శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

27 మంది అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కావలి రూరల్, ఫిబ్రవరి 19: ఎర్రచందనం అక్రమ రవాణా అరికట్టే చర్యలలో భాగంగా పోలీసులు ఏకకాలంలో దాడులు నిర్వహించి 27 మంది అంతర్ రాష్ట్ర ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించేందుకు స్థానిక డిఎస్పీ కార్యాలయంలో ఓఎస్‌డీ విఠలేశ్వరరావు, డీఎస్పీ రఘు, రూరల్ సిఐ అశోక్‌వర్దన్‌రెడ్డి సోమవారం విలేఖర్ల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓఎస్‌డీ విఠలేశ్వరరావు మాట్లాడుతూ జిల్లాఎస్పీ రామకృష్ణ ఆదేశాలతో ఎర్రచందనం ఆక్రమ తరలింపులపై నిఘా ఉంచామన్నారు. ఈ క్రమంలో సంగం, కావలి రూరల్, దుత్తలూరు స్టేషన్ల పరిధిలో ఎర్రచందనం కూలీల సంచారం ఉన్నట్లు సమాచారం అందడంతో ఆయా స్టేషన్ల ఎస్‌ఐలు చాకచక్యంగా వ్యవహరించి కూలీలను అదుపులోకి తీసుకున్నారన్నారు. ఈ సమయంలో సంగం పోలీస్‌స్టేషన్ పరిధిలో ఎస్‌ఐ జి వేణు తమ సిబ్బందితో కలసి తొమ్మిది మందిని అదుపులోకి తీసుకున్నారన్నారు. అలాగే కావలి రూరల్ పరిధిలోఎస్‌ఐ పుల్లారావు 10 మంది కూలీలను, దుత్తలూరు పరిధిలో ఎస్‌ఐ రాజేష్ ఎనిమిది మంది కూలీలను అదుపులోకి తీసుకున్నట్లు ఆయన తెలిపారు. మొత్తం 27 మంది నుంచి 50 ఎర్రచందనం దుంగలు, నాలుగు కార్లు, 24 సెల్‌ఫోన్లు, ఆరు గోడ్డళ్లతో పాటు కొంత నగదు స్వాదీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. 588 కేజీల బరువు ఉన్న ఎర్రచందనం దుంగల విలువ సుమారు రూ.70 లక్షలు ఉంటుందని తెలిపారు. వెలుగొండ పరిధిలోని అటవీ ప్రాంతం నుంచి ఈ దుంగలను తరలించేందుకు వివిధ వాహనాల్లో వీరు బయలుదేరినట్లు ఎస్పీకి సమాచారం అందిన వెంటనే ఆయన సంబంధిత స్టేషన్లను అప్రమత్తం చేశారు. ఈ క్రమంలో సంగం, దుత్తలూరు, కావలి రూరల్ పోలీసుల ప్రత్యేక తనిఖీలలో వీరిని పట్టుకున్నట్లు తెలుపుతూ ఆయా ఎస్‌ఐలను అభినందించారు.

