సంపాదకీయం

నీటి దోపిడీ నియంత్రణ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇండియన్ ప్రీమియర్ లీగ్-ఐపిఎల్-మహారాష్టల్రో నిర్వహించ తలపెట్టిన క్రికెట్ ఆటల పోటీలను ఇతర ప్రాంతాలకు తరలించాలని ముంబయి హైకోర్టు ఆదేశించడం నీటి కొరత తీవ్రత గురించి పాలకులకు మరోసారి గుర్తుచేస్తోంది. ఇలా తరలించడంవల్ల మహారాష్ట్ర ప్రాంతపు మంచినీటి సమస్యకు సమగ్ర పరిష్కారం లభించబోదని హైకోర్టు స్పష్టం చేయడం కూడ ప్రభుత్వాలకు లభించిన న్యాయాభిశంసన. నీటికొరత నివారణకు శాశ్వత పరిష్కారం కనుగొనడంలో ప్రభుత్వాలు పదే పదే విఫలమవుతున్నాయన్నది ముంబయి ఉన్నత న్యాయమూర్తుల మాటలలో ధ్వనించిన వ్యంగ్యం! ఐపిఎల్ ఆటలను మహారాష్ట్ర వెలుపలకి వెళ్లగొట్టడం నీటి సమస్య పరిష్కారానికి ఒక ప్రారంభం మాత్రమేనని ఉన్నత న్యాయమూర్తులు విఎమ్ కానడే, ఎఫ్‌ఎస్ కార్నిక్ చెప్పిన మాట ప్రభుత్వాలకు అదిలింపు వంటిది. ఇది ప్రారంభం మాత్రమేనని ఇంకా జరుగవలసింది ఎంతో ఉందని హైకోర్టు న్యాయమూర్తులు ప్రభుత్వాలను కోరినట్టయింది! ఐపిఎల్ పేరుతో జరుగుతున్న ఆర్భాటపు క్రీడా విన్యాసాలు సమాజ శ్రేయస్సును పట్టించుకోవడం లేదన్నది హైకోర్టు తీర్పుతో మరోసారి స్పష్టమైంది. ప్రపంచీకరణ-గ్లోబలైజేషన్ వల్ల మన జీవన పద్ధతి జాతీయ సంస్కృతి దూరమైపోయి వాణిజ్య పారిశ్రామీకరణకు గురి అయిందనడానికి ఐపిఎల్ వారి క్రికెట్ ఒక ఉదాహరణ మాత్రమే! జాతీయ స్ఫూర్తితో దేశానికి ఉపకరించవలసిన క్రీడాకారులు వేలంలో పెద్దఎత్తున డబ్బునకు అమ్ముడుపోతున్న దుస్థితి ప్రపంచీకరణ వల్ల దాపురించింది. డబ్బుంటే ఏమైనా చేయగలమన్న ఐపిఎల్ ధోరణిని హైకోర్టు నిరాకరించడం ప్రపంచీకరణ శక్తులకు చెంపపెట్టు....ఈ వాణిజ్య ప్రపంచీకరణ వల్లనే దేశంలో నీటికొరత తీవ్రతరమైంది! ప్రపంచీకరణ విధానాన్ని సమీక్షించుకోవడం వల్ల మాత్రమే నీటి కొరత నివారణకు దీర్ఘకాల చర్యలు సాధ్యం...ఎందుకంటే ప్రపంచీకరణ మొదలైన తరువాతనే బహుళ జాతీయ వాణిజ్య సంస్థలు మన భూమిని విచ్చలవిడిగా తవ్విపారేయడానికి వీలు కలిగింది. ఈ తవ్వకాలు భూగర్భజలాలను ఆవిరిగా మార్చి, భూగర్భాన్ని ఎండగట్టేసాయి. ప్రధాన సమస్య ఇదీ!!
