స్మృతి లయలు
ఎంత చేసినా ‘వద్ద’నదు దినపత్రిక!-95
S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.
ఐధు పాసింజర్ బోగీలను అవతల పారేసి, ముందుకు వెళ్లిపోయింది మద్రాసు-హౌరా మెయిలు. భోగి పండుగ అన్ని చోట్లా చలిమంటలు వేసుకుని ఉంటారు జనం. ఆ రాత్రి అడవిలో పెద్దలు, పిన్నలు నాకు ఎందరో సహాయం చేశారు. నా ‘బదిలీ’కి మంచి ముహూర్తమే అయిందది. యువకులు నా సామాన్లు మోసుకొస్తే పెద్దలు టార్చిలైట్లతో ముందు నడిచారు. ఒక ‘‘మిలటరీ బోగీ’’ దగ్గర ఆగి ‘‘వుఠో.. వుఠో గాడీ గిర్ గరుూ’’ అంటూ లోపల నిద్రిస్తున్న మన వీరజవాన్లను మేల్కొలిపారు.
అందులో నుంచి, అంటే ఆ బోగీలో నుంచి ఒకడు ‘రైలు బోల్తా’ వింటూనే ‘కిటికీ’ (ఊచలు లేని కిటికీలు ఉండేవి ఆ రోజులలో)లో నుంచి దూకేశాడు. అందరూ వివరించారు. ‘‘్ఫస్ట్‌క్లాస్ ప్యాసింజర్ ఇతను’’ అంటూ నా కథ చెబుతూంటే చలికి స్వెట్టర్లు కూడా వేసుకునే అలవాటు లేని నేనూ - నా మిత్రబృందమూ కూడా చేతులు మరింత బిగించుకుని చూపులతో నేనూ విన్నవిస్తూ ఉంటే ఓ అబ్బాయి నా అంతే ఉన్నాడు. ‘‘నేను మలయాళీని. ఇంగ్లీషులో చెప్పు. హిందీలో కాదు’’ అన్నాడు.
ఆ విధంగా మిలటరీ డబ్బాలోకి ఫెర్నాండెజ్ అనే ఆ లెఫ్ట్‌నెంట్ ట్రైనీ ఔదార్యంతో మళ్లీ రైలెక్కేశాను. రిలీఫ్ రైలు బిట్రగుంట నుంచి వస్తుందని ఏదో చెప్పారు గానీ మెయిల్ - మిగిలిన ‘ముక్క’ ముందుకు బెజవాడ వైపు ప్రస్థానం కొనసాగిస్తూ ఉంటే - నేను అందులోనే ఫెర్నాండెజ్‌తో కబుర్లు మొదలెట్టా. జర్నలిజం, రచనా వ్యాసంగం వగైరా ఇష్టం ఉన్న ఈ వీర జవానుకీ, నాకు ఎన్నో విషయాలలో ‘వేవ్ లెంగ్త్’ కలిసింది. తన చిరునామా, శుభాకాంక్షలూ రాసి ఫెర్నాండెజ్ ఓ మోడర్న్ కార్టూను పుస్తకం ఒకటి నాకు బహూకరించాడు. వాళ్లకి ‘చిరునామా’ అంటే, ఓ కోడ్, నెంబరూ ఉంటాయి. అంతే. ‘‘ఆ ‘కోడ్’ రాసి లెటర్ పడేస్తే మేము ఏ క్యాంపులో ఏ శిబిరంలో ఉన్నా అందుతుంది నీ లెటర్ నాకు’’ అని చెప్పాడు మై డియర్ ఫ్రెండ్ ఫెర్నాండెజ్.
రిలీఫ్ రైలు రాకుండానే, నేను అదే రైలులో, ఉదయం పది గంటల వేళ బెజవాడ స్టేషన్‌లో దిగి మిలటరీ ఫ్రెండ్స్‌కి - నా స్పెషల్ ఫ్రెండ్‌కి ‘‘బై’’ చెప్పి, ప్లాట్‌ఫామ్ మీదికి చూద్దును కదా - తమ్ముడు వచ్చాడు ఎదురుగా. ‘‘ఎందుకైనా మంచిది ఇందులో రాకపోతే తర్వాత రిలీఫ్ బండి కోసం ఇక్కడే ఆగుదాం అని వచ్చాను’’, అన్నాడు.
