శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు

రెవెన్యూ సమస్యలు వెంటనే పరిష్కరించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నెల్లూరు, జనవరి 21: రెవెన్యూ, భూ సమస్యలకు సంబంధించి ప్రజల నుండి దరఖాస్తులు వచ్చిన వెంటనే స్పందించి వెంటనే పరిష్కరించాలని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో జిల్లాస్థాయి రెవెన్యూ అధికారులతో ఆయన సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో డిప్యూటీ సిఎం కెఇ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మీఇంటికి-మీ భూమి కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్ఠంగా అమలు చేసినందుకు అధికారులను అభినందించారు. రెవెన్యూకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ మంత్రి పేషీ నుండి గాని, పైఅధికారుల నుంచి గాని వచ్చినప్పుడు జిల్లా కలెక్టర్ వెంటనే స్పందిస్తూ తగు చర్యలు తీసుకోవడం సంతోషకరమన్నారు. రాష్ట్రం మొత్తంమీద ఈ ప్రక్రియ నెల్లూరు జిల్లాలో ప్రారంభమైందన్నారు. ఇతర జిల్లాల్లో కూడా ఇదేవిధంగా సమస్యలను కలెక్టర్లు పరిష్కరించి నివేదిక అందించేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. ఇటీవల జిల్లాలో సంభవించిన వరదలతో రెవెన్యూ యంత్రాంగం ఎంతో కష్టపడి పని చేసిందని అన్నారు. రెవెన్యూ శాఖ రైతులు, ప్రజలతో మమేకమై అనేక సేవలను ప్రజలకు అందించాలన్నారు. ఈ ప్రక్రియలో గ్రామస్థాయి రెవెన్యూ అధికారుల నుంచి మండల, రెవెన్యూ డివిజన్ అధికారుల సమన్వయంతో ఆయా సమస్యలు పరిష్కరించడంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే అమలు చేస్తున్న రెవెన్యూ కార్యక్రమాలు పట్టాదారు పాస్‌పుస్తకాలు, ఇ క్రాప్, మీసేవ పౌరసరఫరాలు, ఆర్‌ఎస్‌ఆర్ కార్యక్రమాలను క్షేత్ర స్థాయిలో పర్యవేక్షించి సమర్థవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ ప్రక్రియలో రెవెన్యూ శాఖకు సంబంధించిన డిప్యూటీ కలెక్టర్ స్థాయి అధికారులు గత నెల నుంచి అమరావతిలో నివాసం ఉంటూ నిరంతరంగా కృషి చేస్తున్నారని చెప్పారు. రెవెన్యూ శాఖకు అన్ని శాఖలతో అనుబంధం ఉందని, ప్రతి ప్రభుత్వ కార్యక్రమంలో రెవెన్యూ శాఖాధికారులు ఏదోవిధంగా పాలుపంచుకుంటున్నారని ఆయన అన్నారు. గత ప్రభుత్వాలు పరిశ్రమల కోసం ఇచ్చిన ప్రభుత్వ భూములలో ఏర్పాటు చేసిన పరిశ్రమల గురించి, వాటికి సంబంధించిన ఉద్యోగ నియామకాలు, పరిశ్రమల నిర్వహణ తదితర అంశాలపై పర్యవేక్షించి వాటి పరిస్థితులకు సంబంధించిన నివేదికను అందచేయాలన్నారు. ప్రధాన సమస్య అయిన భూ సర్వే నిర్వహించేందుకు ప్రభుత్వం అందచేసిన ఆధునిక యంత్రాలను తీసుకుని వెళ్లేందుకు అద్దెపై వాహన సదుపాయాలను కల్పిస్తామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న రెవెన్యూ కార్యక్రమాలను పటిష్ఠంగా అమలు చేసేందుకు అర్హులైన లబ్ధిదారులకు పూర్తిస్థాయిలో అందేలా చూడాలన్నారు. రాష్ట్ర చీఫ్ కమిషనర్ ల్యాండ్ అక్విజిషన్ ఏసి పునీత మాట్లాడుతూ ప్రధానంగా జిల్లాలో పట్టాదారు పాస్ పుస్తకాలు అందచేయడంలో కొన్ని మండలాలలో సక్రమంగా అనుకున్న లక్ష్యాలు సాధించడంలో వెనుకబడి ఉన్నారని అన్నారు. వాటిలో నాయుడుపేట, వెంకటగిరి, కలువాయి మండలాలలో రెవెన్యూ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. అలాగే మీ ఇంటికి-మీ భూమి కార్యక్రమంపై రైతులకు పూర్తి అవగాహన కల్పించి వారి నుంచి వచ్చిన సమస్యలను అంశాలవారీగా వెబ్‌సైట్‌లో పొందుపరచి