సంపాదకీయం

పెరిగిన పచ్చదనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అడవుల విస్తీర్ణం పెరుగుతుండడం ఆనందకరం. దశాబ్దుల తరబడి నరికివేతకు గురైన మహావృక్షాల స్థానంలో కొత్త కొత్త మొక్కలు మారాకు తొడుగుతున్న దృశ్యం భరత భూమి నలుచెరగులా విస్తరిస్తుండడం శివంకరం, శుభంకరం. అడవి ప్రతీక.. ప్రకృతి పతాక.. సృష్టి స్థిత సతత హరిత సంతులనం ప్రగతికి నిజమైన భూమిక. ఈ సంతులనం వృక్షజాలానికీ, జంతుజాలానికీ మధ్యగల శాశ్వతమైన అనుసంధానం. వృక్షజాలం, జంతుజాలం కలసి ఉమ్మడి జీవజాలం ఏర్పడి ఉంది. జీవజాలంలో మానవుడు సర్వోన్నతుడు, విచక్షణ వంతుడు, సంస్కార శోభితుడు, విజ్ఞాన విగ్రహుడు.. అందువల్ల సృష్టిగత సంతులనం మానవుని విచక్షణ వికాసంతో ముడివడి ఉంది. ఇలా ముడివడి ఉండడం అనాది జీవన వాస్తవం. అనంతమైన భౌతిక, బౌద్ధిక అభ్యుదయం. భారతదేశంలోని ‘విచక్షణ’ ఈ ప్రాకృతిక సంతులన పరిరక్షణకు,పరిపోషణకు దోహదం చేసింది. ప్రకృతిని ఆరాధించడం హైందవ జాతీయ సనాతన సంస్కారమైంది. ఈ సంస్కార ప్రభావం పంచభూతాల నుంచి ప్రసరించింది, పంచభూతాలను పరిరక్షించింది. మానవుడు ప్రకృతిలో భాగం, ప్రకృతి కంటె భిన్నమైన వాడు కాదు. ప్రకృతి సమగ్ర సృష్టిలో భాగం, సృష్టి కంటె భిన్నం కాదు. ఈ సృష్టిగత వాస్తవం హైందవ సమాజ స్థితం కావడం ప్రకృతి పరిరక్షణకు దోహదం చేసింది. అందువల్లనే భారతీయులు అనాదిగా నేలతో, నీటితో, నిప్పుతో, నిరంతర జీవన శ్వాస అయిన గాలితో, నింగితో ఏకాత్మ భావ భరితులయ్యారు. నేల, నీరు, నిప్పు, గాలి, నింగి పంచభూతాలు. సృష్టి పంచభూతాల సమాహారం. మానవుడు, సకల జీవరాశులు పంచభూతాల సమాహారం. ఇదీ అద్వైతం. సృష్టికర్త భూతపతి. పంచభూతాలలో వ్యాపించిన పరమశక్తి.. పంచభూతాలను పెంపొందించిన మానవుడు పరమశక్తిగా ఎదిగాడు. పరమశక్తిగా భాసించాడు. ‘శివో భూత్వా శివం యజేత్’- సృష్టిగా మారి సృష్టికర్తగా మారి సృష్టిని, సృష్టికర్తను పూజించాలి- అన్నది జీవసత్యం. అందువల్లనే భారతీయులు ప్రాకృతిక దేహంతో ప్రకృతిని ఆరాధిస్తున్నారు. పాంచ భౌతిక దేహంతో పంచభూతాలను పూజిస్తున్నారు. నేలతల్లి, నింగితండ్రి, అగ్ని పురోహితుడు, నీరు, గాలి ‘జీవం’ కలిగిస్తున్న జీవన విధాతలు. చెట్టు పుట్ట చెరువుకట్ట కొండగట్టు- ప్రకృతికి చిహ్నాలు, భారతీయులకు వందనీయ పవిత్ర స్థానాలు. ఈ జీవన విధానం అడవులను రక్షించింది. ఈ మమకారం చెట్లను, జంతువులను, పక్షులను, పచ్చదనాన్ని పరిపోషించింది. ఆకుపచ్చదం అన్నం. ఆకుపచ్చదనం అనాదిగా సహజమైన అభ్యుదయం. ఈ పచ్చదనం మళ్లీ పెరుగుతుండడం, అడవులు మళ్లీ విస్తరిస్తుండడం ప్రగతికి పునరుజ్జీవనం..
