రాష్ట్రీయం

సేద్యంలో దేశానికే ఆదర్శంగా తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 16: సేద్యం రంగంలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా ఉండేలా ప్రయత్నిస్తున్నామని తెలంగాణ వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి సి. పార్థసారథి తెలిపారు. ఢిల్లీలోని కేంద్ర సచివాలయ సేవల విభాగం నుండి హైదరాబాద్ వచ్చిన అధికారుల బృందంతో పార్థసారథి సోమవారం సచివాలయంలో సమావేశమయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు చేపట్టిన పథకాలు, కార్యక్రమాలతో పాటు త్వరలో చేపట్టబోయే పథకాలు, కార్యక్రమాల గురించి ఆయన వివరించారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న రైతుబంధు పథకం (ఎకరానికి నాలుగువేల రూపాయల ఆర్థిక సాయం) గురించి పార్థసారథి తెలిపారు. ఏటా రెండుపంటలకు కలిపి ఎకరానికి రైతుకు ఎనిమిది వేల రూపాయలు పంటల పెట్టుబడి కోసం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు కొనుగోలుతో పాటు, ఇతరత్రా పెట్టుబడులకోసం ఈ నిధులను రైతులు వినియోగించుకోవచ్చన్నారు. అంటే పంటలకోసం రైతులు పెట్టే పెట్టుబడికి చేయూత ఇవ్వాలన్నదే కేసీఆర్ లక్ష్యమని వివరించారు. ఈ పథకం కోసం 2018-19 సంవత్సరం బడ్జెట్‌లో 12 వేల కోట్ల రూపాయలు పొందుపరిచామన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ రంగానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో రుణమాఫీ జరిగిందని, ఈ కార్యక్రమానికి నాలుగేళ్లలో 16,124.38 కోట్ల రూపాయలు ఖర్చు చేశామన్నారు. అలాగే వ్యవసాయ యాంత్రీకరణకు గత నాలుగేళ్లలో 586.16 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని వివరించారు. దేశానికే విత్తన భాండాగారంగా తెలంగాణను రూపుదిద్దుతున్నామని తెలిపారు. సాగునీటికి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ కోటి ఎకరాలకు సాగునీటిని ఇవ్వాలన్న లక్ష్యంతో నీటిపారుదల ప్రాజెక్టులను పెద్దఎత్తున చేపట్టామని పార్థసారథి తెలిపారు. ఏటా దాదాపు 25 వేల కోట్ల రూపాయలు నీటిపారుదల కోసం వ్యయం చేస్తున్నామన్నారు. కేంద్ర సహకారంతో చేపట్టిన వివిధ పథకాల గురించి ఈ సందర్భంగా పార్థసారథి వివరించారు. ఈ సమావేశంలో వ్యవసాయ కమిషనర్ డాక్టర్ ఎం. జగన్‌మోహన్, ఉద్యాన కమిషనర్ ఎల్. వెంకటరామిరెడ్డి, మార్కెటింగ్ సంచాలకులు లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు.