ప్రకాశం

రహదారిపై భద్రతా నియమాలు పాటించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,జనవరి 24:రహదారిపై భద్రతా నియమాలు పాటించి వాహనాలు నడపాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. మంగళవారం 28వ జాతీయభద్రతా వారోత్సవాలను పురస్కరించుకుని నగరంలోని రెవిన్యూ డివిజనల్ అధికారి కార్యాలయం వద్ద నుండి యువతి, యువకుల నడక పరుగును ఆయన జెండాఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ ప్రతిఒక్కరికి ప్రాణం ఎంతో ముఖ్యమని రహదారి భద్రత నియమాలు పాటించి ప్రమాదాలు నివారించాలన్నారు. భద్రతా నియమాలు పాటిస్తే మన కుటుంబాలకు మనమే రక్షగా ఉంటామన్నారు. వేగంకన్నా ప్రాణం మిన్నా అన్నారు. రహదారిపై వాహనాలు నడిపే సమయంలో చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. వాహనాన్ని నడిపేటప్పుడు సెల్‌ఫోన్లు వాడరాదన్నారు. ఆటోలు పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోరాదన్నారు. రహదారి భద్రతానియమాలు ప్రతిఒక్కరు పాటించి ప్రభుత్వానికి సహకారం అందించాలన్నారు. కేంద్రప్రభుత్వం రహదారి భద్రతపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరి అధ్యక్షతన ఐదు రాష్ట్రాల్లో ఇప్పటికే పర్యటించి, సమావేశాల నిర్వహించి రహదారి భద్రతపై అధ్యయనం చేసిందన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలన్నారు. నాలుగుచక్రాల వాహనాల్లో ప్రయాణీంచేవారు తప్పనిసరిగా సీట్‌బెల్టు ధరించి ప్రమాదాలను నివారించాలని మంత్రి శిద్దా రాఘవరావు సూచించారు. ఈకార్యక్రమంలో మంత్రి సతీమణి శిద్దా లక్ష్మిపద్మావతి, ప్రాంతీయ రవాణాశాఖాదికారి సుబ్బారావు, ఎంవిఐ నాయక్, తదితరులు పాల్గొన్నారు. ఈ ర్యాలీ స్థానిక అద్దంకి బస్టాండు సెంటరువరకు సాగింది.

అప్పుల పాలయ్యాం ఆదుకోండి
* కేంద్ర కరవుబృందం వద్ద ఏకరవు పెట్టిన రైతులు
కొనకనమిట్ల, జనవరి 24 : వర్షాభావ పరిస్థితుల వల్ల వేసిన పంటలు దెబ్బతిని పెట్టిన పెట్టుబడులు కూడా దక్కక అప్పులపాలయ్యామని రైతులు కేంద్ర కరవుబృందం వద్ద వాపోయారు. కొనకనమిట్ల, ఎదురాళ్లపాడు గ్రామాల్లో మంగళవారం కేంద్ర కరవు బృందం సభ్యులు రాంబాబు, ఎస్‌సి మీనా, హెచ్‌ఆర్ కన్నా పర్యటించారు. కొనకనమిట్లకు చెందిన కె కోటిరెడ్డి, కె దిబ్బరెడ్డి, ఎదురాళ్లపాడులో పి అంజిరెడ్డి, వెంకటేశ్వరరెడ్డి సాగుచేసిన కందిపంటలను పరిశీలించారు. దెబ్బతిన్న పైరును పరిశీలించి రైతుల ద్వారా వివరాలు సేకరించారు. ఎకరాకు 10 నుంచి 15 వేల రూపాయలు పెట్టుబడులు పెట్టామని, వర్షాలు లేకపోవడంతో పంటలు దెబ్బతిన్నాయని, కూలీ ఖర్చు కూడా రాకపోవడంతో కోతకోయకుండా పంటను వదిలేశామని తెలిపారు. 500 అడుగుల లోతు బోరు వేసినప్పటికీ నీరు పడటం లేదని, ఎకరాకు 5 క్వింటాళ్లకుపైగా దిగుబడి రావాల్సిన కందిపంట నేడు కోతకూలీకి కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. జిల్లా రైతుసంఘం అధ్యక్షుడు డి శ్రీనివాసులు మాట్లాడుతూ ఈ ప్రాంత శాశ్వత కరవు నివారణకు వెలుగొండ ప్రాజెక్టే శరణ్యమని, తగినన్ని నిధులు విడుదల చేసి ప్రాజెక్టు పనులు త్వరితగతిన పూర్తి చేయాలని కోరారు. తక్షణమే కరవు సహాయక చర్యలు చేపట్టి రైతులను ఆదుకోవాలని, ఇంకా వివిధ సమస్యలపై వినతిపత్రం అందచేశారు. వీరితోపాటు నియోజకవర్గ రైతు సంఘం అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు గోపాల్‌రెడ్డి, వెంకటకొండయ్య, పలువురు రైతులు ఉన్నారు.
