రాష్ట్రీయం

రాచకొండ భూములపై మరో ఉద్యమం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్రనగరి వద్దు..పర్యాటకమే ముద్దు
సిఎం కెసిఆర్ ప్రతిపాదనలపై వ్యతిరేకత

నల్లగొండ, డిసెంబర్ 6: నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల్లో విస్తరించి ఉన్న రాచకొండ గుట్టల భూముల వినియోగంపై సిఎం కెసిఆర్ ప్రతిపాదనలపై పర్యావరణం..పర్యాటక కోణాల్లో వ్యతిరేకత వ్యక్తమవుతుంది. రాచకొండ గుట్టలు, భూములను చిత్రనగరి, క్రీడానగరి వంటి వాటికి వినియోగిస్తామంటూ గతంలో సిఎం కెసిఆర్ చేసిన ప్రకటన లాభనష్టాలపై రాచకొండ పరిరక్షణ సమితి స్థానిక ప్రజల్లో చైతన్యాన్ని రగిలిస్తుండటం ఆసక్తికరంగా మారింది.
చిత్రనగరి, క్రీడానగరి లేక ఫార్మాసిటీ వంటి పారిశ్రామిక వాడల నిర్మాణాలతో తెలంగాణ రాష్ట్రం చారిత్రక ఘనతకు నిదర్శమైన రాచకొండ కట్టడాలను, రాచకొండ గుట్టల ప్రకృతి అందాలను, సహజత్వాన్ని దెబ్బతీయడమే అవుతుందన్న వాదన రాచకొండ గుట్టల్లో క్రమంగా మారుమోగుతుంది. రాచకొండను పర్యాటక కేంద్రంగా మాత్రమే అభివృద్ధి చేయాలంటూ ఇప్పటికే కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి మహేశ్‌శర్మకు వినతులు సైతం అందించడం విశేషం. చిత్రనగరి, క్రీడానగరి వంటి నిర్మాణాలతో స్థానిక ప్రజలకు ఉపాధి ప్రయోజనాలు శూన్యమని చిత్రనగరి లోపల అన్ని వ్యాపారాలు దాని యాజమాన్యమే నిర్వహించనుందన్న వాదన వినిపిస్తుంది. అంతేగాక చిత్రనగరితో రాచకొండ చారిత్రక కోటలు, పురాతన దేవాలయాలు, సహజసిద్ధ లోయలు, సెలయేర్లతో కూడిన ప్రకృతి అందాలు కొంతమంది సంపన్న వర్గాలకే అందుబాటులోకి వెళతాయి. చిత్రనగరి నిర్మాణంతో రాచకొండ గుట్టల సహజ స్వరూపం దెబ్బతిని కాంక్రీట్ జంగిల్‌గా మారితే పరోక్షంగా పరిసర నల్లగొండ-రంగారెడ్డి జిల్లాల భూగర్భ జలాలపై ప్రతికూల ప్రభావం పడనుంది. రాజధాని హైద్రాబాద్‌కు సమీపంలో రాచకొండ గుట్టల్లో ఉన్న చిట్టడవుల ప్రాంతం అంతరించి ప్రకృతి సమతుల్యానికి నష్టం జరుగనుందన్న వాదన రాచకొండ పరిరక్షణ సమితి లేవనెత్తుతుంది. గుట్టలు, లోయల భూముల్లో వ్యవసాయం జీవనోపాధిగా బతుకుతున్న రైతులు, గిరిజనులు తమ భూములు కోల్పోయి వలస కూలీలుగా మారనున్నారన్న ఆందోళన వ్యక్తమవుతుంది. ఇటీవల రిజర్వాయర్ ప్రతిపాదన సైతం ప్రభుత్వం చేయడంతో రాచకొండ గుట్టల అటవీ ప్రాంతంలో జీవిస్తున్న వారంతా తాము ముంపు బాధితులమవుతామంటూ వాపోతున్నారు.
రాచకొండ గుట్టల సహజ స్వరూపాలను దెబ్బతీసే చిత్రనగరి, క్రీడానగరి, పారిశ్రామిక సంస్థలు, రిజర్వాయర్‌లు వంటి నిర్మాణాల కంటే పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయడంతో రాచకొండ ప్రాంతం పూర్వ వైభవం అందుకుంటుందని రాచకొండ పరిరక్షణ సమితి, రాచకొండ ప్రజాసంఘాలు భావిస్తున్నాయి. కాకతీయ రాజుల సైన్యాధిపతులుగా వ్యవహరించి పద్మ వంశీయులు స్వతంత్య్ర రాజ్యంగా రాచకొండ రాజ్యంను ఏర్పాటు చేసుకుని పాలించారు. క్రీ.శ 1357లో రాజు సింగమనాయుడు సంస్థాన్ నారాయణపూర్ రాచకొండ గుట్టలపై 600అడుగుల ఎత్తున నిర్మించిన రాచకొండ కోట, ఇతర కట్టడాలు, ఆలయాలు పర్యాటకులను ఆకర్షించనున్నాయి. రాచకొండ రాజులు నిర్మంచిన శైవ, వైష్ణవ, జైన, బౌద్ధ మందిరాలు, తటాకాలు రాచకొండ ప్రకృతి అందాల మధ్య గత వైభవ దర్పంగా దర్శనమిస్తుంటాయి. కవి సార్వభౌముడు శ్రీనాథుడు రాచకొండను సందర్శించి ఇక్కడి రాజుల పాలనను కొనియాడగా, ఆయన బంధువు బమ్మెర పోతన రాచకొండ ఆస్థాన కవిగా విజ్ఞాన వెలుగులు పంచారు. ఈ నేపధ్యంలో రాచకొండ గుట్టల ప్రాంతాన్ని పర్యాటక రంగంగా అభివృద్ధి చేస్తే తెలంగాణ రాజరిక దర్పం రాచకొండ గొప్పదనాన్ని అందరికీ తెలియచేయడం ద్వారా తగిన ప్రాధాన్యత కల్పించవచ్చని రాచకొండ పరిరక్షణ సంఘాలు భావిస్తున్నాయి. పర్యాటక కేంద్రంతో స్థానిక గిరిజన సంస్కృతి, రాచకొండ ప్రకృతి అందాలకు నష్టం లేకుండా ఉంటుంది. పర్యాటక రంగంలో వచ్చే పెట్టుబడులు, వ్యాపారాలతో స్థానికులకు ఉపాధి దక్కనుంది. రాచకొండ ప్రాంతంలో ఉన్న అంతరిక్ష ఖగోళ పరిశోధనా కేంద్రం, రాచకొండ గుట్టల గిరిజన సంస్కృతులు, పురాతన ఆలయాలు, కోటలు పర్యాటక రంగానికి ఉపకరించనున్నాయి. (చిత్రం) ప్రకృతి అందాల నెలవు రాచకొండ గుట్టలు..లోయలు