్‌రెడ్డి హాజరు కానున్నారు. జిల్లాలోని 12 నియోజకవర్గాల నుంచి భారీగా కార్యకర్తలు, నాయకులు హాజరుకావాలని ఇప్పటికే వైకాపా జిల్లా అధ్యక్షుడు బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. ఈ ధర్నాలో ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూడా హాజరుకానున్నారు. మొత్తంమీద జగన్ జిల్లాకు వచ్చామా, వెళ్లామా అని కాకుండా నియోజకవర్గాలపై ప్రత్యేక దృష్టిసారించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న అభిప్రాయం పార్టీ శ్రేణుల నుంచి వినిపిస్తోంది.

అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
* జిల్లాకలెక్టర్ సుజాతశర్మ ఆదేశం

ఒంగోలు, డిసెంబర్ 8: ఉపాధి హామీ నిధుల అనుసంధానంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. గురువారం తన క్యాంప్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉపాధిహామీ పథకం అనుసంధానంతో జరుగుతున్న పనులపై జిల్లా అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించి సుదీర్ఘంగా పనుల పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఉపాధిహామీ నిధులతో జిల్లాలో పంచాయితీశాఖ ద్వారా చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాలు, అంగన్‌వాడీ కేంద్రాల భవనాల నిర్మాణపనులు వచ్చే ఫిబ్రవరి నెలాఖరులోగా పూర్తి చేయాలని సూచించారు. జిల్లాలో 241 పంచాయతీ భవనాలకు గాను 184 పూర్తయ్యాయని, మిగిలినవి వెంటనే పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా 533 అంగన్‌వాడీ కేంద్రాలకు గాను 46 మాత్రమే పూర్తిచేయడం సరైంది కాదన్నారు. ఇప్పటికైనా పనులను వేగవంతం చేయాలన్నారు. కాలవ్యవధిని నిర్ణయించుకుని నిర్మాణాలు పూర్తిచేయాలని, అందుకు సంబంధించి ప్రతి 15 రోజులకు ఒక ప్రగతి నివేదిక అందించాలన్నారు. అలాగే చేపట్టిన పనుల బిల్లుల చెల్లింపునకు ఎప్పటికప్పుడు వివరాలను అప్‌లోడ్ చేయాలని, ఎఫ్‌టివోలు జనరేట్ చేయాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఆటస్థలాల అభివృద్ధికి అంచనాలను వెంటనే రూపొందించాలన్నారు. జిల్లాలో 400 కిలోమీటర్ల సిసి రోడ్ల నిర్మాణాలకు గాను ఇప్పటివరకు 247.1 కిలోమీటర్లు పూర్తిచేశారని, మిగిలిన లక్ష్యాన్ని త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. జిల్లాలో 827 శ్మశ్మానవాటికల నిర్మాణానికి గాను 143 చోట్ల పనులు పురోగతిలో ఉన్నాయన్నారు. పశువులకు అవసరమైన పశుగ్రాసం పెంపకానికి, నీటితొట్టెల నిర్మాణానికి సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలన్నారు. పట్టుపరిశ్రమశాఖ పరిధిలో సూక్ష్మనీటి సేద్యం ద్వారా మల్బరీ మొక్కల పెంపకానికి చొరవ చూపాలని, మల్బరీ రీరింగ్ షెడ్ల నిర్మాణపనులు వేగవంతం చేయాలన్నారు. జిల్లాలో పాడి పశువులు, ఉద్యానపంట పెంపకం వైపు రైతులు దృష్టి సారించేలా పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ప్రధానంగా సముద్రతీర ప్రాంతాల్లో జీడిమామిడి, మామిడి, ఆపిల్‌బేర్, సపోట, జామ, పుచ్చకాయల తోటల పెంపకానికి రైతులను