ఆ ఉదయం రేడియో వార్తలు విన్నవాళ్లకి తప్ప ఈ రైలు ప్రమాదం వార్త తెలియలేదు. మర్నాడు కూడా పేపర్లు లేవుగా. బెజవాడ ఆఫీసులో వాచ్‌మాన్, టైమ్ కీపర్ తప్ప ఒక్కడు రాలేదు. పేపర్లు ‘‘లేకపోవడం’’తో ఈవాల్టికీ, పంతొమ్మిది వందల అరవై, డెబ్భై దశకానికీ చాలా తేడా ఉంది.
ఇంట్లో అందరూ నన్ను మృత్యుంజయుణ్ని చూసినట్లు చూశారు. హవురా మెయిల్‌కి ప్రమాదం జరిగితే అన్న విషయం పదిహేను తారీఖు ఉదయం దాకా మా డైలీ ఇన్‌చార్జి ప్రకాశరావుకే తెలియదుట.
‘‘‘డమీ’ పేపరే కదా, చేస్తున్నాం’’ అని పండుగనాటి ఉదయం, రేడియో కూడా వినలేదుట.!
నా స్థిరాస్తి, చరాస్తి కూడా వీక్లీ సంచికలు, పుస్తకాలు, ఉత్తరాలయితే, అదృష్టవశాత్తూ సదరు ‘మూటలు’ వారం తిరిగేసరికి, ఇల్లు వెతుక్కుంటూ తెచ్చి ఇచ్చేశారు. శేషగిరిరావు, (సర్క్యులేషన్ డిపార్ట్‌మెంట్) అతని ఫ్రెండూ కూడా నాకు దేవదూతల్లా కనబడ్డారు. కానీ, ఈలోగానే ఓ తమాషా జరిగింది. నేను పద్నాలుగు సంక్రాంతి ఉదయం హడావుడిగా, ఆందోళనగా రైలు దిగి, ఇంటికి వస్తూ నేను కూర్చున్న మిలటరీ డబ్బాలోని చిన్న నీలంరంగు రెగ్జిన్ హ్యాండ్ బాగ్ వదిలేశాను. రైలు కదలక ముందే, మా వీరుడు లెఫ్టెనెంట్ ఫెర్నాండెజ్ చూశాడు. రైలు దిగి ఎదురుగా ఉన్న స్టేషన్ మాస్టర్ల హాలులోకి వెళ్లి అక్కడ కనబడ్డ ఏ.ఎస్.ఎమ్. ఒకరికి నా బ్యాగ్ అప్పగించాడు. దీన్ని మీ ‘దేశం’లో ఫేమస్ రైటర్ వీరాజీకి అందజెయ్యి. బ్యాగ్‌లో ఇంటి అడ్రస్ ఉంది ‘‘లేదా’’ అంటూ రివాల్వర్ తీసి, ‘‘దీంతో నిన్ను పైకి లేపేస్తా’’ నంటూ సంకేతించి ఓ చిన్న అక్నాలెడ్జ్‌మెంట్ స్లిప్ తీసుకుని మరీ వెళ్లాడట. ఎంత గ్రేట్!
ఆ ఏ.ఎస్.ఎమ్. అప్పారావుగారు భద్రంగా బ్యాగ్‌ని పెట్టుకునే ముందు దాని ‘జిప్’ లాగి తెరచి చూశాడు. అందులో వంద రూపాయలలోపు చిల్లరనోట్లు ఓ ‘కీ’ చెయిన్, కొన్ని కాగితాలు, రశీదులు, విజిటింగ్ కార్డులు లాంటి వాటితో పాటు ఓ సినిమా స్టార్ల బొమ్మలున్న ఆహ్వానం కార్డు కూడా ఉంది. అదో సినిమా శతదినోత్సవం యొక్క ఇన్విటేషన్ కార్డు. పైగా ‘అడ్మిట్ టూ’ అని ఉంది.
అప్పారావు సందిగ్ధంలో పడ్డాడు. ఆ రోజుల్లో శతదినోత్సవాలు ఓ ‘క్రేజ్’. ఆ ‘‘కార్డు’’ కోసమేనా, మా ఇల్లు పట్టుకోవాలని అనుకుంటూ ఉండగా ఓ చిత్రం.
