ప్రకాశం

రోడ్డుప్రమాదాల నివారణకు అత్యంత ప్రాధాన్యత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు,డిసెంబర్ 24:రానున్న కాలంలో రాష్ట్రంలో రోడ్డుప్రమాదాల నివారణకు అత్యధిక ప్రాధాన్యతను ఇవ్వనున్నట్లు డిజిపి నండూరి సాంబశివరావు తెలిపారు. శనివారం ఒంగోలులోని జిల్లా పోలీసుకార్యాలయంలోని ఐటి సమావేశమందిరంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశం మొత్తంమీద ఒక సంవత్సరానికి ఐదులక్షల రోడ్డుప్రమాదాలు జరుగుతున్నాయని, ఈప్రమాదాల్లో ఐదులక్షలమంది గాయపడుతున్నట్లు తెలిపారు. వీరిలో ఒక లక్షా 49వేలమంది మృత్యువాత పడుతున్నట్లు తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో సంవత్సరానికి 24వేల రోడ్డుప్రమాదాలు జరుగుతుండగా 24వేల మంది ప్రమాదాల్లో గాయపడుతున్నట్లు తెలిపారు. ఈ ప్రమాదాల్లో ఎనిమిదివేల మంది మృతిచెందుతున్నారని పేర్కొన్నారు. దీంతో రోడ్డుప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టిని సారించి 2020నాటికి ఈ రోడ్డుప్రమాదాల సంఖ్యను సగానికి అయినా తగ్గించే లక్ష్యంతో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. రానున్న ఏప్రిల్ ఒకటి నుండి సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా ఎవరైనా జాతీయ రహదారికి సమీపంలో బ్రాందీషాపులు, బెల్టుషాపులు నిర్వహిస్తే అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకోనున్నట్లు డిజిపి హెచ్చరించారు. రాష్ట్రంలో యూనిఫాం రహిత పోలీసింగ్ విధానాన్ని విస్తత్రపరిచేందుకు, కమ్యూనిటీ పోలీసింగ్ సిస్టంను విస్తరించబోతున్నట్లు కూడా ఆయన తెలిపారు. చిత్తూరు జిల్లాలో ఈ ప్రయోగం మంచి ఫలితాలను ఇచ్చినందున రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో కూడా ఈ విధానానికే ప్రాధాన్యత క్రమంలో విస్తరింపచేసేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. సేవాదళ్ పోలీసును కూడా ఇటీవల జరిగిన పుష్కరాల సమయంలో పోలీసుశాఖ ఉపయోగించుకోవటం జరిగిందన్నారు. దీంతో పోలీసు శాఖపై కూడా గౌరవం పెరిగినట్లు తెలిపారు. పండగలు, తిరునాళ్లు వంటి సందర్బాల్లో సేవాదళ్ కార్యకర్తల సేవలను వినియోగించుకునేందుకు కూడా భవిష్యత్‌లో ప్రణాళికలు సిద్ధం చేసినట్లు తెలిపారు. వచ్చే జనవరి నుండి యూనిఫాం రహిత పోలీసింగ్ విధానంపై దృష్టి పెట్టనున్నట్లు తెలిపారు. పోలీసుల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో పోలీసు క్వార్టర్లు శిధిలావస్థకు చేరుకున్నాయని పోలీసు హౌసింగ్ కార్పొరేషన్ ద్వారా క్వార్టర్ల మరమ్మతులు, నూతన నిర్మాణాలకు చర్యలు చేపట్టన్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 5600మంది పోలీసుకానిస్టేబుళ్లను రిక్రూట్‌మెంటు చేసుకున్నామని, వీరికి శిక్షణ పూర్తయిన తరువాత అవసరమైన ప్రాంతాల్లో వీరిని నియమించనున్నట్లు, తద్వారా పోలీసుస్టేషన్ల సిబ్బంది కొరతను నివారించవచ్చునని తెలిపారు. తనకు అవకాశం దొరికిన సమయాల్లో పోలీసుస్టేషన్లను ఆకస్మికంగా తనిఖీలు నిర్వహిస్తానని ఆయా స్టేషన్లల్లో నిల్వ ఉంచిన రికవరి మోటారుసైకిళ్లను పరిశీలిస్తానన్నారు. ఆ వాహానాలకు సంబంధించిన టైర్లు, ఇతర పరికరాలు ఏమైనా మార్పు చేసినట్లు గమనిస్తే సంబంధిత స్టేషన్ అధికారిని బాధ్యుడిగా చేస్తామని హెచ్చరించారు. విలేఖర్ల సమావేశంలో ఎస్‌పి త్రివిక్రమవర్మ, అదనపు ఎస్‌పి దేవదానం తదితరులు పాల్గొన్నారు.