ప్రోత్సహించాలన్నారు. పశ్చిమ ప్రకాశంలో పసుపు, టమోటా పంటలకు ముద్రబ్యాంకు రుణాలను మంజూరు చేయించి ఔత్సాహిక రైతులకు చేయూత అందించాలన్నారు. జిల్లాలో బాగా పండించే రైతుల పొలాలకు ఎక్స్‌పోజర్ కల్పించి రైతుల సందర్శనలు ఏర్పాటు చేయాలని, తద్వారా ఎక్కువమంది రైతులు ఆ వైపు మొగ్గు చూపుతారని అన్నారు. జిల్లాలో 2700 బోరుబావుల రీఛార్జింగ్‌కు అనుమతి మంజూరు చేశామని, అందులో 400 మాత్రమే పురోగతిలో ఉన్నాయని, మిగిలిన వాటిని కూడా వెంటనే రీఛార్జింగ్ చేపట్టాలన్నారు. చినపవని గ్రామంలో ఉన్న 500 ఎకరాల అందమైన స్థలంలో ఉద్యానవన, వ్యవసాయశాఖల ద్వారా వీలైన తోటలు, పంటలతో అభివృద్ధి చేయాలన్నారు. బాగా పనిచేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాల కార్యకర్తలకు కూరగాయల విత్తనాల కిట్లను అందించి కూరగాయలు పండించేలా ప్రోత్సహించాలన్నారు. గృహనిర్మాణ శాఖ ద్వారా 2156 గృహాలు మంజూరుచేయగా 45 గృహాలకు అంచనాలు సిద్ధమయ్యాయని, తొమ్మిది పురోగతిలో ఉన్నాయని, మిగిలినవి కూడా సత్వరమే చేపట్టాలన్నారు. మండలాల్లో ఎంపిడివోలు, ఎఇలతో సమన్వయం చేసుకుని పనులను ముమ్మరం చేయాలన్నారు. ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనార్టీ, కాపు కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులను గుర్తించి సంతలు జరిగే సమయంలో సంబంధిత పశువైద్యుల సహకారంతో పాడిపశువుల కొనుగోలుకు చర్యలు తీసుకోవాలన్నారు. నీరు-చెట్టు, ఎన్‌టిఆర్ జలసిరి పథకాల అమలుకు మరింత చొరవ చూపాలన్నారు. గ్రామాల్లో పశుసంపదకు అవసరమైన తాగునీటి అవసరాల కోసం అంచనాలను రూపొందించాలన్నారు. అన్నిప్రభుత్వ శాఖలు వారి పరిధిలో కేటాయించిన లక్ష్యాలకు అనుగుణంగా రెండెంకల వృద్ధి సాధించేందుకు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

మోదీ పాలనతో దేశానికి జవసత్వాలు
* బిజెపి జిల్లా అధ్యక్షుడు పివి కృష్ణారెడ్డి స్పష్టం
కందుకూరు, డిసెంబర్ 8: ప్రధాని నరేంద్రమోదీ పాలన దేశానికి జవ సత్వాలను అందిస్తోందని బిజెపి జిల్లా అధ్యక్షులు పివి కృష్ణారెడ్డి అన్నారు. గురువారం ఆ పార్టీ మండల అధ్యక్షులు ఎం మాలకొండయ్య అధ్యక్షతన బిజెపి కార్యాలయంలో జరిగిన సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ మోదీ చేపట్టిన పెద్దనోట్ల రద్దు ఈ దేశ ఆర్థిక స్వాతంత్య్రానికి నాంది అన్నారు. వాస్తవాలను వక్రీకరించి ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేయడం సరికాదన్నారు. కాగా, బూత్ స్థాయిలో కమిటీలను ఏర్పాటుచేసి తద్వారా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని ఆయన నాయకులకు పిలుపునిచ్చారు. బంగారంపై ప్రతిపక్షాలు చేస్తున్న సత్యదూర ప్రకటనలు నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షులు సిహెచ్ పాండురంగయ్య, ప్రధాన కార్యదర్శి పివి నరసింహారావు, రాష్ట్ర కౌన్సిల్ మెంబర్ డి నరసింహం, జమీల్, మాల్యాద్రినాయుడు, బి కోటేశ్వరరావు, ఎం భూషయ్య, జె వైకుంఠం, కల్యాణ్, మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.