సకాలంలో పరిష్కరించేలా చూడాలన్నారు. ఆధార్ సిడీంగ్ ప్రక్రియ పెండింగ్ లేకుండా పూర్తి స్థాయిలో నిర్వహించేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ-పాస్ సిస్టం సమర్థవంతంగా నిర్వహించేలా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. మీ ఇంటికి- మీ భూమి, ఈ-పాస్, ఈ-క్రాప్ తదితర కార్యక్రమాలపై జాయింట్ కలెక్టర్లతో రాష్టస్థ్రాయిలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. రాష్ట్ర రెవెన్యూ ముఖ్యకార్యదర్శి జెసి శర్మ మాట్లాడుతూ ప్రధానంగా ప్రభుత్వ భూములను గుర్తించి వాటిని అన్యాక్రాంతం కాకుండా పరిరక్షించేందుకు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. రైతుల నుంచి భూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు వచ్చినప్పుడు వాటిని ఆన్‌లైన్‌లో పొందుపరచి సకాలంలో స్పందించి పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ ఎం జానకి మాట్లాడుతూ పవర్ పాయింట్ ప్రంజెంటేషన్ ద్వారా జిల్లాకు సంబంధించిన సిజెఎఫ్‌ఎస్ భూములు, లీజు పట్టాపై రుణాలు, ఇనాం భూములు, మీ ఇంటికి- మీ భూమి తదితర అంశాల గురించి వివరించారు, అనంతరం ఆమె మాట్లాడుతూ నెల్లూరు పట్టణాన్ని కార్పొరేషన్ చేయడం వల్ల జనాభా పెరగడంతో నెల్లూరు నగరానికి అదనంగా మరో తహశీల్దార్‌ను నియమించాలని కోరారు. రాష్ట్ర స్టాంప్స్, రిజిస్ట్రేషన్ శాఖ ఐజి వెంకటరామిరెడ్డి మాట్లాడుతూ రాష్ట్రప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన ఎక్కడైనా రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రక్రియలో భాగంగా రెవెన్యూ శాఖ ఆన్‌లైన్‌లో పొందుపరిచి ల్యాండ్ బ్యాంక్‌ను ఉపయోగించుకోవడం జరుగుతుందన్నారు. రాష్ట్ర సర్వే అండ్ సెటిల్‌మెంట్ శాఖ కమిషనర్ వాణి మోహన్ మాట్లాడుతూ సర్వే కోసం ఇచ్చిన కొత్త యంత్రాల నిర్వహణకు సర్వేయర్లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నట్లు వెల్లడించారు. ఈ సమావేశంలో సంయుక్త కలెక్టర్ ఎఎండి ఇంతియాజ్, సంయుక్త కలెక్టర్ ఆర్‌ఎస్ రాజ్‌కుమార్, జిల్లా రెవెన్యూ అధికారి ఎం సుదర్శన్‌రెడ్డి, సిఇఓ బి రామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

హల్దీయా ఎక్స్‌ప్రెస్ రైలు బోగీలో మంటలు
* అప్రమత్తం చేసిన గేట్‌మెన్
మనుబోలు, జనవరి 21: మండలపరిధిలోని చెర్లోపల్లి రైల్వే గేటు సమీపంలో ఓ రైలు బ్రేక్‌లు పట్టివేయడంతో మంటలు వ్యాపించాయి. ఈ విషయాన్ని రైల్వే గేట్‌మెన్ గుర్తించి సమాచారం ఇవ్వడంతోపాటు ప్రయాణికులు చైన్‌లాగి రైలును నిలిపి, మంటలను ఆపివేసిన సంఘటన గురువారం సాయంత్రం చోటుచేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. చెన్నై సెంట్రల్‌లో మధ్యాహ్నం 2.40 గంటలకు హల్దీయా వీక్లి ఎక్స్‌ప్రెస్ హల్దీయాకు బయలుదేరింది. మార్గమధ్యంలో మండలపరిధిలోని చెర్లోపల్లి గేటు సమీపంలోకి రాగా ఎస్-3 బోగీ వద్ద బ్రేకులు పట్టివేయడంతో మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. దీంతో ఆందోళన చెందిన ప్రయాణికులు చైన్ లాగి ఆపివేశారు. దీంతోపాటు చెర్లోపల్లి గేట్‌మెన్ వినయ్‌కుమార్ అధికారులకు సమాచారం అందించారు. ప్రయాణికులు వెంటనే పక్కనే ఉన్న ఇసుక, నీటిని చల్లి మంటలను ఆపివేశారు. ఈ సమయంలో అక్కడకు చేరుకున్న రైలు డ్రైవర్ చైన్ ఎందుకు లాగారంటూ ప్రయాణికుల పట్ల దురుసుగా ప్రవర్తించినట్లు ప్రయాణికులు వాపోయారు. సుమారు అర్ధగంట తర్వాత రైలు తిరిగి బయలుదేరింది.

