రాష్ట్రీయం

...కరెన్సీ కనికట్టు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

* పివి రమణారావు
హైదరాబాద్, ఏప్రిల్ 17: తెలంగాణలో వాణిజ్య బ్యాంకులతో పాటు గ్రామీణ బ్యాంకులు, సహకార బ్యాంకులు కరెన్సీ కొరతతో విలవిలలాడుతున్నాయి. బ్యాంకుల్లో దాచుకున్న డబ్బును తీసుకునే (విత్‌డ్రా) అవకాశాన్ని మేనేజర్లు ఇవ్వడం లేదు. పది లక్షలకు రెండు, మూడు లక్షలు విత్‌డ్రా చేసుకోవాలన్నా కష్టమే అంటున్నారు. పెళ్లిల్లు, పేరంటాళ్లకు కూడా బ్యాంకుల్లో ఉన్న డబ్బు తీసుకునేందుకు ఖాతాదారులకు సాధ్యంకావటం లేదు. తమ వద్ద డబ్బు లేదని బ్యాంకు మేనేజర్లు చెబుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల్లోనూ ఇలాంటి చేదుఅనుభవాలే ఎదురవుతున్నాయ. ఒక డిపాజిట్‌దారుడికి రోజూ 10 వేల రూపాయల కంటే ఎక్కువ ఇవ్వలేమని బ్యాంకర్లు స్పష్టంగా చెబుతున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది. గ్రామీణ ప్రాంతాల్లో ఒక ఖాతాదారుడు ఐదువేలు కూడా విత్‌డ్రా చేసుకునేందుకు అవకాశం ఉండటం లేదు. ఏటీఎంల ద్వారా డబ్బు డ్రా చేసుకోవాలంటే ఏటీఎంలు పనిచేయడం లేదు. 2016-17లో రాష్టవ్య్రాప్తంగా ఉన్న బ్యాంకుల్లో 3,57,318 కోట్ల డిపాజిట్లు ఉండగా, తాజా సమాచారం ప్రకారం మూడు లక్షల కోట్లకు తగ్గినట్టు తెలుస్తోంది. బ్యాంకుల్లో డిపాజిట్లు తగ్గిపోతుంటే, రుణాలు ఇవ్వడం స్తబ్ధుగా మారింది. 2017-18లో తెలంగాణలో 1,14,000 కోట్ల రూపాయలు రుణంగా ఇవ్వాలని వార్షిక రుణప్రణాళిక సిద్ధం చేయగా, తాజా సమాచారం ప్రకారం 80 వేల కోట్లు కూడా రుణంగా ఇవ్వలేదని తెలిసింది. గ్రామాల్లో చిన్న వ్యాపారాల కోసం 10 వేల రూపాయల రుణం కావాలన్నా బ్యాంకర్లు నో చెప్తున్నారు. పెద్దనోట్ల రద్దు తర్వాత తెలంగాణలో బ్యాంకుల ఆర్థిక పరిస్థితి దిగజారుతూ వస్తోంది. కేంద్రం ఫైనాన్సియల్ రిసొల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్సూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు తీసుకువస్తోందని, దాంతో బ్యాంకుల్లో చేసిన డిపాజిట్లకు ముప్పువాటిల్లుతుందని ప్రచారం జరుగుతుండటంతో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎఫ్‌ఆర్‌డిఐ బిల్లు అమల్లోకి వచ్చిన తర్వాత ఏదైనా బ్యాంకు దివాలా తీస్తే, డిపాజిట్‌దారులను ఆదుకునేందుకు ప్రభుత్వం ముందుకు రాదని ప్రచారం జరగడమే ఆందోళనకు కారణమని తెలుస్తోంది. ఉద్యోగులు, రిటైరైనవారు, వ్యాపారులు, గృహిణులు తదితరులు పొదుపుగా దాచుకున్న డబ్బును బ్యాంకుల్లో ఫిక్స్‌డ్ డిపాజిట్లరూపంలోనూ, ఇతరత్రా రూపాల్లో డిపాజిట్ చేస్తూ వస్తున్నారు. బ్యాంకుల్లో డబ్బు ఉంటే గ్యారంటీ ఉంటుందన్న నమ్మకం ప్రజల్లో ఉంటూ వచ్చింది. పెద్దనోట్ల రద్దు తర్వాత ప్రభుత్వం పట్ల ప్రజల్లో నమ్మకం సన్నగిల్లుతోంది. ప్రస్తుతం చలామణిలో ఉన్న 2000, 500 రూపాయల నోట్లు కూడా రద్దవుతాయన్న భయం ప్రజల్లో కలుగుతోంది. 2016 నవంబర్ నుండి 2017 మార్చి వరకు (ఐదునెలల్లో) ఆర్‌బీఐ నుండి తెలంగాణ బ్యాంకులకు 82,168 కోట్ల రూపాయల కరెన్సీ రాగా, 2017 ఏప్రిల్ నుండి 2018 ఫిబ్రవరి వరకు 51,532 కోట్ల రూపాయల కరెన్సీ వచ్చింది. గత నెలలో కేవలం 500 కోట్ల రూపాయల కరెన్సీ మాత్రమే వచ్చిందని తెలుస్తోంది. బ్యాంకులకు చేరుతున్న డబ్బు ప్రజలకు వెళ్తోంది తప్ప మళ్లీ బ్యాంకులకు డిపాజిట్లు రావడం లేదు. ప్రజలు తమ డబ్బును బంగారం, భూములు, ప్లాట్లు, అపార్ట్‌మెంట్లు, ఇళ్లు కొనుగోలులో పెట్టుబడిగా పెడుతున్నారు.
డిపాజిట్లు రావట్లేదు..
హైదరాబాద్ (నాగోల్) ఐడిబిఐ మేనేజర్ ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, తమ శాఖకు గతంలో రోజూ 30 లక్షల నుండి 36 లక్షల రూపాయల వరకు డిపాజిట్లు వచ్చేవన్నారు. ప్రస్తుతం ఐదువందల నోట్ల కట్టలు రెండు పట్టుకుని ఏ ఒక్కరూ డిపాజిట్ చేసేందుకు రావడం లేదన్నారు. పైగా విత్‌డ్రాలు ఎక్కువగా ఉన్నాయన్నారు. ఏటీఎంలో ఐదు లక్షల రూపాయలు పెడితే గంటలోగా అయిపోతున్నాయని, అదే సమయంలో తమ శాఖకు ఉన్నతస్థాయి నుండి నగదు రావడం తగ్గిపోయిందని దాంతో ఆర్థిక లావాదేవీలు ఇబ్బందికరంగా మారిందని వివరించారు. ఇదే పరిస్థితి రాష్ట్రంలోని అన్ని బ్యాంకుల శాఖల్లోనూ కనిపిస్తోంది.