‘మత్స్యకారులు వేటకు వెళ్లొద్దు’

ఒంగోలు, డిసెంబర్ 8 : బంగాళాఖాతంలో ఏర్పడిన వాగ్ధా తుఫాన్ కారణంగా జిల్లాలోని కోస్తా తీర ప్రాంత మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లవద్దని మత్స్య శాఖ జిల్లా సహాయ సంచాలకులు లాల్ మహ్మద్ గురువారం ఆంధ్రభూమి ప్రతినిధికి తెలిపారు. సముద్రంలో వేటకు వెళ్లిన వారు తిరిగి రావాలని ఆయన కోరారు. తుఫాన్ కారణంగా మత్స్యకారులు సముద్రపు అంచున ఉన్న బోట్లు, తెప్పలు, వలలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆయన సూచించారు. తుఫాన్ కారణంగా మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
‘దివ్య దర్శనం కోసం దరఖాస్తులు స్వీకరణ’
మర్రిపూడి, డిసెంబర్ 8 : మండలంలోని 21 గ్రామ పంచాయతీల ప్రజలకు దేవాదాయ శాఖ దివ్వదర్శనం కోసం దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తహశీల్దార్ జగదీశ్వరరావు తెలిపారు. ఈ అవకాశాన్ని మండలంలోని అన్ని గ్రామాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. దేవాదాయ శాఖ వారు ఏర్పాటు చేసిన ఈ దివ్య దర్శనంలో భాగంగా 200 మందికి 8 ప్రసిద్ధ దేవాలయాల్లో దివ్వ దర్శన కార్యక్రమాలను ఉచితంగా ఏర్పాటు చేయనున్నట్లు ఆయన తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థులు స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన బాక్సులో దరఖాస్తులు వేయాలని ఆయన కోరారు. దరఖాస్తులను పూర్తిచేసి 15 రోజుల్లోపు తహశీల్దార్ కార్యాలయానికి అందజేయాలని కోరారు. 200 మందికి మాత్రమే ఈ అవకాశం కలుగుతుందన్నారు. పొదిలి దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ఈ అవకాశాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా ఏర్పాటు చేస్తున్నట్లు తహశీల్దార్ తెలిపారు.
‘విద్యుత్ వినియోగదారులు
సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చు’
మర్రిపూడి, డిసెంబర్ 8: మండలంలోని విద్యుత్ వినియోగదారులు ఎవరైనా ఆయా సమస్యలపై మర్రిపూడి విద్యుత్ శాఖ కార్యాలయంలో ఫిర్యాదులు చేసుకోవచ్చని నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎఈ మోహన్‌రెడ్డి తెలిపారు. గురువారం స్థానిక విద్యుత్ శాఖ కార్యాలయంలో ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ నెల్లూరు జిల్లా నుంచి బదిలీపై మర్రిపూడి మండలానికి వచ్చినట్లు తెలిపారు. విద్యుత్ సమస్యలపై వ్యవసాయ రైతులు, వినియోగదారులు ఎవరైనా ఫిర్యాదులు చేసుకోవచ్చని, సమస్యలకు పరిష్కార మార్గాలు చూపుతామని వివరించారు. ప్రధానంగా రైతులకు, వినియోగదారులకు మెరుగైన విద్యుత్‌ను అందిస్తున్నామన్నారు. విద్యుత్ బకాయిలు వెంటనే చెల్లించాలని ఆయన కోరారు.
