ప్రకాశం

రెవెన్యూ వ్యవస్థ మరింత పటిష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జనవరి 22 : రాష్టవ్య్రాప్తంగా రెవెన్యూశాఖను ప్రక్షాళన చేశామని, అయినప్పటికీ విమర్శలు వస్తున్నాయని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి వెల్లడించారు. శుక్రవారం జిల్లా కేంద్రమైన ఒంగోలులో జిల్లా రెవెన్యూ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన అనంతరం స్థానిక ఎన్‌ఎస్‌పి అతిథిగృహంలో ఏర్పాటుచేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రెవెన్యూ శాఖను మరింత పటిష్టం చేసి రైతులకు, అన్నివర్గాల ప్రజలకు సేవలు అందించనున్నట్లు తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబునాయుడు రైతుల పక్షపాతి అని, రైతులను సంతృప్తిపరిచేందుకు మీ ఇంటికి -మీ భూమి కార్యక్రమాలను చేపట్టినట్లు వెల్లడించారు. రాష్టవ్య్రాప్తంగా తహశీల్దార్ కార్యాలయాల్లో కంప్యూటర్ ఆపరేటర్ల కొరత ఉన్నందున భవిష్యత్తులో అవుట్‌సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అదేవిధంగా ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా గత ప్రభుత్వం పరిశ్రమలు నెలకొల్పేందుకు వేలాది ఎకరాల భూములను అప్పగించిందని, అయినప్పటికి ఆ భూముల్లో ఫ్యాక్టరీలు లేకపోగా ఒక్క కార్మికుడు కూడా లేడని, ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని జిల్లా యంత్రాంగాలకు ఆదేశాలు జారీ చేశామని తెలిపారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనయుడు నారా లోకేష్ క్రమశిక్షణ, పట్టుదల కలిగిన నాయకుడని ఆయన కొనియాడారు. దేశంలో ఏ పార్టీకి లేని విధంగా 55 లక్షలమంది సభ్యత్వాలను లోకేష్ నమోదు చేయించారని ఆయన పేర్కొన్నారు. వైకాపా రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ముందుగా తన తండ్రి చరిత్రను తెలుసుకోవాలని హితవు పలికారు. ప్రతి సమావేశంలోను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చట్టం తన పని తాను చేసుకుపోతుందని తెలిపేవారని, ప్రస్తుతం చెవిరెడ్డి భాస్కరరెడ్డి, మిధున్‌రెడ్డిల వ్యవహరంలోను చట్టం తనపని తాను చేసుకుపోయిందన్నారు. కాగా అవి కేంద్రప్రభుత్వ పరిధిలోని కేసులని, ఈ కేసులకు రాష్ట్రప్రభుత్వంతో ఎలాంటి సంబంధం లేదన్న విషయాన్ని జగన్ గుర్తించుకోవాలని ఆయన హితవు పలికారు. అదేవిధంగా అసెంబ్లీ సమావేశాల్లోను తమకు స్పీకర్ కనిపించకుండా వైకాపా శాసనసభ్యులు చుట్టుముడుతూ ఆందోళన చేయటాన్ని ఆయన తప్పుపట్టారు. ముందుగా వైకాపా శాసనసభ్యులు శాసనసభ నియమనిబంధనలను నేర్చుకోవాల్సిన అవసరం ఉందని ఆయన విమర్శించారు. తమ అధినేత చంద్రబాబునాయుడు 18నెలల పాలనలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని ఆయన గుర్తుచేశారు. 2018-19 సంవత్సరానికి పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాలనే ఆలోచనతో ముఖ్యమంత్రి చంద్రబాబు ముందుకు పోతున్నారని ఆయన తెలిపారు. కాగా రాష్ట్రంలో 13 జిల్లాలు ఉండగా 14 జిల్లాలు అంటూ సాక్షాత్తు రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి విలేఖర్ల సమావేశంలో పేర్కొనటంపై సర్వత్రా చర్చనీయాంశమైంది. విలేఖర్ల సమావేశంలో పాల్గొన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వెంటనే రాష్ట్రంలో 13 జిల్లాలు అనడంతో వెంటనే పొరపాటును మంత్రి గ్రహించి 13 జిల్లాలు అని చెప్పటం గమనార్హం. ఒంగోలు నగరంలో ఒక తహశీల్దార్ కార్యాలయం మాత్రమే ఉందని, రెండవ తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటు చేయాలని స్థానిక ఎమ్మెల్యే కోరుతున్నారని తెలిపారు. ఒంగోలులో రెండవ తహశీల్దార్ కార్యాలయం ఏర్పాటుచేసే ఆలోచన చేస్తామన్నారు. విలేఖర్ల సమావేశంలో జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఒంగోలు శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్, రాష్ట్ర తెలుగు రైతు అధ్యక్షుడు కరణం బలరామకృష్ణమూర్తి, జిల్లా శాసనమండలి సభ్యుడు మాగుంట శ్రీనివాసరెడ్డి, కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి, జిల్లాజాయింట్ కలెక్టర్ హరిజవహర్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.

