రాష్ట్రీయం

ఎన్నెల్లు తెచ్చి... ఎద మీటిపోయి...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రంగనాథ్ మృతితో విషాదంలో చిత్రసీమ

హైదరాబాద్, డిసెంబర్ 19: జీవితం విలువైనదని, ఆత్మహత్యలు చేసుకోవడం సరికాదని ఎందరికో ధైర్యం నూరిపోసిన నటుడు రంగనాథ్ బలవన్మరణానికి పాల్పడటం ఆయన సన్నిహితుల్ని, చిత్రరంగంలో ఆయన స్నేహితుల్ని నిశే్చష్టుల్ని చేసింది. స్వతహాగా రచయిత కూడా అయిన రంగనాథ్ జీవితపు విలువల గురించి, మానవతావాదం గురించి సన్నిహితులతో పదేపదే చర్చించేవారట. అయితే ఆయన సున్నిత మనస్కుడు కూడా. గతంలో, ప్రాణస్నేహితుడొకరు బదిలీపై వెళ్లిపోవడంతో తట్టుకోలేక రైలుపట్టాలపై కూర్చుని ఆత్మహత్యకు సిద్ధపడి...ఆ తరువాత మనసు మార్చుకుని తిరిగొచ్చానని ఆయన స్వయంగా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. ఇద్దరు కూతుళ్లు, కుమారుడు చక్కగా స్థిరపడ్డారని సంతోషంగా చెప్పిన రంగనాథ్ జీవితం పూలపాన్పుకాదు. ‘జీవితం మనం కోరుకున్నట్లు ఉండదు, దేవుడి రాసినట్లు ఉంటుందని, ఎలా సాగితే అలా ఒదిగిపోవడమే మంచిదని’ ఆ మధ్య ఓ టీవి ఛానల్‌లో తన అంతరంగాన్ని వివరించారు.
ఆరడుగుల పొడగరి, పొడుగుకు తగ్గ సొగసు, గంభీరమైన కంఠస్వరం- హీరోకు ఉండాల్సిన లక్షణాలన్నీ పుణికిపుచ్చుకుని చిత్ర సీమలోకి అడుగుపెట్టిన రంగనాథ్ డబ్భయ్ దశకంలో అగ్ర హీరోలకు గట్టి పోటీ ఇచ్చారు. హీరోగా, ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా రంగనాథ్ బహుముఖ ప్రజ్ఞ చూపారు. 1949వ సంవత్సరంలో చెన్నైలో జన్మించిన ఆయన వెంకటేశ్వర యూనివర్సిటీ నుండి ఇంగ్లీష్ లిటరేచర్‌లో పట్టా పుచ్చుకున్నారు. తల్లిదండ్రులు పెట్టిన పేరు తిరుమల సుందర శ్రీరంగనాధ్. 22 ఏళ్ల వయస్సులో రైల్వేశాఖలో టిక్కెట్ కలెక్టర్‌గా పనిచేసి సినిమాల్లోకి వచ్చారు. 1966లో విడుదలైన ‘బుద్ధిమంతుడు’ చిత్రంతో తొలిసారిగా తెరపై కనిపించారు. ఆ తర్వాత అనేక చిన్నచిన్న పాత్రల్లో నటించినా, ‘చందన’ చిత్రంతో కథా నాయకుడిగా పరిచయం అయ్యారు. ఆ తరువాత జమిందారుగారి అమ్మాయి చిత్రంతో ఆయన చిత్ర సీమలో స్థిరపడ్డారు. ఆ తర్వాత వచ్చిన తొలి సినిమా స్కోపు బ్లాక్ అండ్ వైట్ చిత్రం ‘దేవతలారా దీవించండి’ చిత్రంలో కథా నాయకుడిగా, నెగెటివ్ షేడ్స్‌లో నటించారు. మ్యూజికల్ హిట్‌గా నిలిచిన ‘పంతులమ్మ’ చిత్రంతో రంగనాథ్‌కు వచ్చిన గుర్తింపు అంతా ఇంతా కాదు. ఆ తర్వాత ‘అమెరికా అమ్మాయి’, ‘ఇంటింటి రామాయణం’, ‘రామయ్య తండ్రి’ వంటి చిత్రాల్లో హీరోగా నటించారు. హీరోగా పాత్రలు తగ్గిన వెంటనే, మరో ఆలోచన లేకుండా విలన్ వేషాలకు అంగీకరించారు. దాదాపు 150 సినిమాల్లో విలన్‌గా నటించారు. ఎన్టీఆర్ రూపొందించిన ‘సమ్రాట్ అశోక’ చిత్రంలో కథానాయకుడికి తండ్రి పాత్రలో ఒదిగిపోయారు. 300 సినిమాల్లో నటించారు. రంగనాథ్ తండ్రి మందస జమీందార్‌వద్ద రాజవైద్యుడిగా పనిచేసేవారు. తల్లి మాత్రం తన కొడుకు సినిమాల్లో నటించాలని కోరుకునేవారు. రంగనాధ్ భార్య మెట్లమీదనుండి జారి పడి దాదాపు 13 సంవత్సరాలు మంచానికి అతుక్కుపోయారు. ఆ సమయంలో ఆమెను చిన్నపిల్లకన్నా ఎక్కువగా చూసుకుని అన్ని సపర్యలు చేసి భార్యాభర్తల బంధానికి చక్కటి ఉదాహరణగా నిలిచారు. ఆ విషయం గురించి అడిగితే భర్త అనే బాధ్యతతో చేశానని నవ్వుతూ ఆ విషయాన్ని దాటవేసేవారు. తన కవితలతో అనేకమందిని అలరించిన ఆయన ‘అక్షర సాక్ష్యం’ అనే సంపుటిని ప్రచురించారు. సినిమాల్లో తండ్రి పాత్రల్లో నటిస్తూనే టీవీ సీరియల్స్‌లోనూ జీవించారు. తన తోటి నటీనటుల ప్రోత్సాహంతో ‘మొగుడ్స్ పెళ్లామ్స్’ సినిమాకు దర్శకత్వం వహించారు. అందరికీ తలలో నాలుకలా మెలిగిన రంగనాధ్ అర్ధంతరంగా తనువు చాలించడం తెలుగుచలనచిత్ర సీమను కలచివేసింది. పరిచయం ఉన్న వారంతా విషాదంలో మునిగిపోయారు. ఇలాంటి వార్త వినాల్సివస్తుందని అనుకోలేదని తల్లడిల్లిపోయారు.