పడమటి కనుమల ప్రాంతంలో విచ్చలవిడిగా జరిగిన తవ్వకాల వల్ల కొండ వాగులు ఎన్నో ఎండిపోయాయి. లావాసా అన్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థ నిర్వహించిన తవ్వకాల బీభత్సం మహారాష్టల్రో నిరసన ప్రకంపనాలను సృష్టించింది. పూణే నగరం సమీపంలో ఈ లావాసా వాణిజ్య సంస్థ పట్టణ వాటికలను నిర్మించడానికై అడవులను ధ్వంసం చేసింది. కొండలను పిండి చేసింది. కేంద్ర ప్రభుత్వ పర్యావరణ, అటవీ పరిరక్షణ మంత్రిత్వ శాఖనుండి హరిత అనుమతులను తీసుకోకుండానే ఈ సంస్థ తవ్వకాలను నిర్మాణాలను చేపట్టింది. ఈ వ్యవహారం హైకోర్టుకెక్కింది. ఇప్పుడు మళ్లీ నీటి సమస్య ప్రాతిపదికగానే బొంబాయి ఉన్నత న్యాయస్థానం మహారాష్టన్రుండి ఐపిఎల్‌ను వెళ్లగొడుతోంది. నాగపూర్‌లో మూడు పూణెలో ఎనిమిది ముంబయిలో తొమ్మిది పోటీ ఆటల-మ్యాచ్‌లు-ను ఆడడానికి ఐపిఎల్‌కు భారత క్రికెట్ నియంత్రణ మండలి-బోర్డ్ ఆఫ్ కంట్రోల్ ఫర్ క్రికెట్ ఇన్ ఇండియా-బిసిసిఐ-అనుమతి నిచ్చేసింది. ఈ మ్యాచ్‌ల కోసం లక్షలాది లీటర్ల-దాదాపు ఒక కోటి లీటర్ల నీరు అవసరమవుతుందట! క్రీడా ప్రాంగణాలను తడపడానికే భారీ ప్రమాణంలో నీరు ఖర్చవుతోంది. డబ్బుంది కాబట్టి నీరు కొనేస్తాము...అన్న ధోరణిలో ఆర్భాటించిన ఐపిఎల్ దుందుడుకు వైఖరికి అడ్డుకట్ట పడడం దేశంలోని నీటిని కొల్లగొడుతున్న బహుళ జాతీయ వాణిజ్య సంస్థలకు హెచ్చరిక వంటిది!
ఐపిఎల్ ఆటలు ఏప్రిల్ 30వ తరువాత మహారాష్టల్రో ఆడరాదన్నది హైకోర్టు నిర్దేశం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఐపిఎల్ నీటి దోపిడీపట్ల ప్రేక్షక పాత్రను వహించినప్పటికీ రెండు స్వచ్ఛంద సంస్థలు హైకోర్టును ఆశ్రయించడం వల్ల నీటిదోపిడీ కొంత మేరకు నిరోధించడానికి వీలయింది. హైకోర్టు వారు వెంటనే 13వ తేదీననే ఐపిఎల్ ఆటలను మహారాష్టల్రో రద్దు చేసి ఉండినట్టయితే మరింత నీరు ఆదా అయి ఉండేది. 30వ తేదీనాటికి ఇరవై మ్యాచ్‌లలో ఏడు పూర్తయిపోతాయి. ఐపిఎల్ జుర్రేయదలిచిన నీటిలో మూడవ వంతుకుపైగా ఆలోగా ఖర్చయిపోతుంది! లాటూరు జిల్లాలో నీటి చుక్క మిగలని ప్రాంతాలకు రైళ్లలో నీటిని సరఫరా చేస్తున్నారట! ఒక రైల్లో ఐదు లక్షల లీటర్లు మాత్రమే నీరు తరలి వస్తోంది. మొదటి రైలునకు లాటూరు పట్టణవాసులు హారతులిచ్చి పూజలు చేసారట! ఈ పట్టణానికి పదిహేను రోజులకోసారి నీరు సరఫరా అవుతోందని ముంబయి హైకోర్టు వారు వెల్లడి చేసారు. అందువల్ల తక్షణం ఐపిఎల్ తరలిపోయి ఉంటే మరో పదిహేను లక్షల లీటర్ల నీరు మహారాష్టక్రు ఆదా అయి ఉండేవి! దేశమంతటా అనేక ప్రాంతాలలో మహారాష్ట్ర రీతిలోనే నీటికి కటకట ఏర్పడి ఉంది. తెలంగాణ కావచ్చు, అవశేషాంధ్రప్రదేశ్ కావచ్చు...