రాష్ట్రీయం

ఉదాశీనతను సహించం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 18: కేంద్ర ప్రభుత్వ సహాయ నిరాకరణతో రాజధాని నగరం అమరావతి నిర్మాణంపై ప్రజానీకంలో అనేక సందేహాలు తలెత్తాయని, వాటిని పటాపంచలు చేసేలా నిర్మాణ పనులు వేగం పుంజుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. రాజధాని నిర్మాణంలో కేంద్రం తన మాటను నిలబెట్టుకోకపోయినా ప్రత్యామ్నాయ మార్గాలు అనేకం ఉన్నాయని, ప్రజలే ముందుకొచ్చి సొంతంగా నిధులను సమకూర్చడానికి సన్నద్ధం కావడం అన్నింటికంటే విశేషమని ఆయనన్నారు. రాజధాని నిర్మాణ విషయంలో రాష్ట్ర ప్రజల్లో ఉన్న విశ్వాసాన్ని సడలనీయకుండా నిర్ణీత వ్యవధిలోగా పనులు పూర్తి చేయడంలో నిర్మాణ సంస్థలు సహకరించాలని కోరారు. అలాకాకుండా పనుల్లో ఉదాశీనత ప్రదర్శిస్తే ఏమాత్రం ఉపేక్షించబోనని స్పష్టం చేశారు. అమరావతి అభివృద్ధి పనుల పురోగతిపై ముఖ్యమంత్రి చంద్రబాబు పురపాలక శాఖ మంత్రి పి నారాయణతో బుధవారం మధ్యాహ్నం వెలగపూడి సచివాలయంలో సమీక్షించారు. రాజధాని ప్రాంత అభివృద్ధి ప్రాధికార సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి సంస్థ అధికారులు, వివిధ ప్రాజెక్టులు చేపట్టిన నిర్మాణ సంస్థల ప్రతినిధులు ఈ సమావేశంలో పాల్గొని పనుల పురోగతిని ముఖ్యమంత్రికి వివరించారు. అమరావతి నగర నిర్మాణానికి అవసరమయ్యే నిధులను ఎలా సమకూర్చుకోవాలన్న అంశంపై రానున్న 18ఏళ్ల కాలాన్ని దృష్టిలో ఉంచుకుని రూపొందించిన ఆర్థిక ప్రణాళికను సమావేశంలో ఆమోదించారు. అయితే దీన్ని కేవలం తాత్కాలిక ప్రణాళికగానే తీసుకోవాలని, పరిస్థితులు, రాబడి మార్గాల ఆధారంగా ఎప్పటికప్పుడు ఈ ప్రణాళికలో మార్పులు, చేర్పులు చేసుకుంటూ ముందుకు సాగాలని ముఖ్యమంత్రి నిర్దేశించారు. అమరావతి ప్రాంతంలో ప్రస్తుతం రూ. 23,294 కోట్ల విలువైన పనులు పురోగతిలో ఉన్నాయని, మొత్తం రాజధాని ప్రాజెక్టును పూర్తి చేయడానికి రూ. 48,115 కోట్లు అవసరం అవుతాయని అంచనా వేసినట్లు సీఆర్‌డీఏ అధికారులు తెలిపారు. ఈ నిధులను వివిధ ఆర్థిక సంస్థల నుంచి సమకూర్చుకోవడం వల్ల వడ్డీతో కలిపి మొత్తం అంచనా వ్యయం రూ. 51వేల కోట్లకు పైబడి ఉంటుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. రూ. 38,590 కోట్ల మేర హడ్కో, వరల్డ్ బ్యాంక్ వంటి సంస్థల నుంచి రుణాలుగా తీసుకోవడానికి అవకాశం ఉందని వివరించారు. మెకన్సీ, క్రిసిల్ వంటి ప్రముఖ కన్సల్టెంట్ల సహకారంతో ఈ ప్రణాళికను రూపొందించామన్నారు. కీలక రాజధాని ప్రాంతంలోని 5020 ఎకరాల భూమిని ఎవరికీ కేటాయించకుండా రిజర్వులో ఉంచి దానిద్వారా నిధులను సమకూర్చుకునే అవకాశం ఉందని తెలిపారు. మరో నాలుగేళ్లలో సీఆర్‌డీఏ సొంత ఆదాయ మార్గాల్లో స్వయంగా నిధులను సమకూర్చుకునే స్థాయికి ఎదుగుతుందని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. పరిపాలనా నగరం అభివృద్ధిని ప్రత్యేకంగా పరిగణించి దానికోసం విడిగా నిధుల కోసం ప్రణాళిక రూపొందించాలని ముఖ్యమంత్రి ఈ సందర్భంగా అధికారులకు సూచించారు. 1300 ఎకరాల విస్తీర్ణంలో నిర్మిస్తున్న పరిపాలనా నగరంలో మానిటైజేషన్ కోసం కేటాయించే భూమి ఎంతో పరిశీలించి ప్రణాళిక రూపొందించాలన్నారు. అలాగే జీఎస్టీ ద్వారా సమకూరే ఆదాయం, ఆస్తిపన్నులు, ఇతర మార్గాల్లో వచ్చే ఆదాయాలను గమనంలోకి తీసుకుని రాజధానికి అవసరమయ్యే ఆర్థిక ప్రణాళికను రూపొందించాలని చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆదాయాన్నంతా తీసుకెళ్లి హైదరాబాదులో పెట్టి ఆ నగరాన్ని అభివృద్ధి చేసినట్టు కొందరు ప్రచారం చేశారని, ఇతర ప్రాంతాలకు చెందాల్సిన ఆదాయంలో ఒక్క రూపాయి కూడా ఆనాడు తాము హైదరాబాద్ అభివృద్ధికి మళ్లించలేదని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చెప్పారు. సైబరాబాద్, శంషాబాద్ నిర్మాణాలకు అవసరమయ్యే నిధుల కోసం ప్రత్యామ్నాయ మార్గాలు వెతికామని, తరువాతి క్రమంలో అక్కడ పెద్ద ఎత్తున ఆర్థిక కార్యకలాపాలు జరగడంతో సెల్ఫ్ సస్టెయినబిలిటీ వచ్చిందని గుర్తుచేశారు.
