రాష్ట్రీయం

ప్రతిష్టాత్మకంగా రైతుబంధు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రైతుబంధు పథకం, పట్టాదార్ పాస్‌పుస్తకాల పంపిణీ కార్యక్రమాల అమలు చేయడంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా చూడాలని ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లు, జిల్లా యంత్రాంగాన్ని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖరరావు హెచ్చరించారు. రెవెన్యూ, వ్యవసాయ శాఖల రాష్టస్థ్రాయి అధికారులు, జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, జిల్లా వ్యవసాయ అధికారులతోప్రగతిభవన్‌లో శనివారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పాస్‌పుస్తకాలు, రైతుబంధు (పంటల పెట్టుబడికి ప్రభుత్వం రైతులకు ఒక్కో ఎకరానికి అందించే నాలుగువేల రూపాయల సాయం) చెక్కుల పంపిణీని మే 10న ప్రారంభించి వారంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఏ రోజు ఏ గ్రామంలో పంపిణీ జరుగుతుందో ముందుగానే ఆయా గ్రామాల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. చెక్కుల పంపిణీ సందర్భంగా ఏమైనా పొరపాట్లు జరిగినా, ఎవరికైనా ఇబ్బందులు వచ్చినా వారి బాధ, సమస్యలు వినేందుకు ‘గ్రీవెన్స్ సెల్’ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. పాస్‌పుస్తకాలు, చెక్కులను తీసుకున్న వారి నుంచి రసీదు తీసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం దేశంలో ఏ ఇతర రాష్ట్రం తీసుకోని విధంగా ఆర్థిక సాయం అందించాలన్న నిర్ణయాన్ని ధైర్యంగా తీసుకున్న రాష్ట్రంగా తెలంగాణకు పేరు వచ్చిందన్నారు. ప్రకృతి వైపరీత్యాల
మూలంగా పంటలకు నష్టం వాటిల్లినా రైతులు నష్టపోయారన్న భావన ఇక ఉండదన్నారు.
కేవలం జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో కూడా ఏ ప్రభుత్వం భూరికార్డుల సర్వే చేసి కొత్తపాస్‌పుస్తకాలను, రైతులకు పెట్టుబడి ఇవ్వలేదని కేసీఆర్ తెలిపారు. ఈ కార్యక్రమాలను మనమే రచించుకుని అమలు చేస్తున్నామని, దాంతో అడుగడుగునా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. 58 లక్షల పాస్‌పుస్తకాలు, చెక్కులను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. ఏప్రిల్ చివరి వరకు వీటి ముద్రణ పూర్తిచేస్తామని, ఆ తర్వాత జిల్లాలు, మండలాలు, గ్రామాల వారీగా వీటిని పంపిణీ చేస్తామన్నారు. వీటిని జాగ్రత్తగా భద్రపరచి, నిర్ణీత తేదీలలో పంపిణీ చేయాలని సూచించారు. గ్రామాల్లో వీటిని పంపిణీ చేసే రోజున ఎవరైనా వీటిని తీసుకోకపోతే ఆ తర్వాత తహశీల్‌దారు కార్యాలయంలో వీటిని అందచేసే ఏర్పాట్లు చేయాలని కేసీఆర్ సూచించారు. ప్రతి 300 పాస్‌పుస్తకాలు, చెక్కుల పంపిణీకి ఒక బృందం చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 2762 బృందాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఒక్కో బృందంలో ముగ్గురు సభ్యులుంటారన్నారు. రైతుబంధు పథకం కోసం 12 వేల కోట్ల రూపాయలను బడ్జెట్‌లో కేటాయించామని, ఇటీవలే వానాకాలం (ఖరీఫ్) పంటలకోసం 6 వేల కోట్ల రూపాయలు విడుదల చేశామన్నారు.
పట్టాదారు రైతులతో పాటు ప్రభుత్వం పేదలకు పంపిణీ చేసిన భూములు కలిగిన రైతులకు, ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలున్నవారికి, ఏజెన్సీ ఏరియాలో సేద్యం చేసే గిరిజనేతరులకు కూడా రైతుబంధు కింద ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ఎవరైనా రైతులకు 50 వేల రూపాయల కన్నా ఎక్కువ ఇవ్వాల్సి వస్తే ప్రతి 50 వేల రూపాయలకు ఒక చెక్కు ఇవ్వాలన్నారు. ఎవరైన రైతులు రైతుబంధు పథకం కింద సాయం వద్దనుకుంటే ఆ డబ్బు రైతుసమన్వయ సమితిల ఖాతాల్లో జమ అవుతుందని వివరించారు.
బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ
బలమైన ఆర్థిక శక్తిగా తెలంగాణ నిలిచిందని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. 2017-18 లో 19.84 శాతం ఆర్థికవృద్ధి సాధించామని, 2018-19 లో 21 శాతం వృద్ధిరేటు సాధించే అవకాశం ఉందన్నారు. దేశంలో ఈ ఇతర రాష్ట్రంలో ఇంత వృద్ధిరేటు లేదన్నారు. పెరిగిన సంపద పేదల సంక్షేమం, అభివృద్ధికోసమే వినియోగిస్తామన్నారు. ‘తెలంగాణకు హరితహారం’ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్లు బాధ్యతతో నిర్వర్తించాలని సిఎం ఆదేశించారు. కొత్తచట్టం ప్రకారం ప్రతి గ్రామ పంచాయతీలో, మున్సిపాలిటీలో నర్సరీలు పెట్టాల్సి ఉందని గుర్తు చేశారు. సంబంధిత అధికారులు, అటవీశాఖ అధికారుల సాయం తీసుకోవాలని సూచించారు. స్థానిక సంస్థలకు బడ్జెట్‌లో 2500 కోట్లు కేటాయించామని తెలిపారు. చిన్న గ్రామపంచాయతీకి 3 లక్షలు, పెద్ద పంచాయతీకి 25 లక్షల రూపాయల వరకు లభిస్తాయన్నారు. ఇవి కాకుండా పన్నులు, ఆర్థిక కమిషన్ ద్వారా వచ్చే నిధులు అదనంగా ఉంటాయన్నారు. ‘తెలంగాణ కంటి వెలుగు’ కార్యక్రమం కింద ప్రజలందరికీ కంటిపరీక్షలు మే నెల చివరి వారం నుండి చేయాలని కేసీఆర్ పేర్కొన్నారు. ప్రతి మండలానికి ఒక కంటిపరీక్షల వైద్యబృందాన్ని నియమించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 41 లక్షల మందికి కళ్లద్దాలు అవసరమని ప్రాథమికంగా వేసిన అంచనావల్ల తేలిందన్నారు. అవసరమైన అద్దాలు సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. మహిళల సమస్యల పరిష్కారం కోసం సంబంధిత అధికారులు నెలకోసారి సమావేశం కావాలని సీఎం సూచించారు.
జూన్ నుండి ధరణి
జూన్ నుండి ధరణి వెబ్‌సైట్ ప్రారంభం అవుతుందని, కొత్త రిజిస్ట్రేషన్ అమల్లోకి వస్తుందని కేసీఆర్ తెలిపారు. శిథిలావస్థలో ఉన్న రెవెన్యూ కార్యాలయాల వివరాలు పంపితే కొత్త్భవనాలకోసం అనుమతిస్తామని కేసీఆర్ తెలిపారు. చనిపోయినవారి ఉద్యోగుల పిల్లలకు ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని సిఎం ఆదేశించారు. భార్యాభర్తల కేసుల్లో బదిలీలు వెంటనే చేయాలని, ఈ ఆదేశాలను అమలు చేయకపోవడం పట్ల ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.

