మహబూబ్‌నగర్

గిరిజన సంక్షేమానికి ప్రభుత్వం కృషి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జడ్చర్ల, ఫిబ్రవరి 15: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటైన నాటి నుండి ముఖ్యమంత్రి కేసీఆర్ గిరిజనుల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్నారని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని శంకరాయపల్లి తండా వద్ద గిరిజనులు ఏర్పాటు చేసిన సంత్ సేవాలాల్ 279వ జయంతి ఉత్సవంలో మంత్రి లక్ష్మారెడ్డి బంజారా భవన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ బంజార భవన్ నిర్మాణానికి అవసరమైన రూ.20లక్షలు ప్రభుత్వం మంజూరు చేసిందని వెల్లడించారు. టెండర్లు పూర్తి అయిన తరువాత శిలాఫలకం ఏర్పాటు చేసి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహిద్దామని మంత్రి వెల్లడించారు. సంత్ సేవాలాల్ వచ్చే జయంతిని బంజార భవన్‌లోనే నిర్వహిద్దామన్నారు. ఇక్కడ నిర్మించనున్న భవనం ద్వారా మండలంలోని అన్ని గ్రామాల గిరిజనులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజనుల అబివృద్ధికి ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాధాన్యత ఇస్తున్నారని పునరుద్ఘాటించారు. ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలను కూడా గిరిజనులు అందిపుచ్చుకొని సద్వినియోగం చేసుకుంటూ ముందుకు సాగుతున్నారని అభినందించారు. తాను మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు తండాలకు వెళితే వారి సమస్యలపై గిరిజనులు ఏకరువు పెట్టేవారని గుర్తుచేశారు. రోడ్డు సమస్య, నీటి సమస్య, ఇళ్ల సమస్య, విద్యుత్ సమస్యలను తన దృష్టికి తీసుకువచ్చేవారని వివరించారు. స్వరాష్ట్రంలో ఒక్కో సమస్యను అధిగమిస్తూ ప్రభుత్వం ముందుకు సాగుతుందని వెల్లడించారు. గ్రామాలకు బీటీ రోడ్లు, విద్యుత్ సమస్యలు పూర్తయ్యాయని అని అన్నారు. త్వరలోనే తండాలు కూడా గ్రామ పంచాయతీలుగా మారనున్నాయని వివరించారు. మిషన్ భగీరథలో భాగంగా ప్రతి గ్రామానికి మంచి నీరు మార్చి నెలలో రానున్నాయన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ లక్ష్మి, జడ్పీటీసీ జయప్రద, కావేరమ్మపేట సర్పంచ్ బుక్కా వెంకటేశం, టీఆర్‌ఎస్ నాయకులు శంకర్ నాయక్, గోపాల్ నాయక్, రమేశ్ నాయక్, గురువు జోధ్యానాయక్ తదితరులు పాల్గొన్నారు.
మిడ్జిల్: తండాలను అన్నివిధాల అభివృద్ధి పరుస్తామని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. గురువారం మండల కేంద్రంలోని సేవాలాల్ జయంతిలో మంత్రి మాట్లాడుతూ గత కొనే్నళ్లుగా తాండలలో విద్య, వైద్య, రవాణాకు అందుబాటులో లేక చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నారని రాష్ట్రం ఏర్పడ్డాక తండాలను ప్రత్యేక పంచాయతీలుగా చేయడమే కాక విద్య, వైద్య, రవాణా సౌకర్యాలతో అభివృద్ధిపరుస్తామన్నారు. మండలంలోని అన్ని తండాలకు బీటీ రోడ్లు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు. మండల కేంద్రంలోని ఎస్టీ కమ్యూనిటీ భవనానికి నిధులు కేటాయిస్తానని తెలిపారు. అనంతరం మండల పరిధిలోని వేముల గ్రామంలో గత మూడు రోజులుగా నిర్వహిస్తున్న శివరామాంజనేయస్వామి బ్రహ్మోత్సవాల్లో ప్రత్యేక పూజ లు నిర్వహించి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. కార్యక్రమంలో సర్పంచు యశోద, జడ్పీటీసీ హైమవతి, ఎంపీటీసీ చెన్నయ్య, గిరిజన నాయకులు గిరినాయక్, లక్ష్మణ్‌నాయక్, సర్పంచ్ అల్వాల్‌రెడ్డి, సరోజినమ్మ పాల్గొన్నారు.

