రాష్ట్రీయం

తెలుగు సెగ తగిలేనా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 2: దేశ వ్యాప్తంగా కర్నాటక ఎన్నికలపై నెలకొన్న ఆసక్తి అంతా ఇంతా కాదు. దక్షిణాది రాష్ట్రాల్లో పాగా వేయాలన్న బీజేపీ ఆశలను కన్నడ ఓటర్లు నిలబెడతారా లేదా అన్నదే ప్రజల ఆసక్తికి కారణం. అయితే కర్నాటకలో అధికారం చేపట్టాలన్న బీజేపీ ఆశలకు తెలుగు ఓటర్లు ఆటంకంగా మారారన్న చర్చ జోరుగా సాగుతోంది. కర్నాటక విధానసభలో ఉన్న 224 స్థానాల్లో 62 నియోజకవర్గాల్లో తెలుగు ఓటర్లు కీలకంగా ఉన్నారని కాంగ్రెస్ పార్టీ నివేదిక స్పష్టం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లో 30 స్థానాల్లో తెలుగు ఓటర్లు ఎన్నుకున్న వారే విధాన సభకు వెళ్తారని కాంగ్రెస్ చేయించిన సర్వేలో తేలింది. ఆయా నియోజకవర్గాల్లో సగటున 60వేల మంది ఓటర్లు తెలుగు వారున్నట్లు సర్వే సంస్థ నివేదిక ఇచ్చినట్లు తెలుస్తోంది. మరో 32 నియోజకవర్గాల్లో విజేతను నిర్ణయించే స్థాయిలో తెలుగు ఓటర్లు ఉన్నారని, ఈ నియోజకవర్గాల్లో సగటున 25 నుంచి 30వేల మంది ఉన్నట్లు స్పష్టం చేసినట్లు తెలుస్తోంది. బళ్లారి, రాయచూర్, బీదర్ జిల్లాలతో పాటు బెంగళూరు నగరంలో అత్యధికంగా తెలుగు వారు నివసిస్తున్నారు. వీటితో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లోని అన్ని జిల్లాల్లోనూ తెలుగు ఓటర్లు కర్నాటక చట్టసభలకు సభ్యులను ఎన్నుకునే అంశంలో తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. కర్నాటక ఎన్నికల్లో ఓటు వేసే అర్హత ఉన్న ఓటర్లపై కాంగ్రెస్ పార్టీ భారీ ఆశలు పెట్టుకుంది. తెలుగు ఓటర్ల ప్రభావం ఉన్న 62 నియోజకవర్గాల్లోనూ తమ అభ్యర్థులు లబ్ధి పొందుతారని ఆ పార్టీ నేతలు ఆశిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున ఇప్పటికే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన నాయకులను ప్రచార పర్వంలోకి దింపింది. ఆయా నియోజకవర్గాల్లో ప్రతి తెలుగు ఇంటిని పలకరించి మద్దతు కూడగట్టుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ ఉంది. కర్నాటక ఎన్నికల్లో ప్రధానంగా బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పోటీ పడుతున్నాయి. వీటిలో బీజేపీ, జేడీఎస్ లోపాయికార ఒప్పందం కుదుర్చుకున్నాయన్న ప్రచారంతో కన్నడ నాట తెలుగు ఓటర్లు తమకే మద్దతు పలుకుతారన్న ధీమాతో కాంగ్రెస్ పార్టీ ఉంది.
తెలుగు ప్రజల వద్దకు ప్రచారానికి వెళ్లిన సందర్భంలో బీజేపీ ఆంధ్రప్రదేశ్‌కు చేసిన అన్యాయంపైనే ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ పేర్కొంటోంది. మరోవైపు తెలంగాణ రాష్ట్ర నేతలు కేంద్రం చూపుతున్న నిర్లక్ష్య వైఖరిని ఓటర్లకు వివరిస్తూ బీజేపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారు. ఇక తెలంగాణ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతర ప్రాంత ముస్లిం ఓటర్లు జేడీఎస్‌కు ఓటేయాలని ఎంఐఎం కోరుతోంది. ఇది తమకు లాభదాయకమేనని కాంగ్రెస్‌పార్టీ కూడా భావిస్తోంది. ప్రభుత్వ వ్యతిరేక ఓట్లలో చీలిక వచ్చి తమ అభ్యర్థులు లబ్ధి పొందుతారని కాంగ్రెస్ నేతలు ఆశిస్తున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ, బహుజన సమాజ్ పార్టీలు సైతం బీజేపీకి వ్యతిరేకంగా పని చేస్తుండటం విశేషం. ఇక తెలుగు రాష్ట్రాల నేతలు మూకుమ్మడిగా బీజేపీకి వ్యతిరేకంగా తీర్పు ఇవ్వాలని ఓటర్లను కోరుతున్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున సినీ నటుడు, కేంద్ర మాజీ మంత్రి చిరంజీవి, జేడీఎస్‌కు మద్దతుగా జనసేన పార్టీ అధినేత, సినీ నటుడు పవన్ కల్యాణ్‌లు నేరుగా ప్రచారం చేయనున్నట్లు ఆయా పార్టీలు ప్రకటించాయి. ఇక ఏపీ సీఎం చంద్రబాబు బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ఇప్పటికే పిలుపునివ్వగా, తెలంగాణ సీఎం కేసీఆర్ జేడీఎస్‌కు ఓటేయాలని కోరే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. దీంతో కర్నాటక ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోరాడుతున్నట్లైందని రాజకీయ విశే్లషకులు స్పష్టం చేస్తున్నారు. రాజకీయ పార్టీలు దాదాపు ఐక్యంగా బీజేపీకి వ్యతిరేకంగా ఓటేయాలని ప్రచారం చేస్తున్న నేపథ్యంలో కర్నాటక ఎన్నికలు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. ఇక్కడ బీజేపీ జయాపజయాలు 2019లో జరగనున్న సార్వత్రి ఎన్నికల్లో ప్రభావం చూపుతాయని భావిస్తున్నారు. ఈ రాష్ట్రంలో అధికారంలోకి రావాలంటే 113 స్థానాల్లో విజయం సాధించాల్సి ఉంటుంది. అయితే ఎన్నికల్లో విజయం ఎవరిని వరిస్తుందన్న అంశంపై సర్వే చేసిన సంస్థలు ఏ పార్టీకీ పూర్తి స్థాయి మెజారిటీ రాదని పేర్కొంటున్నాయి. దీంతో కర్నాటక ఎన్నికల్లో బీజేపీ సర్వశక్తులు ఒడ్డి పోరాడుతోంది. దేశ ప్రధాని అయిన బీజేపీ నాయకుడు నరేంద్రమోదీ ఏకంగా 5రోజుల పాటు కర్నాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారంటే ఆ పార్టీ ఎంత ప్రాధాన్యం ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఇక బీజేపీపై గుర్రుగా ఉన్న తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు బీజేపీయేతర పార్టీలన్నీ ఆ పార్టీకి వ్యతిరేకంగా పని చేస్తుండటంతో దక్షిణాది రాష్ట్రాల్లో కర్నాటక ఎన్నికలపై మరింత ఆసక్తి నెలకొని ఉంది.