పచ్చటి పొలాలను చూసి ఓర్వలేకున్నారు
* రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి
మనుబోలు, ఫిబ్రవరి 19 : జిల్లాలోని పచ్చటి పొలాలను చూసి ప్రతిపక్ష నేతలు జీర్ణించుకోలేకపోతున్నారని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి విమర్శించారు. సోమవారం కండలేరు డ్యాం అతిథిగృహంలో మనుబోలు మండల తెలుగుదేశం నాయకులతో పార్టీ పరిస్థితిపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమగ్రమైన నీటి యాజమాన్యంతో జిల్లాలో రికార్డు స్థాయిలో పంటలు పండిస్తున్నామని, మెట్ట భూములు కూడా మాగాణిని తలపిస్తూ కళకళలాడుతున్నాయని అన్నారు. వైకాపా నాయకులు ఒకవైపు రైతుల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నాలు చేస్తూ మరోవైపు సాగునీటిని తామే ఇప్పిస్తున్నట్లుగా రైతులను మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తున్నారని, దీన్ని టీడీపీ నాయకులు తిప్పికొట్టాలని సూచించారు. తనను వ్యక్తిగతంగా దెబ్బతీయాలని చూసిన వ్యక్తులు పరువు పోగొట్టుకున్నారంటూ పరోక్షంగా కాకాణిని ఉద్దేశించి అన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి చూసి వైకాపా నాయకులు ఓర్వలేకపోతున్నారన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ అర్హులకు అందేవిధంగా పార్టీ నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని సూచించారు. రాబోవు ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీకి మనుబోలు మండలంలో సుమారు 4వేల ఓట్ల మెజారిటి సాధించే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు నియోజకవర్గ పార్టీ నమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్‌రెడ్డితోపాటు మనుబోలు మండల తెలుగుదేశం నాయకులు గాలి రామకృష్ణారెడ్డి, పొన్నూరు రామకృష్ణయ్య, వర్దినేని మస్తాన్‌నాయుడు, సూరపనేని కిషోర్‌నాయుడు, శివుడు రాజా తదితరులు ఉన్నారు.

అత్యాధునిక టెక్నాలజీతో పక్కాగృహాలు
*రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 19: జిల్లాలో ఆర్థికంగా వెనుకబడిన తరగతుల వారికి పక్కా గృహాలు అందించడంలో భాగంగా నెల్లూరు నగర పరిధికి దగ్గరలోని కొండ్లమూడి వద్ద 60 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేయవలసినదిగా సంబంధిత అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి పి నారాయణ వెల్లడించారు. సోమవారం ఉదయం నెల్లూరు మండలం కొండ్లమూడి వద్ద కొనుగోలు చేయనున్న భూమిని ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలోని 110 మున్సిపాలిటీలలో 5 లక్షల ఇళ్లను అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించడమే లక్ష్యంగా ఉందన్నారు. షీర్‌వాల్ టెక్నాలజీని ఉపయోగించి అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో, అన్ని వసతులతో ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. ప్రభుత్వ భూములు లేనిచోట భూములు కొనుగోలు చేసి ఏర్పాటుచేయడం జరుగుతుందన్నారు. అందులో భాగంగా కావలిలో 6 కోట్లతో, ఏలూరులో 50 కోట్లతో భూమి కొనుగోలుచేసి గృహ నిర్మాణానికి చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. అందరికి అందుబాటులో ఉండే విధంగా నగర పరిధిలో లేదా దగ్గరగా ఉండే విధంగా గృహ నిర్మాణం చేపట్టి అందజేయడం జరుగుతుందన్నారు. నెల్లూరులో జనార్దన్‌రెడ్డి కాలనీ, కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డు కాలనీ, వైఎస్‌ఆర్‌నగర్, ఇరుకళల పరమేశ్వరి దేవాలయం, తదితర ప్రాంతాలలో స్థలాలను గుర్తించి గృహ నిర్మాణాలు చేపట్టడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ చాట్ల నరసింహరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి డి హరిత, నగర పాలక కమీషనర్ ఆలీంబాషా, తహశీల్దార్ నరసింహులు, విఆర్‌ఓ జనార్దన్, వివిధ శాఖాధికారులు తదితరులు పాల్గొన్నారు.

