స్మృతి లయలు

‘లుముంబా’ వర్సిటీకి పోదామని...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆంధ్రప్రభ బెజవాడ గాంధీనగర్ నుం చి ప్రచురింపబడటంతో ఊళ్లో ఒక సంచలనం. గాంధీనగరం అది వరకూ కేవలం సినిమా పంపిణీ కేంద్రమే గానీ, ఆ తర్వాత ఎక్స్‌ప్రెస్, ప్రభ వెలువడుతూ స్పెషల్ ఏరియా అయింది (1960). నవయుగ ఫిలిమ్స్ మేనేజర్ కాట్రగడ్డ నరసయ్య - అయిడియాల పుట్ట. మా తమ్ముడు ప్రభలో ప్రూఫ్ రీడర్‌గా పని చేస్తూనే - కార్టూన్లు కూడా వేస్తూ - ఫిలిం పబ్లిసిటీ రంగంలో కూడా - నర్సయ్య ప్రోత్సాహంతో పబ్లిసిటీ ఫీల్డులోకి దిగాడు.
‘మిడ్‌వీక్’ ప్రకటనలు అంటూ క్రొత్తగా సినిమా రిలీజ్ అయినాకా, వారం మధ్యలో చిన్నసైజు ప్రకటనలు వచ్చాయి. వారం వారం వచ్చే పెద్ద ప్రకటనలు మద్రాసు నుంచే వచ్చేవి. నాకు, మా తమ్ముడికి అయిడియాలిచ్చే పని తగులుకుంది. సినిమాలు, పత్రికలు - అంతే. రోజంతా రేడియో ప్రోగ్రామ్స్ కూడా వుండేవి కావు. అంచేత రచయితలకు కాలరెత్తుకు తిరిగే అవకాశం వుండేది. అలాగే నాటకాల నటులకీ డిమాండు. తాలూకా ఆఫీస్ ఎదురుగ్గా ఉన్న దుకాణ సముదాయం మేడ మీద నటుల రిహార్సల్సుతో పరిసరాల్లో జనాల చెవుల తుప్పు వొదలగొడుతూ వుండేవారు. రెగ్యులర్‌గా హనుమంతరాయ గ్రంథాలయంలో నాటకాలుండేవి. ‘ఇన్‌స్పెక్టర్ జనరల్’ నాటకం ఫేమ్ - వేంకటేశ్వర్రావు ‘టాప్‌ర్యాంకర్’ అయినాడు. ఇతనికే ఆనక యూనివర్సిటీలో - నాటక కళా విభాగంలో ఉద్యోగం వచ్చింది. ఈ వెంకటేశ్వర్రావు మేనల్లుడు మా రెండో తమ్ముడికి ఫ్రెండు - లక్ష్మణరావు. అందంగా, ఎర్రగా, చురుగ్గా వుండి, నాటకాలలో ఛాన్స్ దొరికితే, చిన్నదో పెద్దదో - వేషం వేసేస్తూ - మాకు అభిమాని అయ్యాడు. అతని దస్తూరీ ముత్యాలకోవ. చిన్నచిన్న అక్షరాలు రాసేవాడు.
ఇట్లా ఒక పేజీలో నాలుగు పేజీల మేటర్ ఎక్కించే మరో రచయిత కొమ్మూరి వేణుగోపాలరావు. నాలుగు పేజీల కథ పేజీన్నరలో రాసేసేవాడు. ఈ లక్ష్మణరావుకి మా తమ్ముడు- నా ‘విడీవిడని చిక్కులు’ నవలని ఫెయిర్ కాపీ చేస్తే నగదు బహుమతి ఇస్తానన్నాడు. ఎందుకంటే వాడు అటు ప్రభ, ఇటు విశాలాంధ్ర - నవయుగ పబ్లిసిటీలతో బిజీ. ఈ అబ్బాయి ఎక్సర్‌సైజ్ బుక్‌లో ‘విడీవిడని చిక్కులు’ నవల మొత్తం - కందిబద్దలంత అక్షరాల్లో రాసేశాడు. అప్పటికే ఆంధ్రపత్రిక వీక్లీ నవలల పోటీ ప్రకటించింది. ప్రభ వీక్లీ కూడా కథల పోటీ ప్రకటించింది.