నేడు దారపనేని పదవీ ప్రమాణ స్వీకారం
పామూరు, జనవరి 22: కనిగిరి ఎఎంసి చైర్మన్‌గా 3వ సారి పదవీ బాధ్యతలు చేపడుతున్న దారపనేని చంద్రశేఖర్ ప్రమాణ స్వీకారం ఈనెల 23న కనిగిరి వ్యవసాయ మార్కెట్ యార్డులో జరగనుంది. ఇందుకోసం భారీ ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కేంద్రమంత్రి సుజనాచౌదరి, రాష్టమ్రంత్రులు పి పుల్లారావు, శిద్దా రాఘవరావు, దేవినేని ఉమామహేశ్వరరావు, రావెల కిషోర్, చింతకాయల అయ్యన్నపాత్రుడు, బాపట్ల ఎంపి శ్రీరామ్ మాల్యాద్రి, రాష్ట్ర తెలుగు రైతు సంఘం అధ్యక్షులు కరణం బలరాం, ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్ధంన్, ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసులరెడ్డి, పర్చూరు ఎమ్మెల్యే ఏ సాంబశివరావు, చీరాల ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావు, గిద్దలూరు, మార్కాపురం, సంతనూతలపాడు, అద్దంకి, కందుకూరు టిడిపి నియోజకవర్గ ఇన్‌ఛార్జిలు అన్నా రాంబాబు, కందుల నారాయణరెడ్డి, విజయ్‌కుమార్, కరణం వెంకటేష్, దివి శివరాం హాజరు కానున్నారు. నియోజకవర్గంలోని మండలి కూడలిలో భారీ ఎత్తున ప్లెక్సీలు, పసుపుతోరణాలు, పచ్చజెండాలు ఏర్పాటు చేసారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి జిల్లా నలుమూలల నుంచి వచ్చే కార్యకర్తలకు, నాయకులకు ఎటువంటి ఇబ్బందులు కలుగ కుండా దారపనేని చంద్రశేఖర్ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసారు. కాగా పామూరు మండలం తూర్పుగోడిగుడ్లపాడు గ్రామంలో దారపనేని పోతయ్య, భూమమ్మ దంపతులకు 1967లో జన్మించిన చంద్రశేఖర్ కొరిశపాడు మండలం ప్రాసంగుల పాడులో హైస్కూలు విద్య అభ్యసించారు. ఒంగోలు ఎకెవికె కాలేజీలో డిగ్రీ పూర్తి చేశారు. అప్పటినుంచి రాజకీయాలపై అభిరుచితో యూత్‌కాంగ్రెస్ మండల అధ్యక్షునిగా, యువజన కాంగ్రెస్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా, టెలికాం సలహాసంఘం సభ్యునిగా అసైన్‌మెంట్ కమిటీసభ్యులుగా, సర్పంచ్ వివిధ పదవులు చేపట్టి సమర్ధవంతమైన నాయకుడిగా ఎదిగారు. ప్రజలకు సంతృప్తికరమైన సేవలు చేయడంతో మార్కెట్ కమిటీ చైర్మన్ పదవి మూడుసార్లు ఆయనే్న వరిస్తూ వస్తోంది.