రైతులను ఆదుకోవాలి : ఎమ్మెల్యే వెంకటరెడ్డి
ప్రతిఏటా కరవుకాటకాలతో అల్లాడుతున్న ఈ ప్రాంత రైతులను ఆదుకోవాలని, శాశ్వత కరవు నివారణకు వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేయాల్సిన అవసరం ఉందని, ఫ్లోరిన్ నీటి బెడద నుంచి కాపాడేందుకు సాగర్‌జలాలను సక్రమంగా సరఫరా చేయాలని ఎమ్మెల్యే వెంకటరెడ్డి కోరారు. అనంతరం కరవు బృందం అధికారుల నుంచి నివేదికలు స్వీకరించారు. కేంద్ర కరవుబృందంతో పాటు జిల్లా జాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్, కందుకూరు ఆర్డీఓ మల్లికార్జున, వ్యవసాయశాఖ జెడి మురళీకృష్ణ, పశుసంవర్థకజెడి రజనీకుమారి, డిఆర్‌డిఎ పిడి మురళీ, డ్వామా పిడి పోలప్ప, ఇన్‌ఛార్జి ఎడిఎ సంఘమేశ్వరరెడ్డి, ఎఓ కాశీవిశ్వనాథ్, పశువైద్యులు శ్రావణి, తహశీల్దార్ జి నరసింహం, ఎంపిడిఓ హనుమంతరావు, పలు శాఖల అధికారులు, ఎంపిపి రామనారాయణరెడ్డి, వైస్ ఎంపిపి ఉన్నం శ్రీను, టిడిపి నాయకులు, చప్పడి రామలింగయ్య, వి వెంకటరామిరెడ్డి, జయదేవ్‌కుమార్, వెంకటనారాయణ తదితరులు పాల్గొన్నారు.
ఆటోకార్మికులపై దాడులను ఆపాలని భారీ ర్యాలీ
ఒంగోలు అర్బన్,జనవరి 24:ఆటోకార్మికులపై ఆర్‌టిసి, ఆర్‌టిఒ, పోలీసు దాడులను ఆపాలని,సెంట్రల్ మోటారువాహనాల ఫీజులపెంపును వ్యతిరేకిస్తూ ఎపి ఆటోవర్కర్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ఒంగోలులో భారీర్యాలీ నిర్వహించి కలెక్టరేట్‌ను ముట్టడించారు. ఈసందర్బంగా కలెక్టరేట్ వద్ద జరిగిన ధర్నాలో ఆటో యూనియన్ రాష్ట్రప్రధానకార్యదర్శి ఆర్‌బి నరసింహరావు మాట్లాడుతూ ఆటోకార్మికులపై ఆర్‌టిసి, ఆర్‌టిఒ, పోలీసు అధికారుల దాడులను ఆపాలని డిమాండ్ చేశారు. కేంద్రప్రభుత్వం పెంచిన వాహనాల ఫీజును వెంటనే ఉపసంహరించుకోవాలని ప్రభుత్వాన్ని కోరారు. రవాణారంగ కార్మికులపై కేంద్రప్రభుత్వం ఇప్పటికి 20సార్లు డీజిల్, పెట్రోలుధరలను పెంచిందన్నారు. గత సంవత్సరం డిసెంబర్ 29వతేదీనుండి వాహనాల లైసెన్స్‌ఫీజులు భారీగా పెంచిందన్నారు. ఈ పెంపును వ్యతిరేకిస్తూ రాష్టవ్య్రాప్తంగా పోరాటాలు ఉద్ధృతం చేస్తామన్నారు. మోటారుసైకిల్ తదితర వాహనాలపై కోట్లాది రూపాయల భారంపడుతుందన్నారు. మరోపక్క విజయమాల్యా, అంబాని లాంటి పెట్టుబడిదారులకు కోట్లాధిరూపాయలు రాయితీలను ప్రకటిస్తుందన్నారు. ఈపెంపుదలను రద్దుచేయాలని డిమాండ్ చేశారు.