సంపాదకీయం

జనగణమనం..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇప్పుడు, ఇంతకాలానికి సర్వోన్నత న్యాయస్థానం స్పష్టీకరణ ఇవ్వవలసి రావడం దురదృష్టకరం!! ‘జనగణమన’ములందు మాతృభూమి పట్ల మమకార తరంగనాదం జాతీయ గీతం! అమ్మకు నమస్కరించమని ఎవ్వరూ ఎవరికీ ఉపదేశించనక్కర లేదు. అమ్మను గౌరవించాలన్న భావం విచక్షణ వికసిస్తున్న ప్రతి హృదయంలోను, పరిమళించే స్వభావం! అలాగే జాతీయగీతం పాడమని పాడినప్పుడు ‘్భరత భాగ్యవిధాత’పట్ల గౌరవసూచకంగా లేచి నిలుచుండాలని భారతమాత బిడ్డలకు ప్రత్యేకించి ఎవ్వరూ చెప్పనక్కరలేదు. ఇనే్నళ్ల తరువాత చెప్పవలసి రావడమే దురదృష్టకరం! 1971లో జాతీయ అస్తిత్వ విరోధ నిరోధక - ప్రివెన్షన్ ఆఫ్ నేషనల్ ఆనర్ - చట్టం రూపొందడానికి రెండు దశాబ్దుల పూర్వం నుంచి దేశప్రజలు జాతీయ గీతాన్ని ఆలపిస్తున్నారు! చట్టం రూపొందిన తరువాత కూడా ఆలపిస్తున్నారు. గతంలో ‘సినిమా’ థియేటర్లలో చిత్ర ప్రదర్శన ముగిసిన తరువాత జాతీయ పతాకాన్ని తెరపై చూపుతూ జాతీయగీతం వినిపించేవారు. సినిమా ప్రేక్షకులు నిలబడి ఉండి గీతాలాపన ముగిసిన తరువాత వదలివెళ్లేవారు. కానీ క్రమంగా అధికాధిక ప్రేక్షకులలో ఈ జాతీయతాధ్యాస తగ్గిపోయింది! అందువల్ల గీతాలాపన జరుగుతుండగానే ప్రేక్షకులు తోసుకుంటూ బయటకి వెళ్లిపోవడం ఆరంభమైంది. ‘‘జాతీయగీతం వినబడుతున్నప్పుడు లేచి నిలుచుంటేనే దేశభక్తి ఉన్నట్టా?? నడుస్తూ ఉంటే కూర్చుని ఉంటే దేశభక్తి లేనట్టా??’’ అన్న విచికిత్స మొదలైంది, వితండవాదం మొదలైంది!! ఈ వాదాన్ని ప్రభుత్వా లు దశాబ్దుల క్రితమే అంగీకరించి ఉండినట్టయితే వివాదమే లేదు.. థియేటర్లలో ప్రదర్శన ముగిసిన తరువాత ‘జాతీ య గీతాలాపన’ యథావిధిగా కొనసాగి ఉండేది. గీతాలాపన పూర్తయ్యేవరకూ కొందరు నిలబడి ఉండేవారు, కొందరు నడుచుకుంటూ మరికొందరు తోసుకుంటూ వెళ్లిపోతూ ఉండేవారు... వారివారి సంస్కార స్థాయి దీన్ని నిర్ధారించి ఉండేది. కానీ కొంతమంది నిలబడకపోవడం వల్ల జాతీయ గీతానికి, ఆలాపన సంప్రదాయానికి అవమానం కలుగుతోందన్న భావంతో లేదా భ్రాంతిలో ప్రభుత్వం ఈ సంప్రదాయాన్ని రద్దు చేసింది! జనాన్ని ఒప్పించడానికి కానీ అవగాహన పెంపొందించడానికికానీ ప్రభుత్వాలు చేసింది శూన్యం! కుటుంబ నియంత్రణ, పాఠశాలలో లైంగిక విద్యను బోధించడం, వివాహేతర లైంగిక శృంగార కలాపాలకు పాల్పడేవారికి ‘నిరోధకాలు’ - కాంట్రాసెప్టివ్స్ - ఉచితంగా పంపిణీ చేయడం, పెళ్లి కాకుండానే సహజీవనం, స్వలింగ సంపర్కాలకు అనుమతి - వంటివాటి గురించి ప్రచారాలు ఉద్యమాలు చేసిన చేస్తున్న ప్రభుత్వాలు, స్వచ్ఛంద సంస్థలు జాతీయ గీతాలాపన పట్ల అవగాహన పెంచడానికి చేసింది ఏమిటి??