ఒంగోలులో పెట్రోలుబంకును ప్రారంభించిన డిజిపి నండూరి
ఒంగోలు,డిసెంబర్ 24:ఒంగోలులోని కొత్తపట్నం బస్టాండు సెంటర్‌లో పోలీసుశాఖ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన పెట్రోలు బంకును రాష్ట్ర డిజిపి నండూరి సాంబశివరావు శనివారం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో సుమారు పోలీసుశాఖ ఆధ్వర్యంలో సుమారు 15 పెట్రోలు బంకులు ఉన్నట్లు తెలిపారు. ఒంగోలులో నూతనంగా పెట్రోలుబంకును ఏర్పాటుచేయటం సంతోషకరమన్నారు. తాను ఒంగోలువాసిని అని తన చిన్ననాటి సమయంలో ఈప్రాంతంలో చిల్లచెట్లు ఉండేవని అయితే ప్రస్తుతం పెట్రోలుబంకును ఏర్పాటుచేయటం వలన కమర్షియల్ స్థలంగా మారటం సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోని పోలీసుశాఖకు చెందిన కొన్ని ఖాళీస్థలాలను సేకరించి అందులో కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణాలను చేపట్టి తద్వారా వచ్చే ఆదాయాన్ని పోలీసుశాఖ వెల్పేర్ ఫండ్‌కు ఉపయోగించేందుకు చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇప్పటికే కమర్షియల్ కాంప్లెక్స్‌ల ద్వారా సుమారు 50కోట్లరూపాయల వరకు ఆదాయం వస్తుందని దీనిని వందకోట్లరూపాయలకు చేసేందుకు కృషిచేయనున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఫండ్‌ను పోలీసుల సంక్షేమానికి ఎక్కువభాగాన్ని ఉపయోగించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.
జిల్లా ఎస్‌పి కార్యాలయంలో పోలీసు వెబ్‌సైట్‌ను డిజిపి సాంబశివరావుప్రారంభించారు. కాగా ఒంగోలులోని పురాతమైన జెఎంబి చర్చిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడి పాస్టర్లు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి డిజిపి నండూరి సాంబశివరావును ఆశీర్వదించారు. ఈ సందర్భంగా డిజిపి మాట్లాడుతూ తాను ఒంగోలులోనే జన్మించానని ఒంగోలులోని ఎబిఎం కాలేజి, శర్మాకాలేజిల్లో తన విద్యాభ్యాసం సాగినట్లు తెలిపారు. ఎబిఎం కాలేజిలో తన తండ్రి టీచర్‌గా అప్పట్లో పనిచేయటంతో తాను కూడా ఎబిఎం కాలేజిలో చదివినట్లు తెలిపారు. తనకు ఒంగోలులో ఎంతోమంది స్నేహితులు ఉన్నారని ఒక్కసారి ఆయన చిన్ననాటి జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. సుమారు 150 చరిత్రగలిగినటువంటి జెఎంబి చర్చిలో క్రిస్మస్ సందర్భంగా జరుగుతున్న ప్రార్థనాకార్యక్రమంలో పాల్గొనటం తనకు ఎంతో సంతోకరంగా ఉందన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సోదరులందరికి క్రిస్మస్ శుభాకాంక్షలను తెలిపారు. ఇదిలా ఉండగా డిజిపి నండూరి సాంబశివరావును జిల్లా తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, తెలుగురైతు రాష్ట్రఅధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, మాజీమంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వేర్వేరుగా మర్యాదపూర్వకంగా కలవటం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్‌పి త్రివిక్రమవర్మ, అదనపు ఎ దేవదానం, జిల్లా ఫైర్ ఆఫీసర్ పెద్దిరెడ్డి, విజిలెన్స్ అదనపు ఎస్‌పి బాలవెంకటేశ్వరరావు, జిల్లాలోని డిఎస్‌పిలు, సిఐలు, ఎస్‌ఐలు పాల్గొన్నారు. డిజిపి ఒంగోలుకు వచ్చిన సందర్భంగా భారీగా పోలీసుబందోబస్తును ఏర్పాటుచేశారు.