గెలుపే లక్ష్యంగా పనిచేయాలి
* బీజేపీ రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ కొండయ్య
మక్తల్, ఫిబ్రవరి 15: రాబోయే 2019 ఎన్నికల్లో బీజేపీ గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ఎంతో శ్రమించి పనిచేయాలని, అప్పుడే మనందరం అనుకున్న ఆశయాలు, లక్ష్యాలు నెరవేరుతాయని ఆ పార్టీ రాష్ట్ర సంపర్క్ అభియాన్ చైర్మన్ కొండయ్య కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గురువారం మక్తల్‌లోని కొండయ్య నివాసంలో ఏర్పాటు చేసిన బీజేపీ మండల కోర్ కమిటీ సమావేశంలో ఆయన కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తున్నాయన్నారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వంపై ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వానికి రాబోయే ఎన్నికల్లో ప్రజలు కచ్చితంగా తగిన గుణపాఠం చెప్పక మానరన్నారు. ఈనెల 16 నుండి బీజేపీ ఆధ్వర్యంలో గ్రామదర్శిని కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. వీటిద్వారా బీజేపీ ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును ప్రజల వద్దకు తీసుకెళ్లి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో సైతం బీజేపీ విజయఢంకా మోగిస్తుందని పేర్కొన్నారు. ఈనెల 28న స్థానిక మక్తల్ పట్టణ కేంద్రంలో రైతు నీటి సమస్యపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, ఇందుకు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కొండయ్య పిలుపునిచ్చారు. సమావేశంలో సభాధ్యక్షులుగా ప్రతాప్‌రెడ్డి, కల్లూరి నాగప్ప, లక్ష్మణ్, మోహన్‌గౌడ్, జయరాంరెడ్డి, వెంకట్రాములు, కుర్వ హన్మంతు, శ్రీకాంత్, లక్ష్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది
* ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి

వనపర్తి, ఫిబ్రవరి 15: గిరిజనుల అభివృద్ధికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పని చేస్తున్నదని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో వనపర్తి సమీపంలోని నాగవరం ఇందూ గార్డెన్‌లో నిర్వహించిన సంత్ సద్గురు సేవాలాల్ మహారాజ్ 279 జయంతి ఉత్సవాలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈసందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ లంబాడా ఆదివాసీల హక్కుల కోసం విద్యా సమాన అవకాశాల కోసం పోరాడటమే కాకుండా గిరిజనుల్లో చైతన్యం తెచ్చేందుకు సంత్ సేవాలాల్ కృషి చేశారన్నారు. తెలంగాణ పోరాటంలో గిరిజనులు ఎక్కువగా నష్టపోయారన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం గడిచిన మూడున్నర సంవత్సరాల్లో 120 గిరిజన పాఠశాలలు, 20 రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసిందని తెలిపారు. కల్యాణ లక్ష్మితో పాటు రైతులకు బిందు, తుంపర పరికరాలను వంద శాతం సబ్సిడీతో ఇవ్వడంతో పాటు అనేక పథకాలు అమలు చేస్తున్నదన్నారు. విద్యార్థులకు అంబేద్కర్ ఓవర్సిస్ పథకం ద్వారా 20లక్షల రుణాలతో విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించేందుకు పథకాన్ని అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ పంచాయతీ ప్రజలతో పాటుగా తండాల అభివృద్ధికి గాను 500 జనాభా కలిగిన ప్రతి తండాను