బాలల ఫిర్యాదులపై తక్షణ విచారణ చేపట్టాలి
పోలీస్ అధికారులకు ఎస్‌పి గజరావు భూపాల్ ఆదేశం
నెల్లూరు కలెక్టరేట్, జనవరి 21: తప్పిపోయిన, కిడ్నాప్, అక్రమ తరలింపు వంటి కేసులను తక్షణమే నమోదు చేసి విచారణ చేపట్టాలని ఎస్‌పి గజారావు భూపాల్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని పోలీస్ కవాతు మైదానంలో ఉన్న ఉమేష్ చంద్ర సమావేశ మందిరంలో ఆపరేషన్ స్మైల్ అనే అంశంపై పోలీస్ అధికారులతో గురువారం జరిగిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాలల తప్పిపోయిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించాలని అధికారులను ఆదేశించారు. ఇందుకోసం ప్రతి పోలీస్‌స్టేషన్‌లో తప్పిపోయిన పిల్లలకోసం గోడపత్రిక విధిగా నిర్వహించాలన్నారు. తప్పిపోవటం, కిడ్నాప్‌కు గురవటం, బాలల అక్రమ తరలింపు వంటి చర్యలను నివారించేందుకు, పిల్లల రక్షణ కోసం ప్రజలలో అవగాహన పెంచేందుకు, ఆపరేషన్ సైల్మ్ సందర్భాన్ని పురస్కరించుకుని ర్యాలీ నిర్వహించాలన్నారు. ఇందుకోసం రూపొందించిన గోడపత్రికను ఆయన ఆవిష్కరించి అధికారులకు అందజేశారు. అవసరమైతే ప్రభుత్వ, స్వచ్ఛంద సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లా లీగల్ సర్వీస్ అథారిటీ సభ్యుడు ఇవిఎస్ నాయుడు మాట్లాడుతూ దేశంలో పిల్లలు అధిక సంఖ్యలో తప్పిపోతున్నప్పటికి చాలా తక్కువ సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు. తప్పిపోయిన పిల్లలు ఏమవుతున్నారో తెలసుకునేందుకు బచ్‌పన్ బచావో ఆందోళన్ సంస్థ వినిపించిన వాదనలతో సర్వోన్నత న్యాయస్థానం చీఫ్ జస్టిస్ ఎ కబీర్ ఆధ్వర్యంలో కొన్ని ఆదేశిక సూత్రాలు సూచించిందన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి బి సురేష్ మాట్లాడుతూ జిల్లాలో 24 రిజిస్టర్డ్ అనాథాశ్రమాలు ఉన్నాయన్నారు. పిల్లలు తప్పిపోయి ఎక్కడైనా అనుమానాస్పదంగా ఉంటే తమకు తెలిపితే వారికి ఆశ్రయం కల్పిస్తామన్నారు. సమావేశంలో ఎఎస్‌పి రెడ్డి గంగాధరరావు, డిఎస్పిలు, ఎస్‌డిపివోలు, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.