కేంద్రమంత్రి సుజనాచౌదరి ఎదుట తేల్చుకునేందుకు రెండు వర్గాలు సిద్ధం
మార్కాపురం, జనవరి 22: రెండు వర్గాలుగా ఉన్న యర్రగొండపాలెం టిడిపి నేతలు శనివారం ఒంగోలు రానున్న కేంద్రమంత్రి సుజనాచౌదరి ఎదుట ఆమీతూమీ తేల్చుకునేందుకు సమాయత్తం అవుతున్నట్లు సమాచారం. గత ఎన్నికల్లో యర్రగొండపాలెం నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓటమిపాలైన బూదాల అజితరావు, ప్రస్తుత త్రిసభ్య కమిటీ మధ్య ఉన్న పరిస్థితులను సుజనాచౌదరి దృష్టికి తీసుకువెళ్ళే పరిస్థితి ఏర్పడింది. ఈనెల 4న జన్మభూమి-మాఊరు కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును కలిసేందుకు అజితరావు వర్గం ప్రయత్నించగా, ముందస్తు సమాచారం తెలుసుకున్న పోలీసులు అజితరావు వర్గాన్ని అడ్డుకున్నారు. అయితే ప్రస్తుతం సుజనాచౌదరి శనివారం ఒంగోలుకు వస్తున్న దృష్ట్యా సమస్యను ఆయన దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించాలని ఒత్తిడి చేసేందుకు ప్రయత్నాలు సాగిస్తున్నారు. బూదాల అజితరావుకు తిరిగి ఇన్‌ఛార్జి బాధ్యతలు అప్పగించాలని ఒక వర్గం, ప్రస్తుతం ఉన్న త్రిసభ్య కమిటీనే కొనసాగించాలని మరోవర్గం ఒత్తిడి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.
ఓ దళిత మహిళ ధైర్యంగా ఎన్నికల్లో పోటీచేసి ఓటమిపాలైనప్పటికీ నియోజకవర్గంలోనే ఉంటూ ప్రజాసమస్యలను పరిష్కరిస్తున్న సమయంలో చెప్పుడు మాటలు విని ఆమెను ఇన్‌ఛార్జిగా తొలగించడం ఎంతవరకు న్యాయమన్న విషయాన్ని సుజనాచౌదరి దృష్టికి తీసుకువెళ్ళేందుకు ఆ వర్గం ప్రయత్నిస్తోంది. ఇదే సమయంలో త్రిసభ్య కమిటీ సభ్యులు కూడా తెలుగుదేశంపార్టీ కార్యకర్తలకు, నాయకులకు ఎలాంటి సహకారం అందించకుండా ఎవరికివారే యమునాతీరే అన్నవిధంగా నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని, అలాంటప్పుడు ప్రజలకు అందుబాటులో ఉండే అజితరావుకే బాధ్యతలు అప్పగించాలని డిమాండ్ చేసేందుకు సిద్ధం అవుతున్నారు. మరోవర్గం మాత్రం అజితరావు కన్నా ఆమె భర్త పెత్తనం ఎక్కువ కావడం, ఒకే సామాజిక వర్గానికి అందుబాటులో ఉంటూ మిగిలిన సామాజిక వర్గాలను దూషిస్తూ వ్యవహరించడం నచ్చకనే అధిష్ఠానానికి ఫిర్యాదు చేశామని, ఆమేరకు అధిష్ఠానం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేసిందని, వారినే కొనసాగేలా చూడాలని ఒత్తిడి తీసుకువచ్చేందుకు సిద్ధం అవుతున్నారు. ఏదిఏమైనా శనివారం ఒంగోలుకు వస్తున్న సుజనాచౌదరి ఎదుట అమీతూమీ తేల్చుకునేందుకు సిద్ధం అవుతున్నారు. కాగా, అజితరావు వర్గానికి జిల్లాలోని ఓ టిడిపి సీనియర్ నేత మద్దతు పలుకుతుండగా, మనె్న రవీంద్ర వర్గానికి జిల్లాలోని ఓ ఎమ్మెల్యే మద్దతు పలుకుతున్నట్లు సమాచారం.

పారదర్శకంగా రెవెన్యూశాఖ సేవలు
* రాష్ట్ర రెవెన్యూశాఖ మంత్రి కెఇ వెల్లడి
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 22 : రాష్ట్రంలో రెవెన్యూశాఖ ద్వారా ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించేందుకు చర్యలు తీసుకోవాలని రాష్ట్ర రెవెన్యూశాఖమంత్రి కెఇ కృష్ణమూర్తి అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక బచ్చలబాలయ్య కల్యాణ మండపంలో రెవెన్యూశాఖకు సంబంధించిన అంశాలపై ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో రెవెన్యూశాఖలో సంస్కరణలు చేపట్టి రెవెన్యూశాఖను మరింత పటిష్టం చేసేందుకు కృషి చేస్తామన్నారు. రాష్ట్రంలో రెవెన్యూశాఖ ద్వారా తుఫాన్ విపత్తుల సమయంలో, ప్రాజెక్టుల భూసేకరణలో, ప్రమాద సమయాల్లో విస్తత్రంగా సేవలు అందించగా కొంతమంది అధికారుల వల్ల ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. మీ ఇంటికి -మీభూమి కార్యక్రమాన్ని చేపట్టి ప్రజల రెవెన్యూ సమస్యలు పరిష్కరించటం పట్ల ప్రకాశం జిల్లా రెవెన్యూశాఖ అధికారులను ప్రసంశించారు. మీ ఇంటికి -మీ భూమి కార్యక్రమం ద్వారా రాష్ట్రంలో విమర్శలు కొట్టుకుపోయాయన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రెవెన్యూశాఖలో విప్లవాత్మకమైన మార్పులకు శ్రీకారం చుట్టారన్నారు. మీ ఇంటికి -మీ భూమి రెండవ విడతలో ప్రకాశం జిల్లాలో 97శాతం అర్జీలను పరిష్కరించి రాష్టస్థ్రాయిలో ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో నిలిచిందన్నారు. రాష్ట్రంలో క్రమశిక్షణకు రెవెన్యూశాఖ పెట్టింది మారుపేరని అన్నారు. రెవెన్యూశాఖ అధికారులు ప్రజల అవసరాలకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి సత్వరమే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. గ్రామ రెవెన్యూ అధికారులు గ్రామాల్లో తప్పనిసరిగా ఉండేవిధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రకాశం జిల్లాలో గత ప్రభుత్వంలో పరిశ్రమల స్థాపనల కోసం కేటాయించిన భూములు వినియోగంలో లేవని, వాటిని గుర్తించి తిరిగి ప్రభుత్వం సేకరించాలన్నారు. ఎలక్ట్రానిక్ క్రాప్ బుకింగ్ రెండులక్షలు నమోదు చేసినందుకు జిల్లా రెవెన్యూ అధికారులను మంత్రి అభినందించారు. ఈ సమావేశంలో భూపరిపాలన శాఖ ప్రధాన కమిషనర్ అనిల్‌చంద్రపునేఠ మాట్లాడుతూ మీ ఇంటికి - మీ భూమి వెబ్‌సైట్ ఏర్పాటు చేయటం పట్ల విదేశాల్లో ఉన్నా కూడా తమ భూముల వివరాలను తెలుసుకుంటున్నారన్నారు. మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమంలో వచ్చిన అర్జీల పరిష్కారంలో ప్రకాశం జిల్లా రెండవ స్థానంలో ఉందన్నారు. రాబోయే నెలలో ప్రకాశం జిల్లా మొదటి స్థానంలో ఉండేవిధంగా అధికారులు కృషి చేయాలన్నారు. ఈ సమావేశంలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ ఐజి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ భారతదేశంలో 19 రాష్ట్రాల్లో లేనివిధంగా ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడ నుంచైనా భూములను రిజిస్ట్రేషన్ చేసుకునే విధానాన్ని అమలుచేయటం జరిగిందన్నారు. తహశీల్దార్ కార్యాలయాల నుంచి సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయాలకు అనుసంధానం చేయటం వల్ల రెవెన్యూ రికార్డుల్లో పారదర్శకత పెరిగిందన్నారు. జిల్లా కలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ ప్రకాశం జిల్లాలో జన్మభూమి కార్యక్రమంలో 91వేల 107 అర్జీలు వచ్చాయని, 78వేలు పరిష్కరించి 99.12 శాతాన్ని సాధించి రాష్టస్థ్రాయిలో రెండవస్ధానంలో నిలిచినట్లు తెలిపారు. ఆధార్‌కార్డు నమోదు, ఈక్రాప్ బుకింగ్, సర్కార్ భూముల నమోదులో నాల్గవస్థానంలో ఉందన్నారు. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి వచ్చిన అర్జీలు 48శాతం పరిష్కరించినట్లు తెలిపారు. నడికుడి-శ్రీకాళహస్తి రైల్వేలైనుకు సంబంధించి భూసేకరణ పూర్తిచేసి ఆరునెలల్లో భూములను అప్పగించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లాలో డాట్‌లైన్ గుర్తుగల 95వేల ఎకరాల భూములు ఉన్నాయని ప్రాథమికంగా గుర్తించామన్నారు. జిల్లాలో రెవెన్యూశాఖలో ఖాళీ పోస్టులను భర్తీచేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. మండల కార్యాలయాల్లో పనిచేస్తున్న డేటా ఎంట్రీ ఆపరేటర్లకు జీతాలు విడుదల చేయాలని మంత్రిని కోరారు. కొండెపి శాసనసభ్యుడు డోలా బాలవీరాంజనేయస్వామి మాట్లాడుతూ జిల్లాలో డాట్‌లైన్ గుర్తుల భూములను రిజిస్ట్రేషన్ చేయడం లేదన్నారు. శింగరాయకొండ మండలంలో 2014 సంవత్సరానికి ముందుగా గృహాలు నిర్మించుకున్న వారి గృహాలను దేవాదాయ భూములని రిజిస్ట్రేషన్ శాఖవారు రిజిస్ట్రేషన్ చేయడం లేదని చాలా కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయని, ప్రభుత్వం పరిశీలించి శింగరాయకొండలో భూములను రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఆదేశాలు ఇవ్వాలని మంత్రిని కోరారు. అనంతరం రెవెన్యూశాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తిని రెవెన్యూ అసోసియేషన్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో భూపరిపాలన కమిషనర్ వాణిమోహన్ తదితరులున్నారు.

పన్ను వసూళ్లు వేగవంతం చేయండి
* గుంటూరు మునిసిపల్ రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు
ఒంగోలు, జనవరి 22 : ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాలకు చెందిన మునిసిపల్ కమిషనర్లతో గుంటూరు మునిసిపల్ రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు శుక్రవారం స్థానిక ఒంగోలు మునిసిపల్ కార్పొరేషన్ కార్యాలయంలో సమీక్షించారు. ఈ సమావేశంలో రీజనల్ డైరెక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఆయా మునిసిపాలిటీల్లో రావాల్సిన ఇంటి పన్నులతోపాటు, కుళాయి ఇతరత్రా అన్ని రకాల పన్నులను వేగవంతంగా వసూలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శానిటేషన్ సక్రమంగా ఉండటం లేదని, కమిషనర్లు పారిశుద్ధ్యం మెరుగుదలకు దృష్టి సారించాలన్నారు. స్మార్ట్‌వార్డుల అభివృద్ధికి చర్యలు తీసుకోవాలన్నారు. తొలుత హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఆఫ్ గుడ్ గవర్నర్ వారు ఎస్‌ఎల్‌బి వారికి ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. 14వ ఆర్థిక సంఘం నిధులు రావాలంటే అన్ని సదుపాయాలు కల్పించేందుకు అవసరమైన సూచనలు, సలహాలకు సంబంధించిన శిక్షణ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు కార్పొరేషన్ కమిషనర్ ఎస్ వెంకటకృష్ణతోపాటు ఆయా జిల్లాలకు చెందిన కమిషనర్లు పాల్గొన్నారు.