గ్రామ పంచాయతీగా ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. వనపర్తిలో గిరిజన భవన్ కోసం త్వరలోనే స్థలం కేటాయించి భవన నిర్మాణానికి తనవంతు కృషితో నిధులు కేటాయించేలా చూస్తానన్నారు. ఎమ్మెల్యే చిన్నారెడ్డి మాట్లాడుతూ సంచార జీవనం గడిపిన గిరిజనులకు సంతుసేవాలాల్ దైవమన్నారు. ప్రస్తుతం వ్యవసాయంపై ఆధారపడిన గిరిజనుల అభివృద్ధికి ప్రత్యేకించి వనపర్తి జిల్లాలో మహిళలకు డిగ్రీ హాస్టల్, నైపుణ్య అభివృద్ధికి అవకాశాలున్నాయని, త్వరలోనే ప్రీ మెట్రిక్ బాలికలకు హాస్టల్‌గా రాబోతుందన్నారు. తండాలు, గ్రామ పంచాయతీలు అయతే స్వయంపాలన వస్తుందన్నారు. గిరిజనులు పిల్లలందరిని పాఠశాలలకు పంపాలన్నారు. కలెక్టర్ శే్వతా మహంతి మాట్లాడుతూ సమాజంలో మార్పుకోసం గిరిజనుల సంస్కృతిపై అవగాహన కల్పించిన గొప్ప వ్యక్తి సంతూసేవాలాల్ అని అన్నారు. జిల్లాలో 46వేల ఎస్టీ జనాభా ఉన్నదని, 31 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. 1390 మంది గిరిజన విద్యార్థులను పోస్టుమెట్రిక్ ఉపకార వేతనాలు ఇస్తున్నామని, గుడుంబా వృత్తి వదిలేసిన 76 మంది గిరిజనులకు కోటి 52లక్షలతో పునరావాసం కల్పించినట్లు తెలిపారు. కార్యకమంలో మున్సిపల్ చైర్మన్ రమేష్ గౌడ్, ఎంపీపీలు శంకర్ నాయక్, కృష్ణానాయక్, గిరిజన ఉద్యోగ సంఘం, సైవా సంఘాల నాయకులు జాత్రునాయక్, చందూనాయక్, బాల్యానాయక్ తదితరులు మాట్లాడారు. కార్యక్రమంలో జేసీ నిరంజన్, డీటీడీఓ మంగ్యనాయక్, ఆర్డీఓ చంద్రయ్య, డీఆర్‌డీఓ గణేశ్, గిరిజన ఉద్యోగాల సంస్థ అధ్యక్షుడు శ్రీ్ధర్ నాయక్, ఎంపీటీసీ మణెమ్మ పాల్గొన్నారు.

వారంలో పైప్‌లైన్ల పనులు పూర్తి
* మంత్రి జూపల్లి కృష్ణారావు
మందకొడి పనులపై అధికారుపై ఆగ్రహం
కోడేరు, ఫిబ్రవరి 15: మండలంలోని గ్రామాలలో అంతర్గత పైప్‌లైన్ల పనులు వారం రోజులలో పూర్తి చేయాలని మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులను ఆదేశించారు. మండల కేంద్రంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో వివిధ శాఖల అధికారులతో గురువారం సమీక్ష నిర్వహించారు. మిషన్ భగీరథ ద్వారా మండలంలో 32 ఓవర్‌హెడ్ ట్యాంకులు మంజూరు కాగా చాలా పనులు ముందుకు కొనసాగకుండా మందకొడిగా కొనసాగడంపట్ల ఆయన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మార్చి 31లోపు మిషన్ భగీరథ పనులన్ని పూర్తి చేయాలని ఆయన ఆదేశించారు. వ్యక్తిగత మరుగుదొడ్లు, డంపింగ్ యార్డులు, వైకుంఠ ధామాలు, ఇంకుడు గుంతలు గ్రామాలలో తక్షణమే చేపట్టి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. మిషన్ భగీరథ పైప్‌లైన్ వేయకుండా అంతర్గత సీసీ రోడ్ల పనులను అనుమతించేదిలేదన్నారు. మైలారం పరిధిలోని నార్యానాయక్ తండాలో 152 సర్వే నంబర్‌లో ఏడు ఎకరాల ప్రభుత్వ భూమిని ఆక్రమించుకున్న వారిపై తక్షణమే నాన్‌బెయిలబుల్ కేసు నమోదు చేసి రెవెన్యూ రికవరీ చట్టం ప్రకారం ఆ పొలంలో పంటలు సాగుచేసిన వారిపై డబ్బులు వసూలు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమించుకున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని స్థానిక తహశీల్దార్ కృష్ణయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మండల కేంద్రం కోడేరులో నాలుగు లైన్ల రోడ్డు నిర్మాణం కోసం తక్షణమే మార్కింగ్ ఇవ్వాలని ఆర్ అండ్ బీ అధికారులను ఆదేశించారు. మండలంలోని జనుంపల్లి, బావాయిపల్లి, మాచుపల్లి, ఎత్తం, తీగలపల్లి గ్రామాల్లో పంచాయతీల భవన నిర్మాణం కోసం రూ.16లక్షల చొప్పున మంజూరైన భవన నిర్మాణాలు ఎందుకు చెపట్టడంలేదని ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులను ప్రశ్నించారు. కోడేరుకు నూతన పంచాయతీ భవన నిర్మాణం కోసం రూ.50లక్షలు మంజూరయ్యాయని తక్షణమే భవన నిర్మాణ పనులు చేపట్టాలని ఆదేశించారు. మండలంలోని అన్ని గ్రామాలను అనుసంధానం చేస్తూ మంజూరైన రోడ్ల పనులను తక్షణమే చేపట్టాలని, కొనసాగుతున్న పనులను పూర్తి చేయాలని ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ శాఖాధికారులకు సూచించారు. మిషన్ భగీరథ ట్యాంకుల నిర్మాణాలు, పైప్‌లైన్ల పనులు నత్తనడకన కొనసాగుతున్నాయని తక్షణమే పనులను వేగవంతం చేయడం కోసం సామాగ్రిని మండలాలకు సరఫరా చేయాలని సీఈ కృపాకర్‌ను చరవాణి ద్వారా ఆదేశించారు. కార్యక్రమంలో ఎంపీపీ కె.రామ్మోహన్‌రావు, జడ్పీటీసీ బస్తీరాంనాయక్, మండల ఉపాధ్యక్షుడు వెంకటస్వామి, ఆయా గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, డీపీవో వెంకటేశ్వర్‌రావు, డీఈవో జనార్ధన్‌రావు, ఆర్‌డబ్ల్యూఎస్ శ్రీ్ధర్‌రావు, ఏఈ బాలరాజు, పంచాయతీరాజ్ డీప్యూటీ ఈఈ పుల్లయ్య, ఏఈ కృష్ణయ్య, ఆర్ అండ్ బీ ఈఈ భీముడు పాల్గొన్నారు.

విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలి
* పాలమూరు వర్సిటీ వీసీ ఆచార్య రాజారత్నం

కొత్తకోట, ఫిబ్రవరి 15: విద్యార్థులు సైన్స్ పట్ల ఆసక్తి పెంచుకోవాలని పాలమూరు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య రాజారత్నం అన్నారు. గురువారం మండల పరిధిలోని పాలెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో కలాం ఫౌండేషన్ సహకరంతో నిర్వహించిన సైన్స్ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం విద్యకు అధిక నిధులు కేటాయించాలని, నిధులు అవసరం మేరకు ఇవ్వకపోవడం కారణం విద్యాలయాల్లో వసతుల లేవన్నారు. అభివృద్ధి చెందిన దేశల్లో విద్యకు ఎక్కువ నిధులు ఇస్తున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణలతో కూడిన విద్య అందుతుందని ఆయన అన్నారు. పాఠశాల స్థాయి నుండి విద్యార్థులు సబ్జెక్టుల వారిగా ప్రయోగశాలలు అవసరం అవుతాయన్నారు. ఉన్నత లక్ష్యాలతో ముందుకు వెళ్లాలని, ఒక్క విద్యార్ధితో ఒక్క రంగంలో వైపు ఆసక్తి ఉంటుందని, ఆ వైపు ప్రోత్సహించాలని ఆయన అన్నారు. విద్యార్ధుల ప్రదర్శనలు ఆలోచింపజేసే విధంగా ఉన్నాయని, స్వచ్ఛ్భారత్, ప్లాస్టిక్ వినియోగం తగ్గించాలనే విషయాన్ని తలిదండ్రులతో పాటు గ్రామస్థులకు అవగాహన కల్పించాలని ఆయన కోరారు. సైన్స్ ప్రదర్శనల ద్వారా విద్యార్థుల్లో ఆసక్తి పెరుగుతుందని, పాఠశాలల్లో వౌలిక వసతులు కల్పించుకునేందుకు ప్రజాప్రతినిధుల సహకరం తీసుకోవాలన్నారు. ఉపాధ్యాయులు సైతం విద్యార్థులకు ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. అనంతరం కలాం యువ జాగృతి ఫౌండేషన్ లోగోను ఆవిష్కరించారు. కార్యక్రమంలో జాగృతి ఫౌండేషన్ సభ్యులు షబుద్దీన్, ఉపాధ్యాయులు, ఎస్‌ఎంసీ చైర్మన్ వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.