లారీ ఢీకొని భార్యాభర్తల మృతి
నాయుడుపేట, జనవరి 21: పొట్టకూటి కోసం చేపలవేటకు వెళ్లిన గిరిజన దంపతులు లారీ ఢీకొని మృతి చెందిన సంఘటన నాయుడపేట జాతీయ రహదారిపై గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని చంద్రబాబునాయుడు గిరిజన కాలనీకి చెందిన తుపాకుల చెంచుకిష్టయ్య (35) వృత్యరీత్యా చేపలు పట్టుకొని జీవిస్తుంటాడు. ఈక్రమంలో భార్య చెంచమ్మ (30)తో కలసి కాలనీ నుంచి జాతీయ రహదారికి ఆవలి వైపున ఉన్న విన్నమాల చెరువులో చేపలు పట్టడానికి ఇద్దరు వెళ్లి తిరిగి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. చెన్నై వైపు వెళుతున్న లారీ మరమ్మతులకు గురై నరసారెడ్డికండ్రిగ క్రాస్‌రోడ్డు వద్ద జాతీయ రహదారిపై ఆగి ఉండటంతో రోడ్డు దాటడానికి వచ్చిన చెంచయ్యకిష్టయ్య దంపతులు ఆగి వున్న లారీ వెనుకన నిలబడ్డారు. అదే సమయానికి చెన్నై నుంచి వేగంగా వస్తున్న సూపర్ వంటగ్యాస్ సిలిండర్ల లారీ అదుపుతప్పి రోడ్డు పక్కన నిలిచి ఉన్న వారితో సహా ఆగి ఉన్న లారీని కూడా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెంచుకిష్టయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ చెంచమ్మను 108 ద్వారా స్థానిక ఆసుపత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం చెంచుమ్మను నెల్లూరుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో గూడూరు వద్ద మృతి చెందింది. స్థానిక ఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కంటైనర్‌ను ఢీకొన్న బైక్
ఒకరి మృతి, మరొకరికి గాయాలు
నాయుడుపేట, జనవరి 21: పట్టణ పరిధిలోని శ్రీకాళహస్తి బైపాస్ రోడ్డుపై ఆర్టీసీ బస్టాండు వద్ద గురువారం బైక్‌పై వెళుతున్న ఇద్దరిని కంటైనర్ లారీని ఢీకొన్న ప్రమాదంలో ఉదయ్ (19) అనే విద్యార్థి మృతి చెందగా, వెంకటేష్‌కు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు పట్టణంలోని అగ్రహారంపేటకు చెందిన ఉదయ్ అనే విద్యార్థి స్థానిక వేమా డిగ్రీ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. చిట్టమూరు మండలం గండజిదిబ్బ ప్రాంతానికి చెందిన తన స్నేహితుడు వెంకటేష్‌ను బస్సు ఎక్కించడానికి బస్టాండుకు బైక్‌పై బయలుదేరాడు. ఆర్టీసీ బస్టాండ్ వద్ద వారి ముందు వెళుతున్న కంటైనర్ లారీని దాటుతుండగా ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఉదయ్ సంఘటనా స్థలంలోనే మృతి చెందగా, వెంకటేష్ అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. గాయపడ్డ వ్యక్తిని స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు 108 ద్వారా తరలించి చికిత్స అందించారు. ఎస్‌ఐ నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

‘జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ సదస్సుకు రండి’
నాయుడుపేట, జనవరి 21: తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో ఈనెల 24 నుంచి జరగబోవు జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ శిక్షణా కార్యక్రమానికి తరలిరావాలని జిల్లా వ్యవసాయ జాయింట్ డైరెక్టర్ హేమమహేశ్వరరావు కోరారు. గురువారం ఆయన స్థానిక ఎఓ నందిమండలం కవిత ఆధ్వర్యంలో లోతువానిగుంట వ్యవసాయ గిడ్డంగిలో ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయ సదస్సులో మాట్లాడారు. ప్రస్తుత వ్యవసాయ పద్ధతుల్లో రసాయనిక ఎరువుల వాడకం అధికంగా ఉందన్నారు. దీనివల్ల ఆహార కలుషితంతోపాటు రైతులు కూడా ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయంలో రసాయనిక వాడకాలను తగ్గించి సేంద్రియ ఎరువుల ద్వారా తక్కువ పెట్టుబడులతో అధిక ఆదాయం సాధించే పద్ధతులను రైతులకు తెలియజేస్తోందని అన్నారు. ఈమేరకు జిల్లాను పది క్లస్టర్లుగా విభజించి అధికారులు సదస్సులు నిర్వహిస్తున్నామని అన్నారు. ఈ నేపథ్యంలో రాష్టవ్య్రాప్త జీరో బడ్జెట్ ప్రకృతి వ్యవసాయ సదస్సు కాకినాడలో నిర్వహిస్తున్నట్లు, సదస్సుకు రైతులందరూ విచ్చేయలని ఆయన కోరారు. ఇందుకు సంబంధించిన ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు మేనేజర్ సిహెచ్ రవిచంద్ర ప్రసాద్, ఎడిఎ నాగరాజారావు, రాజ్‌కుమార్, శివరంజన్, నాల్గు మండలాల ఎఓలు పాల్గొన్నారు.