జిల్లాలో సాగు, తాగునీటి అవసరాల కోసం
మరో నాలుగు టిఎంసిల నీరు
ఆర్‌డబ్ల్యుఎస్ అధికారుల పనితీరుపై మండిపడ్డ మంత్రి శిద్దా
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు,డిసెంబర్ 24: జిల్లాలో సాగు, తాగునీటి అవసరాల కోసం అదనంగా మరో నాలుగు టిఎంసిల నీటిని ఎన్‌ఎస్‌పి కాల్వ ద్వారా విడుదల చేయాలని ముఖ్యమంత్రిని కోరతామని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు అన్నారు. శనివారం స్థానిక సిపిఒ సమావేశమందిరంలో జిల్లాలో సాగు,తాగునీటి సమస్యలపై శాసనసభ్యులు, అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో తాగునీటి అవసరాల కోసం రాష్ట్రప్రభుత్వం ఆరు టిఎంసిల నీటిని విడుదల చేసేందుకు చర్యలు తీసుకుందన్నారు. జిల్లాలో వర్షాభావ పరిస్థితుల్లో ఆరుతడి పంటలు, మిర్చి 70వేల హెక్టర్లల్లో పంటలు ఎండిపోకుండా తాగునీటి అవసరాలను తీర్చేందుకు అదనంగా నాలుగు టిఎంసిల సాగర్‌నీటిని విడుదల చేసేందుకు ముఖ్యమంత్రిని తనతోపాటు శాసనసభ్యులు, కలెక్టర్ కలిసి కోరతామన్నారు. ముఖ్యమంత్రి సాగు, తాగునీటి సమస్యలు లేకుండా చర్యలు తీసుకుంటామన్నారు. రైతాంగానికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చివరి భూములకు సాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో తీవ్రమైన సాగునీటి సమస్య ఉన్న ప్రాంతాల్లో ట్యాంకర్ల ద్వారా నీటి సరఫరా చేయాలని ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులను ఆదేశించారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖ ద్వారా గ్రామాల్లో నీటి సరఫరా చేసి ట్యాంకర్లకు బిల్లులు వెంటనే చెల్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆర్‌డబ్ల్యుఎస్ శాఖలో నిధులు ఉన్నప్పటికీ ఏడునెలల నుండి బిల్లులు చెల్లించకపోవటంపై మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్‌డబ్ల్యుఎస్ అధికారులు పద్దతి మార్చుకోవాలని హెచ్చరించారు. ఎన్‌ఎస్‌పి నుండి విడుదలయ్యే నీటిని చివరిభూముల వరకు వెళ్లే విధంగా ఆర్‌డబ్ల్యుఎస్, ఎన్‌ఎస్‌పి ఇంజనీర్లు కాల్వలపై పర్యవేక్షించాలన్నారు. జిల్లాకలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ ఎన్‌ఎస్‌పి ద్వారా విడుదలయ్యే సాగర్‌నీటిని తాగునీటికి ప్రాధాన్యత ఇస్తూ పంటలకు కూడా నీరు అందిస్తామన్నారు. జిల్లాలో ఎన్‌ఎస్‌పి నుండి అదనంగా నాలుగు టిఎంసిల నీరు విడుదల చేసేందుకు ప్రభుత్వాన్ని కోరతామన్నారు. ఎన్‌ఎస్‌పి కాల్వ నుండి విడుదలయ్యే నీటిని చివరి భూములకు వెళ్లే వరకు మధ్యలో ఎవరు ఎలాంటి