ప్రభ దీపావళి సంచికలో నా ‘గెలుపూ ఓటమీ’ అనే కథ (పెద్దది) పడింది. తిరుమల రామచంద్రగారు డైలీలో వుండేవారు. ఆయనతో పరిచయమయింది. గానీ, ఆంధ్రప్రభ గేటులో కృష్ణమూర్తి అనే టైమ్ కీపర్ - లోపలికి వెళ్తానంటే అడ్డుపడిపోయేవాడు. అతనంటే వర్కర్లకి గుర్రు. పాపం.. ఓసారి దేహశుద్ధి కూడా చేశారు. ఓ కన్ను పోయిందిట కూడాను. చిత్రమేమిటీ అంటే - అటు తర్వాత, ఐదేళ్లకి ఇదే కృష్ణమూర్తి మద్రాసు నుంచి ఇక్కడికి వచ్చిన మా డైలీలో టైమ్ కీపర్‌గా చేరాడు. రోజుకోసారయినా ‘సారీ బాస్!’ అంటూ నాకు ఎంతో సన్నిహితుడయినాడు. అపాలజీ చెప్పేవాడు పదే పదే.
అద్సరే. ఒకసారి శేషయ్యగారితో (ఎడిటర్) మాట్లాడుతూ లోపలికి, ఆయన ప్రక్కనే నడుస్తూ దూరిపోయాను. కానీ ఎడిటోరియల్ హాలులో - శార్వరి గారి దగ్గర, రావూరి గారి దగ్గర, తిరుమల రామచంద్ర గారి దగ్గర కబుర్లు చెబుతూ, గడిపేసేవాణ్ణి. ఈ టైమ్‌కీపర్ వచ్చి ఓసారి గొడవ పెట్టాడు. ‘వాడంతే. తెలుగురాని అరవ్వాడు. అరవడం వాడి పని..’ అన్నారంతా.
నేను కూడా పోవడం తగ్గించేశాను. ఈలోగా, ‘దేశ కవిత’ నుంచి, ఓ సైన్సు పుస్తకం - రాకెట్‌లు, రోదసికి సంబంధించినది - అనువాదం చేస్తాడేమో, అన్నయ్యా, కనుక్కో’ అని, దేశి కవిత ప్రచురణల ‘శి.రా.కృ’గారు కబురెట్టాడు. అప్పుడు, అందులో అడుసుమిల్లి పూర్ణచంద్రరావు - ప్రూఫులు చూసేవాడు. ‘హంస’ అని, ఒక చిన్నపత్రిక తెచ్చేవాళ్లు వాళ్లు. ‘హంస’కి రాయాల్సి వచ్చింది. తమ్ముడి ద్వారా ‘రాకెట్ - మిస్సైల్స్’ బుక్ తీసుకుని ‘రాకెట్‌లు - మిసిలీలు’ అంటూ అనువాదం చేశాను. దానికి మా వాడు అరవై రూపాయలు తెచ్చిచ్చాడు. నాకు పి.ఆర్.వో, అడ్వయిజర్ అన్నీ తమ్ముడు సుబ్బారావు మాత్రమే.
‘మునగచెట్టు’ నవల శివరామకృష్ణ గారు వేస్తాను అన్నాడు. కానీ, అది ఇంకో ముప్పై పేజీలు ఉండాలి. నూట ఇరవై పేజీల దాకా లాగమన్నాడు. ‘ససేమిరా’ అన్నానే్నను. దానికి విజయసాహితీ సమితి వారి సలహా మీద ‘నవలిక’ చేశాను. అసలది ఆంధ్రపత్రికలో కథానికగానే వచ్చింది. ‘అందులోని పాత్రలకు ‘పెద్ద పెద్ద డైలాగులు రావు’ అన్నాను - సరే, మరో మూడు కథలు చేర్చారు. బుక్ - ప్రూఫ్‌లు తమ్ముడు తెచ్చి, వాడి నైట్‌షిఫ్ట్‌లో దిద్దుతూ వుంటే - ‘తిరుమల’గారి కంటపడ్డది. మర్నాడు దాన్ని తీసుకు చదివారాయన. ఎంతో నచ్చేసిందాయనకి.
‘మీవాడు తొలి మలుపు రాయడం గొప్పేం కాదు. అందులో ఆశ్చర్యం లేదు. కానీ, ఇది రాయడం, అతని ప్రతిభకి గీటురాయి’ అన్నారుట.
‘మీరు ముందు మాటలు రాస్తారా, మరి? అన్నయ్యకి చెబుతాను. హ్యాపీగా ఫీలవుతాడు’ అన్నాడట మా వాడు. తిరుమల రామచంద్రగారి లాంటి స్కాలర్, బహుభాషా కోవిదుడు, జర్నలిస్టు - ముందు మాటలు రాసిన, ఆ ‘మునగచెట్టు’ - దేశీవారు ఎన్నో అచ్చుతప్పులతో వేసినా నాకు పేరు తెచ్చిన కల్పవృక్షం అయింది.