తల్లి మందలించిందని కుమార్తె ఆత్మహత్య
మార్కాపురం, జనవరి 22: అక్కాచెల్లెళ్లు ఘర్షణ పడుతుండటంతో తల్లి మందలించడంతో మనస్థాపానికి గురై మిద్దెపై నుంచి దూకి కుమార్తె ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన పట్టణంలోని విజయా టాకీస్ సమీపంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి సమీపంలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలలో బిటెక్ మొదటి సంవత్సరం చదువుతున్న ఉత్తరాది సౌభాగ్యవతి (17) ఆత్మహత్య చేసుకుందని పోలీసులు తెలిపారు. ఉత్తరాది లక్ష్మీదేవికి ఆరుగురు కుమార్తెలు కాగా, అందులో 5వ కుమార్తె అయిన వెంకటలక్ష్మీ, 6వ కుమార్తె అయిన సౌభాగ్యవతి ఘర్షణ పడుతుండగా తల్లి లక్ష్మీదేవి మందలించింది. దీంతో మనస్థాపానికి గురైన సౌభాగ్యవతి మిద్దెపై నుంచి దూకగా మధ్యలో విద్యుత్ వైర్లు తగిలి ఎడమచేతికి గాయాలు కాగా కిందపడటంతో తలకు బలమైన గాయాలయ్యాయ. ప్రధమ చికిత్స చేసిన అనంతరం ఒంగోలు వైద్యశాలకు తరలిస్తుండగా చీమకుర్తి సమీపంలో మృతిచెందినట్లు గుర్తించారని ఎస్‌హెచ్‌ఓ మాల్యాద్రిరెడ్డి తెలిపారు.

గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించాలి
* జిల్లా కలెక్టర్ సుజాతశర్మ
ఒంగోలు, జనవరి 22: గణతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సంసిద్ధంగా ఉండాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ అధికారులను ఆదేశించారు. శుక్రవారం స్థానిక సిపివో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాకలెక్టర్ గణతంత్ర దినోత్సవ వేడుకలపై జిల్లా అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పోలీసు పెరేడ్ మైదానంలో ఈ నెల 26వ తేదీ ఉదయం 7.45 గంటలకే జాతీయపతాకాన్ని ఎగురవేయాల్సి ఉందన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
నేడు రెండుకిలోమీటర్ల పరుగు
జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ప్రజల్లో చైతన్యం తెచ్చేందుకు ఈ నెల 23వ తేదీన జిల్లావ్యాప్తంగా అన్ని పాఠశాలలు, కాలేజిల్లో రెండు కిలోమీటర్ల పరుగును నిర్వహించాలని జిల్లాకలెక్టర్ సుజాతశర్మ ఆదేశించారు. శుక్రవారం నగరంలోని సిపిఒ కాన్ఫరెన్స్ హాలులో జాతీయ ఓటర్ల దినోత్సవంపై జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు.

‘నటనకు జీవం పోసిన అక్కినేని చరితార్థుడు’
మద్దిపాడు, జనవరి 22 : ప్రతి పాత్రకు తన నటన ద్వారా జీవం పోసి ప్రజల హృదయాలలో నిలిచిపోయిన అక్కినేని నాగేశ్వరరావు చరితార్థుడని ప్రముఖ నటులు బి రాధాకృష్ణమూర్తి, పి రమణయ్య పేర్కొన్నారు. శుక్రవారం మద్దిపాడు గ్రంథాలయం వద్ద ఏర్పాటు చేసిన అక్కినేని రెండవ వర్ధంతి సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సభలో ఆర్థోమెడికల్ రిటైర్డు వైద్యాధికారి డాక్టర్ కె అంకయ్య, సాంకేతిక విద్యా శాఖ రిటైర్డ్ డైరెక్టర్ బత్తుల పున్నయ్య మాట్లాడుతూ అక్కినేని జానపద, పౌరాణిక, సాంఘిక పాత్రల ద్వారా ప్రజలను మేల్కొలిపిన సంఘటనలు, ఆయన జీవిత ప్రస్తావనల గురించి వివరించారు. ఈ సభలో గ్రామసభ సర్పంచ్ ఎ నాగేశ్వరరావు, ప్రధానోపాధ్యాయుడు కలాం తదితరులు నాగేశ్వరరావు జీవిత విశేషాలు వివరించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గ్రంథ పాలకులు జి శ్యామ్‌సన్, శర్మ, బాబూరావు, వెంకటసుబ్బయ్య, ప్రభాకర్, విశ్వనాథ్, తదితరులు పాల్గొని అక్కినేనికి నివాళులర్పించారు.

