ప్రకాశం

ఎంఎల్‌సి అభ్యర్థుల భవితవ్యం తేలేది నేడే..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,మార్చి 19: పట్ట్భద్రుల, ఉపాధ్యాయ నియోజకవర్గాల తరపున పోటీచేసిన అభ్యర్థుల భవితవ్యం సోమవారం తేలనుంది. సోమవారం ఉదయం ఎనిమిదిగంటల నుండి చిత్తూరు జిల్లాకేంద్రంలో కౌంటింగ్ జరగనుంది. దీంతో ఈ కౌంటింగ్‌లో అదృష్టం ఎవరిని వరించనుందోనన్న ఉత్కంఠంలో పిడిఎఫ్, తెలుగుదేశంపార్టీ, కాంగ్రెస్‌పార్టీకి చెందిన నాయకులు ఉన్నారు. పిడిఎఫ్ తరుపున పోటీచేసిన పట్ట్భద్రుల ఎంఎల్‌సి నియోజకవర్గ అభ్యర్థి యండపల్లి శ్రీనివాసరెడ్డి, తెలుగుదేశంపార్టీ అభ్యర్థి వేమిరెడ్డి పట్ట్భారామిరెడ్డి, కాంగ్రెస్‌పార్టీ తరపున ఏలూరి రామచంద్రారెడ్డి, ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి పోటీచేసిన పిడిఎఫ్ అభ్యర్థి విఠపు బాలసుబ్రహ్మణ్యం, తెలుగుదేశంపార్టీ అభ్యర్థి ఏ వాసుదేవనాయుడులు ఫలితాలకోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు. ఎవరికివారే తమగెలుపుఖాయమన్న ధీమాలో ఉన్నారు. పిడిఎఫ్ అభ్యర్థులకు వైకాపా అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మద్దతు తెలపటంతో వారికి అనూహ్యంగా మద్దతు పెరిగినట్లైంది. దీంతో తమ గెలుపుఖాయమన్న ధీమాలో పిడిఎఫ్ అభ్యర్థులు ఉన్నారు. అదేవిధంగా ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు చేపడుతున్న సంక్షేమ పథకాలను చూసి ఓటర్లు తమకే పట్టం కడతారన్న ధీమాలో తెలుగుతమ్ముళ్లు ఉన్నారు. గతంలో పిడిఎఫ్ అభ్యర్థులే గెలుపొందటం జరిగింది. కాగా తెలుగుదేశంపార్టీ తరుపున పోటీచేసిన అభ్యర్ధులు నామమాత్రంగానే జిల్లాలో ప్రచారం చేపట్టారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దీన్నిబట్టి చూస్తే తమ గెలుపుఖాయమన్న ధీమాలో తెలుగుతమ్ముళ్ళు అతి ఆత్మవిశ్వాసంతో ఉన్నారన్న ఆరోపణలు కూడా తెలుగుతమ్ముళ్ల నుండి వినిపించాయి. ఇదిలా ఉండగా పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి మొత్తం 77,124మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సి ఉండగా 53వేల 063మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపాధ్యాయ నియోజకవర్గం నుండి 5557మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాల్సిఉండగా 5112మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. కాగా ఉదయం పదిగంటల నుండిసాయంత్రం నాలుగుగంటల వరకు పట్ట్భద్రుల నియోజకవర్గం నుండి కేవలం 47.87శాతంమంది ఓటర్లు మాత్రమే తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. నాలుగుగంటల నుండి సాయంత్రం ఆరుగంటల సమయంలోనే 71.43శాతానికి పెరిగింది. కేవరం రెండు గంటల వ్యవధిలోనే 23.56శాతంమంది ఓటర్లు తమఓటు హక్కును వినియోగించుకోవటంతో పిడిఎఫ్, తెలుగుతమ్ముళ్ళల్లో ఉత్కంఠ పరిస్ధితి నెలకొంది. ఈ రెండుగంటల వ్యవధిలోనే ఇంత ఓటింగ్‌శాతం పెరగటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. అదేవిధంగా ఉపాధ్యాయ నియోజకవర్గానికి సంబంధించి 91.97 శాతం మంది ఓటర్లు తమఓటు హక్కును వినియోగించుకోలేదు. జిల్లాలో 5557మంది ఉపాధ్యాయ ఓటర్లు ఉండగా వారిలో 5112మంది ఓటు వేయగా 445మంది తమఓటు హక్కును వినియోగించుకోలేదు. ప్రధానంగా ఓటర్లల్లో చైతన్యం లేకపోవటం ఒకపక్క అయితే ఎండ తీవ్రత కూడా ఎక్కువుగా ఉండటంతో ఓటర్లు సాయంత్రం వేళ తమ ఓటుహక్కును వినియోగించుకునేందుకు బారులు తీరారు. కాగా ఈ ఎన్నికలను రాష్టర్రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావుతోపాటు, జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్ధన్, ఎంఎల్‌సి మాగుంట శ్రీనివాసులరెడ్డిలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. పిడిఎఫ్ అభ్యర్థుల తరపున మాత్రం ప్రతిష్టాత్మకంగా ఒంగోలు పార్లమెంటుసభ్యుడు వైవి సుబ్బారెడ్డితోపాటు, వైకాపా తమ్ముళ్లు ఛాలెంజ్‌గా తీసుకుని ముమ్మరప్రచారాన్ని నిర్వహించారు. మొత్తంమీద సోమవారం సాయంత్రానికి అభ్యర్థుల భవిషత్యం తెలనుండటంతో పోటీలో ఉన్న వారు ఉత్కంఠంతో ఫలితాల కోసం ఎదురుతెన్నులు చూస్తున్నారు.

నేడు ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపు
* చిత్తూరులో ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు

చిత్తూరు, మార్చి 19 : తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపును సోమవారం చిత్తూరులోని పివి కెఎన్ డిగ్రీ కాలేజిలో నిర్వహించనున్నారు. తూర్పు రాయలసీమ పట్ట్భద్రులు, ఉపాధ్యాయల ఎమ్మెల్సీ ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్, ఎన్నికల రిటర్నింగ్ అధికారి సిద్ధార్థజైన్ తెలిపారు. ఆదివారం ఓట్ల లెక్కింపుపై కలెక్టర్ విలేఖర్లతో మాట్లాడుతూ ఈ లెక్కింపులో సుమారు 400 మంది సిబ్బంది పాలుపంచుకుంటారని తెలిపారు. దీనిపై ఇది వరకే ప్రత్యేక శిక్షణా కూడా ఇచ్చినట్లు తెలిపారు. కౌంటింగ్ ఏజెంట్ల ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రమైన చిత్తూరులోని పివికెఎన్ డిగ్రీ కాలేజిలో మూడంచెల భద్రత ఏర్పాటు చేసినట్లు తెలిపారు. స్ట్రాంగ్ రూమ్‌ల్లోని బ్యాలెట్ బాక్సులను ఏజంట్ల సమక్షంలోనే సీళ్లు తీస్తామన్నారు. ఈ లెక్కింపుపర్వం రాష్ట్ర ఎన్నికల పరిశీలకులైన శ్రీధర్‌రావు, శ్రీనరేష్‌ల ఆధ్వర్యంలో కొనసాగుతుందన్నారు. సోమవారం ఉదయం 8 గంటల నుంచి లెక్కింపు నిర్వహించనున్నట్లు వివరించారు. పట్ట్భద్రులకు 18 టేబుళ్లు, ఉపాధ్యాయల నియోజకవర్గానికి 10 టేబుళ్లు చొప్పున ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు చేపట్టి అనంతరం బ్యాలెట్ బాక్సుల లెక్కింపు కొనసాగుతుందన్నారు. ఈ కౌంటింగ్ ప్రక్రియను పూర్తిగా వీడియా ద్వారా చిత్రీకరిస్తామని తెలిపారు. కౌంటింగ్ హాల్లోకి ఎట్టి పరిస్థితుల్లో సెల్‌ఫోన్లను అనుమతించడం జరగదన్నారు.