జీవితంలో చాలా సంఘటనలు యాదృచ్ఛికాలు, లేదా కాకతాళీయాలు, మా చెల్లెలు భర్త - శ్రీరంగం సూర్యనారాయణ - నైన్ పూర్ రైల్వే వాడు. ఈ బ్యాగ్ పోయింది. అందులోనే ఈ అమూల్యమైన శతదినోత్సవం యొక్క ఆహ్వాన పత్రం ఉన్నదీ అన్నప్పటి నుంచీ రెస్ట్‌లెస్‌గా ఉన్నాడు. బెజవాడ రైల్వేస్టేషన్‌కి వాళ్ల రైల్వే శాల్తీ ఒకడికి ‘సెండాఫ్’ ఇవ్వడానికి వెళ్లాడు. మధ్యలో ఏ.ఎస్.ఎమ్.ల రూమ్‌ల్లోకి పోయి (రైల్వే వారికి అలవాటు) ‘హల్లో’లు చెప్పుకోవడం కోసం వెళ్లాడు. సరిగ్గా ‘‘అప్పారావు’’గారు తటస్థపడ్డాడు. కథ అంతా చెప్పి ‘‘వీరాజీని పట్టుకోవాలి, గురూ!’’ అన్నాడుట అప్పారావుగారు.
అట్లా నా బ్యాగు నాకు తిరిగి చేరింది. ఆ సినిమా ఫంక్షన్ టికెట్ మీద అప్పారావు, సూర్యనారాయణలు, అలంకార్ థియేటర్‌కి ఆనందంగా వెళ్లారని, వేరే చెప్పనక్కరలేదుగా?
* * *
జీవితంలో కొన్ని పొందటానికి కొన్నిటిని వదులుకోక తప్పదు. ఆంధ్ర దేశానికి నడిబొడ్డు లాంటి బెజవాడ నుంచి ఆంధ్రపత్రికని ప్రచురించాలన్న వాంఛ. బహు చిరకాల వాంఛ. అది ఒక చారిత్రాత్మక ఘట్టంగా 1965, జనవరి 23 తారీకున నెరవేరింది. అందులో నేను సైతం ఒక సమిధని కావడంతో, ఉద్దేలంగానే ఉంది నా మనసు. కానీ కేంద్రబిందువుగా ఉన్న వాడికి వృత్తం యొక్క అంచున నిలబడినట్లుగా ఉంది అప్పుడు.
దినపత్రిక పూర్తిగా ‘టీమ్ వర్క్’. దానికి కెప్టెన్ ప్రకాశరావుగారు. బెజవాడ - గాంధీనగర్ ఏలూరు కాల్వ తీరంలో ‘ఆంధ్రపత్రిక’ సెంటర్‌గా జనవరి 24 (1965) నుంచీ పేరు పడ్డ కూడలి. ఇది ‘ఐదురోడ్ల’ కూడలి. ‘‘దుర్గ్భావన్’’ రైలుస్టేషన్ నుంచి వస్తూ ఉంటే అందర్నీ ఆకర్షించే అందమైన, విశాలమైన, రెండు భారీ గేట్ల మధ్య నిలిచిన భవనం. అందులోకి రాధాకృష్ణ గారు వచ్చినప్పుడల్లా నేను లోపలికి ప్రవేశిస్తూ ఉంటే.
టైమ్ కీపర్ కృష్ణమూర్తి నన్ను పోల్చినట్లే ఉంది. ‘విష్’ చేశాడు. ‘‘చాలా ట్రంక్ కాల్స్ వచ్చాయి. మీరు క్షేమమేనని చెప్పాను. మీ ఫాదర్ చెయ్యమన్నారని ఈ మాడమ్ రెండు ట్రంక్‌కాల్స్ ఇక్కడి ఆఫీసుకి చేసింది. నేనే చెప్పాను.’’ మీరు నిన్న ఉదయం మీ బ్రదర్‌తో ఇంటికి వెళ్తూ ఉండడం నేను చూశాను. కానీ ప్రకాశరావుగారు మాత్రం ‘‘ఏమో! తెలియదమ్మా క్షేమంగానే ఉండి ఉంటాడు. ఏక్సిడెంట్ న్యూస్ కూడాలేదు. శలవు కదా, ఇవాళ అంటూ ఫోన్ పెట్టేశాడు’’ అన్నాడు ఫిర్యాదుగా.