రోడ్డురవాణారంగంలో లక్షలాదిమంది కార్మికులు ఐక్యంగా పోరాడితేనే సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. కార్మికులకు భారాలు మోపకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. సిఐటియు జిల్లాప్రధానకార్యదర్శి సిహెచ్ శ్రీనివాసరావుమాట్లాడుతూ గత రెండునెలలనుండి అధికారులుదాడులు చేయటం సరికాదన్నారు. కార్మికుల న్యాయమైన పోరాటానికి తమమద్దతు ఉంటుందన్నారు. ఆటోయూనియన్ జిల్లా అధ్యక్షుడు మహమ్మద్ బేగ్, నగర కార్యదర్శి శ్రీనివాసులు, సిఐటియు జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు సిహెచ్ మజుందార్, జి శ్రీనివాసులుతోపాటు జిల్లా నలుమూలలనుండి యూనియన్ నాయకులు పాల్గొని మాట్లాడారు.ముందుగా సిఐటియు జిల్లాకార్యాలయంనుండి ఆటో ర్యాలీ ప్రారంభమై అద్దంకిబస్టాండు, ట్రంకురోడ్డుమీదుగా కలెక్టరేట్ వరకు సాగింది. ఈనెల 23వతేదీ అర్ధరాత్రినుండి జిల్లా నలుమూలల్లోపోలీసులు ఆటోకార్మికులపై నిర్బంధాన్ని ప్రయోగించారన్నారు. టంగుటూరు, కొండెపి,కనిగిరి, గిద్దలూరు, ఒంగోలు తదితరప్రాంతాలనుండి వాహనాలను పోలీసులు అడ్డుకున్నారన్నారు. ఒంగోలుకు వెళ్తే అరెస్టుచేస్తామని బెదిరించారన్నారు. ఈసందర్బంగా ఆటో ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. ఈసందర్బంగా డిఆర్‌ఒ సమక్షంలో ఆర్‌టిసి ఆర్‌ఎం, ట్రాపిక్ సిఐ రాంబాబు, టూటౌన్‌సిఐ దేవప్రభాకర్‌లు యూనియన్ నాయకులతో చర్చించారు. ఆర్‌టిసి అదికారులు పోలీసులతో కలిసి రారని ఆర్‌టిసి ఆర్‌ఎం హామీ ఇచ్చారు. పెంచిన ఫీజులు తగ్గించాలని ప్రభుత్వానికి తెలియచేస్తామని, లైసెన్స్‌ల కోసం ఎడ్యూకేషన్ క్యాంపు నిర్వహిస్తామని ఆర్‌టిఒ హామీ ఇచ్చారు. జిల్లాలో ఆటోస్టాండ్ల ఏర్పాటుచేస్తామన్న హామీతో ఆందోళన కార్యక్రమాన్ని ముగించారు.
పొదిలిలో..
పొదిలి : తమ సమస్యలను పరిష్కరించాలంటూ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో మంగళవారం పొదిలిలో ఆటో డ్రైవర్లు ప్రదర్శన నిర్వహించారు. స్థానిక విశ్వనాధపురం నుండి ఆటోడ్రైవర్లు పట్టణ పురవీధుల గుండా ప్రదర్శన జరిపి మండల రెవిన్యూ కార్యాలయంలో వినతిపత్రాన్ని అందజేశారు. ఆటోలపై ఆర్టీసీ అధికారులు,సిబ్బంది దాడులకు పాల్పడటం ఆపివేయాలని ఆటోలకు లైసెన్సు, బ్రేక్ చార్జీలను ప్రభుత్వం ఉప సంహరించుకోవాలని వారు వినతిపత్రంలో కోరారు. ఈ కార్యక్రమంలో ఆ సంఘం అధ్యక్షులు జిలానీతో పాటు ఆటోవర్కర్లు పాల్గొన్నారు.