‘కేంద్రం సహకరించడం లేదని, పనులు నిలిచిపోతాయని కొందరు ప్రచారం చేస్తున్నారు. అవేవీ నిజం కాదు. రాజధాని నిర్మాణానికి నిధులు అందించేందుకు ప్రజలు స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు’ అని చంద్రబాబు తెలిపారు. ఇవన్నీ ప్రజలకు వివరించాల్సి ఉందన్నారు. రాజధానిలో జరుగుతున్న పనులను డ్రోన్ల ద్వారా చిత్రీకరించి రెండు నిమిషాల నిడివి కలిగిన లఘు చిత్రాలను ప్రతినెలా సినిమా థియేటర్లలో, మీడియా చానళ్లలో ప్రదర్శించాలని సూచించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇబ్బందులు ఎదురైతే ప్రత్యామ్నాయ మార్గాలను ఇప్పటినుంచి సిద్ధం చేసుకోవాలన్నారు. కేంద్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం చేస్తే ప్రజలు ముందుకొచ్చి రుణాలు అందించడానికి సిద్ధంగా ఉన్నారని తెలిపారు. రాజధాని ప్రాంతంలో ఏర్పాటు చేయతలపెట్టిన కనె్వన్షన్ సెంటర్ కోసం 5 ఎకరాల స్థలం కేటాయించి ప్రైవేట్ భాగస్వామ్యం, నిర్వహణతో పూర్తి చేద్దామని సమావేశంలో ముఖ్యమంత్రి ప్రతిపాదించారు. శాఖమూరు ఉద్యానవనాన్ని సైతం ఇదే రీతిలో పబ్లిక్- ప్రైవేట్ భాగస్వామ్యంలో చేపట్టామని గుర్తుచేశారు. అమరావతి డెవలప్‌మెంట్ అథారిటీ ఆధ్వర్యంలో రూ. 15వేల కోట్ల మేర పనులు పురోగతిలో ఉన్నాయని ఏడీసీ సీఎండీ లక్ష్మీపార్థసారథి చెప్పారు. విజయవాడ- గుంటూరు వరకు రహదారి వెంట బ్యూటిఫికేషన్ పనులను ఏడాది లోగా పూర్తిచేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. 50 కిలోమీటర్ల మేర ఉన్న విజయవాడలోని కాల్వలను సుందరీకరించే ప్రాజెక్టును సత్వరం చేపట్టాలని ఏడీసీకి సూచించారు. పరిపాలనా నగరం అభివృద్ధి పనులను సీఆర్‌డీఏ కమిషనర్ శ్రీధర్ ముఖ్యమంత్రికి వివరించారు. సచివాలయం నిర్మాణ ప్రక్రియ త్వరలోనే టెండర్ల దశకు వెళ్తున్నట్టు చెప్పారు. 2 ప్యాకేజీలుగా సచివాలయం నిర్మాణం చేపడుతున్నట్టు చెప్పారు. తొలిదశలో రూ. 2వేల కోట్ల అంచనా వ్యయంతో టెండర్లకు వెళ్తున్నామని తెలిపారు. జిల్లా కోర్టు ఏర్పాటుపై టెండర్ ఓపెన్ చేశామని వివరించారు. ఈ వారంలోనే పనులు ప్రారంభం అవుతాయన్నారు. ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుకు సంబంధించి రూ. 2026 కోట్ల మేర ఆంధ్రా బ్యాంక్, విజయా బ్యాంక్, ఇండియన్ బ్యాంక్ ఆర్థిక సహాయం అందిస్తున్నాయని తెలిపారు. ఈ నెల 21న యూకే హాస్పిటల్ గ్రూపు ప్రతినిధులు వస్తున్నారని తెలిపారు. ఆతిథ్య రంగానికి సంబంధించి ఐదు, నాలుగు, మూడు నక్షత్రాల హోటళ్లు కొన్ని ముందుకు వచ్చాయని చెప్పారు. 3 ఐదు నక్షత్రాల హోటళ్లు, 3 మూడు నక్షత్రాల హోటళ్లు ఆసక్తి చూపాయన్నారు. 5వేల గదుల చొప్పున నిర్మించడానికి మహీంద్ర, తాజ్ గ్రూపులు అంగీకరించాయని ముఖ్యమంత్రి తెలిపారు. అక్షరధామ్, టీటీడీ, బిర్లా దేవాలయాల ఏర్పాటుకు ఆయా సంస్థలు సంసిద్ధంగా ఉన్నాయని అధికారులు వివరించారు.