శలవు అయినా కొత్త ఇన్‌చార్జి కదా.. ప్రకాశరావుగారు ఆఫీసుకి ఒక్కడే వచ్చాడుట. చివరికి మద్రాసు నుంచి టెలి ప్రింటర్ కనెక్షన్ కూడా కట్టేశారు. అయినా ప్రకాశరావుగారితో మాట్లాడి నేను మన ఫ్రెండ్ ఉన్నాడుగా. సుబ్బారావు రూమ్ నెం.9. అతనికి ట్రంక్ కాల్ బుక్ చేసుకున్నాను. బెజవాడలో అప్పటికి ‘నో డిలే’ సదుపాయం కూడా లేదు మా ఊళ్లో. ప్రకాశరావుగారికి చాలా పెద్ద రూము దొరికింది. ‘‘డైరెక్ట్ ఫోన్‌లు - ఇవాలో, రేపో ‘‘్ఫట్’’ చెయ్యాలి.’’ అన్నాడాయన. మా కొత్త ఇన్‌చార్జ్ ప్రకాశరావుగారు నాకు పాతవాడేగా. ఆత్మీయుడు కూడా.
ఎమ్.ఎస్. శర్మగారీయన్ని ‘‘ఓ హెడ్ క్లర్కయ్యా. జర్నలిస్ట్ అంటావేంటి?’’ అనే వాడు.
ప్రకాశరావుగారేం కొత్తవాడు కాదు. అక్కడ మద్రాస్‌లో ‘‘ఫ్రెండ్స్‌మేగా?’’ కానీ, ‘‘కొత్త’’గా ఉంది. వెలితిగా ఉంది.
రాధాకృష్ణగారు అన్న మాటలు గుర్తొచ్చాయి. ‘‘కొంచెం పోకర్‌ఫేసేం ప్రకాశరావుగారిది’’ అది ‘‘నిజమే! నిమ్మకు నీరెత్తినట్లుంటాడు. ప్రకాశరావుగారు ‘‘నో, సెంటిమెంట్స్’’ అనే వాడు, వి.వి.ఎన్.
ఐతే, ప్రకాశరావుగారికి తన బాధ్యతల పట్ల పూర్తి శ్రద్ధ ఉంది.
‘‘నాకు నలుగురు ‘చాకు’ల్లాంటి కుర్రాళ్లు కావాలి. తప్పకుండా, కష్టపడి ‘రిజల్ట్’ తేగలను అని, అయ్యవారికి చెప్పాను’’ అన్నాడు.
‘‘అయితే, నేనో చాకునన్న మాట’’ అన్నాను నవ్వుతూ. ‘‘మిగతా మూడు ‘పిల్లర్స్’ ఎక్కడ?’’ అని కూడా అన్నాను.
ఎస్.వి.ఆర్., సి.వి.ఆర్ (అంటే, ఎస్. వెంకటేశ్వరరావు, సి. రాజగోపాల్రావు)లు హాలులో దొరుకుతారు. మరో పిల్లర్ - మీ ఫ్రెండ్ - వి.వి.ఎన్. ఎల్లుండికి దిగుతాడు. హాలులోకి మరో ఇద్దరు కుర్రాళ్లు కూడా ఉన్నారు. అని లేచి ‘‘పద’’ అంటూ హాల్లోకి దారి తీశాడు. అప్పటికి ఇంకా పది గంటలే అయింది.
ఒక బల్ల చూపించి ‘‘నార్త్ ఫేసింగ్ బెటర్’’ అంటూ నేను కుర్చీలో కూర్చునే దాకా ఆగి తనూ పక్క టేబిల్ ముందు కుర్చీలో కూర్చున్నాడు. ‘‘డమీలు వేస్తున్నాం ఇరవై నాలుగో తేదీ పత్రిక మనం చేసి పంపిస్తాం. అయ్యవారు 22కే వస్తారు. శ్రీరాములుగారు కూడా వస్తారు’’ అంటూ చెప్పాడు.