పంట నష్టపరిహారం కోసం కృషి
* రైతులకు ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి హామీ
తర్లుపాడు, డిసెంబర్ 8: నకిలీ పురుగుమందులు వాడి పంట నష్టపోయిన రైతులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని మార్కాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే జంకె వెంకటరెడ్డి అన్నారు. గురువారం తర్లుపాడు గ్రామానికి చెందిన వెలుగు పుల్లారావు సాగుచేసిన మిర్చి పంటను ఆయన పరిశీలించారు. నకిలీ పురుగుమందులు వాడి పంటపూర్తిగా నష్టపోవడాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే వెంకటరెడ్డి మాట్లాడుతూ అధికారులు క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించి నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు చర్యలు చేపట్టాలని అన్నారు. ఇటీవలకాలంలో మీర్జాపేట గ్రామానికి చెందిన రైతులు నకిలీ మందులతో మిర్చిపంటను నష్టపోగా, సీతానాగులవరం గ్రామానికి చెందిన మరో రైతు నకిలీ విత్తనాలతో పంట నష్టపోయారని, ఇలా రైతులు నష్టపోతున్నారని అన్నారు. ఆరుగాలం కష్టించి పండించిన పంటను నకిలీ పురుగుమందులతో నష్టపోతుంటే అధికారులు ఆ పురుగుమందులు అమ్మినవారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని వాపోయారు. ప్రతి డీలర్‌షాపులో ధరల పట్టిక, రైతులకు బిల్లు ఇచ్చే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈకార్యక్రమంలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

నగదు రహిత లావాదేవీలపై అవగాహన
సంతనూతలపాడు, డిసెంబర్ 8 : సంతనూతలపాడు పంచాయితీ కార్యాలయంలో గురువారం ఐకెపి ఆధ్వర్యంలో మహిళలకు నగదు రహిత లావాదేవీలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ మారుతున్న సాంకేతిక పరిణామాల్లో మహిళలు కూడా పరిజ్ఞానాన్ని పెంపొందించుకొని సాంకేతికంగా అభివృద్ధికి నిదర్శనంగా నిలవాలని కోరారు. అందులో భాగంగానే డ్వాక్రా మహిళలకు ప్రభుత్వం ప్రకటించిన పసుపు, కుంకుమ కింద ప్రకటించిన రుణమాఫీ పత్రాలను డ్వాక్రా సంఘాలకు సర్పంచ్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి మహిళల అభ్యున్నతి కోసం నిరంతరం కృషి చేస్తున్నారన్నారు. ఈ అవకాశాలను వినియోగించుకొని మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఆయన కోరారు. అనంతరం రుణమాఫీ పత్రాలకు చెందిన చెక్కులను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిడివో కె మాలకొండయ్య, డ్వామా ఎపివో కె చిన్నకొండయ్య, పంచాయతీ కార్యదర్శి సైదులు, ఐకెపి సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

చంద్రన్న క్రిస్మస్ కానుక పంపిణీకి చర్యలు చేపట్టండి
* రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు ఆదేశం
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 8 : రాష్ట్రంలో చంద్రన్న క్రిస్మస్ కానుక ఈ నెల 20 నుంచి 26వ తేదీలోగా ప్రజలకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలని పౌరసరఫరాల శాఖ డైరెక్టర్ జి రవిబాబు పౌర సరఫరాల శాఖ అధికారులను ఆదేశించారు. గురువారం వరి ధాన్యం సేకరణ, చంద్రన్న క్రిస్మస్ కానుకలు, చంద్రన్న సంక్రాంతి కానుకలు తదితర అంశాలపై రాష్ట్ర పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ రవిబాబు జిల్లా సంయుక్త