రాష్ట్రీయం

మోదీవి తుగ్లక్ చర్యలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, ఏప్రిల్ 21: బ్యాంకులను జాతీయం చేసి ఇందిరాగాంధీ సామాన్య ప్రజలకు బ్యాంకింగ్ సేవలు అందుబాటులోకి తీసుకువస్తే నేడు ప్రధాని మోదీ తన తుగ్లక్ చర్యల ద్వారా వాటిని దూరం చేసి, పెద్దనోట్ల రద్దుతో ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్.రఘువీరారెడ్డి నిప్పులు చెరిగారు. నగదు కొరతతో ప్రజల ఇబ్బందులపై దేశవ్యాప్త నిరసనలో భాగంగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శనివారం విజయవాడలో నిరసన కార్యక్రమం చేపట్టారు. తొలుత ఆంధ్రరత్న భవన్ నుంచి రఘువీరారెడ్డి నాయకత్వంలో వందలాది కార్యకర్తలు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీ ఆంధ్రరత్న భవన్ నుంచి ఏలూరు రోడ్డు మీదుగా కొనసాగింది. యాక్సెస్ బ్యాంకు ఏటీఎం వద్ద నాయకులు నిరసన వ్యక్తం
చేశారు. ఈ సందర్భంగా రఘువీరారెడ్డి మాట్లాడుతూ పెద్దనోట్లు రద్దు జరిగి 18 నెలల తరువాత కూడా ఏటీఎంలలో, బ్యాంకుల్లో నగదు కొరత తీరకపోగా, నేటికి మరింత తీవ్రరూపం దాల్చిందన్నారు. ఆనాడు ప్రధాని మోదీ 50 రోజుల సమయం ఇవ్వండి.. ఆలోగా పరిస్థితిని చక్కదిద్దకపోతే నన్ను ఉరి తీయండి అన్నారని రఘువీరా గుర్తుచేస్తూ, ఇప్పుడేమంటారని ప్రశ్నించారు. ఏడాదిన్నరగా ఏటీఎంలలోనే కాదు బ్యాంకుల్లోనూ సొమ్ములు లేవు.. దశాబ్దాలుగా బ్యాంకులపై ప్రజలు పెంచుకున్న విశ్వాసాన్ని గత రెండేళ్ల పరిణామాలు దెబ్బతీశాయన్నారు. పెద్దనోట్ల రద్దు పెద్ద దెబ్బ కొడితే, ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు బ్యాంకులకు పెనుభూతంగా తయారైందన్నారు. నోట్ల రద్దు ప్రపంచంలోనే అతి పెద్ద కుంభకోణం అన్నారు. ప్రస్తుతం ఫైనాన్షియల్ రిజల్యూషన్ అండ్ డిపాజిట్ ఇన్స్యూరెన్స్ (ఎఫ్‌ఆర్‌డీఐ) బిల్లు సెలెక్ట్ కమిటీ పరిశీలనలో ఉందని, ఇందులోని ఒక నిబంధన ప్రకారం ఏదైనా బ్యాంకు దివాళాతీస్తే అందులోని డిపాజిట్ల మెచ్యూరిటీ గడువును పెంచవచ్చు.. లేదా డిపాజిట్లను కస్టమర్లకు ఇవ్వకుండా నిలిపివేయవచ్చు.. సేవింగ్స్ ఖాతాల్లో సొమ్మును కూడా చెల్లించకుండా నిలిపివేయొచ్చునన్నారు. ఈ బిల్లుకు భయపడి ఖాతాదారులు డిపాజిట్లు రద్దు చేసుకుని డబ్బు వాపసు తీసుకోవడం, పెద్దనోట్ల రద్దు అనంతరం పరిస్థితులు బ్యాంకుల్లో, ఏటీఎంలలో నగదు లేమికి కారణమయ్యాయన్నారు. పెద్దనోట్ల రద్దుకు సలహా ఇచ్చానని గొప్పలు చెప్పుకుని, తదుపరి డిజిటల్ పేమెంట్స్‌పై ప్రధాని మోదీ వేసిన ముఖ్యమంత్రుల కమిటీకి నేతృత్వం వహించిన చంద్రబాబునాయుడు ఇప్పుడు ఏమంటున్నారో ప్రజలు గుర్తించాలన్నారు. ప్రజల్లో భయాందోళనలకు కారణమైన ఎఫ్‌ఆర్‌డీఐ బిల్లు ప్రతిపాదనను విరమించుకోవాలని, ప్రజల్లో విశ్వాసం కల్పించకపోతే పెను సంక్షోభం తప్పదని రఘువీరారెడ్డి హెచ్చరించారు. డిపాజిట్లపై వడ్డీ శాతాన్ని 12 శాతానికి పెంచాలన్నారు. బ్యాంకుల్లో, ఏటీఎంలలో తగినంత క్యాష్ ఉంచడమే కాకుండా ప్రజలు వారికి కావలసినంత డ్రా చేసుకునే అవకాశం ఇవ్వాలన్నారు.

చిత్రం..విజయవాడలో కాంగ్రెస్ నిరసన ప్రదర్శనలో పాల్గొన్న రఘువీరారెడ్డి తదితరులు