‘‘ఎడిట్ పేజీ, సన్ డే పేజీలు అక్కడి నుండే వస్తాయిగా?’’ అన్నాను యథాలాపంగా...
‘‘మిగతా డిపార్ట్‌మెంట్స్ అన్నీ ‘‘సెట్’’ అవుతున్నాయి. ఇక్కడి అసిస్టెంట్ మానేజర్ రమేష్ (వి.రమేష్‌బాబు) తెలుసుగా, నీకు’’ అన్నాడు.
‘‘ప్రెస్‌లోకి పోదామా? వర్కర్స్‌ని చూద్దాం’’ అన్నాను.
‘‘కాదులే... ఇవాళ కాదు రేపు బెటర్ డే. నువ్వు రేపటి నుంచీ రంగంలోకి దిగుదువువు. నలుగుర్నీ పరిచయం చేసుకుని, ఇంటికి పోయి, రెస్ట్ తీసుకో. నీకు పి.టి.ఐ. కొత్తా? డైలీ వర్క్ కొత్తా?’’ అంటూ అప్పటికి దిగిన వెంకట్రావు, సుబ్రహ్మణ్యం, ఎస్.వి.ఆర్. గార్లతో నన్నొదిలేసి తన రూమ్‌లోకి వెళ్లి మద్రాసు నుంచి వచ్చిన ‘కంటైనర్’ చూసుకోవడం మొదలెట్టాడు.
‘‘1908. కీలక నామ సంవత్సరం భాద్రపద శుద్ధ చతుర్దశి బుధవారం నాడు మహా రాష్ట్ర రాజధాని అయిన బొంబాయి నగరంలో వారపత్రికగా ఆంధ్ర పత్రిక ఆరంభమైంది. అక్కడ ఆంధ్ర పత్రికను ప్రారంభించడం అప్పటికీ కాదు ఇప్పటికీ మహా సాహస కార్యమే గానీ స్థాపించిన మనిషి అసాధారణమైన వ్యక్తి’’ అని మొట్టమొదటి విజయవాడ ఎడిషన్ ఎడిటోరియల్ (జనవరి 24, 1965) ఉటంకించింది. ఇంకా కొంత అందులోంచి ఎత్తి రాస్తున్నాను’’ ఆంధ్ర వారపత్రిక అసాధారణ జనాదరణని పొందింది. ఆంధ్రదేశంలో - వాడ వాడలకు వెళ్లింది. ఎక్కడెక్కడో ఉన్న ఆంధ్రుల అభిమానమును చూరగొంది... ’’ అట్లా వార పత్రిక - ఆరు సంవత్సరాలు బొంబాయిలో నడచినది. స్వరాష్టమ్రు ఏర్పడవలెనని స్వరాష్టమ్రునకు రావలెననీ ప్రగాఢ వాంఛతోనే, ఆది నుంచీ ఉన్నది. 1913వ సంవత్సరంలో ఆంధ్ర మహాసభ రాష్ట్రోద్యమాన్ని ప్రారంభించింది. 1914 ఏప్రిల్ 1వ తేదీన ఆనంద సంవత్సర ఉగాది రోజున ఆంధ్ర పత్రిక దిన పత్రిక చేసిన సేవ నిర్వహించిన పాత్ర అందరూ ఎరిగినదే. దేశ, రాష్ట్ర చరిత్రలో ఆంధ్రపత్రిక చరిత్ర అనేక విధాలుగా పెనవేసుకుని ఉన్నది’’ అన్నది ఆ సంపాదకీయం.
ఎన్నాళ్ల నుంచో ఉన్న చిరకాల వాంఛ నేటికి నెరవేరి, కృష్ణాతీరం విజయవాడకి వచ్చిందన్న సంతోషాన్ని సంపాదకీయం అక్షరక్షరం ప్రతిఫలించింది.
రెండుసార్లు చదివాను. అట్టి మహత్కార్యంలో చారిత్రాత్మకమైన ‘కథ’. నేను సైతం ఒక చిన్న ‘పాత్ర’ను పోషించగలిగానన్న ఆనందంతో నా మనస్సు ఉప్పొంగింది. ఇంటికి ఒక కొత్త వీరాజీ చేరుకున్నాడనిపించింది.
(ఇంకా బోలెడుంది)