కుదేలైన మిరప రైతు
* పెరిగిన ఖర్చులు * తగ్గిన ధరలు
కందుకూరు, మార్చి 19 : మిరప పంటను సాగు చేసిన రైతులను కష్టాలు వెంటాడుతూనే ఉన్నాయి. గతేడాది రైతులకు గిట్టుబాటు ధరలు అంతంత మాత్రంగానే ఉండటంతో రైతులు తీవ్ర ఇక్కట్లకు గురయ్యారు. ఈ ఏడాది కూడా మిరప సాగు చేసిన రైతులకు నష్టాలు తప్పడం లేదు. రైతులు మిరప సాగు చేసింది మొదలు నేటి వరకు వర్షాలు కురవలేదు. తీవ్ర వర్షాభావం కారణంగా ఈ ఏడాది మిరప సాగు చేసిన రైతులకు భారీగా దిగుబడులు తగ్గాయి. దీంతో వారు మరింత నష్టాలపాలయ్యారు. దిగుబడులు తక్కువగా ఉన్నా ధరలు ఉంటాయని భావించిన రైతులకు ఆశాభంగం వాటిల్లింది. గత ఏడాది కన్నా ఈ ఏడాది ధరలు గణనీయంగా తగ్గాయి. గత ఏడాది ఎండు మిర్చి ధర క్వింటా రూ. 10వేలు నుంచి 12వేలు వరకు పలికింది. ఈ ఏడాది రూ. 6వేలు నుంచి 8వేలు మాత్రమే ధర ఉందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ధరలు ఆశాజనకంగా ఉంటాయని భావించిన రైతులకు గత ఏడాదికి ఈ ఏడాదికి గరిష్టంగా నాలుగు వేలుకు పైచిలుకు ధరలు పతనం కావడంతో ఏమి చేయాలో అర్థంకాని అయోమయ పరిస్థితుల్లో మిరప రైతులు కొట్టుమిట్టాడుతున్నారు. ధరలు బాగుంటాయని, తమ అప్పులు తీరతాయని మిరప సాగు చేసిన రైతుల ఆశలు అడియాశలయ్యాయి. ఈ ఏడాది కందుకూరు డివిజన్‌లో వేలాది ఎకరాల్లో మిరపపంట సాగు చేశారు. కందుకూరు మండలంలోనే అధికారికంగా 350 హెక్టార్లు, అనధికారికంగా మరో వంద ఎకరాలు మిరప పంటను రైతులు సాగుచేశారు. ఒక్క ఎకరా మిరప సాగు చేయడానికి రూ. లక్ష నుంచి లక్షన్నర వరకు ఖర్చు అవుతుంది. ఖర్చులు పెరిగినప్పటికీ అప్పులు చేసి మరీ రైతులు మిరప సాగు చేశారు. పంటలను చీడపీడల నుంచి రక్షించుకోనేందుకు ప్రైవేటు వ్యాపారుల వద్ద నుంచి అధిక వడ్డీలకు నగదు తెచ్చి ఖర్చు చేశారు. ఇదిలావుండగా మరో వైపు ప్రకృతి కనె్నర చేయడంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. గత యేడాది వర్షాలు కొంతమేర సక్రమంగా కురవటంతో డివిజన్‌లో సాగు చేసిన మిరప పంట రైతులకు మంచి దిగుబడులు వచ్చాయి. గత ఏడాది ఎకరాకు సగటున 35 నుంచి 40 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఈ ఏడాది వార్ధా తుఫాన్ ప్రభావంతో డిసెంబర్‌లో కురిసిన వర్షాలకు కుంటలకు, చెరువులకు వర్షపు నీరు చేరింది. ఈ ఏడాది శనగ, మిరప, పొగాకు, పత్తి తదితర పంటలన్నింటినీ రైతులు ఒకేసారి సాగు చేశారు. రైతులు పంటలు సాగు చేసిన తదుపరి వర్షాలు కురవక పోవడంతో రైతులు పంటలను కాపాడుకునేందుకు ఆయిల్ ఇంజన్‌లు, మోటార్లు, పైపుల ద్వారా కుంటలు, చెరువుల్లో నిల్వ ఉన్న కొద్దిపాటిని సాగుకు వినియోగించారు. దీంతో కుంటలు, చెరువుల్లోని నీరు పూర్తిగా అడుగంటింది. మిరప పంట రైతులకు చేతికి రావాలంటే కనీసం ఇంకా ఐదారు తడులు సాగు చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం కుంటలు, చెరువుల్లో నీరు లేకపోవడంతో ఏమి చేయాలో పాలుపోని పరిస్థితి నెలకొంది. ఈ పరిస్థితుల్లో పంటలు ఎండి పోతాయని, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పెరిగన ఖర్చులు...
