రాష్ట్రీయం

ఏకమవుదాం.. ఒత్తిడిచేద్దాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 7: విభజన సమయంలో ఇచ్చిన హామీలను ఎందుకు నేరవేర్చడం లేదని ప్రశ్నించడానికి తాను ఒక్కడినే సరిపోనని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. రెండు ప్లకార్డులు ప్రదర్శించి, నాలుగు స్లోగన్‌లు ఇస్తే సరిపోదని, తెలంగాణ సాధనకు అన్ని పార్టీలూ కలిసి కట్టుగా ఎలా చేశాయో అదేవిధంగా ఆంధ్రాలోనూ పనిచేయాల్సిన అవసరం ఉందని పవన్ కళ్యాణ్ చెప్పారు. బుధవారం సాయంత్రం ఆయన పాత్రికేయులతో మాట్లాడారు. కేంద్ర బడ్జెట్‌పైనా ఆయన స్పందించారు. ప్రత్యేక హోదా ఇస్తామని అప్పటి ప్రధాని మన్మోహన్‌సింగ్ పార్లమెంటులో ప్రకటించారని, మోదీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి న్యాయం జరుగుతుందని ఆశించామని అన్నారు. భారతీయ జనతా పార్టీ ఎన్నికల అజెండాలోనూ ప్రత్యేక హోదా అంశాన్ని చేర్చిందని, ఈ అంశాన్ని తిరుపతిలో తాను లేవనెత్తిన తర్వాతనే ప్రత్యేక ప్యాకేజీని ప్రకటించారని అన్నారు. కేంద్రం నుండి వచ్చిన నిధులపై ఇంతవరకూ స్పష్టత లేదని, రాష్ట్రంలో ఒక మాట, పార్లమెంటులో మరో మాట మాట్లాడుతున్నారని అన్నారు. పార్లమెంటులో ఏ హామీ ఇచ్చారో, ఆ హామీని నిలుపుకోవాలన్న అంశంపై పోరాటం చేస్తామని అన్నారు. ప్రభుత్వాలు చేసిన చట్టాలను అమలుచేయనపుడు ప్రజల నుండి సహజంగానే వ్యతిరేకత వస్తుందని పవన్ హెచ్చరించారు.
విభజన చట్టం హామీల అమలుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు భిన్న వాదనలు వినిపిస్తున్నాయని, హామీల అమలుపై ప్రశ్నించేందుకు జనసేన గొంతుక ఒక్కటే సరిపోదని, కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు ఒక వేదికను రూపొందించాలని అన్నారు. తెలంగాణ ఐకాస మాదిరిగా ఆంధ్రాలోనూ మేథావులు అంతా ఏకం కావాలని సూచించారు. జయప్రకాశ్ నారాయణ్, ఉండవల్లి అరుణ్‌కుమార్ లాంటి మేథావులను కలుపుకుని ఐకాసా వంటిది ఏర్పాటుచేస్తామని, ప్రజలను మభ్యపెట్టే రాజకీయ విధానాలు ఎంతమాత్రం సరికాదని పేర్కొన్నారు. బంద్‌ల పేరిట మనల్ని మనం హింసించుకోవడం సరికాదని, ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే బంద్‌లు నిర్వహించాలని, వాటికే జనసేన మద్దతుగా ఉంటుందని పేర్కొన్నారు.
జనసేన పార్టీ ఆవిర్భావానికి ముఖ్యకారణం కూడా విధి విధానాలతో రాష్ట్ర విభజన జరగకపోవడమేనని అన్నారు. అందరికీ సమాన న్యాయం కోసం పోరాడటానికే పార్టీ పెట్టామని అన్నారు. వామపక్షాల బంద్‌కు శాంతియుత ధర్నాలకు జనసేన మద్దతు ఇస్తుందని చెప్పారు. 2014 ఎన్నికలకు ముందు నరేంద్ర మోదీని కలిసి ఆయనకు మద్దతు ఇవ్వడానికి కారణం కాబోయే ప్రధాని వద్దకు విడిపోయిన రెండు రాష్ట్రాల సమస్యలను తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని భావించామని అన్నారు. తాను నరేంద్ర మోదీని కలిసినపుడు కాంగ్రెస్ పార్టీ ఆనాడు సరిగా విభజించలేదు కనుక రెండు రాష్ట్రాలకూ న్యాయం చేయమని తాను అడిగానని అన్నారు. దశాబ్దాల తరబడి జరిగిన అన్యాయాన్ని మార్చడానికి కొంత సమయం పడుతుంది కనుక తాను ఎన్‌డీయేను ప్రశ్నించకుండా కొంతకాలం వేచి చూశానని, కానీ ఇప్పటికీ బీజేపీ, టీడీపీలు ప్రత్యేక హోదా గురించి ప్రజలను పదే పదే మభ్యపెట్టడం జరుగుతోందని అన్నారు. తాను ప్రజల పక్షం తప్ప ఏ పార్టీ పక్షం కాదని పేర్కొన్నారు. ఈ అంశాలపై తాను ప్రశ్నించినపుడల్లా మభ్యపెడుతున్నారే తప్ప క్లారిటీ ఇవ్వడం లేదని చెప్పారు. జనసేన మీద సామాజిక మాధ్యమాల్లో అనేక కామెంట్లు వస్తున్నాయని చెబుతూ పాలిటిక్స్ అంటే కన్‌స్ట్రక్టివ్ క్రిటిసిజం ఉండాలని, అలా లేని కామెంట్స్‌ను తాను పట్టించుకోనని అన్నారు. బూతులు తిట్టుకునే రాజకీయాలు తనకు రావని, తాను అలాంటి రాజకీయాలు చేయబోనని చెప్పారు. జేఏసీకి సంబంధించి చిరంజీవికి ఇన్విటేషన్ ఉందా అని ప్రశ్నించగా, నోనో చిరంజీవికి దీనితో ఎలాంటి సంబంధం లేదని అన్నారు.