అవసరాల కోసం నీటిని వినియోగించవద్దని కోరారు. ఎన్‌ఎస్‌పినీటిని సక్రమంగా సరఫరా చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో సహకరించాలన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర తెలుగురైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి మాట్లాడుతూ జిల్లాలోని చివరిభూములకు సాగు,తాగునీరు అందాలంటే 85/3మైలు వద్ద మూడువేల క్యూసెక్కుల నీరు తగ్గకుండా విడుదల చేయాలన్నారు. ఎన్‌ఎస్‌పి కాల్వ కింద ఉన్న తాగునీటి పథకాలు, రామతీర్థం ప్రాజెక్టుకు మొదటి ప్రాధాన్యత ఇచ్చి నింపేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గుండ్లకమ్మ ప్రాజెక్టు కింద ఉన్న ఉలిచి, అమ్మనబ్రోలుకు తాగునీరు అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ జిల్లాలో వ్యవసాయ, తాగునీటి అవసరాల కోసం తొమ్మిది టిఎంసిల నీరు అవసరం ఉందని ప్రస్తుతం ఆరు టిఎంసిల నీటిని ప్రభుత్వం విడుదల చేస్తుందన్నారు. జిల్లాలో తాగునీటి అవసరాల దృష్ట్యా మరో నాలుగు టిఎంసిల నీరు విడుదల చేసేందుకు ముఖ్యమంత్రిని కలుద్దామన్నారు. రామతీర్థం ప్రాజెక్టును సాగర్‌నీటితో నింపి ఒంగోలు,కందూకురు, కనిగిరి, సంతనూతలపాడు నియోజకవర్గాల ప్రజల దాహర్తిని తీరుద్దామన్నారు. గుంటూరులో ఎన్‌ఎస్‌పి నీటి విడుదల విషయంపై చర్చించేటప్పుడు ప్రకాశం జిల్లా ప్రజాప్రతినిధులు కూడా వెళ్దామన్నారు. యర్రగొండపాలెం శాసనసభ్యుడు పాలపర్తి డేవిడ్‌రాజు మాట్లాడుతూ జిల్లాకు సాగర్ నీరు విడుదల విషయంపై గుంటూరు జిల్లావారు అన్యాయం చేస్తున్నారన్నారు. యర్రగొండపాలెంలో సీజన్‌తోపాటు సంబంధం లేకుండా గతరెండుసంవత్సరాలనుండి తీవ్ర తాగునీటి సమస్యలున్నాయన్నారు. సుమారు 75శాతం గ్రామాల్లో 6.5కోట్లతో తాగునీటిని రవాణాచేస్తున్నామన్నారు. తక్షణం కనీసం 60 తాగునీటి బోర్లు మంజూరుచేయాలని, ఎన్‌ఎస్‌పి నీటితో దూపాడు, గొల్లపల్లి, ముటుకుల,దూపాడు -2 నీటి పథకాలను నింపాలన్నారు. గిద్దలూరు శాసనసభ్యుడు ముత్తుమల అశోక్‌రెడ్డి మాట్లాడుతూ పశ్చిమప్రాంతమైన గిద్దలూరులో తీవ్రమైన తాగునీటి సమస్య ఉందని, 750అడుగుల లోతుబోర్లు కూడా పనిచేయటం లేదన్నారు. తక్షణమే 60 తాగునీటిబోర్లను మంజూరుచేయాలన్నారు.దుపాడు తాగునీటి పధకం ద్వారా గిద్దలూరుకు పైపులైను ఏర్పాటుచేసి తాగునీటి సమస్యను పరిష్కరించాలన్నారు. కనిగిరి శాసనసభ్యుడు కదిరి బాబురావు మాట్లాడుతూ కనిగిరిలో 121 హేబిటేషన్లల్లో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందన్నారు. వర్షాధారం తప్ప ఎన్‌ఎస్‌పినుండి నీరు వచ్చేపరిస్ధితి లేదన్నారు. తాగునీటిని ట్యాంకర్ల ద్వారా సరఫరా చేయాలని కోరారు. ఈసమావేశంలో కందుకూరు, అద్దంకి శాసనసభ్యులు పోతుల రామారావు, గొట్టిపాటి రవికుమార్, మార్కాపురం, కందుకూరు మాజీ శాసనసభ్యులు కందుల నారాయణరెడ్డి, దివి శివరాంతో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