ఎకరా భూమిలో మిరప కాయలు కోయాలంటే గతంలో రూ. 1000 ఖర్చు అయ్యేది. ప్రస్తుతం ఆ ఖర్చు నాలుగు రెట్లు అధికమైందని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఒక్కొక్క కూలీకి రోజుకీ రూ. 200 నుంచి 300 వరకు చెల్లించాల్సి వస్తుంది. ప్రకృతి సహకరించక, పెట్టుబడులు పెరిగి అప్పుల్లో కూరుకుపోయిన మిరప రైతులను కమీషన్ ఏజెంట్లు, మధ్యవర్తులు ధరలు తగిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం స్పందించి మిరపతో పాటుగా మిగతా పంటలకు కూడా గిట్టుబాటు ధరలు కల్పించాలని, లేని పక్షంలో ఆత్మహత్యలే శరణ్యమని రైతులు ఆవేదన చెందుతున్నారు.

మిర్చి రైతులను పరుగులు పెట్టించిన మేఘాలు
సంతమాగులూరు, మార్చి 19 : సంతమాగులూరు మండలంలో ఈ ఏడాది 860 హెక్టార్లలో మిర్చి పంటను సాగు చేశారు. మొక్కదశ నుండి పెట్టుబడి చుక్కలను అంటింది. హైబ్రిడ్ వంగడాల సాగుతో ఎకరాకు 20 వేల వరకు నారు ఖర్చులు అయ్యాయి. భూమి సిద్ధం చేయడం, రసాయనిక ఎరువులు, పురుగు మందులు ఎకరాకు లక్ష రూపాయల వరకు ఖర్చు అయ్యాయి. వర్షాభావం తలెత్తడంతో సుదూర ప్రాంతాల నుండి రెండు, మూడు ఆయిల్ ఇంజన్లతో పొలం తడపాల్సి రావడం, కొన్ని ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా పైరు తడపడం వంటివి భారీ వ్యయంతో కూడుకుంది. ప్రస్తుతం నాణ్యమైన మిర్చి రకం 6 వేల నుండి ఏడు వేల వరకు మాత్రమే ధర పలకడంతో పెట్టుబడులు కూడా వచ్చే పరిస్థితి లేదు. దీనికి తోడు ప్రకృతి వైపరీత్యాలు కూడా రైతులను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి. తరచూ చిరుజల్లులు పడటం, మేఘావృతం కావడంతో వర్షం జల్లులకు భయపడి కల్లాల పై ఉన్న మిర్చి పంటను కాపాడుకునేందుకు వేలకు వేలు వెచ్చించి తార్పాలిన్ పట్టలను కొనుగోలు చేస్తున్నారు. ఆదివారం మేఘావృతం చిరుజల్లులు కురవడంతో ఒక్కసారిగా మిర్చి రైతుల్లో ఆందోళన మొదలైయ్యింది. మండుటెండలో ఆకస్మికంగా చిరుజల్లులు పడటంతో పంటను కాపాడుకునేందుకు కుటుంబ సమేతంగా కల్లాల వైపు పరుగులు తీశారు. ప్రభుత్వం మిర్చి పంటకు గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని మిర్చ రైతులు కోరుతున్నారు.