జాతీయగీతం పాడాలనికానీ ఎలా పాడాలని కానీ సుప్రీంకోర్టు నిర్దేశించవలసిరావడం ఏడు దశాబ్దుల వైఫల్యానికి వర్తమాన సాక్ష్యం! ఈ వైఫల్యం ప్రభుత్వాలది, మేధావులది, విద్యాధికులది, ఉద్యమ సంస్థలది.. కలసి వెరసి సమాజ సమష్టి వైఫల్యం ఇది! చిత్ర ప్రదర్శనలు ప్రారంభం కావడానికి ముందు థియేటర్లలో జాతీయగీతం పాడాలని సర్వోన్నత న్యాయస్థానం 2016 నవంబర్ 30వ తేదీన ఆదేశించడంతో వివాదం ముగిసిందన్న అభిప్రాయం ఏర్పడింది! అన్ని సినిమా హాళ్లలోను ‘సినిమా’ ప్రారంభం కావడానికి ముందు జాతీయ గీతాలాపన జరుగుతుందని జనం మురిసిపోయారు. దీనివల్ల ప్రేక్షకులలో దేశభక్త్భివం, జాతీయతా నిష్ఠ జాగృతం కాగలవని ఎందరో ప్రముఖులు వ్యాఖ్యానించారు. కానీ వివాదం ముగియలేదు, వివాదం మొదలైంది! యాబయిమూడు సెకన్లపాటు నిలుచునే శక్తి జనబాహుళ్యానికి లేదన్నది వివాదానికి ప్రాతిపదిక! వృద్ధులకు దివ్యాంగులకు మినహాయింపు ఇవ్వడం సహజం! కానీ సినిమాలు చూడడానికి తొక్కుకుంటూ తోసుకుంటూ గుద్దుకుంటూ ఎగబడే వీక్షక మహాశయులకు ఆ మాత్రం ఓపిక లేదా?? ప్రేక్షకులలో తొంబయి తొమ్మిదిశాతం జనగణమన గీతాలాపనను సమర్థిస్తున్నారు. ఒక శాతం దుర్బుద్ధితోనో అవగాహన లేమిచేతనో వ్యతిరేకించవచ్చుగాక! కానీ ఈ వ్యతిరేకుల వాదనే తర్కబద్ధమై కూచుంది. సినిమా థియేటర్‌లలో జాతీయ గీతాలాపన తప్పనిసరికాదని, ఐచ్ఛికమని సర్వోన్నత న్యాయస్థానం మంగళవారం తీర్పు చెప్పడం విచిత్రమైన పరిణామం..
ఇప్పుడు నిర్ణయించే అధికారం, అవకాశం, విచక్షణ సినిమాహాళ్ల యజమానులకు లభించింది. అందువల్ల దేశవ్యాప్తంగా ఎన్ని థియేటర్లలో జాతీయ గీతాన్ని ఆలపిస్తారన్నది ‘వెండితెర’పై చూడడానికి వేచి ఉండక తప్పదు!! కేంద్రప్రభుత్వం నియమించిన పనె్నండుగురు సభ్యులు మంత్రివర్గ ఉపసంఘంవారు ‘్థయేటర్ల’ లోను సార్వజనిక స్థలాలలోను జాతీ య గీతాన్ని పాడే విషయమై చర్చించి నిర్థారించనున్నదట! మొదటి సమావేశం జనవరి పంతొమ్మిదవ తేదీన జరుగుతుందట! అంటే ఆ తరువాత కూడ మరికొన్ని సమావేశాలు జరుగుతాయన్నమాట! జాతీయగీతం పాడాలా? వద్దా? అన్న ఇలాంటి మీమాంస బహుశా మరే దేశంలోనూ జరగలేదేమో??
బ్రిటన్ వ్యతిరేక స్వాంత్య్ర సమరం జరిగిన సమయంలో బ్రిటన్ ప్రభుత్వం నిషేధించినప్పటికీ ‘‘వందేమాతరం’’ అని జాతి ఎలుగెత్తింది! ‘వందేమాతరం’ గీతాలాపనను ఆ తరువాత కాంగ్రెస్ ఉద్యమ సంస్థలోని కొందరు వ్యతిరేకించడం చరిత్ర! ఆ వ్యతిరేకులు పాకిస్తాన్ సమర్ధకులు! 1947 తరువాత ‘జనగణమన’ జాతీయగీతంగాను, ‘వందేమాతరం’ జాతీయ గేయంగాను ప్రభుత్వం నిర్థారించింది! ‘జనగణమన’ దేశప్రజల పితృభక్తికి పతాక! ‘‘ద్యౌః పితా పృథివీ మాతా’’ అన్న వేదద్రష్టలు చేసిన నిర్ధారణకు పునరావృత్తి రవీంద్రుని ‘జనగణమన’ బకించంద్రుని ‘వందేమాతరం’.. మన జాతికి మాత్రమే కాదు ప్రతి జాతికి జన్మనిస్తున్న భూమి తల్లి.. భూమిని వర్షధారలతో పండిస్తున్న ఆకాశం తండ్రి! ఆకాశం జాతిపిత, భూమి జాతీయత! అధినాయకుడైన, విధాత అయిన తండ్రిని ‘జనగణమన’లో స్తుతిస్తున్నాము! అస్తిత్వకారకమైన తల్లిని ‘వందేమాతరం’లో ప్రార్థిస్తున్నాము! ఈ రెండు జాతీయ మంత్రాలను ఉచ్ఛరించడం, పఠించడం గానం చేయడం పారాయణం చేయడం జనానికి సహజ జీవన వృత్తి కావాలి. శాశ్వత ప్రవృత్తి కావాలి!