రాష్ట్రీయం

అతిసారానికి మరో ఐదుగురి బలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మార్చి 7: గుంటూరులో అతిసార వ్యాధి అదుపులోకి రాలేదు. వ్యాధి విజృంభించడంతో గత 24 గంటల్లో మరో ఐదుగురు మృతిచెందారు. దీంతో అతిసారం మృతుల సంఖ్య 8కి చేరింది. మంచినీరు కలుషితం కారణంగానే వ్యాధి వ్యాప్తిచెందిందని అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. వ్యాధి నియంత్రణకు పది డివిజన్లలో ఏర్పాటు చేసిన ప్రత్యేక వైద్య శిబిరాలకు రోగులు వందల సంఖ్యలో తరలివచ్చి చికిత్స పొందుతున్నారు. జీజీహెచ్, ఫీవర్ ఆసుపత్రుల్లో ప్రత్యేక వార్డు లు ఏర్పాటు చేశారు. వ్యాధి తీవ్రతతో జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాలాజీనగర్‌కు చెందిన ఎ వెంకట్రావు (43), సంగడిగుంటకు చెందిన ఎస్ పద్మావతి (52) లాలాపేటకు చెందిన ఎస్‌కె గౌస్ (53) మృతిచెందగా, ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జియావుద్ధీన్ నగర్ వాసి సి బాలకోటిరెడ్డి (45), గుడివాడ వారి వీధిలో నివసిస్తున్న వి సామ్రాజ్యం (70) మృతిచెందారు. నగరంలో డయేరియా ప్రబలుతున్న ప్రాంతాల్లో పురపాలకశాఖ డైరెక్టర్ కన్నబాబు, గుంటూరు కలెక్టర్ కోన శశిధర్, నగర కమిషనర్ చల్లా అనురాధ పర్యటించి రోగులకు అందుతున్న సహాయ చర్యలను పర్యవేక్షిస్తున్నారు. పాతగుంటూరు ప్రాంతంలో కలుషిత నీటి నమూనాలను అధికారులు సేకరించి పరీక్షలకు పంపారు. డ్రెయిన్లలో ఏర్పాటు చేసిన మంచినీటి పైపులైన్లను గుర్తించి వాటిని తొలగించే ప్రయత్నాలు చేస్తున్నారు. జీజీహెచ్‌తో సహా పలు నర్సింగ్ కళాశాలల విద్యార్థులు ఇంటింట సర్వే నిర్వహిస్తున్నారు. సమస్యాత్మక ప్రాంతాల్లో 28వేల నివాసాలలో పరిస్థితిని అంచనా వేసేందుకు వంద ఇళ్లకు ఓ బృందం చొప్పున 280 ప్రత్యేక బృందాల ఆధ్వర్యంలో ఇంటింట సర్వే నిర్వహించి బాధితులను చికిత్సకు తరలిస్తున్నారు. పరిస్థితి అదుపు తప్పితే జీజీహెచ్‌కు తరలించేందుకు 15 అంబులెన్స్‌లను సిద్ధం చేశారు. ప్రత్యేక వైద్య శిబిరాల్లో అన్ని మందులు అందుబాటులో ఉంచారు. నగరంలో డయేరియా ప్రబలిన తీరుపై ఎంపి గల్లా జయదేవ్ కలెక్టర్‌కు ఫోన్‌చేసి వివరాలడిగి తెలుసుకున్నారు. పశ్చిమ నియోజకవర్గంలో పట్ట్భాపురం ప్రాంతంలో కూడా డయేరియా ప్రబలుతున్నట్లు కలెక్టర్ వివరించారు. విపత్కర పరిస్థితిని అధిగమించేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఎంపీ సూచించారు. మంచినీటి పైపులైన్లను యుద్ధప్రాతిపదికన తొలగించాలన్నారు. బాధితులకు అవసరమైతే మెరుగైన వైద్య చికిత్స అందించాలని కోరారు. కాగా జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులను బుధవారం రాత్రి మంత్రులు ప్రత్తిపాటి పుల్లారావు, నారాయణ, నక్కా ఆనంద్‌బాబు పరామర్శించారు. వైద్య చికిత్సపై జీజీహెచ్ సూపరింటెండెంట్ రాజునాయుడును అడిగి తెలుసుకున్నారు. వసతి, సౌకర్యాలు తగినంత లేకపోతే ప్రైవేటు ఆసుపత్రులకు తరలించాలని ఆదేశించారు. కాగా మంచినీటి పైపులైన్ల లీకేజీపై మంత్రులు అధికారులపై ఆగ్రహం వ్యక్తంచేశారు. పర్యవేక్షణాలోపం వల్లే ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తోందని మండిపడ్డారు. పరిస్థితిని ముఖ్యమంత్రికి వివరించి సత్వర సహాయ చేపడతామని చెప్పారు. శాసనసభ సమావేశాలు జరుగుతున్న తరుణంలో అధికారుల తప్పిదానికి ప్రభుత్వం బాధ్యత వహించాల్సి వస్తోందని అసహనం వ్యక్తంచేశారు. మంచినీటి కాలుష్యంపై సమస్యాత్మక ప్రాంతాల ప్రజలు, రోగుల కుటుంబాలు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పైపులైన్ల లీకేజీ గురించి ముందుగానే తెలిసినా అధికారులు పట్టీపట్టనట్లు వ్యవహరించటం వల్లే ఈ దుస్థితి దాపురించిందని మంత్రుల ఎదుట ఏకరవు పెట్టారు. అతిసార ప్రభావిత ప్రాంతాల్లో మరో 48 గంటలు ప్రత్యేక వైద్య శిబిరాలను కొనసాగించాలని మంత్రులు ఆదేశించారు.

chitram....
గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న బాధితులు