రాష్ట్రీయం

జనసంద్రం.. ‘సాగర సంగమం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మచిలీపట్నం/ కోడూరు, ఫిబ్రవరి 9: మాఘ పూర్ణిమ పర్వదినాన్ని పురస్కరించుకుని కృష్ణా జిల్లాలోని సాగర సంగమ క్షేత్రాలు భక్తులతో పోటెత్తాయి. ఉప్పొంగి ప్రవహించే కృష్ణమ్మ సముద్రుడిలో కలిసే అత్యంత పవిత్ర పుణ్యక్షేత్రంగా భాసిల్లుతున్న కోడూరు మండలం హంసలదీవి వద్ద సాగర సంగమంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాలకు అత్యంత చేరువలో మచిలీపట్నానికి సమీపంలోని మంగినపూడి సముద్ర తీరం భక్తజన సంద్రంగా మారాయి. ఈ రెండు బీచ్‌ల వద్ద సుమారు రెండు లక్షల మందికి పైబడి భక్తులు పవిత్ర పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు లేకుండా అధికారులు ఏర్పాట్లు చేసిన నేపథ్యంలో సింధూ స్నానాలు ప్రశాంతంగా ముగిశాయి. ప్రధానంగా హంసలదీవి బీచ్ వద్దే సుమారు లక్షా 50వేల మంది వరకు భక్తులు పుణ్యస్నానాలు ఆచరించినట్టు అధికారులు తెలిపారు. తెల్లవారుజామున 5గంటలకు పాలకాయతిప్ప వద్ద తెరుచుకున్న బీచ్ గేట్లు సాయంసంధ్యా సమయం వరకు మూసుకోలేదు. పాలకాయతిప్ప మెరైన్ పోలీసు స్టేషన్ సమీప బీచ్ గేటు దగ్గర మొదలుకుని వాహనాల క్యూలైన్ దింటిమెరక వై-జంక్షన్ వరకు కనిపించింది. సముద్ర తీరంలో సూర్యోదయ ప్రకృతి అందాలను తిలకించడానికి యాత్రికులు ఆసక్తి కనబరిచారు. కానీ ఆదివారం ఉదయం ఆకాశం మేఘావృతమై 7.30 గంటల తర్వాత గానీ సూర్యోదయం కాలేదు. సూర్యోదయం అవుతున్న సమయంలో యువకులు తమ చేతుల్లోని అధునాతన చరవాణులతో సూర్య కిరణాలతో బంగారు వర్ణంలా మెరిగిపోతున్న నీటి తెరలను కెమెరాల్లో బంధించడానికి ప్రయత్నించారు. ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టిన డాల్ఫిన్ భవనం దగ్గర నుంచి ద్విచక్ర వాహనాలను కూడా బీచ్ ఒడ్డుకు అనుమతించక పోవటంతో యాత్రికులు స్వేచ్ఛగా సముద్రతీరం వెంబడి పుణ్యస్నానాలు చేసి సాగర సంగమం వరకు బీచ్ ఒడ్డున నడుచుకుంటూ వెళ్లటం కనిపించింది. డాల్ఫిన్ భవనం వద్ద బీచ్ ఒడ్డు నుంచి సాగర సంగమం వెళ్లడానికి మూడు కిలోమీటర్ల దూరం ఉండటంతో ఒక్కొక్కరికి రూ.20 తీసుకునేలా పోలీసు యంత్రాంగం ఆటో సదుపాయం కల్పించింది. కృష్ణమ్మ సముద్రంలో కలుస్తున్న ప్రదేశంలో పసుపు, కుంకుమ, అరటి పండ్ల తాంబూలం నైవేద్యంగా సమర్పించి, మంత్రాన్ని జపిస్తూ పుణ్యస్నానాలు ఆచరించారు. ఆదివారం ఉదయం పౌర్ణమి ప్రభావంతో సముద్రం పోటు ఎక్కువగా ఉండటంతో అధికారులు జల్లుస్నానం ఏర్పాటు చేసినప్పటికీ సేఫ్టీ జోన్‌లో నీటి లోతు ఎక్కువగా ఉండటంతో నదీ, సముద్రం కలిసేచోటే భక్తులు స్నానం చేయడానికి ఆసక్తి కనబర్చారు. ప్రజలు భారీ సంఖ్యలో హాజరైనప్పటికీ, ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సింధు స్నానాలు ముగియటంతో, అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకుంది.

*చిత్రం...కృష్ణా జిల్లా హంసలదీవి దగ్గర జనసంద్రంగా మారిన సాగర సంగమం