కలెక్టర్లు, జిల్లా పౌరసరఫరాల అధికారులు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్లు, డిప్యూటీ తహశీల్దార్లతో విజయవాడ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా పౌర సరఫరాల శాఖ డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో చంద్రన్న క్రిస్మస్ కానుకలు ఈ నెల 20 నుంచి 26వ తేదీలోగా ప్రజలకు పంపిణీ చేయాలన్నారు. చంద్రన్న సంక్రాంతి కానుకలు జనవరి 1 నుంచి 15వ తేదీలోగా పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. చంద్రన్న కానుకలో కందిపప్పు అరకిలో, పామాయిల్ అరకిలో, శనగలు అరకిలో, బియ్యం అరకిలో, గోధుమలు కిలో, నెయ్యి 100 గ్రాములు కలిపి ఒక బ్యాగ్‌లో ప్రజలకు పంపిణీ చేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలో అన్ని చౌకధరల దుకాణాల్లో అదనంగా కందిపప్పు, పామాయిల్, ఉప్పు, ఉల్లిపాయలు, గోధుమలు స్టాక్ ఉంచాలన్నారు. చౌకధరల దుకాణాల్లో ఈ పాస్ మిషన్లు వినియోగించి నగదు రహిత లావాదేవీలు నిర్వహించాలన్నారు. వినియోగదారులకు బ్యాంకు ఖాతా లేకుంటే వెంటనే బ్యాంకు ఖాతాలు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ నెల బ్యాంకు ఖాతాలేని వినియోగదారులకు అప్పుగా నిత్యావసర సరకులు ఇచ్చి జనవరి మాసంలో వారి ఖాతా నుంచి నగదు మినహాయించుకోవాలన్నారు. ఈ నెల 15వ తేదీలోగా చౌక ధరల దుకాణాల్లో నిత్యావసర వస్తువులు పంపిణీ పూర్తి చేయాలన్నారు. రాష్ట్రంలో వరి ధాన్యం సేకరణకు చర్యలు తీసుకోవాలని పౌర సరఫరాల శాఖ అధికారులను రాష్ట్ర పౌరసరఫరాలశాఖ డైరెక్టర్ ఆదేశించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా సంయుక్త కలెక్టర్ డాక్టర్ ఎం హరిజవహర్‌లాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి వెంకటేశ్వర్లు, పౌర సరఫరాల శాఖ జిల్లా మేనేజర్ వెంకటరమణ, సహాయ పౌర సరఫరాల అధికారి హనుమంతరావు, పౌర సరఫరాల శాఖ డిప్యూటీ తహశీల్దార్లు, ఎన్‌ఫోర్స్‌మెంట్ డిప్యూటీ తహశీల్దార్ తదితరులు పాల్గొన్నారు.

‘పెద్దనోట్ల రద్దు సాకుతో సంక్షేమానికి తూట్లు’
ఒంగోలు అర్బన్, డిసెంబర్ 8: పెద్దనోట్ల రద్దును సాకుగా చూపి ఎస్‌సి, ఎస్‌టి, బిసి సంక్షేమ పథకాలకు రాష్ట్రప్రభుత్వం తూట్లు పొడుస్తుందని దళిత మహాసభ రాష్ట్ర అధ్యక్షుడు ఎం జూలియన్ విమర్శించారు. గురువారం స్ధానిక జిల్లా కార్యాలయంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రన్న దళితబాట, చంద్రన్న సంక్షేమం పేరుతో ప్రభుత్వ పథకాలను ప్రకటించిందే కాని ఆచరణలో మాత్రం అమలు కావడం లేదన్నారు. ఈ సమావేశంలో దళిత సంఘాల నాయకులు విల్సన్, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.
‘పార్టీలు మారిన ఎమ్మెల్యేలు రాజీనామా చేసి గెలవాలి’
ఒంగోలు అర్బన్, నవంబర్ 8: వైకాపా తరపున పోటీచేసి గెలిచిన ఎమ్మెల్యేలు ఓట్లు వేసిన ప్రజలను మోసం చేసి డబ్బు, అధికారం, పదవుల కోసం తెలుగుదేశం పార్టీలో చేరారని, ఆ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి ప్రజల తీర్పు పొందాలని ఆ పార్టీ వాణిజ్యవిభాగం జిల్లా అధ్యక్షుడు డి క్రాంతికుమార్ గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఎన్నికలతోపాటు, రాష్ట్రంలో జరగాల్సిన మునిసిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలిచి చూపించాలని సవాల్ విసిరారు.