25న జరిగే జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించండి
* రాష్ట్ర ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ ఆదేశం
ఒంగోలు అర్బన్, జనవరి 22 : ఈ నెల 25వ తేదీన జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్నివిధాల చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి భన్వర్‌లాల్ జిల్లాకలెక్టర్లను ఆదేశించారు.శుక్రవారం సాయంత్రం హైదరాబాద్ నుంచి జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల ఏర్పాట్లపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. జిల్లాస్థాయి, నియోజకవర్గ, మండల స్థాయిలో జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమాలను పెద్దఎత్తున చేపట్టాలన్నారు. ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ నాటికి 18సంవత్సరాలు నిండి ఓటరుగా నమోదు చేసుకున్న వారికి పోలింగ్ కేంద్రాల్లో ఓటరు కార్డును జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో పంపిణీ చేయాలని ఆదేశించారు. ప్రతి పోలింగ్ స్టేషన్‌లో బూత్‌లెవల్ అధికారులు జాతీయ ఓటర్ల దినోత్సవం రోజున తప్పనిసరిగా అందుబాటులో ఉండాలన్నారు. ప్రతి పోలింగ్ బూత్‌లో బూత్‌లెవల్ అధికారుల వద్ద ఫారం 6, 7, 8 బిఏలను ప్రజలకు అందుబాటులో ఉంచాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో ప్రజాప్రతినిధులను ఆహ్వానించి వారు పాల్గొనే విధంగా చూడాలన్నారు. ఎన్‌సిసి, ఎన్‌ఎస్‌ఎస్, కళాశాలల విద్యార్థినీ విద్యార్థులు, నగర పౌరులతో పెద్దఎత్తున ర్యాలీ నిర్వహించాలని సూచించారు. జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించి వ్యాసరచన, వక్తృత్వ, క్విజ్ పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు, ప్రశాంసపత్రాలు అందచేయాలన్నారు. ప్యూరిఫికేషన్ ఆఫ్ ఎలక్ట్రోరోల్ ఓటరుకార్డుతో ఆధార్ అనుసంధానం ప్రక్రియ వందశాతం చేపట్టిన అధికారులకు జిల్లా కలెక్టర్ అవార్డు, నగదు బహుమతి అందచేసే ఏర్పాటు చేయాలన్నారు. జిల్లా కలెక్టర్లు తమ జిల్లాలో అత్యంత ప్రతిభ చూపిన ఇఆర్‌ఒ, ఎఇఆర్‌ఒ, సూపర్‌వైజింగ్ అధికారి, బూత్‌లెవల్ అధికారుల పేర్లను ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి ప్రతిపాదనలను పంపాలన్నారు. ఓటరుగా నూతనంగా ఎన్‌రోల్ అయిన వారికి సంబంధిత పోలింగ్ బూత్‌ల వద్ద ఎపిక్ కార్డులు పంపిణీ చేయాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకల్లో డాక్యుమెంటేషన్ చేపట్టి ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయానికి పంపాలన్నారు. జాతీయ ఓటర్ల దినోత్సవానికి సంబంధించిన బ్యాడ్జిలు, క్యాలెండర్లు, పబ్లిసిటీ మెటీరియల్‌ను జిల్లా కేంద్రం నుంచి నియోజకవర్గ, మండల స్థాయికి పంపాలన్నారు. నూతనంగా ఓటరుగా నమోదయ్యేందుకు ఏ విధంగా రిజిష్టర్ చేసుకోవాలనే విషయాలపై కరపత్రాల ద్వారా విస్తత్రంగా ప్రచారం చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో జిల్లాకలెక్టర్ సుజాతశర్మ మాట్లాడుతూ జిల్లాలో 25వేల 933మంది నూతనంగా ఓటర్లుగా నమోదయ్యారని, జాతీయ ఓటర్ల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని ప్రధాన ఎన్నికల అధికారికి తెలిపారు. పబ్లిసిటీ మెటీరియల్‌ను తహశీల్దార్లకు పంపించామన్నారు. ఈ సమావేశంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.