రెవెన్యూ శాఖలో అవినీతిని సహించను
ఉప ముఖ్యమంత్రి కెఇ స్పష్టం
గూడూరు, జనవరి 21: ప్రజలకు మెరుగైన సేవలు అందించే విషయంలో ఈ ప్రభుత్వం నిబద్ధతతో పని చేస్తున్నదని, ప్రధానంగా రెవెన్యూ శాఖలో అవినీతిని సహించే ప్రసక్తే లేదని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. గురువారం ఆయన జిల్లా పర్యటనలో భాగంగా గూడూరు మున్సిపల్ చైర్‌పర్సన్ పి దేవసేన నివాసానికి విచ్చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో కెఇ మాట్లాడుతూ కు రెవెన్యూ శాఖ వల్లే ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారని అన్నారు. రెవెన్యూ అధికారులు అవినీతికి, అక్రమాలకు పాల్పడితే వారిని ఉపేక్షించే ప్రసక్తే లేదని హెచ్చరించారు. అందుకే తెలుగుదేశం ప్రభుత్వం రెవెన్యూ శాఖలో అవినీతిని పారదోలేందుకు మీ ఇంటికి-మీ భూమి, ఈ-పాస్ విధానం, రెవెన్యూ రికార్డుల కంప్యూటీకరణతో పాటు రైతు సదస్సులు నిర్వహిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఈ సదస్సుల్లో రైతులు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవచ్చన్నారు. తమ ప్రభుత్వం ప్రజల వద్దకే పాలన ద్వారా అధికారులను నేరుగా ప్రజలకు వద్దకు పంపి వారి సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఇతర పార్టీల నుండి టిడిపిలోకి వస్తున్న వారికి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలనాదక్షత, ఆయనపై నమ్మకంతో పార్టీలో చేరిన వారికి సముచిత స్థానం ఉంటుందన్నారు. రాష్ట్ర విభజన అనంతరం అధికారం చేపట్టిన తెలుగుదేశం ప్రభుత్వం రాష్ట్ర అర్ధిక పరిస్థితి దయనీయంగా ఉన్నా సంక్షేమ పథకాలను సిఎం సమర్ధవంతంగా అమలు చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి విదేశాల్లో పర్యటిస్తూ పారిశ్రామికవేత్తల నుండి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో అధిక సంఖ్యలో పరిశ్రమలు వచ్చినట్టయితే నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు మెండుగా లభిస్తాయని అన్నారు. నూతన రాజధాని అమరావతి నిర్మాణానికి రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలు సహకారం అందించాలన్నారు. నదులను అనుసంధానం చేసి రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో సస్యశ్యామలం చేసేందుకు బాబు కృషి చేస్తున్నారని అన్నారు. బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం ఈ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదన్నారు. అదే విధంగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు 5892 కోట్లు, బిసి సబ్ ప్లాన్‌కు 6041 కోట్లు కేటాయించిందన్నారు. బ్రాహ్మణులకు, మైనారిటీలకు, కాపులకు ప్రత్యేక కార్పొరేషన్‌లు ఏర్పాటుచేసి నిధులను కేటాయించిందని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం పార్టీలకు అతీతంగా అర్హులకు సంక్షేమ పథకాలు అందించేందుకు కృషి చేస్తోందన్నారు. కాగా అంతకుముందు జిల్లా పర్యటనకు వెళుతున్న ఉప ముఖ్యమంత్రికి చైర్‌పర్సన్ దంపతులు స్థానిక సాయిబాబా గుడ వద్ద ఘనస్వాగతం పలికి ఆయనను గజమాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో పారిశ్రామికవేత్త పొనకా శివకుమార్‌రెడ్డి, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, మున్సిపల్ వైస్‌చైర్మన్ శీలం కిరణ్‌కుమార్, గూడూరు డిఎస్పీ బి శ్రీనివాస్, టౌన్, రూరల్ సిఐలు టివి సుబ్బారావు, శ్రీనివాసరెడ్డి, టిడిపి నియోజకవర్గ ఇన్‌చార్జ్ జోత్న్సలత, టిడిపి మున్సిపల్ కౌన్సిలర్లు ఉన్నారు.