రాష్ట్రీయం

బస్సుయాత్రకే పవన్ ఓటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మే 9: జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ రానున్న సార్వత్రిక ఎన్నికలకు అస్త్ర శస్త్రాలతో సన్నద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ఆంధ్ర పర్యటనకు రంగం సిద్ధమైంది. తొలుత పాదయాత్రకు మొగ్గుచూపినా, తక్కువ సమయంలో ఎక్కువ ప్రాంతాలు పర్యటించాలంటే బస్సు యాత్ర ఉత్తమమని నిర్ణయించి, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన టెక్నాలజీ ఆధారిత బస్సును పవన్ సిద్ధం చేసుకున్నారు. అందులో ఒక రెస్టు రూమ్, మీటింగ్ కేబిన్, కంప్యూటర్ కేబిన్, బస్సు పైకి వెళ్లి అక్కడ నుంచి చిన్న చిన్న సమూహాలను ఉద్ధేశించి మాట్లాడేందుకు ఎస్క్యులేటర్ సదుపాయం, సహాయక సిబ్బంది వెంట ఉండేందుకు వీలుగా బస్సును రూపొందించారు. తొలుత పర్యటనను 12న ప్రారంభించాలని భావించినా ఒకటి రెండు రోజులు చేర్పులు మార్పులు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలు చుట్టివచ్చేలా యాత్ర రూపొందించారు. యాత్రకు గ్రామ స్వరాజ్యం అనే పేరును తాత్కాలికంగా ప్రతిపాదించినా, దీనిపై తుది నిర్ణయం గురువారం తీసుకునే వీలుంది. యాత్ర పేరు, ప్రారంభ తేదీ, ఎక్కడ నుంచి ఎక్కడి వరకూ ఉంటుందనేది కూడా గురువారం నాటి సమావేశంలో మరింత స్పష్టత వస్తుంది. యాత్రకు సంబంధించి రూట్ మ్యాప్ రూపొందించిన పవన్‌కళ్యాణ్ తొలుత తక్కువ ఆదరణ ఉన్న ప్రాంతాలకు వెళ్తే మంచిదని భావిస్తున్నట్టు తెలిసింది. యాత్ర కొనసాగుతున్న కొద్దీ జనసమూహాలు పెరిగితే దాని ప్రభావం యాత్రపై అనుకూలంగా ఉంటుందన్నది ఆయన భావనగా తెలుస్తోంది. ఇప్పటికే రూపొందించిన రూట్ మ్యాప్‌పై నేతలతో అనేకమార్లు చర్చించిన పవన్, గురువారం మరికొంత మందితో మాట్లాడతారు. ప్రజల్లోకి వెళ్లడం, ఎక్కడికక్కడ స్థానిక సమస్యలను గుర్తించడం, రాష్ట్రంలో పరిస్థితులు, పార్టీ విధానాలు, ఆలోచనలు, ఆశయాలను ప్రజలకు విడమరిచి చెప్పడం, పనిలో పనిగా

ఆయా నియోజకవర్గాల్లో ఆసక్తిగా ఉన్న నేతలను గుర్తించడం, ఇంతవరకూ వారి పనితీరు, ప్రజల స్పందన, స్థానిక కార్యకర్తల అభిప్రాయాలు తెలుసుకోవడం లక్ష్యంగా పవన్ ఈ యాత్రను రూపొందించారు. ప్రజాసమస్యల ఆధారంగా పార్టీ విధానాన్ని నవీకరిస్తూ, ఎన్నికల నాటికి రూపొందించే మ్యానిఫెస్టోలో ఈ అంశాలన్నీ ఉండేలా చూడాలనేది పవన్ భావనగా చెబుతున్నారు. వివిధ జిల్లాల్లో జనసేన బలాబలాలు, బలహీనతలు విశే్లషించి, మరింత పటిష్టం చేయడం, ప్రతి నియోజకవర్గంలో బూత్‌స్థాయిలో కమిటీలను వేయడం కూడా వేగవంతం చేస్తారు.
పటిష్ట యంత్రాంగం
వైజాగ్, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, కృష్ణ, గుంటూరు జిల్లాలను ఒక యూనిట్‌గా, శ్రీకాకుళం, విజయనగరం, నెల్లూరు, ప్రకాశం జిల్లాలను ఒక యూనిట్‌గా , అనంతపురం, కడప, చిత్తూరు, కర్నూలు పట్టణాలను ఒక యూనిట్‌గా రూపొందించి ఇన్‌ఛార్జిలను నియమించారు. కేంద్ర కార్యాలయంలో ప్రజాయాజమాన్య విభాగం, వౌలిక సదుపాయాలు, సౌకర్యాల కల్పన యాజమాన్యం, భద్రతా వ్యవహారాల విభాగాలను నెలకోల్పారు. వీటితో పాటు ఆర్థిక కమిటీ, మహిళా కమిటీ, ఐటి, పబ్లిసిటీ విభాగాలు నెలకొల్పారు. పర్యటన శ్రీకాకుళం నుండి అనంతపురం వరకూ సాగాలా లేదా అనంతపురంలో ప్రారంభించి శ్రీకాకుళంలో ముగించాలా అన్నది కూడా మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.
ఎక్కువ సంఖ్యలో విద్యార్థులు, యువత పాల్గొనే కార్యక్రమాలకు హాజరవకావడం ద్వారా పార్టీ ఆశయాలను వారిలో ప్రభావితం చేయాలని పవన్‌కళ్యాణ్ చూస్తున్నారు. స్వాతంత్య్ర పోరాట స్మారకంగా 122 అడుగులు వెడల్పు, 183 అడుగుల ఎత్తుతో 22,326 చదరపు అడుగుల విస్తీర్ణంతో రూపొందించిన ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ పతాకాన్ని పవన్‌కళ్యాణ్ ఎన్టీఆర్ స్టేడియంలో ఆవిష్కరిస్తారు. అనంతరం ఆయన నేల టిక్కెట్ సినిమా ఆడియో ఆవిష్కరణలో పాల్గొంటారు. వీటితో పాటు మరో రెండు ప్రైవేటు కార్యక్రమాల్లో కూడా పాల్గొంటారు. అనంతరం పార్టీ కార్యాలయంలో జరిగే సమావేశంలో పర్యటన షెడ్యూలు ఖరారు చేస్తారు.