రాష్ట్రీయం

విశ్రమించేది లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 20: రాష్ట్ర ప్రయోజనాల కోసం దేశ చరిత్రలోనే తొలిసారిగా కేంద్ర ప్రభుత్వంపై తాను సాగిస్తున్న ధర్మ పోరాటానికి ప్రజలంతా మద్దతివ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. ఐదుకోట్ల ప్రజలు తన వెనుక ఉంటే వచ్చే ఎన్నికల్లో 25 పార్లమెంటు సీట్లను కైవసం చేసుకుని దేశ ప్రధాని ఎవరో మనమే నిర్ణయిద్దామన్నారు. పార్లమెంటులో పూర్తిస్థాయిలో మెజార్టీ ఉందన్న అహంభావంతో ప్రధాని నరేంద్రమోదీ పొత్తుల ధర్మాన్ని, విభజన చట్టం హామీలను, ఎన్నికల వాగ్దానాలను విస్మరించడమే కాకుండా ఏకంగా వ్యక్తిగతంగానూ తనను ఏదో చేయగలరన్న సంకేతాలను పంపుతున్నప్పటికీ తానేమీ ఖాతరు చేయబోనన్నారు. ఈ రాష్ట్రాన్ని కాదు చివరకు తనను కూడా ఏమీ చేయలేరని ఉద్వేగంతో అన్నారు. ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ ఈ ఇచ్చిన హామీలను మరోసారి గుర్తుచేసేందుకు ఈనెల 30న తిరుపతిలో మరో ధర్మపోరాటానికి శ్రీకారం చుట్టబోతున్నానని చెప్పారు. కమలనాథులకు వెంకన్నపై అచంచల భక్తి, గౌరవం ఉందనుకుంటున్నానంటూ అందుకే వెంకన్న సాక్షిగానే ఈ సభ నిర్వహించబోతున్నానని
చెప్పారు. ప్రత్యేక హోదా, విభజన చట్టం హామీల అమలు కోసం శుక్రవారం ఉదయం 7గంటలకు ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో 12గంటల ధర్మపోరాట దీక్షను ప్రారంభించిన చంద్రబాబు సరిగ్గా రాత్రి 7 గంటల సమయంలో చిన్నారులు ఇచ్చిన నిమ్మరసం తాగి తన దీక్ష విరమించారు. ఆయనతో పాటు 96ఏళ్ల వయస్సులో దీక్షలో పాల్గొన్న స్వాతంత్య్ర సమరయోధుడు పావులూరి శివరామకృష్ణయ్య కూడా పిల్లలతో పాటు బాబుకు నిమ్మరసాన్ని అందజేశారు. అనంతరం బాబు ఎంతో ఉద్వేగంతో దాదాపు 80 నిముషాలపాటు ప్రసంగించారు. ప్రధానంగా కేంద్ర ప్రభుత్వంపైన ముఖ్యంగా మోదీపైనే ఘాటైన పదజాలంతో విమర్శనాస్త్రాలు సంధించారు. తెలుగులో ఉన్న ‘సామ దాన భేద దండోపాయాలన్న’ సామెతను ప్రస్తావిస్తూ మొదటి మూడింటిని తాను ఎంతో సమయస్ఫూర్తితో పూర్తిచేశానని, ఇక మిగిలింది దండోపాయమే అన్నారు. రాష్ట్ర ప్రయోజనాల కోసమే ప్రధాని మోదీని ఎంతో గౌరవిస్తూ వచ్చానంటూ మూడో ఆయుధంగా తొలుత కేంద్ర మంత్రివర్గం నుంచి తప్పుకుని, చివరగా ఎన్డీఏ నుంచి వైదొలిగామన్నారు. 16వేల కోట్ల లోటు బడ్జెట్‌ను భర్తీచేస్తామని చెప్పిన కేంద్రం ఎందుకూ పనికిరాని లెక్కలు చూపుతూ నాలుగువేల కోట్లతో చేతులెత్తేసేందుకు సిద్ధమవుతున్నదని అన్నారు. దేశంలో ప్రత్యేక హోదా ఊసే లేదంటూ ఐదో బడ్జెట్ సమావేశంలో 11 రాష్ట్రాలకు కేంద్ర పథకాల అమల్లో 90 శాతంను సబ్సిడీగా ఎలా కేటాయించారంటూ ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్ చేసిన నేరం ఏమిటన్నారు. పోలవరం పథకాన్ని ఎవరు అడ్డుకోవాలని ప్రయత్నించినా కుంటిసాకులతో కేంద్రం కాలయాపన చేయాలని భావిస్తూ లేనిపోని అసత్యారోపణలతో తనను వ్యక్తిగతంగా దెబ్బతీసే ప్రయత్నం చేయాలని భావిస్తున్నప్పటికీ ఉపేక్షించబోనంటూ బాబు తీవ్రస్థాయిలో హెచ్చరించారు. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ ప్రాజెక్టును పూర్తిచేసి తీరుతానంటూ హర్షధ్వానాల మధ్య ప్రకటించారు. తెలుగువాడు గర్వపడేలా ప్రపంచ స్థాయిలో అమరావతి రాజధాని నిర్మాణాన్ని చేపట్టబోతున్నానన్న అసూయతోనే కేంద్రం అవాకులు, చవాకులు పేలుతూ ఇప్పటికి ముష్టి రూ.1500 కోట్లు మాత్రమే అందజేసిందన్నారు. అదే గుజరాత్‌లో పటేల్ విగ్రహానికి రూ.2500 కోట్లు ఎలా ఖర్చు చేయగలుగుతున్నదంటూ ప్రశ్నించారు. ఆంధ్రులు పన్నులు కట్టడం లేదా, కేంద్రం నిధుల్లో మనకు హక్కు లేదా... అయినా మనపై కేంద్రం పెత్తనం ఏమిటంటూ ప్రశ్నించారు. గతంలో ఒక్క కేంద్ర మంత్రిపదవి కూడా ఆశించకుండా వాజ్‌పేయి ప్రభుత్వానికి మద్దతిచ్చామని గుర్తుచేశారు. కేంద్రం అరకొరగా ఇస్తున్న నిధుల ప్రకారం వచ్చే 30ఏళ్లకు కూడా కేంద్ర విద్యాసంస్థలు ఒక కొలిక్కి రావన్నారు. షెడ్యూల్ 9, 10లో ఇంకా తేల్చాల్సినవి చాలా ఉన్నాయని, విశాఖ రైల్వే డివిజన్, కడప ఉక్కు ఫ్యాక్టరీ వంటివి కాగితాలకే పరిమితం చేస్తున్నారంటూ కేంద్రంపై విరుచుకుపడ్డారు. గ్రేహౌండ్స్‌కు రూ.800 కోట్లు కావాలని అడిగితే రూ.210 కోట్లు కేటాయించి చేతులు దులుపుకున్నారని అన్నారు. వెనుకబడిన జిల్లాల అభివృద్ధి కోసం తాజాగా రూ.350 కోట్లు ఇచ్చి ఆర్‌బీఐ ద్వారా ఆ సొమ్మును మళ్లీ వెనక్కి తీసుకోవటమనేది దేశంలో ఎక్కడా జరగలేదన్నారు. తమిళనాడులో ప్రాంతీయ పార్టీలను దెబ్బతీయగలిగామన్న ఉద్దేశంతో ఆంధ్రాను ఏదో చేయాలనుకుంటే సాధ్యపడదని మరోసారి హెచ్చరించారు. వైకాపాతో లాలూచీపడి వచ్చే ఎన్నికల్లో లబ్ధి పొందుతామని బీజేపీ భావిస్తుంటే, మరికొన్ని రాజకీయ పక్షాలు తన స్వప్రయోజనాల కోసం తన ఆందోళనకు తూట్లు పొడుస్తున్నాయని అన్నారు. అన్ని రాజకీయ పక్షాలకు అవసరమైతే తానే స్వయంగా ఎన్నిమార్లయినా ఫోన్ చేసి ఆహ్వానం పంపుతానని, ఇందులో తనకు ఎలాంటి భేషజాలు లేవని స్పష్టం చేశారు. బీజేపీ పాలిత గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాలకు ఏ విధంగా సహాయ పడుతున్నదో తాను కూడా చిట్టా విప్పే రోజులు రాగలవని హెచ్చరించారు. జన్మభూమిపై ఏ మాత్రం విశ్వాసం ఉన్నా విపక్షాలు తన పోరాటానికి కలిసి రావాలంటూ మరోసారి విజ్ఞప్తి చేశారు. కేంద్రంతో లాలూచీపడే వ్యవహారాలకు ఇకనైనా స్వస్తి చెప్పాలన్నారు. బ్యాంకులు, ఏటీఎం కేంద్రాల్లోను డబ్బు అందుబాటులో లేకపోవటం వెనుక కుట్రలు, కుతంత్రాలు దాగి ఉన్నాయని అంతర్లీనంగా చెప్పారు. నేడు ఈ రాష్ట్రంలో బీజేపీకి ఓటు వేసే ఒక్క ఓటరైనా ఉన్నారా అంటూ ప్రశ్నించగా లేరు.. లేరు అంటూ ప్రజల నుంచి సమాధానం వచ్చింది. ఒకవైపు పవన్ కల్యాణ్, మరోవైపు జగన్ లాలూచీ రాజకీయాలతో తనను అన్ని విధాలుగా దెబ్బతీసేందుకు కుయుక్తులు పన్నుతూ తాను సాగిస్తున్న ధర్మ పోరాటాన్ని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రం సహకరించినా, సహకరించకపోయినా ప్రజా మద్దతుతో బాండ్ల రూపేణా నిధులు సేకరించి రాజధాని నిర్మాణాన్ని పూర్తిచేయగలనంటూ ఉద్వేగంగా ప్రకటించారు.