బంజారాల ఆరాధ్యదైవం సేవాలాల్
* కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ
గద్వాల, ఫిబ్రవరి 15: బంజారాల ఆరాధ్యదైవం శ్రీ సంత్ సేవాల్ మహారాజ్ అని కలెక్టర్ రజత్‌కుమార్ సైనీ అన్నారు. గురువారం సేవాలాల్ మహారాజ్ జయంతి వేడుకలు జిల్లాలో గిరిజన సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. గద్వాల పట్టణంలోని పాతబస్టాండు నుండి పీజేపీ క్యాంపులోని శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర ఆలయం వరకు ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ సేవాలాల్ మహారాజ్ భోగ్ బండారో-్భక్త్భివన సభకు జిల్లా కలెక్టర్ రజత్‌కుమార్‌షైని, గద్వాల ఎమ్మెల్యే డీకే అరుణ, మార్కెట్ యార్డు చైర్‌పర్సన్ బండ్ల లక్ష్మీదేవిలు ముఖ్యఅతిథిలుగా హాజరై సేవాలాల్ హోమగుండంలో పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ సైనీ మాట్లాడుతూ ప్రభుత్వ సహకారంతో గిరిజనుల ఆరాధ్యదైవం అయిన శ్రీ సేవాలాల్ మహారాజ్ మందిర నిర్మాణానికి, కమ్యూనిటి హాలు నిర్మాణానికి కృషి చేస్తానని కలెక్టర్ అన్నారు. అనంతరం ఎమ్మెల్యే డీకే అరుణ మాట్లాడుతూ గిరిజన అర్హత గల తండాలను గ్రామ పంచాయతీలుగా గుర్తించాలని ప్రభుత్వానికి ప్రతిపాదన పంపించామన్నారు. త్వరలోనే తండాలు పంచాయతీలుగా ఏర్పాటు కానున్నాయని ఆమె తెలిపారు. జిల్లాలో గిరిజన సేవాలాల్ భవన ఏర్పాటుకు స్థలం కేటాయించి, నిర్మాణ పనులకు తమ వంతు సహాయ సహకారం ఉంటుందని అమె అన్నారు. కార్యక్రమంలో తహశీల్దార్ రాజు, సేవాలాల్ రాష్ట్ర అధ్యక్షుడు సంజీవ్‌నాయక్, సేవాలాల్ జిల్లా అధ్యక్షుడు కృష్ణనాయక్, గిరిజన ఉపాధ్యాయ సంఘం నాయకుడు బాసు నాయక్, గిరిజన విద్యార్థి నాయకుడు బిక్యానాయక్, సేవాలాల్ సేన, లంబాడి ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, పీసీసీ కార్యవర్గ సభ్యుడు గడ్డం కృష్ణారెడ్డి, నాయకులు జమ్మిచేడు ఆనంద్, డీటీడీసీ నర్సింహ పాల్గొన్నారు.