రాష్ట్రీయం

ఇక రిజర్వేషన్ల పంచాయతీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 2: గ్రామ పంచాయతీ ఎన్నికలకు రిజర్వేషన్లు అడ్డంకిగా మారబోతున్నాయా? అన్నది చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం చేసిన కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎస్సీ, ఎస్టీ, బీసీలకు కలిపి రిజర్వేషన్లు 58 శాతం నుంచి 60 శాతం వరకు చేరుతున్నాయి. కొత్తగా చేసిన చట్టాన్ని అనుసరించి ఎస్సీలకు 18 నుంచి 20 శాతం వరకు, ఎస్టీలకు 5 నుంచి 6 శాతం వరకు, బీసీలకు 34 శాతం (బీసీ-ఈ గ్రూపులోని మైనారిటీలు సహా) రిజర్వేషన్లు కల్పించాల్సి వస్తోంది. సుప్రీంకోర్టు వివిధ సందర్భాల్లో ఇచ్చిన తీర్పులను పరిశీలిస్తే రిజర్వేషన్లు మొత్తం 50 శాతం మించకూడదు. ఈ తీర్పు విద్యాసంస్థలలో ప్రవేశాలు, ఉద్యోగ నియామకాలు, స్థానిక సంస్థలలో వివిధ పోస్టుల భర్తీకి కూడా వర్తిస్తాయని న్యాయనిపుణులు పేర్కొంటున్నారు. అంటే గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుసభ్యులకు జరిగే ఎన్నికల్లో రిజర్వేషన్లు 50శాతం మించకూడదని వారి అభిప్రాయంగా తెలుస్తోంది. హైకోర్టు సీనియర్ న్యాయవాది వెల్దండ హనుమంతరావు ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ, బీసీలకు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పును పట్టించుకోకుండా తెలంగాణ ప్రభుత్వం గ్రామపంచాయతీ సర్పంచ్‌లు, వార్డు సభ్యుల ఎన్నికల్లో రిజర్వేషన్లను 50 శాతానికి మించి కల్పిస్తే, ప్రభుత్వ నిర్ణయం చట్టం ముందు నిలబడదని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ నిలిచిపోయే అవకాశం ఉందని వివరించారు. పంచాయతీరాజ్ చట్టానికి తాజాగా చేసిన మార్పులు, చేర్పుల ప్రకారం సర్పంచ్ స్థానాలు, వార్డు సభ్యుల స్థానాల్లో మొత్తం రిజర్వేషన్లు 58శాతం మించుతున్నాయి. చట్టంలో ఉన్న రిజర్వేషన్లకు అనుగుణంగానే ప్రభుత్వం రిజర్వేషన్ల ప్రక్రియను చేపడుతోంది. పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఇదే దారిలో అవసరమైన చర్యలు చేపట్టారు. జిల్లా పంచాయతీ అధికారులతో త్వరలో సమావేశం నిర్వహించి ఎన్నికల ప్రక్రియపై చర్చించాలని ప్రభుత్వం నిర్ణయించింది. బీసీ నాయకుడు, ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ రిజర్వేషన్లపై తాము సుప్రీంకోర్టు నుంచి స్టే తెచ్చామని, 60 శాతానికి పంచాయతీల్లో రిజర్వేషన్లు చేరినా ఇబ్బంది ఉండబోదని వివరించారు.
వివాదాస్పదంగా బీసీల జనాభా
ఇలావుంటే బీసీల జనాభా సంఖ్య కూడా వివాదాస్పదంగా మారింది. చట్టం ప్రకారం ఇప్పటివరకు బీసీల జనాభా ఎంతో తేల్చలేదు. ప్రభుత్వం చేసిన ఇంటింటికీ సమగ్ర సర్వేను ప్రాతిపదికగా తీసుకుంటున్నారు. ఈ లెక్కలు చట్టం ముందు నిలబడవని
తెలుస్తోంది. తెలంగాణ రాష్ట్ర బీసీ కమిషన్ చైర్మన్ బిఎస్ రాములు బుధవారం ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ బీసీ కమిషన్ సమగ్రంగా బీసీల జనాభా ఎంత ఉందో తేల్చలేదని స్పష్టం చేశారు. గ్రామ పంచాయతీ సర్పంచ్‌లు, వార్డుసభ్యులను ఎన్నుకునేందుకు జూన్ లేదా జూలైలో ఎన్నికలు నిర్వహించాల్సి ఉంది. ప్రస్తుతం సర్పంచ్‌లు, వార్డు సభ్యులుగా పనిచేస్తున్న వారి పదవీకాలం 2018 ఆగస్టుతో ముగుస్తుంది. వీరి పదవీకాలం ముగిసే ముందే ఎన్నికలు నిర్వహించాల్సి ఉంటుంది. ఎన్నికలకు సంబంధించి ఓటర్ల జాబితాలను రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ఇటీవలే అన్ని గ్రామపంచాయతీల్లోనూ ప్రకటించింది. ఈ జాబితాలపై ఒకవైపు అఖిలపక్షం సమావేశాలు జరుగుతున్నాయి. రాష్టస్థ్రాయి, జిల్లాస్థాయి సమావేశాలు ఇప్పటికే జరిగాయి. మండలస్థాయిలో గురువారం అఖిలపక్షం సమావేశాలు నిర్వహిస్తున్నారు. అంటే ఎన్నికల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత రిజర్వేషన్లు 50 శాతానికి మించినట్టు తేలితే ఎవరైనా కోర్టుకు వెళ్లే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వ విధానం ఏమిటో త్వరలోనే తేలుతుంది.