విదేశీయులు భరతభూమి పట్ల మమకారం లేని వారు. ప్రధానంగా బ్రిటన్ దురాక్రమణదారులు మన దేశంపై పెత్తనం చెలాయించిన కాలంలో ఈ ప్రకృతి పరిరక్షణ ప్రవృత్తి క్రమంగా నశించింది. అవసరాల కోసం కాక అత్యాశతో కలపను మన దేశం నుంచి తరలించడం మొదలైంది. వృక్షాలను నరికివేయడంతోపాటు, అటవీ జంతువులను నిరంతరం హత్య చేయడం జీవన విధానంగా మారింది. రెండవ ప్రపంచ యుద్ధ సమయంలో లక్షలాది వృక్షాలను నరికివేసి కలపను బ్రిటన్‌కు తరలించడం పట్ల దేశ ప్రజలు నిరసనలను తెలపడం చరిత్ర. స్వాతంత్య్ర ఉద్యమకారులు చెట్లను కౌగిలించుకొని ‘హత్యాకాండ’ను ఆపడానికి యత్నించడం చరిత్ర. ఈ అటవీ హననం కారణంగా వనచర జంతుజాతులు అంతరించాయి. గడ్డి దొరకని ఆవులు, పాడిపశువులు ఆకలితో అలమటించాయి, వధ్యశాలకు తరలిపోయాయి. అడవుల్లో లభించే పచ్చని ఆకులు, ఆవుపేడ అనాదిగా వ్యవసాయ భూమికి ఆహారం! అడవులు, ఆవులు చాలావరకూ అంతరించిపోవడంతో సహజమైన ఎరువులు దొరకని వ్యవసాయ భూమి నిర్జీవ క్షేత్రంగా మారింది. రసాయన విషాలు కలిసిన కృత్రిమ ఎరువుల వాడకం వల్ల భూమి ఉపరితలం, భూగర్భ జలం, మానవుల, జంతువుల ఆహారం కలుషితమై పోయాయి, పోతున్నాయి. పుడమిని పరిశుభ్రం చేయగలిగిన నీరు స్వచ్ఛతను కోల్పోయి విషద్రవంగా మారిపోయింది. పారిశ్రామిక వాటికల కోసం లక్షల ఎకరాల అడవులు విధ్వంసమయ్యాయి, నదుల నీరు తాగడానికి మాత్రమే కాదు, తాకడానికి సైతం పనికిరాని ప్రాకృతిక వైపరీత్యానికి గురికావడానికి కారణం అడవుల విధ్వంసం. సుగంధాన్ని పంచే ఎఱ్ఱచందనం వృక్షాలు నేలకొరిగిపోయాయి, కలపగా మారి విదేశాలకు తరలిపోయాయి. పులుల చర్మాలు, గోళ్లు, ఏనుగుల దంతాలు చైనా మందుల ఉత్పత్తి కేంద్రాలకు చేరిపోయాయి..