ఇదంతా ఎందుకు చెబుతున్నానూ - అంటే - అటు విశాలాంధ్ర, ఆకాశవాణీ - ఇటు ప్రభలో పెద్దల పరిచయం ఇవన్నీ కలిపి - వేరే ఉద్యోగం మీదికి నా దృష్టి మరలకుండా చేశాయి. అప్పట్లో నవలలకి గవర్నమెంటు లైబ్రరీల ఆర్డర్స్ తెచ్చుకుంటే- అది పబ్లిషర్స్‌కి బంగారు పంటే! కానీ, ముఖచిత్రాలు వేసేవారు తక్కువ. నా ‘రాతిమేడ’ తొలి ఎడిషన్‌కి ‘వెంబు’ కూడా వెయ్యలేదు. ‘ఏఎన్నార్’ అనే ఆర్టిస్టు వేశాడు. కానీ, ఇతను ఆర్టిస్ట్ కాదు. ప్రచురణకర్త. నాగేశ్వర్రావుగా - విక్రమ్ పబ్లిషర్స్ పార్ట్‌నర్‌గా, నేను మద్రాసు నుంచి వచ్చేసరికి - టాప్‌స్పీడ్‌లో - ఎడ్యుకేషనల్ బుక్స్‌ని పబ్లిష్ చేస్తున్నవాడైనాడు. ‘విక్రమ్ గైడ్స్’దో పేరు. తొంభైలో నాకు కూడా కొంత వర్క్ ఇచ్చి, ఇంటికి పంపించి మరీ, చేయించారు విక్రమ్ పబ్లిషర్స్.
‘మునగచెట్టు’కి మా తమ్ముణ్నే ముఖచిత్ర రచన చెయ్యమన్నాను. ‘మద్రాసు మీద మనం ఆధారపడకూడదు’ అన్నది మా నర్సయ్యగారి నినాదం. ‘కట్ కలర్స్’లో ఆ విధంగా మా వాడి మొట్టమొదటి కవర్‌పేజీ వాడికి అన్నయ్య నవలే నాంది పలికింది.
అంతలో బందరు రోడ్డు మీదికి ‘ఆంధ్రజ్యోతి’ అనే డైలీ - కె.ఎల్.ఎన్. ప్రసాద్ - నార్లగారిని ఎడిటర్‌గా - తెస్తున్నారన్నదో సంచలన వార్త అయింది. మద్రాసు ‘ప్రభ’లో వున్న విద్వాన్ విశ్వంగారు - నార్లగారితోపాటూ వచ్చేశారుట!
చెప్పానుగా.. నేను ఫిజిక్సు వాణ్ణి - నా తొలి మలుపు హీరో - శేఖరం ‘కెమిస్ట్రీ’ వాడనీ. అంచేత తొలి మలుపు నా కథే కానక్కరలేదని అంటూ వుండేవాణ్ని. కానీ ‘తొలిమలుపు వీరాజీ’ అన్న పేరు స్థిరమై పోయింది.
మా ఆనర్సు బ్యాచ్‌లో నేనూ, నా రూమ్‌మేటు గోపాలం తప్ప మిగతా పదిహేను మందీ పై చదువులకి వెళ్లిపోయారు. గోపాలం, నేనూ డ్యూటీ ఆఫీసర్‌లు, ‘ప్రొగ్రామ్ టెక్’ల పరీక్ష రాశాం - సరదాకి. వాడు సెలెక్టయ్యాడు. నేను ‘డ్రాప్’ అయిపోయాను. మాకు యూనివర్సిటీలో డబుల్ సీనియర్ - కథలు రాసే కొండముది హనుమంతరావుగారప్పుడే రేడియో స్టేషన్‌లో జాయినయి పోయాడు. దీంతో కంట్రోల్ రూమ్ (ఆకాశవాణి) మాదే అయింది. ‘బ్రాడ్‌కాస్టింగ్ టెక్’లుంటారు. ఫిజిక్స్‌లో సెలెక్ట్ అయితే లేదా ఆర్ట్స్ అయితే డ్యూటీ ఆఫీసర్లంటారు. మేం కంట్రోల్ రూమ్‌కి సరదాగా వెళ్లేవాళ్లం. హనుమంతరావుగారు, ప్రసాదరావుగారు మాకు సీనియర్లుగా చనువు. ఈ ‘టెక్నికల్ వింగు నుంచి రికార్డింగు స్టూడియోలోకి వెళ్లేవాళ్లం. అలా అక్కడ ‘శ్రీవాత్సవ’ శ్రీమతి ‘లత’ (అప్పుడు అనౌన్సర్ అనుకుంటాను) వోలేటి గారు, జరుక్ శాస్ర్తీగారు - ప్రయాగ నరసింహశాస్ర్తీ గారూ లాంటి పెద్దలు పరిచయమై పోయారు. ఒక చిన్న పాత బిల్డింగ్‌లో వుండేది స్టూడియో నాడు. ట్రాన్స్‌మిషన్ టవర్ నంబూరు (గుంటూరు దారిలో)వద్ద వుండేది.