రహదారుల భద్రతా ప్రమాణాలను పాటించాలి
* రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా
ఆంధ్రభూమి బ్యూరో
ఒంగోలు, జనవరి 22 : రాష్ట్రంలో వాహనదారులు భద్రతా ప్రమాణాలు పాటించి ప్రమాదాలు జరగకుండా ప్రయాణించాలని రాష్ట్ర రవాణాశాఖమంత్రి శిద్దా రాఘవరావు పిలుపునిచ్చారు. శుక్రవారం స్థానిక మంత్రి నివాసంలో 27వ జాతీయ రహదారి భద్రతా వారోత్సవాల్లో భాగంగా రహదారి భద్రత-తక్షణ కర్తవ్యం అనే గోడపత్రికను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి శిద్దా మాట్లాడుతూ రహదారుల భద్రత వారోత్సవాలపై కళాశాలల్లో విద్యార్థులకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలన్నారు. డిగ్రీ కాలేజిలు, ఇంజనీరింగ్ కాలేజిల్లో రహదారి భద్రతపై ర్యాలీలు, సెమినార్లు నిర్వహించాలన్నారు. ఈ నెల 22 నుంచి 28వ తేదీ వరకు అన్ని జిల్లాల్లో రవాణాశాఖ విస్తత్ర ప్రచారం కల్పించాలన్నారు. సీటు బెల్టు ధరించకపోవటం వల్ల కలిగే నష్టాలను, హెల్మెట్ ధరించకపోవడం వల్ల కలిగే నష్టాలను ప్రజలకు అర్థమయ్యేవిధంగా ప్రదర్శనలు ఏర్పాటు చేయాలన్నారు. సెల్‌ఫోన్ మాట్లాడుతూ వాహనాలు నడపటం, మద్యం సేవించి వాహనాలు నడపటం, ట్రాఫిక్‌రూల్స్ పాటించటం వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం కలిగించాలన్నారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ డిప్యూటీ కమిషనర్ కృష్ణయ్య, ప్రాంతీయ రవాణాశాఖ అధికారి రాంప్రసాద్, మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు కృష్ణారావు, శేషిరెడ్డి, సహాయ మోటారు వెహికల్ ఇన్‌స్పెక్టర్లు ఎస్‌కె మాబు, మధుసూదనరావు, గోపినాయక్, కార్యాలయ పర్యవేక్షకులు సుశీల తదితరులు పాల్గొన్నారు.

‘మంచినీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు’
చీరాలరూరల్, జనవరి 22 : రానున్న వేసవి కాలంలో పురపాలక సంఘంలో ఉన్న పట్టణ ప్రజలకు మంచి నీటి సమస్య లేకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నట్లు ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్ తెలిపారు. చీరాల, కారంచేడు మధ్యలో ఉన్న మంచినీటి రిజర్వాయర్‌ను శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ వర్షాలు లేక కరవు పరిస్థితుల మధ్య మంచినీటి చెరువుల్లో నీటిని పూర్తిస్థాయిలో నింపలేకపోయామన్నారు. వేసవిలో మూడు నెలల పాటు మంచినీటిని సరఫరా చేయాలంటే ప్రస్తుతం ఉన్న నీటి పరిమాణం సరిపోదన్నారు. అందుకు మంచినీటిని పట్టణంలో గంట సరఫరా చేయాలా లేదా, రోజు మార్చి రోజు సరఫరా చేయాలా అని పరిశీలించి ప్రజల అభిప్రాయాన్ని కూడా తీసుకుని నీటి ఎద్దడి పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలు ఇది గమనించి మంచినీటిని వృధా చేయకుండా పొదుపుగా వాడుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ మోదడుగు రమేష్ బాబు, కమిషనర్ బ్రహ్మయ్య, డిఇ మాల్యాద్రి, కౌన్సిలర్లు కె శ్యాంసన్, పొదిలి ఐస్వామి, బురదగుంట ఆశీర్వాదం, కె ప్రకాష్, కళ్లకుంట అంజమ్మ, రఘునాథ్‌బాబు, నాయకులు మార్పు గ్రెగొరి, డాక్టర్ భవానీప్రసాద్, డేటా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.