* ఏటీఎంలలో నిల్!
తెలంగాణలో వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎం (ఆటోమేటెడ్ టెల్లర్ మిషన్లు) 75శాతం వరకు పనిచేయడం లేదు. మరో 25 శాతం ఏటీఎంలు డబ్బులు పెట్టిన గంటకే ఖాళీ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ఆర్‌బిఐ ప్రాంతీయ కార్యాలయం ఆవరణలోని ఏటీఎంలో సైతం నగదు కొరత కనిపిస్తోంది. బ్యాంకుల వద్ద నగదు నిలువలు తగ్గిపోవడమే ఇందుకు కారణమంటున్నారు. ఎస్బీఐ నేతృత్వంలోని 11 వేల ఏటీఎంలలో ఇప్పటికే 1500 పైగా మూతపడ్డాయ. మిగతా వాటిలో సగానికిపైగా పనిచేయడం లేదు. తెలంగాణ మొత్తంలో దాదాపు 9000 పైగా ఏటీఎంలు గత ఆరునెలల నుండి పనిచేయడం లేదని తెలిసింది.
* ఏజెంట్ల వద్ద ఫుల్
ఒకవైపు బ్యాంకుల్లో నగదు లేక విలవిల్లాడుతుంటే, ఆర్బీఐ కార్యాలయం బయట ఏజంట్లు యథేచ్చగా నోట్ల వ్యాపారం నిరాటంకంగా సాగిస్తున్నారు. 10, 20, 50, వంద నోట్లు పెద్ద మొత్తంలో కావాలనుకునే వారికి ‘ఆపద్భాందవుల్లా’గా కనిపిస్తున్నారు. వెయ్యి చిల్లర (10, 20 నోట్లు)కి 140-150 రూపాయల కమిషన్. ఐదు వేలకు చిల్లరిస్తే 200 నుండి 250 రూపాయల కమిషన్. ఇలా ఎంత మొత్తానికైనా ఏజంట్ల వద్ద చిల్లర సిద్ధంగా ఉంటుంది. నిజానికి చిల్లర అడిగితే ఆర్బీఐలోనే ఇవ్వాలి. కాని చిన్న వ్యాపారులు, సామాన్యులు ఆర్బీఐలోకి వెళితే చిల్లర దొరకదు. కమిషన్ ఏజంట్లకు మాత్రం కట్టలు కట్టలు దొరుకుతున్నాయ.