ఓసారి, సరదాగా మా వాడు ‘గోపాలం’ నన్ను స్టూడియోలోకి తీసుకుపోయి- ఆనాటి ఎక్స్‌ప్రెస్‌లో ఒక అయిటమ్ చదవమన్నాడు. తను దాన్ని టెక్నికల్ రూమ్‌లో నుంచి ‘రికార్డ్’ చేశాడు. అది మేము వింటూంటే ప్రొగ్రామ్ ఎగ్జిక్యూటివ్ శ్రీనివాసన్ గారు అటుగా వస్తూ విన్నాడు.
‘నేనూ, శారదా శ్రీనివాసన్ కలిసి కొత్తగా యూత్ ప్రొగ్రామ్ ఒకటి పెడుతున్నాం. దానికి మీరు ‘టాక్స్’ రాసి, తెచ్చి చదవండి. బాగుంది మీ స్పీడు’ అన్నాడు. ఆకాశవాణి స్టూడియో కలియ తిరిగే ఛాన్సు ఇప్పుడు మరింత ఎక్కువయింది. కొన్ని ‘టాక్స్’ చేశాను గానీ - నాన్నగారు మద్రాసులో వున్నారు కనుక అక్కడికి పోయి - ‘కనె్నమెర లైబ్రరీ’లో బుక్స్ చదువుకోవాలన్న కోరిక కలిగింది. దీనికీ కారణం వుంది. విశాలాంధ్ర ఆఫీసు మిత్రులు పెద్దలూ ఆత్మీయతా - ఇవన్నీ కలిపి నన్ను అటు వేపు లాగడం మొదలుపెట్టాయి. ‘లుముంబా’ యూనివర్సిటీకి పోయి రష్యన్ నేర్చుకుందామనుకున్నాను. సీనియర్‌గారు నన్ను పిల్చి, కూర్చోబెట్టుకున్నారు.
‘వినండి’ అన్నారు.
ఆయన ఎన్నడూ, ఎంత వాదించినా, ఏకవచన ప్రయోగంలో మాట్లాడేవారు కాదు. ‘మీరు తొందరపడొద్దు. సిద్ధాంతం, మోజు వేరు. పార్టీ వేరు. బాగా అధ్యయనం చెయ్యండి. మద్రాసులో ‘్ఫదర్’ వున్నారు, అక్కడికిపోయి. కనె్నమెర లైబ్రరీలో అన్ని బుక్స్ దొరుకుతాయి. మార్క్స్ ఏంగిల్స్‌లతో పాటు, ఇంకా శాస్తవ్రేత్త లెందరో వున్నారు. సైంటిస్టులున్నారు. వాళ్ల గ్రంథాలూ చదవండి. కేవలం ఈ రాహుల్ సాంకృత్యాయన్ నవలలు, టాల్‌స్టాయ్ అనువాదాలే కాదు - స్టడీ ఇండియన్ ఫిలాసఫీ, వివేకానందా బుక్స్ దాకా వదలొద్దు - మీ అంతట మీరు ఒక నిర్ణయానికి రాండి. మీకు ఫ్యామిలీ రెస్పాంసిబిలిటీస్ వున్నాయి.. మైండిట్. యూ ఆర్ ది ఎల్డెస్ట్‌సన్’ అన్నారు.
నాకు ‘వివేకోదయం’ అయింది. కానీ, రుూలోగా అనుభవజ్ఞులు పరకాల, నిడమర్తి, బొమ్మారెడ్డి, ఏటుకూరిగారు, రామ్మోహన్ గారు సరేసరి. వీరి సాంగత్యం, వాత్సల్యాల వల్ల - పత్రిక ఎడిటోరియల్ డిపార్ట్‌మెంట్, డాక్ ఎడిషన్సూ, మార్నింగ్ ఎడిషన్ వగైరాలు అవగతమయినాయి. ‘రేడియో పిల్లల కార్యక్రమం - వీరాజీ అన్నయ్య వచ్చాడర్రా’ లాంటి ఆకర్షణలు తగిలాయి. వెనుకబడ్డాయి అవీ - ఓ రకంగా పత్రికా రంగంలో డ్రెస్ రిహార్సల్స్ అయిపోయాయి.
మద్రాసు నుంచి తమాషాగా - వో ఆహ్వానం - వో పిలుపు వెతుక్కుంటూ వచ్చింది. మహానుభావుడు. ఆనందవాణి ఉప్పులూరి కాళిదాసు గారు వెతుక్కుంటూ వచ్చారు. కానీ, నేనా టైములో ఇంట్లో లేను...

(ఇంకా బోలెడుంది)

వీరాజీ 9290099512 veeraji.columnist@gmail.com