‘పెండింగ్‌లో ఉన్న ఫీజులు వెంటనే విడుదల చేయాలి’
గూడూరు, ఫిబ్రవరి 19 : 2016-17 సంవత్సరానికి సంబంధించి రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న ఫీజు బకాయిలు రూ.2158 కోట్లను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలంటూ ఏఐఎస్‌ఎఫ్ ఆధ్వర్యంలో గూడూరు సబ్‌కలెక్టర్ కార్యాలయం ఎదుట సోమవారం ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐఎస్‌ఎఫ్ అధ్యక్షుడు అబ్బాస్, కార్యదర్శి పవన్ మాట్లాడుతూ రాష్ట్రంలో బీసీలకు రూ.898 కోట్లు, ఈబీసీలకు రూ.590 కోట్లు, ఎస్‌లకు రూ.415 కోట్లు, ఎస్‌టిలకు రూ.96 కోట్లు, మైనారిటీలకు రూ.167కోట్లు, పిహెచ్‌డిలకు రూ.3కోట్లు ఫీజురీయంబర్స్‌మెంట్ పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఈ విధంగా ఫీజు బకాయిలు పేరుకుపోతుంటే సంక్షేమశాఖ అధికారులు స్పష్టత ఇవ్వకుండా దాగుడుమూతలు ఆడుతున్నారంటూ ధ్వజమెత్తారు. ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు సంబంధించి ప్రభుత్వం విద్యా సంవత్సరం మొత్తాన్ని ఓకేసారి చెల్లించాలంటూ ఇంజనీరింగ్ కాలేజీల యాజమాన్యాలు కోరుతుంటే ప్రభుత్వం నాలుగు విడతలుగా చెల్లిస్తోందన్నారు. దీంతో రాష్ట్రంలో 10శాతం కాలేజీలు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. పెండింగ్‌లో ఉన్న సొమ్మును కాలేజీలకు ప్రభుత్వం చెల్లించకపోవడంతో కాలేజీలలో పనిచేస్తున్న ఉద్యోగులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. ఇకనైనా ప్రభుత్వం వెంటనే నిధులను విడుదల చేసి విద్యార్థులకు ఉత్తమమైన విద్య అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో వీరితోపాటు ఏఐఎస్‌ఎఫ్ నాయకుడు హర్ష తదితరులు పాల్గొన్నారు.

అంతరాష్ట్ర బైక్ దొంగల అరెస్ట్
* ఆరు మోటార్‌బైక్‌లు స్వాధీనం
సూళ్లూరుపేట, ఫిబ్రవరి 19 : ఆంధ్ర, తమిళనాడులో మోటారుబైక్‌లు దొంగతనాలు చేసే ఇద్దరు అంతరాష్ట్ర దొంగలను సోమవారం సూళ్లూరుపేట పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి మొత్తం ఆరు మోటారు బైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పోలీస్‌స్టేషన్‌లో సిఐ కిషోర్ బాబు, ఎస్సై ఇంద్రసేనారెడ్డి విలేఖర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు తిరువళ్లూరు జిల్లా పెరియ ఓబులాపురంకు చెందిన బి మారిముత్త చిలంబరసన్, తమిళనాడు ఎళావూరుకు చెందిన మూర్తి చంద్రబోస్ అనే ఇద్దరు యువకులు జల్సాలకు అలవాటుపడి బైక్ దొంగతాలను ఎంచుకున్నారు. ఈ క్రమంలో గత ఏడాడి జూలై నెలలో చెంగాళమ్మ ఆలయం వద్ద పార్కుచేసిన పల్సర్ బైక్‌ను అపహరించారు. ఆ బైక్‌ను నెంబర్ ప్లేట్ మార్చి సొంత అవసరాలకు వాడుకుంటూ అప్పటి నుంచి సూళ్లూరుపేట, తడ, దొరవారిసత్రం తదితర ప్రాంతాల్లో తిరుగుతూ ఆపి ఉన్న మోటారు సైకిళ్లను చోరీచేసి తీసుకెళ్లెవారు. ఇలా వీరు ఇరువురు మొత్తం ఆరు బైక్‌లు అపహరించారు. వీరేకాకుండా ఈ చోరీలకు పాల్పడే మూడు, నాలుగు గ్రూపులు ఉన్నట్లు విచారణలో రుజువైనట్లు సిఐ తెలిపారు. ఇటీవల తడ, వాకాడులో కూడా మరో రెండు గ్రూపులను అరెస్ట్ చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా కొందరిని పట్టుకోవాల్సి ఉందని త్వరలోనే అందరిని పట్టుకుంటామన్నారు. చెంగాళమ్మ ఆలయం వద్ద వీరిద్దరు మోటారుబైక్‌లపై తిరుగుతుండగా అనుమానంతో విచారించగా అసలు విషయం బయటపడిందన్నారు. వెంటనే ఇద్దరిని అదుపులోకి తీసుకొని విచారించి అరెస్ట్ చేసి కోర్టుకు హాజరుపరిచారు. వారి వద్ద నుంచి ఆరు మోటారుబైక్‌లను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో మోటారుబైక్‌ల యజమానులు బైక్‌లకు సెంటర్ లాక్ వేయడమే కాకుండా రక్షణగా ఫోర్క్ లాక్ కూడా వేయాలన్నారు. ఎక్కడపడితే అక్కడ బైక్‌లు నిలపరాదని, రక్షణ ఉన్నచోట నిలిపి తాళాలన్ని జాగ్రత్తగా వేసుకోవాలని పోలీసులు తెలిపారు. ఎంతో చాకచక్యంతో దొంగలను పట్టుకున్న ఎఎస్సై శేఖర్, హెడ్ కానిస్టేబుళ్లు మునీర్‌బాషా, మురళీకృష్ణ, ఎస్‌కె నవాజ్‌లను సిఐ, ఎస్సై అభినందించారు.