ఈ దుస్థితిని నిరోధించడానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేపట్టిన జలరక్షణ, వృక్షరక్షణ, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు సత్ఫలితాలను ఇస్తున్నట్టు ఇపుడు ధ్రువపడింది. ‘హరిత హారం’ పథకం తదితర ‘వన’ చర్యల కారణంగా తెలంగాణలో గత రెండేళ్లలో అటవీ విస్తీర్ణం ఐదువందల అరవై ఐదు చదరపు కిలోమీటర్ల మేర పెరిగిందట! తెలంగాణ భూభాగంలో ఇరవై నాలుగు శాతం మేర ప్రస్తుతం అడవులు విస్తరించి ఉన్నాయన్నది ‘్భరత అటవీ సమీక్షా సంస్థ’- ఫారెస్ట్ సర్వే ఆఫ్ ఇండియా- ఎఫ్‌ఎస్‌ఐ- విడుదల చేసిన ద్వైవార్షిక భారత ‘అటవీ అస్తిత్వ నివేదిక’- స్టేట్ ఆఫ్ ఫారెస్ట్ రిపోర్ట్- ఎస్‌ఎఫ్‌ఆర్- ద్వారా ధ్రువపడిందట. ‘హరితాంధ్ర ప్రదేశ్’ కూడ అడవుల విస్తరణలో అత్యద్భుత విజయం సాధించి దేశంలో అగ్రస్థానంలో నిలువగలుగుతోంది. దేశం మొత్తం మీద ఈ రెండేళ్లలో ఆరువేల ఏడు వందల డెబ్బయి ఎనిమిది చదరపుకిలోమీటర్ల మేర అడవుల వైశాల్యం పెరుగగా, ఇందులో దాదాపు మూడవ వంతు విస్తరణ ఆంధ్రప్రదేశ్‌లోనే జరగడం రొదలేని హరిత విప్లవ సంకేతం. రెండు వేల నూట నలబయి ఒక్క చదరపు కిలోమీటర్ల మేర ఈ రెండేళ్ల- 2015-2017లో ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా అడవులు ఏర్పడినాయట! ప్రస్తుతం తెలంగాణలో ఇరవై నాలుగు శాతం భూభాగంలో, ఆంధ్రప్రదేశ్‌లో ఇరవై మూడు శాతం భూభాగంలో అడవులు విస్తరించి ఉన్నాయట. ఈ పెరుగుదల తర్వాత మొత్తం దేశంలో అటవీ భూమి ఇరవై ఒక్క శాతం నుంచి ఇరవై రెండు శాతానికి పెరగడం హరిత పథ ప్రస్థానంలో వర్తమాన ‘ప్రగతి పదం’..
దేశంలోని భూభాగంలో కనీసం ముప్పయి మూడు శాతం అడవులు విస్తరించి ఉండాలన్నది పుడమితల్లి పరిపుష్టికి, పర్యావరణ సమతుల్యతకు, మానవ జీవన సౌష్టవానికి అనివార్యం. బ్రిటన్ దొరలు మన దేశానికి వచ్చేనాటికి, నాలుగు వందల ఏళ్ల పూర్వం నాటికి అఖండ భారత భూభాగంలో యాబయి మూడు శాతం మేర అడవులు విస్తరించి ఉండేవట! బ్రిటన్ దొరల దోపిడీకాండ ముగిసే నాటికి అడవుల విస్తీర్ణం ముప్పయి శాతానికి కుంచించుకొని పోయింది. అయినప్పటికీ శ్రీశైలం అడవుల్లోని ఆకులు ‘రక్తగాయాలను గంటలలో మాన్పిన చరిత్ర’ అప్పుడు కూడ కొనసాగింది. అనంతగిరి అడవుల నుంచి ప్రవహించిన ఓషధీ జలాలు ఆరోగ్యాన్ని పరిరక్షించిన చరిత్ర కొనసాగింది. డెబ్బయి ఏళ్ల తర్వాత అనంతగిరి నుంచి ప్రవహించిన అమృత ఝరి ‘ముచికుంద’ మురుగునీటి మూసీగా మారడానికి కారణం అడవుల విధ్వంసం.. అటవీ రక్షణ భారతీయత, అటవీ విధ్వంసం ‘ప్రపంచీకరణ’.. భరతమాత హరిత చేలంపై పడిఉన్న ‘చిరుగులు’ మాసిపోయేదెప్పుడు? అడవుల శోభలు యథాపూర్వంగా వికసించేదెలా?