ప్రకాశం

జిల్లాలో మారిన రాజకీయ ముఖచిత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 27:జిల్లాలో ఈ సంవత్సరం రాజకీయ ముఖచిత్రం పూర్తిగా మారింది. ఈ సంవత్సరం వైకాపాకి రాజకీయంగా భారీ కుదుపురాగా, తెలుగుదేశంపార్టీ మాత్రం మరింత బలం పుంజుకుంది. 2014 సంవత్సరం అసెంబ్లీ ఎన్నికల్లో వైకాపాకి చెందిన శాసనసభ్యులు ఆరుగురు గెలుపొందగా టిడిపి పక్షాన ఐదుగురు గెలిచారు. చీరాల నుండి స్వతంత్య్ర అభ్యర్థిగా ఆమంచి కృష్ణమోహన్ గెలుపొందారు. ఈ సంవత్సరంలోనే రాజకీయాలు చకచకా మారిపోయాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీకి చెందిన యర్రగొండపాలెం, గిద్దలూరు, కందుకూరు, అద్దంకి శాసనసభ్యులు పాలపర్తి డేవిడ్‌రాజు, ముత్తుమల అశోక్‌రెడ్డి, పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్‌లు ఆపార్టీకి గుడ్‌బై తెలుగుదేశంపార్టీ గూటికి చేరారు. అదేవిధంగా స్వతంత్య్ర అభ్యర్థిగా ఉన్న ఆమంచి కృష్ణమోహన్ కూడా తెలుగుదేశంపార్టీ గూటికి చేరటంతో మొత్తం జిల్లాలో ఆ పార్టీ బలం పదిమందికి పెరగ్గా వైకాపా తరపున సంతనూతలపాడు, మార్కాపురం శాసనసభ్యులు ఆదిమూలపు సురేష్, జంకె వెంకటరెడ్డి మాత్రమే మిగిలారు. గతంలో జిల్లాపరిషత్,ఇతర ముఖ్యమైన సమావేశాల్లో ప్రజల పక్షాన తమ వాణిని వినిపించేందుకు వైకాపా తరపున బలం ఉండేది. కాని నేడు ఆ బలం ఇద్దరికి పడిపోవటంతో ప్రజావాణిని వారిద్దరు మాత్రమే వినిపిస్తున్నారు.
ఇదిలా ఉండగా వైకాపా శాసనసభ్యులను తెలుగుదేశంపార్టీ వైపు తీసుకువచ్చేందుకు జిల్లా మంత్రి శిద్దా రాఘవరావు, టిడిపి జిల్లా అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్‌లు కీలకపాత్ర పోషించారు. వైకాపా శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహించి తెలుగుదేశంపార్టీ గూటికి చేరటంతో ఆ నియోజకవర్గాల్లో వైకాపా బలం తగ్గినట్లయ్యింది. కాగా వైకాపా శాసనసభ్యులు తెలుగుదేశంపార్టీ గూటికి చేరటంతో ఆయా నియోజకవర్గాల్లో కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. ప్రధానంగా అద్దంకి, గిద్దలూరు నియోజకవర్గాల్లో శాసనసభ్యుడు గొట్టిపాటి రవికుమార్, ఇన్‌చార్జి కరణం వెంకటేష్, బలరాం మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితులు ఉన్నాయి. ఒకరు తూర్పు అంటే మరొకరు పడమర అంటుండటంతో ఇటు పార్టీశ్రేణులు, అటు అధికారులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల బదిలీలు, అభివృద్ధి పనుల్లో ఆ నియోజకవర్గంలో రాజకీయ జోక్యం విపరీతంగా పెరిగింది. అదేవిధంగా గిద్దలూరు నియోజకవర్గంలో శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి, ఇన్‌చార్జి అన్నా రాంబాబు మధ్య సయోధ్య లేకపోవటంతో రాష్టప్రార్టీకి పెద్ద తలనొప్పిగా మారింది. ఈ నియోజకవర్గంలో ఎవరికివారే యమునా తీరే అన్నట్లు గ్రూపురాజకీయాలు నడుస్తున్నాయి. అభివృద్ధి పనుల్లోను వారిద్దరి మధ్య సఖ్యత పూర్తిస్థాయిలో కొరవడిందనే చెప్పవచ్చు. అదేవిధంగా కందుకూరు నియోజకవర్గంలో గతంలో శాసనసభ్యుడు పోతుల రామారావు, ఇన్‌చార్జి దివి శివరాం మధ్య ఘర్షణ వాతావరణం నెలకొనగా ప్రస్తుతం వారిద్దరి మధ్య సఖ్యత కొనసాగుతుంది.
ఇదిలా ఉండగా రాష్ట్రంలో తెలుగుదేశంప్రభుత్వం అధికారపగ్గాలు చేపట్టి రెండున్నర సంవత్సరాలు పూర్తయినప్పటికీ ఇంతవరకు కొంతమందికి నామినేటెడ్ పదవులను కట్టబెట్టకపోవటంతో నేతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జనచైతన్య యాత్రల్లో భాగంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు జిల్లాకు వచ్చిన సందర్భంగా పార్టీశ్రేణులకు ప్రభుత్వపరంగా సముచిత స్థానం ఉంటుందని భరోసా ఇచ్చి వెళ్లారు. కొత్తసంవత్సరంలోనైనా కొంతమంది నేతలకు నామినేటెడ్ పదవుల్లో అవకాశం దక్కుతుందో లేదో వేచిచూడాల్సి ఉంది.
కాగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌పార్టీ తరపున నూతన జిల్లా అధ్యక్షుడిగా బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రమాణస్వీకారం చేశారు. అదేవిధంగా పాత భవనం నుండి కొత్త్భవనంలోకి పార్టీకార్యాలయాన్ని మార్చారు. ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డి ఈ సంవత్సరంలో జిల్లా సమస్యలపై పార్లమెంటులో తమవాణిని వినిపించారు. అదేవిధంగా తననిధులతో నియోజకవర్గ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టిసారించారు. కేంద్ర,రాష్ట్రప్రభుత్వాలు అవలంబిస్తున్న ప్రజావ్యతిరేకవిధానాలను తమకు అనుకూలంగా మార్చుకుని పార్టీని బలోపేతం చేసేందుకు వైసిపి శ్రేణులు ముందుకురాని పరిస్థితి నెలకొందన్న వాదన ఆ పార్టీ నుండే వినిపిస్తోంది.
ఇదిలా ఉండగా కేంద్ర,రాష్ట్రప్రభుత్వాల వైఫల్యాలపై సిపిఎం, సిపిఐ పార్టీలు మొక్కుబడిగానే ఆందోళన బాట పట్టాయి. మొత్తంమీద జిల్లాలో తెలుగుదేశంపార్టీ ఈ సంవత్సరం పుంజుకోగా, వైకాపా మాత్రం భారీగా నష్టపోయిందనే చెప్పవచ్చు.
పైవార్తకు వైకాపా, తెలుగుదేశంపార్టీ జెండాలను వాడగలరు.