రాష్ట్రీయం

పాలేరులో 90% పోలింగ్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఖమ్మం, మే 16: ఖమ్మం జిల్లా పాలేరు ఉప ఎన్నికలో 89.73 శాతం పోలింగ్ నమోదైంది. గత ఎన్నికల్లో ఇదే నియోజకవర్గంలో 91.46శాతం పోలింగ్ జరగగా, ఈసారి రెండు శాతం తగ్గడం గమనార్హం. చెదురుమదురు సంఘటనలు మినహా చెప్పుకోదగిన స్థాయిలో ఘర్షణలేమీ జరగకపోవడంతో అధికారగణం ఊపిరి పీల్చుకుంది. కొన్నిచోట్ల ఇవిఎంలు మొరాయించాయి. నేలకొండపల్లి మండలం సుర్దేపల్లి, కూసుమంచి మండలం గురవాయిగూడెం, కోక్యాతండా గ్రామాల్లో స్వల్ప ఘర్షణలు జరిగాయి. సుర్దేపల్లిలో పోలీసులు స్వల్పంగా లాఠీచార్జ్ చేశారు. కాగా ఈసారి ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన మోడల్ బూత్‌లు అందర్నీ విశేషంగా ఆకట్టుకున్నాయి. ఉప ఎన్నిక పోలింగ్‌లో 12 మోడల్ బూత్‌లను ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని అద్భుతంగా అలంకరించి బూత్‌లో కూలర్లు, చల్లని మంచినీరు, వైద్య శిబిరం, వలంటీర్లను ఏర్పాటు చేశారు. ఈ బూత్‌లను చూసేందుకు ఓటర్లు ఆసక్తి కనబర్చారు. అలాగే దేశంలోనే తొలిసారిగా అన్ని కేంద్రాల్లో ఏర్పాటు చేసిన వివిప్యాట్‌ల ద్వారా తాము ఎవరికి ఓటు వేశామో చూసుకొని ఓటర్లు ఆనందం వ్యక్తం చేశారు. పూర్తిగా గ్రామీణ నియోజకవర్గమైన పాలేరులో అన్ని కేంద్రాల్లోనూ వెబ్‌కాస్టింగ్ విధానాన్ని అమలు చేశారు. దీంతో అధికారులు ఖమ్మం నుంచి కూడా పోలింగ్ సరళిని పర్యవేక్షించారు.
నియోజకవర్గంలో మొత్తం 1,90,351 మంది ఓటర్లు ఉండగా 1,70,800 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నేలకొండపల్లి మండలంలో అత్యధికంగా 90.76 శాతం పోలింగ్ నమోదైంది. తిరుమలాయపాలెంలో 90.29, కూసుమంచిలో 89.71, ఖమ్మం రూరల్ మండలంలో అత్యల్పంగా 88.74 శాతం పోలింగ్ నమోదైంది. 13 మంది అభ్యర్థులు పోటీలో నిలవగా అధికార టిఆర్‌ఎస్ పార్టీ అభ్యర్థి తుమ్మల నాగేశ్వరరావు, తెలుగుదేశం, వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలు బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థి రాంరెడ్డి సుచరితారెడ్డి, సిపిఐ బలపరిచిన సిపిఎం అభ్యర్థి పోతినేని సుదర్శన్‌రావు మధ్య పోటీ నెలకొంది. పోలింగ్ సందర్భంగా పెద్దసంఖ్యలో ఇతర జిల్లాల పోలీసులను బందోబస్తుకు వినియోగించారు. మరోవైపు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం స్వగ్రామమైన తెల్దారుపల్లిలో ఇతర పార్టీల ఏజెంట్లను రానివ్వండం లేదని, అక్కడ రిగ్గింగ్ జరిగే అవకాశం ఉందని టిఆర్‌ఎస్ నేతలు ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అయితే ఆ గ్రామస్తులు మాత్రం గతానికి భిన్నంగా ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని పోలింగ్‌లో పాల్గొన్నారు.

చిత్రం మోడల్ బూత్‌లో ఓటువేసే విధానం తెలియజేస్తూ ఏర్పాటు చేసిన స్వాగత ద్వారం