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
- మరొకరికి తీవ్ర గాయాలు
పొదిలి, మార్చి 19 : రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం పొదిలి మండలంలోని కుంచేపల్లి గ్రామం వద్ద జరిగింది. దర్శి పట్టణానికి చెందిన ఎం ప్రభాకర్ , జి వెంకట సుబ్బారావు పొదిలి నుండి మోటార్ సైకిల్‌పై దర్శికి వెళుతుండగా మార్గ మధ్యలోని కుంచేపల్లి గ్రామ సమీపంలో మోటార్ సైకిల్‌తో చెట్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న 108 సిబ్బంది హుటాహుటిన అక్కడికి వెళ్లి క్షతగాత్రులను చికిత్స నిమిత్తం పొదిలి ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. అయితే చికిత్స పొందుతూ వెంకట నరసింహారావు మృతి చెందారు. ఇదే ప్రమాదంలో గాయపడిన ప్రభాకర్‌ను మెరుగైన చికిత్స నిమిత్తం ఒంగోలులోని ఓ ప్రైవేట్ వైద్యశాలకు తీసుకెళ్లారు. సంఘటనపై పొదిలి సిఐ శ్రీనివాసరావు నేతృత్వంలో ఎస్‌హెచ్‌వో ప్రతిభాపాటిల్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

రోడ్డు ప్రమాదంలో విద్యార్థి దుర్మరణం
కందుకూరు, మార్చి 19: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతిచెందిన సంఘటన పట్టణంలోని సూర్య బార్ అండ్ రెస్టారెంట్ సమీపంలో ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. స్థానికులు, పట్టణ ఎస్సై టి శ్రీరామ్ తెలిపిన వివరాలు ఈవిధంగా ఉన్నాయి. పట్టణంలోని సాయినగర్‌లో నివాసం ఉంటున్న హరికృష్ణసింగ్ ట్రాక్టర్ మెకానిక్‌గా జీవనం సాగిస్తూ తన ఒక్కగానొక్క కుమారుడు సందీప్ (21)ను చెన్నైలోని సత్యభామ కళాశాలలో ఇంజనీరింగ్ చదివిస్తున్నారు. ఇంజనీరింగ్ ఆఖరి సంవత్సరం చదువుతున్న సందీప్ కళాశాలకు శని, ఆదివారాలు సెలవు కావడంతో శుక్రవారం రాత్రి కందుకూరులోని తల్లిదండ్రుల వద్దకు వచ్చాడు. తల్లిదండ్రులు, స్నేహితులతో సరదగా గడిపాడు. ఆదివారం సాయంత్రం తండ్రి హరికృష్ణసింగ్ తన కుమారునికి డబ్బులు ఇచ్చి తన మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ పోయించుకురమ్మని పంపారు. దీంతో సందీప్ మోటార్‌సైకిల్‌లో పెట్రోల్ పోయించుకుని తిరిగి వస్తూ పట్టణంలోని సూర్య బార్ అండ్ రెస్టారెంట్ వద్దకు చేరుకున్నాడు. అదే సమయంలో కనిగిరి వైపు నుంచి ఒంగోలు వైపు వెళ్తున్న లారీ ఎదురుగా వస్తున్న ఆటోను తప్పించబోయి మోటార్‌సైకిల్‌ను ఢీకొనడంతో సందీప్ అక్కడికక్కడే మృతిచెందాడు. కుమారుడు మృతిచెందిన సమాచారం అందుకున్న తండ్రి హరికృష్ణసింగ్ హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీరుమున్నీరుగా విలపించారు. తన ఒక్కానొక్క కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృత్యువాత పడటంతో ఆయన విలపించిన తీరు స్థానికులను సైతం కంటతడి పెట్టించింది. సమాచారం అందుకున్న పట్టణ ఎస్‌ఐ పోలీసు సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాద వివరాలను అడిగి తెలుసుకున్నారు. ప్రమాదానికి కారణమైన లారీని, ద్విచక్ర వాహనాన్ని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. సందీప్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. తండ్రి హరికృష్ణసింగ్ ఫిర్యాదు మేరకు పట్టణ ఎస్‌ఐ శ్రీరామ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ట్రాఫిక్ సమస్యే రోడ్డు ప్రమాదాలకు కారణం
పట్టణంలో మితిమీరిన ట్రాఫిక్ సమస్య కారణంగా పట్టణంలో నిత్యం ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణంలో పెరిగిన వాహనాలు దృష్ట్యా రోడ్ల విస్తరణ జరగక పోవడంతో తరచూ ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. పాలకులు, అధికారుల నిర్లక్ష్యం కారణంగా కందుకూరుకు మంజూరైన బైపాస్ రోడ్డు ఇంతవరకు రూపుదాల్చలేదు. దీంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. ఇప్పటికైనా పాలకులు, అధికారులు స్పందించి బైపాస్ రోడ్డు నిర్మాణాన్ని చేపట్టి హెవీ వాహనాలను బైపాస్ ద్వారా దారి మళ్లిస్తే పట్టణంలో ఎలాంటి ప్రమాదాలు జరగకుండా నివారించవచ్చునని పట్టణ ప్రజలు కోరుతున్నారు.