బ్యాంకులు, ఎటిఎంల వద్ద భారీగా జనం
* ప్రభుత్వ విధానాలపై జనం అక్రోశం
మార్టూరు, డిసెంబర్ 8: కేంద్ర ప్రభుత్వం పెద్దనోట్లు రద్దు చేయడంతో మొదటగా ప్రధాని నరేంద్రమోదీ నిర్ణయాన్ని ప్రజలు ప్రశంసించినప్పటికీ రోజులు గడిచే కొద్దీ కేంద్రప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇప్పటి వరకు కొత్తనోట్లు తగినంతగా మార్కెట్లోకి రాకపోవడం వల్ల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రతి రోజూ రూ.2వేలు డ్రా చేయాలంటే ఉదయం వెళ్లి సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. మధ్యతరగతి వర్గాలపై నోట్ల ప్రభావం ఎక్కువగా పడింది. కొన్ని ఎటిఎం సెంటర్లను ఇప్పటి వరకు బ్యాంకులు పట్టించుకున్న దాఖలాలు లేవు. మరికొన్ని సెంటర్లలో డబ్బులు పెడుతున్నప్పటికీ అవి ఎంతమందికి సరిపోతాయో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక మార్టూరులో రూ.2 వేల కొత్తనోట్లు మాత్రం చలామణిలో ఉన్నాయి. ఒకటి రెండు ప్రాంతాల్లో రూ.500నోట్లు పెట్టినప్పటికీ అవి అంతంత మాత్రంగానే ఉన్నాయి. వలపర్లలో రెండు బ్యాంకులు ఉండగా, క్యూలో నిలబడితే రూ.2వేల నోటు డ్రా చేస్తే చిల్లర లభించడం లేదు. నోట్లు రద్దు చేసి ఇన్ని రోజులు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం మాత్రం ఇప్పటి వరకు కొత్తనోట్లు మార్కెట్‌కు పంపండంలో విఫలమైందనే ఆరోపణలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తగు రీతిలో కృషి చేయాలని ప్రజలు కోరుతున్నారు.

‘బ్యాంకులు వెంటనే రైతులకు రుణాలు ఇవ్వాలి’
ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్
ఒంగోలు, డిసెంబర్ 8 : బ్యాంకులు వెంటనే రైతులకు పంటరుణాలను మంజూరుచేసి నగదును అందుబాటులో ఉండేవిధంగా రాష్ట్రప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. గురువారం రైతు ప్రతినిధి వర్గం లీడ్‌బ్యాంకు మేనేజర్ నరసింహరావును కలిసి వినతిపత్రాన్ని సమర్పించారు. ప్రభుత్వం పెద్దనోట్లు రద్దుచేసిన తరువాత అన్ని ప్రాంతాల్లో బ్యాంకులు రైతులకు రుణాలు మంజూరు చేయడంలో జాప్యం చేస్తున్నాయని లీడ్ మేనేజర్‌కు ప్రతినిధి బృందం వివరించింది. వర్షాలు కురిస్తే రైతులు పెట్టుబడుల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని, అందువల్ల వెంటనే రైతులకు పంటరుణాలు ఇచ్చే ప్రక్రియ పూర్తిచేయాలని, ఆ విధంగా పనిచేసేందుకు అన్ని బ్యాంకులకు సూచనలిచ్చి పర్యవేక్షణ జరపాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. పాలకేంద్రాలకు వచ్చిన నగదును కూడా బ్యాంకులు ఇవ్వడం లేదని, దానిపైన ఆధారపడే సన్న, చిన్నకారు రైతులు గ్రామాల్లో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారన్నారు. పాల రైతులకు నగదు వెంటనే అందేవిధంగా బ్యాంకులు చొరవ తీసుకోవాలని కోరారు. లీడ్‌బ్యాంక్ మేనేజర్ మాట్లాడుతూ ఒకటి, రెండురోజుల్లో అన్ని బ్యాంకుల బ్రాంచిలు పంట రుణాలిచ్చేందుకు దృష్టిపెట్టాలని కోరతామని వివరించారు. పాలరైతులకు కూడా నేరుగా రైతుల ఖాతాలకు నగదు చేరేవిధంగా బ్యాంకులకు సూచనలిస్తామని హామీ ఇచ్చారు. ఈ ప్రతినిధి బృందంలో రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు అబ్బూరి వెంకటేశ్వర్లు, జిల్లాకమిటీ సభ్యులు కొల్లూరి వెంకటేశ్వర్లు, కె కోటిరెడ్డి, బి లక్ష్మీనారాయణ తదితరులు ఉన్నారు.