దొనకొండలో పరిశ్రమల ఏర్పాటుకు చర్యలు * అనంతపురం - అమరావతి ఎక్స్‌ప్రెస్ వే దొనకొండ మీదుగానే
* ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ జి నివాస్
దొనకొండ, డిసెంబర్ 24: దొనకొండ మండలంలో పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వౌలిక వసతుల గురించి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, అనంతపురం నుంచి అమరావతికి నిర్మించే ఎక్స్‌ప్రెస్ వే రోడ్డు నిర్మాణం దొనకొండ మీదుగానే జరుగుతుందని ఎపిఐఐసి మేనేజింగ్ డైరెక్టర్ జి నివాస్ అన్నారు. ఆయన శనివారం దొనకొండ మండలంలోని కొచ్చర్లకోట, రుద్రసముద్రం గ్రామాల్లో ప్రభుత్వ భూములను పరిశీలించి అనంతరం పాత్రికేయుల సమావేశంలో మాట్లాడుతూ తాను నూతనంగా ఉద్యోగ బాధ్యతలు చేపట్టిన తర్వాత మొదటిసారిగా దొనకొండ మండల ప్రభుత్వ భూములను పరిశీలించాలనే ఉద్దేశంతో వచ్చినట్లు తెలిపారు. దొనకొండ మండలంలో పరిశ్రమల ఏర్పాటుకు నీటి సౌకర్యం గురించి వెలుగొండ ప్రాజెక్టు నుంచి నీరు తీసుకునేందుకు ఇరిగేషన్ అధికారులతో ప్రభుత్వం చర్చలు జరిపిందని, దానికి సంబంధించిన ప్రతిపాదనలు సిద్ధం అవుతున్నాయని తెలిపారు. మండలంలో ఇప్పటివరకు ఎపిఐఐసికి ప్రభుత్వ భూముల సమగ్రనివేదిక పూర్తిస్థాయిలో అందలేదని, కొన్ని చిన్నచిన్న కారణాలతో కొన్ని భూములు ఆగాయని, సమగ్ర నివేదిక ప్రభుత్వానికి చేరినవెంటనే ప్రభుత్వం లేఔట్లు ఏర్పాటు చేసి పరిశ్రమలను ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. అనంతపురం నుంచి రాజధాని అమరావతికి నిర్మించనున్న ఎక్స్‌ప్రెస్ వే రోడ్డు నిర్మాణం దొనకొండ మీదుగా కొనసాగించేందుకు ప్రభుత్వ అన్నిచర్యలు చేపట్టిందని తెలిపారు. మిగిలిన వౌలిక వసతులు రైల్వే, విమానాశ్రయం, విద్యుత్, తదితర సమస్యలను పరిశీలిస్తుందని తెలిపారు. దొనకొండకు 8కిలోమీటర్ల దూరంలో నేషనల్ హైవేరోడ్డును గుర్తించామని, త్వరలో అన్నిచర్యలు తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఆయనతో పాటు ఎపిఐఐసి ప్రణాళిక విభాగం మేనేజర్ రాజేంధ్రకుమార్, ఇంజనీర్ కుమార్, తహశీల్దార్ కె వెంకటేశ్వర్లు, సర్వేయర్ వెంకటరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.