ఉత్తరప్రదేశ్ కావచ్చు! వేసవిలో మంచు కరిగి స్వచ్ఛమైన నీరు వరదలెత్తే జమ్ము కశ్మీర్‌లో సైతం నీటి సమస్య నెలకొని ఉందట! కర్నాటకలోని బళ్ళారి జిల్లాలో చిత్రదుర్గంలో నీటి చుక్క లేని గ్రామాలలోని ప్రజల గోడు దృశ్యమాధ్యమాలలో ఆవిష్కృతమైంది. మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్ ప్రాంతాలు రాజస్తాన్‌లోని ఎడారి ప్రాంతాలను తలపిస్తున్నాయి. దేశంలోని అతి ప్రధానమైన తొంబయి ఒక్క జలాశయాలలో మంచినీటి స్థాయి సగటు మట్టంలో ఇరవై నాలుగు శాతానికంటె తక్కువకు పడిపోయి ఉందని వాతావరణ విభాగం వారు లెక్కలు తేల్చారు. జూన్‌లో మొదలయ్యే చల్లని జల్లుల కోసం ఈ జలాశయాలు నోళ్లు తెరిచి ఉన్నాయి, జనం నోళ్లు ఎండిపోతున్నాయి. ఈ ఎండిన నోళ్ల వారికి దక్కకుండా నీటిని కొల్లగొడుతున్న ఐపిఎల్ క్రికెట్ ఆటలు ఇప్పుడు జరగకపోతే ఏమి? మహారాష్టల్రోని నీరు వృథా అయినా ఒక్కటే, రాయపూర్ ధర్మశాల, ఢిల్లీ, కలకత్తా నగరాలలోని మంచినీరు క్రికెట్ మైదానాల మట్టిపాలయినా ఒక్కటే! అందువల్ల కేంద్ర ప్రభుత్వం పూనుకుని మొత్తం పోటీలను రద్దు చేయడం మేలు...
ఇలా రద్దు చేయాలన్నదే బహుశా బొంబాయి ఉన్నత న్యాయస్థానం వారి ఉద్దేశ్యం. బిసిసిఐ విధులను కేంద్రప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని ఇందుకోసం పార్లమెంటులో చట్టాన్ని రూపొందించాలని సర్వోన్నత న్యాయస్థానం బుధవారం అభిప్రాయపడింది. ఇలాంటి చట్టాన్ని ఎందుకని రూపొందించరాదని కూడ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి టిఎస్‌ఠాకూర్, ఎఫ్‌ఎమ్‌ఐ ఖలీఫుల్లా ప్రశ్నించారు. అలా కేంద్ర ప్రభుత్వమే క్రికెట్ ఆటల స్థలాలను సమయాన్ని నిర్ధారించినట్టయితే మంచినీటికి గండంగా మారిన ఐపిఎల్ వ్యూహం అమలు జరిగి ఉండేది. హైకోర్టు చెప్పినట్టు ఆరంభం వల్ల ప్రయోజనం లేదు. దీర్ఘకాల పథకాలను ఇప్పుడైనా మొదలుపెడితే కొన్ని ఏళ్ల తరువాతనైనా మండు వేసవిలో మంచినీరు లభిస్తుంది. పారిశ్రామిక కాలుష్య వాటికలను నెలకొల్పడానికంటె హరిత వన వాటికలను, వేలకొలదీ ఎకరాలలో పండ్ల తోటలను ఏర్పాటు చేసే పథకాలకు కేంద్ర ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇవ్వాలి! పురుగుల మందుల అవశేషాలు నిండిన బహుళ జాతీయ సంస్థల శీతలపానీయాల కర్మాగారాలను మూసివేయించాలి! పెప్సీ, కోకో, నెజల్ వంటి సంస్థలు భూగర్భాన్ని తోడేస్తున్నాయి. సామాన్యులకు నీరు దొరకకుండా చేస్తున్నాయి. మన కడుపులను క్రిమినాశక విషాలతో నింపుతున్నాయి...