జిల్లాలో 15 కరవు మండలాలు
* ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం
ఆంధ్రభూమి బ్యూరో
నెల్లూరు, ఫిబ్రవరి 19: జిల్లాలో 15 కరవు మండలాలుగా ప్రకటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. జిల్లాలో మొత్తం 46 మండలాలు ఉండగా, 15 మండలాలను కరవు మండలాలుగా ప్రకటించింది. అందులో సీతారామపురం, వరిగుంటపాడు, కొండాపురం, వింజమూరు, ఉదయగిరి, మర్రిపాడు, చేజర్ల, అనంతసాగరం, రాపూరు, పొదలకూరు, గూడూరు, సైదాపురం, బాలాయపల్లి, ఓజిలి, కోట మండలాలు ఉన్నాయి. ప్రధానంగా వర్షపాతం వివరాలు, పంటలు ఎండిపోవడం వంటి అంశాలను పరిగణనలోకి తీసుకొని కరవు మండలాలుగా ప్రకటించడం జరిగింది.

రూ.5లక్షలతో ఐమ్యాక్స్‌లైటింగ్ ప్రారంభం
* నగర మేయర్ అబ్దుల్ అజీజ్ స్పష్టం
నెల్లూరుసిటీ, ఫిబ్రవరి 19: నగరంలోని పెద్ద బజారు సెంటర్‌లో 5లక్షలతో ఐమ్యాక్స్ లైటింగ్‌ను నగర మేయర్ అబ్దుల్ అజీజ్ సోమవారం ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ నగరంలోని అన్ని ప్రాంతాలలో ఎల్‌ఇడి లైట్లును వేయడం జరిగిందన్నారు. ఎల్‌ఇడి లైట్లు లేని 4వేల స్తంభాలను గుర్తించినట్లు వాటి కూడా త్వరలో వేస్తామన్నారు. అదే విధంగా ఐమ్యాక్స్ లైట్లుతో పాటు ముఖ్యమైన ప్రాంతాలలో మహిళల రక్షణ కొరకు సిసి కామెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. మహిళలకు రక్షణ కల్పించడమే టిడిపి ముఖ్య లక్ష్యం అన్నారు. మహిళలను ఆర్థికంగా అభివృద్ది చేసేందుకు ముఖ్యమంత్రి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. ఈకార్యక్రమంలో కార్పొరేటర్లు దొడ్డపనేని రాజానాయుడు, ఉచ్చి భువనేశ్వరప్రసాద్, నూనె మల్లికార్జున్ యాదవ్, జాకీర్ తదితరులు పాల్గొన్నారు.