సిబ్బందికి ప్రోత్సాహకం
తెలంగాణ రాష్ట్రంలో భూముల రికార్డులను యుద్ధప్రాతిపదికన, సమర్థతగా పూర్తి చేసిన రెవెన్యూ సిబ్బందికి ఒక నెల మూల వేతనం చెల్లించేందుకు వీలుగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి ఇటీవల రెవెన్యూ ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు ఈ ఉత్తర్వులు (జీఓ ఆర్‌టి నెంబర్ 173, రెవెన్యూ (అసైన్‌మెంట్-1) శనివారం జారీ చేశారు.

జిల్లాకు 2 కోట్లు
రైతుబంధు పథకం నిర్వహించేందుకు తెలంగాణలోని ప్రతి జిల్లాకు (హైదరాబాద్ మినహా) రెండుకోట్ల రూపాయలను ప్రభుత్వం కేటాయించింది. ఇందుకోసం శనివారం ఒక జీఓ (జీఓ ఆర్‌టి నెంబర్ 284, ప్లానింగ్ డిపార్ట్‌మెంట్) జారీ చేశారు.
ప్రగతిభవన్‌లో శనివారం నిర్వహించిన ఉన్నతస్థాయి సమావేశంలో ఈ జీఓ కాపీలను జిల్లా కలెక్టర్లకు అందచేశారు. సమావేశాల నిర్వహణ, రవాణ, ఉద్యోగుల భత్యం తదితర అవసరాలకు ఈ నిధులను వినియోగించవచ్చు.
చిత్రం..రైతుబంధు పథకం అమలుపై ప్రగతిభవన్‌లో కలెక్టర్లతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతున్న సీఎం కేసీఆర్